ఫోకస్

ఉగ్రవాదం.. కిం కర్తవ్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పఠాన్‌కోట్‌లో వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా వాటి వెనుక లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, అల్‌ఖైదాలాంటి ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉంటోంది. ఇప్పుడు కొత్తగా ఐసిస్ పుట్టుకొచ్చింది. భారత్‌లోనూ ఉగ్రవాద ఘటనలు కొత్తేమీ కాదు. దేశీయ ఉగ్రవాదాన్ని తీవ్రవాదంగా భావించినా, వారి ఉద్దేశ్యాల వెనుక ఉన్నది ఉగ్రవాద ఆలోచనలే. తీవ్రవాదానికి ఇద్దరు ప్రధానులు బలైన దేశం మనది. తీవ్రవాదంతో జార్ఖండ్, చత్తీస్‌గఢ్, అస్సాం వంటి రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నట్టే ఉగ్రవాదంతో జమ్మూ, కాశ్మీర్ గత 50 ఏళ్లుగా పోరు సాగిస్తోంది. మరో పక్క ముంబై బాంబు పేలుళ్ల అనంతరం ఉగ్రవాదం వేళ్లు దేశంలోని చాలా రాష్ట్రాలకూ పాకాయి. చాలా ఘటనల్లో హైదరాబాద్ పేరు వినిపించడం కూడా దక్షిణాది రాష్ట్రాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో పఠాన్‌కోట్‌పై జరిగిన దాడి ద్వారా ఉగ్రవాదం మరోమారు పడగ విప్పి బుసలుకొట్టింది. పఠాన్‌కోట్‌లో పెనుముప్పును మన భద్రతా దళాలు వీరోచితంగా నిలువరించగలిగినా ఏడుగురు సైనికుల ప్రాణాలను కోల్పోయాం.
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ఎన్నో దేశాలు ప్రయత్నిస్తున్నా ముష్కరుల దాడులు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఆగడం లేదు. భారత్‌లో సైతం ఉగ్రవాద దాడుల గురించి ఎన్నోసార్లు ఐబి ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా ఎందుకు వాటిని అడ్డుకోలేక పోతున్నారు? పట్టుబడిన ఉగ్రవాదులు చెప్పిన చాలా విషయాలు దిగ్భ్రాంతికరమైనవి. కొంతమంది 10 -15 రోజుల ముందే దేశంలో ప్రవేశించి రెక్కీలు నిర్వహించి మరీ దాడులకు పాల్పడుతున్నారంటే దేశంలో నిఘా నిద్రపోతోందా? భద్రతా లోపం, అధికారుల అలసత్వం కూడా ప్రశ్నార్థకంగా మారాయి. ఉగ్రవాద ఘటనలు జరిగిన ప్రతిసారీ అదికారంలో ఉన్న పెద్దలు వాటిని ఖండించడం, చట్టాలు కఠినతరం చేస్తామని చెప్పడం, రెండు మూడు రోజులు నిరంతర తనిఖీలు చేయడం, తర్వాత అంతా గాలికి వదిలేయడం జరుగుతోంది. వాజపేయి ప్రభుత్వ కాలంలో ‘పోటా’ చట్టం అమలులో ఉండగానే పార్లమెంటు భవనంపై బాంబుదాడి జరిగిన విషయాన్ని ఈ దేశం ఇంకా మరిచిపోలేదు. ఉగ్రవాదం బలపడటానికి చాలా కారణాలు ఉన్నా యువత మాత్రం ఎక్కువగా ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కావడం, యువతీ యువకులను కొందరు తమ స్వార్థ ప్రయోజనాలకు ఉన్మాద చర్యలకు, ఉగ్రవాద దాడులకు వాడుకోవడం కొత్తకాదు. మరోవైపుమత ప్రాతిపదికన ఉగ్రవాదం వెర్రితలలు వేస్తోంది. గుజరాత్, మహారాష్టల్ల్రో హిందూ సంస్థలు, వ్యక్తులపై దాడులే లక్ష్యంగా ఉగ్రవాద ఘటనలు జరిగాయి. అనేక సందర్భాల్లో మతం పేరుతో ఉగ్రవాదం పంజా విసిరింది. వీటన్నింటికీ కారణం మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడమే. ఉగ్రవాద నిర్మూలన అంశాన్ని లోతుగా పరిశీలించాల్సి ఉంది. దేశానికి సంబంధించినంత వరకూ ఆర్థిక, సామాజిక సమస్యలను పరిష్కరించుకోడం, లౌకిక విధానాలకు కట్టుబడి ఉండటం కీలకమైనవి. ఉగ్రవాద భూతాన్ని తరిమికొట్టడానికి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ పొరుగు దేశాలతో కలిసి ముందడుగు వేస్తున్నా మన దేశంలో మతపరమైన సమస్యలు పరిష్కరించుకోవల్సిన తరుణం ఆసన్నమైంది. తీవ్రవాదులు చేసిందైనా, ఉగ్రవాదులు చేసిందైనా ఒక్కటే... ఇతరులకు భయం పుట్టించడం, ఇతరులను భయపెట్టి తమ పంతం నెగ్గించుకోవాలని చూడటమే. ప్రపంచవ్యాప్తంగా వందలాది ఉగ్రవాద సంస్థలు ఇలాంటి పైశాచిక చర్యలకు పాల్పడుతునే ఉన్నాయి. రెండు డజన్లకు పైగా ఉగ్రవాద సంస్థలు తరచూ దాడులకు పాల్పడుతున్నాయి. ముఖ్యంగా ఆల్‌ఖైదా, లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దావా, జైషే మహ్మద్, యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ వంటి సంస్థల ఆటకట్టించడం ఎవరి తరం కావడం లేదు. ఇక ఐసిస్ అరాచకాలకు అంతే లేకుండా పోయింది. ఈ ఉగ్రవాద సంస్థల సారథులను పట్టుకుని శిక్షించడం ద్వారా ఉగ్రవాద దాడులకు శాశ్వతంగా తెరదించడం సాధారణ పోరుతో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఉగ్రవాదంపై యుద్ధమే చేయాల్సి వచ్చేలా ఉంది. యుద్ధానికి దిగి పాక్ వంటి దేశాల్లోని ఉగ్రవాదుల పీచమణచాలనే వాదన దేశంలో బలపడుతోంది. అయితే అది అనుకోని మలుపు తిరిగి అణ్వస్త్ర దాడులకు తెరతీస్తే జరిగేది విధ్వంసమేనని మరికొందరు వాదిస్తున్నారు. భారత్ తమ భూభాగంపై దాడులకు పాల్పడితే నిమిషాల్లో దానిని తిప్పికొడతాం అంటూ పాక్ నేతలు పరోక్షంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజాగా పఠాన్‌కోట్ ఉగ్రచర్యల వెనుక పాక్ ఐఎస్‌ఐ హస్తం ఉందనేది సుస్పష్టం. భారత ప్రధాని నరేంద్ర మోదీ స్నేహ హస్తం చాచి వారం తిరగకుండానే పాక్ ఈ కుట్రలకు దిగడంపై కొందరు నిపుణుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.