ఫోకస్

ఉద్యోగాలు కల్పించే అభివృద్ధి నమూనా తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో ఒకవైపు విద్యావంతుల సంఖ్య పెరుగుతుండగా, మరోవైపు ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతోంది. అంతర్జాతీయ సంస్థల సూచనలతో ఉద్యోగాలు కల్పించలేని అభివృద్ధి నమూనా మన దేశంలో అమలవుతోంది. ఈ విధానం మన దేశానికి ఉపయోగపడదు. తెలంగాణ రాష్ట్రంకోసం జరిగిన ఉద్యమం ప్రధానంగా మూడు అంశాలపై కొనసాగిందన్న విషయం అందరికీ తెలుసు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు.. ఇవీ ఉద్యమానికి ఊపిరిగా కొనసాగాయి. గిర్‌గ్లాని కమిషన్ రూపొందించిన నివేదిక ప్రకారం సమైక్య పాలనలో తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 56 వేల మంది ఇతర ప్రాంతాలకు చెందినవారని వెల్లడైంది. అవి కాకుండా లక్షకుపైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లయినా ఈ ఉద్యోగాల భర్తీ ఎందుకు చేయలదన్నది చర్చనీయాంశంగా మారింది. నిరుద్యోగులు ఆందోళన చేస్తే ప్రభుత్వం అణచివేస్తోంది. ప్రజాస్వామ్యం బదులు డిక్టేటర్‌షిప్ కొనసాగుతున్నట్టు అనిపిస్తోంది. నిరుద్యోగులు ఆందోళన చేస్తే, ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి విచారణ చేయించి, వాస్తవాలేమిటో ప్రజలకు తెలియచేయవచ్చు. అలాకాకుండా ఉద్యమానే్న అణచివేయడం సరైన విధానం కాదు. తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన విద్యార్థులు, యువతను అణచివేయాలని ప్రయత్నిస్తే తీవ్రపరిణామాలకు దారితీస్తుంది. టిఎస్‌పిఎస్‌సి 1200 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే ఏడు లక్షల మంది దరఖాస్తు చేశారంటే నిరుద్యోగ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. జాతీయ స్థాయిలో పరిస్థితి పరిశీలిస్తే, 1975 వరకు కూడా చదువుకున్న వారికి ఉద్యోగాలు సులువుగా లభించేవి. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో లక్షలాది ఉద్యోగఖాళీలు భర్తీ చేశారు. ఒక నివేదిక ప్రకారం 120 లక్షల మంది ఉద్యోగులు ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసేవారు. ఈ సంఖ్య ఇప్పుడు 45 లక్షలకు తగ్గిపోయింది. క్లాస్ త్రీ, క్లాస్ ఫోర్ ఉద్యోగుల భర్తీ పూర్తిగా నిలిచిపోయింది. ప్రపంచబ్యాంక్‌తోపాటు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థ సలహామేరకు పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్య ఏయేటికాయేడు తగ్గించివేస్తున్నారు. 1985-86 తర్వాత పరిస్థితి మరీ దిగదుడుపుగా మారింది. కాంట్రాక్ట్, తాత్కాలిక, ఔట్‌సోర్సింగ్ విధానంలో ఉద్యోగులను నియమిస్తున్నారు. ఐదారేళ్లు గడిచేసరికి వీరంతా తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు భారీగా వస్తున్నప్పటికీ, యాంత్రిక విధానం ఎక్కువగా ఉండటంతో ఉద్యోగాల కల్పన బాగా తక్కువగా ఉంది. జనాభా తక్కువగా ఉన్న దేశాలకు యాంత్రిక విధానం బాగానే ఉన్నప్పటికీ, మానవ వనరులు పుష్కలంగా ఉన్న మన దేశానికి ఈ విధానం పనికిరాదు. ప్రైవేట్ రంగ కంపెనీలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం ఈ అంశంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులకు ఎక్కడికక్కడ ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. మానవ వనరులను పూర్తిగా ఉపయోగించుకుని, దేశాన్ని, సమాజాన్ని అభివృద్ధివైపు తీసుకువెళ్లే అభివృద్ధి నమూనా మనదేశానికి ఉపయోగకరంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

- ప్రొఫెసర్ హరగోపాల్ సామాజిక శాస్తవ్రేత్త