ఫోకస్

ప్రభుత్వ విధానాలే రైతుకు శాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే రైతులను నిలువునా ముంచుతున్నాయి. ఆరుగాలం శ్రమించే రైతు, అర్ధాకలితో అలమటిస్తున్నా, అర్ధాంతపు చావులకు పాల్పడుతున్నా, అవి ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలుగానే భావించాలి. ప్రకృతి వైపరీత్యాలు, కరవు కాటకాలను ధైర్యంగా ఎదిరించి, పండించిన పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే కనీస గిట్టుబాటు ధర లభించని పరిస్థితి. వ్యవసాయం నిమిత్తం చేసిన అప్పులు తీర్చలేక, కొత్తగా అప్పులు పుట్టక రైతు బలవన్మరణానికి పాల్పడుతున్నాడు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి. రైతు రుణమాఫీ పేరిట ప్రభుత్వం లక్షలాది మంది రైతులను నిలువునా మోసగించింది. తీసుకున్న అప్పులు తీర్చలేదని బ్యాంకులు కొత్తగా అప్పులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న పరిస్థితి ప్రస్తుతం నవ్యాంధ్రలో నెలకొంది.
ప్రభుత్వం మాత్రం రైతు రుణమాఫీ తమ ఘనతగా ప్రచారం చేసుకుంటోంది. రుణమాఫీ జరిగితే బ్యాంకులు రైతులకు ఎందుకు కొత్త అప్పులు ఇవ్వట్లేదు. ఈ అంశంపై ప్రభుత్వం ఎప్పుడైనా స్పందించిందా! రైతులకు చెల్లించామంటున్న ఇన్‌పుట్ సబ్సిడీలు సకాలంలో అందుతున్నాయా! ఇలా సవాలక్ష సమస్యలతో రైతు సతమతం అవుతుంటే ప్రభుత్వాలు మాత్రం రైతు పక్షపాతిగా ప్రచారం చేసుకోవడం దారుణం. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే తాజాగా మిర్చి రైతు తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర తెచ్చుకోలేక కుదేలవుతున్నాడు. పత్తి, చెరకు రైతు పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతుంటే విపక్షాలు మాత్రం అది తమ పనికానట్టే వ్యవహరించడం బాధాకరం.
రాజకీయ మైలేజ్ అంశాలను ప్రాధాన్యత ఇస్తున్న విపక్షాలు రైతుకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఎందుకు ఉద్యమించట్లేదో అర్ధం కాని విషయం. నవ్యాంధ్ర విషయానికొస్తే ఇక్కడ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ రైతును ఆదుకునే విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. అసెంబ్లీ వేదికగా రైతు రుణమాఫీ, రైతు ఆత్మహత్యలపై చర్చించకుండా, అధికార, విపక్షాలు ఒకరినొకరు విమర్శించుకుంటూ సభా కాలాన్ని వృధా చేశారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే గొడ్డలిపెట్టు. రైతే దేశానికి వెనె్నముకగా చెప్పుకునే దేశంలో రైతు సంక్షేమం కోసం క్షణమైనా ఆలోచించి, ఆత్మహత్యల బారిన పడకుండా, వారికి మనోధైర్యాన్నిచ్చే నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. రైతును రాజును చేసే చర్యలే ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుతాయని పాలకులు గుర్తుంచుకుంటే రైతు రాజ్యం వచ్చినట్టే.

- బీశెట్టి బాబ్జీ, లోక్‌సత్తా అధ్యక్షుడు, ఏపి