ఫోకస్

కార్పొరేట్ పేరిట పాఠశాల విద్య నిర్వీర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుణాత్మక విద్య నందించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేస్తోంది. కనీస వౌలిక సదుపాయాల్లేకుండానే కార్పొరేట్ తరహా విద్య నందిస్తానంటూ ప్రగల్భాలు పలుకుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2006-07 నుంచి సక్సస్ స్కూల్స్ పేరిట ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా తీసుకున్న చర్యలు శూన్యం. రాష్ట్రంలో ప్రస్తుతం 4,500 ప్రభుత్వ పాఠశాలలను సక్సస్ స్కూల్స్‌గా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం మొదలైన పదేళ్లలో ఆంగ్ల మాధ్యమంలో ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయలేదు. ఇలాఉంటే సక్సస్ స్కూల్స్ నుంచి ఏవిధంగా అద్భుత ఫలితాలను ఆశిస్తారు. ఉపాధ్యాయులు తమ ఉద్యోగ భద్రతకోసం నానాతంటాలు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే వారిలో అత్యధికులు నిరుపేద, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీలే ఉంటారు. ఇక రేషనలైజేషన్ పేరిట పాఠశాలలను మూసివేయడం జరుగుతోంది. దశాబ్ధాల కిందట కుటుంబ నియంత్రణ అమల్లో లేని కాలంలో ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తిని ఇప్పటికీ అమలు చేస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో 1:30 నిష్పత్తిని, ఉన్నత పాఠశాలల్లో 1:40 నిష్పత్తితో ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలనుకోవడం అవివేకమే. ఇప్పటి జీవన విధానానికి అనుగుణంగా విద్యార్థులు, ఉపాధ్యాయ నిష్పత్తిని 1:20గా మార్చాలి. లేనిపక్షంలో మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో విద్య అందని ద్రాక్షగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. గిరిజన ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఇళ్లుండే తండాలు, గూడేల్లో రేషనలైజేషన్ పేరిట పాఠశాలలు మూసివేతకు పాల్పడుతున్నారు. వీటిని సమీప గూడేలు, తండాలకు తరలించడంవల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపేందుకు ఇష్టపడట్లేదు. తద్వారా ప్రాథమిక స్థాయిలోనే పాఠశాల విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనేవి గ్రామీణంలో తప్పనిసరి. అయితే ప్రభుత్వం తన బాధ్యతనుంచి తప్పుకునేందుకు ప్రయత్నించే క్రమంలో తీసుకుంటున్న నిర్ణయాలు ప్రాథమిక విద్యాబోధనకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. ఇక రాష్ట్రంలో 26వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉండగా, ప్రభుత్వ లెక్కల ప్రకారం అసలు పోస్టుల అవసరమే లేనట్టుగా ఉంది. రేషనలైజేషన్ పేరిట మూసివేసిన పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను మిగులు పోస్టులుగా ప్రభుత్వం లెక్కలు చూపుతోంది.
ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంతోపాటు సక్సస్ స్కూల్స్ ఆంగ్ల మాథ్యమంలో నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించాలి. గ్రామాలు, ఏజెన్సీల్లో స్కూల్స్‌కు అనుబంధంగా ఉండే హాస్టల్స్‌ను మూసివేస్తూ, ప్రధాన కేంద్రాల్లో రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటువల్ల విద్యార్థులను అంతదూరం పంపేందుకు తల్లిదండ్రులు విముఖత చూపుతున్నారు. ముఖ్యంగా బాలికా విద్య విషయంలో ఇదే ప్రధాన సమస్యగా మారుతోంది. ప్రాథమిక విద్యను పూర్తిస్థాయిలో అందించాలంటే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఒక్కటే కాకుండా, వౌలిక సదుపాయాల కల్పన విషయంలో కూడా సరైన నిర్ణయం తీసుకోవాలి.

- ఎస్ సింహాచలం, ఏపి ఎస్సీ, ఎస్టీ టీచర్స్ అసోసియేషన్