ఫోకస్

తీర్పు సరైంది కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిపుల్ తలాఖ్ విషయంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైంది కాదు. భారతదేశం లౌకిక దేశం. ఈ దేశంలో మతపరమైన అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం సముచితం కాదు. అలహాబాద్ హైకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని భావిస్తున్నాను. హిందువులకు గీత, క్రిస్టియన్లకు బైబిల్ ఎలా ప్రామాణికమైందో ముస్లింలకు ఖురాన్ అలాంటిదే. ముస్లిం మహిళలకు హక్కులు, బాధ్యతలను కూడా ముస్లింపర్సనల్ లా కల్పిస్తోంది. ముస్లింలకు సంబంధించి ముస్లిం పర్సనల్ లా ముఖ్యమైంది. ముస్లిం పురుషులు తమ భార్యకు విడాకులు ఇచ్చేందుకు త్రిపుల్ తలాఖ్ ఒక అవకాశంగా ఉన్నప్పటికీ, దీన్ని అంత సులువుగా ఉపయోగించేందుకు వీలులేదు. విడాకులు (తలాక్ లేదా డైవోర్స్) కేవలం ముస్లింలకే పరిమితం కాలేదు. హిందువుల్లోనూ, క్రిస్టియన్ మతంలోనూ ఉన్నాయి. తలాఖ్ అన్న అవకాశం ఉందని విచ్చలవిడిగా వాడటం లేదు. మహిళలపట్ల అన్యాయం అన్న విషయం అన్ని మతాల్లోనూ ఉంది. అందరూ అనుకుంటున్నట్టు ముస్లిం మహిళలకు పూర్తిగా అన్యాయమేమీ జరగడం లేదు. తలాఖ్ (విడాకులు) ఇవ్వగానే పురుషులపై బాధ్యత సమసిపోవడం లేదు. తర్వాత భరణం ఇవ్వాల్సి ఉంటుంది. భర్తలు తమ వేతనం నుండి లేదా ఆస్తినుండి కొంత భాగం విడాకులు ఇచ్చిన భార్యకు ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లలు ఉంటే వారి పోషణ బాధ్యత కూడా భర్తపైనే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మగవారు తన భార్యకు అన్యాయంగా తలాఖ్ ఇస్తే, ముస్లిం పెద్దలు జోక్యం చేసుకుంటారు. హరియత్ ప్రకారం భరణం చెల్లించాలి. అన్యాయం జరిగితే గతంలో ఉన్నట్టు ముస్లిం మహిళలు గమ్మున ఉండటం లేదు. న్యాయంకోసం పోరాడుతూనే ఉన్నారు.
కులమేదైనా, మతమేదైనా భార్యాభర్తల మధ్య అవగాహన ఉండాలి. అవగాహన లేకపోతే సమస్యలు ఉత్పన్నం అవుతాయి. చిన్న చిన్న అంశాలు కూడా ఒక్కోసారి పెద్దవిగా మారతాయి. అందువల్ల భార్యాభర్తలు పరస్పరం అవగాహనతో మెలిగితే ఆ కుటుంబం సుఖంగా సంతోషంగా ఉంటుంది. ముస్లింలకు సంబంధించినంత వరకు ప్రతి కుటుంబంలో పురుషులు మహిళలను సంప్రదించే ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారు. ముస్లింలలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందనడంలో సందేహం లేదు. హిందువుల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ వారిని ‘లక్ష్మీదేవి’ అని ఎలా సంభోదిస్తున్నారో ముస్లింలు కూడా మహిళలకు అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. పురుషులు సంపాదించే డబ్బును భార్య చేతికి ఇచ్చి, ఖర్చు చేయిస్తే కుటుంబానికి శుభం జరుగుతుందని భావిస్తున్నారు. దీన్ని చాలా కుటుంబాలు అమలు చేస్తున్నాయి. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందన్నదన్న నానుడి ముస్లింలకు కూడా వర్తిస్తుంది. ఏ మతమైనా మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. అయితే ముస్లిం మహిళల్లో విద్యావంతుల శాతం తక్కువ ఉండొచ్చు. అందువల్ల విద్యారంగంలో ముస్లిం మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి. విద్యావకాశాలు పూర్తిగా ఉండాలి. మారుతున్న కాల పరిస్థితిలో సమాజాభివృద్ధిలో ముస్లిం మహిళల పాత్ర తక్కువేమీ కాదు.

- ఎల్. ఫిరోజ్ బేగం మెంబర్, రాష్ట్ర మహిళా కమిషన్