ఫోకస్

జాతీయ విధానం ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్యంపై జాతీయ విధానం లేదు. మద్యం రాష్ట్రాల పరిధిలోని అంశం. మద్యం ద్వారా వచ్చే ఆదాయంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ విషయంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇంచుమించు ఒక విధానంతో ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు మద్యం విక్రయాలను ప్రోత్సహించే విధంగా పాలసీలను రూపొందించాయి. బెల్ట్‌షాపులను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కాని ఇంతవరకు ఆచరణలో విఫలమయ్యారు. జాతీయ రహదారులకు సమీపంలో మద్యం షాపులు ఉండరాదని సుప్రీం కోర్టు ఆ మధ్య మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో నగర శివార్ల వరకు ఉన్న జాతీయ రహదారులను డినోటిఫై చేశారు. యదావిధిగా మద్యం షాపులను కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నాయి. పైగా ప్రతి గల్లీలో, గ్రామంలో మద్యం సిండికేట్లు కొంత ధరను పెంచి చీప్ లిక్కర్‌ను వినియోగదారులకు విక్రయిస్తున్నాయి. గతంలో టిడిపి హయాంలో ముఖ్యమంత్రి ఎన్టీరామారావు మద్యనిషేధం అమలు చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రకాశం పంతులు గారి హయంలో మద్య నిషేధం అమలు జరిగింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కూడా కొన్ని సంవత్సరాల పాటు మద్యనిషేధం అమలు చేశారు. గుజరాత్‌లో ఇప్పటికీ మద్య నిషేధం అమలవుతోంది. మద్యం పూర్తిగా నిషేధం విధించడం వల్ల స్లగ్లర్లు పెట్రేగిపోతారు. అలా అని చెప్పి మద్యం విక్రయాలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ పాలసీ ఉండరాదు. ఖజానాను నింపుకునేందుకు మద్యం విక్రయాలను ప్రధాన వనరులుగా చూసే కోణంలో నుంచి ప్రభుత్వాలు బయటకు రావాలి. ఈ రోజు సగటున రోజుకు ఐదు వందల రూపాయలు సంపాదించే కూలీ రోజుకు 200 రూపాయల వరకు మద్యంపైన ఖర్చుపెడుతున్నాడు. సామాజిక జీవితాలను ఆర్థికంగా, సాంఘికపరంగా ఛిద్రం చేసే మద్యం విక్రయాలపై జాతీయ స్ధాయిలో విధానం ఉండాలి. మద్యం రేట్లను పెంచి ఇష్టం వచ్చినట్లు సిండికేట్లు అమ్ముతున్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రేటు. పవిత్ర మందిరాలు, పుణ్యక్షేత్రాల్లో, కాలనీలు, కాలేజీలు, గ్రామాల్లో మద్యం షాపులకు అనుమతించరాదు. మద్య నిషేధమనేది కేవలం ఒక్క రాజకీయ పార్టీకి బాధ్యతగా చూడరాదు. సామాజికంగా ప్రజా సంఘాలు, ఎన్జీవో సంఘాలు, ప్రగతిశీల శక్తులు, అన్ని రాజకీయ పార్టీలు చేతులు కలపాలి. అప్పుడే మద్య నిషేదం పూర్తిగా కాకపోయినా, విక్రయాలను గణనీయంగా తగ్గించవచ్చు.
- విశే్వశ్వరరెడ్డి వైకాపా శాసనసభాపక్ష ఉపనేత, ఆంధ్రప్రదేశ్