ఫోకస్

రాజకీయ పార్టీల్లో సంస్కరణలు తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయ పార్టీలు ఎన్నికల్లో అవినీతి విధానాలకు పాల్పడే వ్యవహారాలపై కేంద్ర ఎన్నికల సంఘం ఉక్కుపాదం మోపాలి. స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలైంది. రాజకీయ పార్టీల్లో సంస్కరణలు, జవాబుదారితనం పెరిగే విధంగా శాసనాల్లో మార్పులు తేవాలి. మన కేంద్ర ఎన్నికల చట్టంలో మార్పులు రావాలి. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఏ విధంగానైనా అధికారంలోకి వచ్చేందుకు రకరకాల అవినీతి పద్ధతులను ఉపయోగిస్తున్నాయ. రాజకీయ పార్టీలు జమా ఖర్చులపై సాలీనా బ్యాలెన్స్ షీటును ఇవ్వాలన్న నిబంధన ఉన్నా అంత సీరియస్‌గా అమలు జరగడం లేదు. రాజకీయ పార్టీలు వేరు.. ప్రజాప్రతినిధులు వేరు కాదు. రాజకీయ పార్టీల్లో ప్రజా ప్రతినిధులు భాగం. ప్రజా ప్రతినిధులు ప్రజలు తమను సేవకుడిగా నియమించారన్న భావనను మర్చిపోతున్నారు. ఒకసారి ఎమ్మెల్యే, ఎంపీ అయితే సంపాదనలకు కొంతమంది అలవాటుపడుతున్నారు. ఇది దురదృష్టకరమైన పరిణామం. ప్రగతిశీల వాదన, దార్శనికత ప్రజాప్రతినిధుల్లో లోపించింది. అదే సమయంలో ప్రజా ప్రతినిధులపై ప్రజలనుంచి వత్తిడి పెరుగుతోంది. పెళ్లిళ్లు, ఆసుపత్రి ఖర్చులు, మరణాలు సంభవించిన ఇంటికి పరామర్శలకు వెళ్లినప్పుడు ఎంతోకొంత వితరణగా ప్రజాప్రతినిధులు నగదును ఇస్తారు. ఇదంతా తన కష్టార్జితంనుంచి ఇస్తే ఫర్వాలేదు. కాని ఎడాపెడా ఇచ్చే ప్రజాప్రతినిధులు కొంతమంది ఉన్నారు. ప్రజాప్రతినిధిగా ఒకసారి ఎన్నికైతే చాలు ఆ కుటుంబ జీవిత విధానంలో మార్పులు వస్తున్నాయి. మనం ఈ విషయంలో పాతతరం కమ్యూనిస్టు పార్టీ, సోషలిస్టు పార్టీ నేతలను ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడా పరిస్థితి లేదు. అలాగే ప్రజా ప్రతినిధులు ప్రజా జీవితంలో ఉన్నందున అభియోగాలు కూడా ఎక్కువే. ప్రత్యర్థి పార్టీలు చేసే ఆరోపణల్లో ఆధారాలుండాలి. వీటిల్లో నిజానిజాలు లేకుండా ఆరోపణలు చేసేవారు కూడా ఉన్నారు. ప్రజా ప్రతినిధుల జీవితం కత్తిమీద సాముగా మారింది. ప్రజాసేవకు రాజకీయాల్లోకి వచ్చి అధికారం ఉంటే, ఎక్కువ సేవ చేయవచ్చు అనే భావన ఉండాలి. కాని అక్రమాలకు పాల్పడే ధోరణి పెరుగుతోంది. ప్రజాప్రతినిధులపై వచ్చే అభియోగాలు అన్నీ నిజమని నమ్మరాదు. అలా అని ప్రజాప్రతినిధులందరూ సచ్చీలురని చెప్పలేం. ప్రజాప్రతినిధులపై ఆరోపణలు సులువుగా చేసేందుకు వీలుంటుంది. అది నిజం కాదని చెప్పేందుకు ప్రజాప్రతినిధులు కూడా అష్టకష్టాలు పడుతుంటారు. అందుకే గాంధేయవాదం, ప్రగతిశీల వాదం, నిరాడంబరత, ప్రజల్లో మమేకం కావడం, సాధారణ జీవతం గడపడం లాంటి ఉన్నత స్థాయి వ్యక్తిత్వ లక్షణాలను ప్రజాప్రతినిధులు అలవరుచుకోవాలి.
- విశే్వశ్వరరెడ్డి, వైకాపా శాసనసభాపక్ష ఉపనేత, ఆంధ్రప్రదేశ్