ఫోకస్

చదువుల కేంద్రాలకు చెదలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చదువులకు, పరిశోధనలకు, నైపుణ్యాలకు, వికాసానికి కేంద్రం ఉన్నత విద్యాసంస్థలు. ప్రతి యువకుడి విద్యాభ్యాసంలో చివరి మజిలీ కూడా అక్కడే. జీవితంలో తన లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన ఉన్నత చదువులను అక్కడ పూర్తి చేసి, అత్యుత్తమ విలువలతో మంచి వ్యక్తిత్వంతో సమాజంలో అడుగుపెట్టేందుకు గొప్ప వేదిక విశ్వవిద్యాలయాలు. అలాంటి విశ్వవిద్యాలయాలు తొలుత రాజకీయాలతో మేళవించుకోగా, నేడు మరో అడుగు ముందుకు వేసి తీవ్రవాదం, ఉగ్రవాదం, విచ్ఛిన్నకరవాదాలకు వేదికలుగా మారుతున్నాయి. రాజకీయాలు చేసుకునేందుకు రాజకీయ పార్టీలు ఉండనే ఉన్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో విధి విధానాలు, సిద్ధాంతాలతో పనిచేస్తున్నాయి. రాజకీయ అవగాహనకు విశ్వవిద్యాలయాలు కేంద్రాలుగా ఉండాలే తప్ప మొత్తం వర్శిటీలే రాజకీయాలుగా మారితే వచ్చే సమస్యలు ఏమిటో ఈ మధ్య పలు ఉన్నత విద్యా సంస్థల్లో జరిగిన ఘటనలు చూస్తే అర్థమవుతుంది. జెఎన్‌యులోనూ, తాజాగా రాంజాస్ విద్యాసంస్థలోనూ వివాదాల సారూప్యం ఒక్కటే. తప్పు చేసిన వారిని తప్పు చేస్తున్నావు అని చెప్పడమే తప్పు అవుతుందా? అనేది ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తప్పు అంటే ఏది? ఈ దేశంలో ఫలానాది తప్పు, ఫలానాది రైటు అని నిర్ణయించేది ఎవరు? ఒకవేళ ప్రశ్నించగానే వారినుండి వచ్చే సమాధానం భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నారనే గగ్గోలు. అసలు భావప్రకటనా స్వేచ్ఛ అంటే ఏమిటి? దాని పరిమితులు ఏమిటి? చట్ట ప్రకారం ఉన్న పరిమితులు, సామాజిక పరిమితులు ఏమిటి? ఇవన్నీ చర్చనీయాంశాలు. భావ ప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్న వారిని ఎవరు శిక్షించాలి? రాంజాస్ కాలేజీలో జరిగింది ఏమిటి? అక్కడ జరుగుతున్న సాహిత్య సదస్సుకు దేశద్రోహం కింద కేసులు ఎదుర్కొంటున్న జెఎన్‌యు విద్యార్థి ఉమర్ ఖలీద్, షెహ్లా రషీద్ సహా కొంతమంది విద్యార్థులను ఆహ్వానించడమే. పేరుకు అది సాహిత్య సదస్సు అయినా అక్కడ జరగబోయేది ఏమిటి? ఈ విషయాలను గుర్తించిన మరో విద్యార్థి సంఘం విద్యాసంస్థ నిర్వాహకులను నిలదీసింది. జాతి వ్యతిరేక శక్తులతో మిలాఖత్ అయినట్టు ఆరోపణులున్న వ్యక్తిని సెమినార్‌కు ఎలా పిలుస్తారని వారంతా గళం ఎత్తారు. ఆందోళన చేశారు. ఆ క్రమం హింసకు దారితీసింది. తర్వాత చూస్తే రాంజాస్ కాలేజీలో వివాదాలకు కారణమైన ఆ సాహిత్య సదస్సు జరగనే లేదు. కాని జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది. స్వేచ్ఛ పేరిట ఒక వర్గం, జాతీయవాదం పేరిట మరోవర్గం బాహాబాహీలకు దిగడం ఎంతవరకూ సమంజసం. ఇలాంటి చర్చకు బహిరంగ వేదికలు ఎపుడూ ఉంటాయి, కాని ఎన్నో లక్ష్యాలతో వచ్చే విద్యార్థులు చదువుకునే కేంద్రాల్లో ఈ బాహాబాహీ అవసరమా? దీనివల్ల లాభం కొద్దిమందికే కాని నష్టం చాలా ఎక్కువ మందికి జరుగుతోంది అని గ్రహించలేని స్థితిలో వీరంతా ఉన్నారా...?? ఈ అంశంపై కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.
chitram...
ఎఐఎస్‌ఏ, జెఎన్‌యు విద్యార్థులకు వ్యతిరేకంగా ఢిల్లీ యూనివర్సిటీలో ఎబివిపి నిర్వహించిన ధర్నా (ఫైల్ ఫోటో)