ఫోకస్

విదేశీ వ్యామోహం విడనాడాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విదేశీ వ్యామోహం రానురానూ వెర్రితలలు వేస్తోంది. తమ పిల్లలు విదేశాలకు వెళ్తేనే బాగా చదువుకున్నట్టుగా తల్లిదండ్రులు చాలామటుకు తప్పుడు అభిప్రాయంలో పడి కొట్టుకుపోతున్నారు. తమ పిల్లలను విదేశాలకు పంపితేనే గొప్ప అనే తత్వం తల్లిదండ్రుల మనస్సులోంచి పోవాలి. ఉన్నత విద్య చదువుకునే పేరిట విద్యార్థులు అక్కడ ఎన్ని అగచాట్లు పడుతున్నారో తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఉన్నత చదువుల కోసమని అక్కడికి వెళ్లిన విద్యార్థులు డాలర్ల సంపాదన మోజులో పడి, చివరికి తమను ఇంతదాక పంపించడానికి కారణమైన తల్లిదండ్రుల ఆలనా పాలనను పట్టించుకోని ఉదంతాలు కూడా మనం వింటూనే ఉన్నాం. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చనిపోయినా ఇక్కడికి రాలేని దుస్థితి. ఉన్నత విద్యకోసం తమ పిల్లలను విదేశాలకు పంపిస్తున్నామని ఎవరైనా అంటే అంతకంటే మరో అబద్ధం ఉండదు. తమ పిల్లలను విదేశాలకు పంపిస్తే కోట్లు సంపాయించి పంపుతారని, మంచి పెళ్లి సంబంధాలు వస్తాయని, అదొక స్టేటస్ సింబల్‌గా భావించేవారే చాలామంది ఉన్నారు. ఆ మాట కోస్తే ప్రపంచంలోనే అత్యుత్తమ విద్య, నాణ్యమైన విద్యను అందిస్తున్నది మన దేశమే. అందుకే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సంస్థలకు సిఇఓలుగా ఎంపికవుతున్న వారు ఇక్కడ చదువుకొని వెళ్లినవారేనన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. విదేశీ వ్యామోహం పెరిగిన తర్వాతనే ఓల్డేజి హోంలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. వాటిలో ఉంటున్న వారిలో 70 శాతం మంది పిల్లలు విదేశాల్లో స్థిరపడినవారే. హోటళ్లలో పని చేయడం, పెట్రోలు బంకుల్లో పని చేయడం ఇక్కడ నామోషిగా భావించే తల్లిదండ్రులు, అక్కడికి వెళ్లిన తమ పిల్లలు అదే పని చేయాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తుచేసుకోవడం లేదు. ఒక్క పిల్లాడిని మెడిసిన్, ఇంజనీరింగ్ చదివించడానికి ప్రభుత్వం ఎంతో ఖర్చు పెడితే, చివరకు ఆ పిల్లాడు కోర్స్ ముగియగానే విదేశాలకు వెళ్లిపోతే సమాజానికి ఎంత నష్టం వాటిల్లుతుందో ఆలోచించాలి. గతంలో అయితే ఇక్కడ సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక విదేశాలకు వెళ్లేవారు. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా పోయింది. ఇక్కడ కూడా అన్ని రంగాలు ఎంతో ప్రగతి సాధించాయి. విదేశాల్లో చెల్లించేంతటి జీతాన్ని ఇక్కడ కూడా చెల్లిస్తున్నారు. ప్రతిభ ఉంటే విదేశాలకు వెళ్లాల్సిన అవసరమే లేదు, ఇక్కడ కూడా బోల్డెన్ని అవకాశాలు ఉన్నాయి. వీటిని మరింతగా పెంచే దిశగా ప్రభుత్వాలు కూడా దృష్టిసారించాలి. మేకిన్ ఇండియా అంటే సరిపోదు, ఆ దిశగా ప్రభుత్వ కార్యాచరణ ఉండాలి.

- డాక్టర్ రాజ్‌సిద్ధార్థ ప్రొఫెసర్, కాకతీయ మెడికల్ కాలేజి