ఫోకస్

పరిరక్షణ అందరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నానాటికీ పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా భావిస్తూ సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో విస్తరిస్తున్న జనాభాతో పోటీపడుతూ జల, వాయు కాలుష్యం ఊహకందని రీతిలో పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. పారిశ్రామిక అవసరాలు, వాహనాల వినియోగం విపరీతంగా పెరిగిపోవడం కాలుష్యం ప్రబలేందుకు కారణమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన అవసరం ఉంది. పట్టణాల్లోనూ పచ్చదనాన్ని పెంపొందిస్తూ, సాధ్యమైనంతవరకు వాహనాల వినియోగాన్ని తగ్గించుకోవాలి. ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకునేందుకే అధిక ప్రాధాన్యతనిస్తూ, అవసరమైన సందర్భాల్లో మాత్రమే వ్యక్తిగతంగా వాహనాలను వినియోగించడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు చేసినట్లవుతుంది. సమీప ప్రాంతాలకు వెళ్లాల్సిన సమయాల్లో కాలినడకను ఎంచుకుంటే, అది మధుమేహం, స్థూలకాయం వంటివి దరి చేరనివ్వకుండా ఆరోగ్యవంతంగా ఉండేందుకు తోడ్పడుతుంది. స్థానిక అవసరాల కోసమే వాహనాలు వినియోగించే వారు పొగ వెదజల్లని బ్యాటరీలతో నడిచే వాహనాలను ఉపయోగించాలి. పర్యావరణానికి పెనుముప్పులా మారిన ప్లాస్టిక్ (పాలిథీన్ కవర్లు) వాడకానికి పూర్తిగా స్వస్తి పలకాలి. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలి. ఈ దిశగా ఇప్పటికే మున్సిపాలిటీలు పెద్ద ఎత్తున మొక్కలు నాటి, వాటిని పరిరక్షించే కార్యక్రమంపై దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. ప్రకృతి ప్రసాదించిన జల వనరులను పొదుపుగా వినియోగిస్తూ, అవి కలుషితం బారినపడకుండా కాపాడుకోవడంపైనే జీవకోటి మనుగడ ఆధారపడి ఉంటుంది. ప్రజలు నివాస ప్రాంతాల్లో ఎక్కడబడితే అక్కడ చెత్తను పారవేయకుండా, తడి-పొడి చెత్తలను వేర్వేరుగా చెత్త సేకరణ కార్మికులకు అందించాలి. స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలి. కాలుష్య నియంత్రణ మండలి, అటవీ, పోలీస్ తదితర శాఖలతో సమన్వయం ఏర్పర్చుకుని కాలుష్య నియంత్రణపై ప్రజల్లో అవగాహనను పెంపొందించే కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.

- జాన్ శాంసన్ నగర పాలక సంస్థ కమిషనర్, నిజామాబాద్, తెలంగాణ