ఫోకస్

దేశానికి రెండో రాజధాని!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ రాజధానిగా న్యూఢిల్లీ వయస్సు 86 ఏళ్లు, నగరంలో అన్ని విధాలా రద్దీ పెరిగిపోయింది. దేశం నలుమూలల నుండి అక్కడికి చేరేవారితో జనసమ్మర్థంగా మారిపోయింది. రాజధాని ఇరుకుగా తయారైంది. దానికితోడు కాలుష్యం, నీటి కొరత, వసతి కొరత, తాజాగా భద్రత కొరత కూడా మొదలైంది. పార్లమెంటుపై తీవ్రవాదుల దాడి జరగడమే కాదు, తాజాగా గ్యాంగ్‌వార్లు కూడా ఎక్కువయ్యాయి. ఇలాంటి ఎన్నో ఇబ్బందులను చవిచూస్తున్నవారు దేశానికి మరో రాజధాని ఉంటే తప్పా అని ప్రశ్నిస్తున్నారు. ప్రాచీన ఆధునికతల మేళవింపు అయిన హైదరాబాద్ నగరం, లేదా కొత్త రాజధాని నిర్మించుకుంటున్న ఆంధ్రప్రదేశ్ అమరావతిలో దేశానికి మరో రాజధాని ఉంటే తప్పేమిటి? రాష్టప్రతికి రెండో విడిదిగా హైదరాబాద్ ఉంది కదా... రెండో రాజధాని ప్రస్తావన తెచ్చిన ప్రతిసారీ మిగిలిన నగరాలకు దూరం అయిపోతుంది కదా అంటారు. ఇపుడు కావడం లేదా? చిట్టచివర ఉన్న తమిళనాడు నుండి ఢిల్లీకి పోవడం లేదా కలకత్తా నుండి ఢిల్లీకి వెళ్లడం లేదా? ఈశాన్య రాష్ట్రాల నుండి ఢిల్లీకి ప్రయాణించడం లేదా? ఇపుడు దూరం కావడం లేదా? ఇపుడు లేని దూరం అపుడు ఎందుకు వస్తుంది? వాస్తవానికి ప్రాచీన భారతంలో ఢిల్లీతోపాటు ఆయా సంస్థానాలకు, రాజ్యాలకు వేర్వేరు రాజధాని నగరాలుండేవి. అవంతి నగరం ఒకపుడు రాజధాని కాదా? గుప్తుల కాలంలో గాంధీపురం, చోళుల సమయంలో ప్రహార్, పాటలీపుత్ర నగరం, తక్షశిల, మధుర, అలా అనుకుంటే తుగ్లక్‌ల పాలనలో దౌలతాబాద్, విజయనగర రాజులకు విజయనగరం, పల్లవులకు కాంచీపురం, చోళులకు తంజావూరు, మొగలులకు అలహాబాద్, మరాఠా రాజులకు పూనే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నగరాలు రాజధానిగా విలసిల్లాయి. వాస్తవానికి 1690లో ఈస్టిండియా కంపెనీ రాకతో కలకత్తాకు ఒక రూపం మొదలైంది. 1911 వరకూ దేశరాజధానిగా కలకత్తా కొనసాగింది. భారత బ్రిటిష్ చక్రవర్తి జార్జి -5 నిర్ణయం మేరకు కలకత్తా నుండి దేశ రాజధాని ఢిల్లీకి మారింది. దేశానికి ఒక చివర ఈ నగరం ఉండటం, భౌగోళికపరమైన అసౌకర్యాలను గుర్తించిన బ్రిటిష్ రాజులు దీనిని ఢిల్లీకి మార్చాలని నిర్ణయించారు. 1911 డిసెంబర్ 15న ఢిల్లీలో రాజధాని నిర్మాణం మొదలై 1931 ఫిబ్రవరి 13 వరకూ కొనసాగింది. అదేరోజు వైస్‌రాయ్ లార్డ్ ఇర్విన్ నగరాన్ని ప్రారంభించారు. 1991లో 69వ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం అంతా దేశరాజధాని ప్రాధికార ప్రాంతంగా ప్రకటించారు. తాజాగా దేశరాజధానిగా ఢిల్లీని పేర్కొంటూ రాజ్యాంగంలో గాని, పార్లమెంటులోకాని ఎక్కడా చట్టం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవలే సుప్రీం కోర్టుకు తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టులో వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశానికి రెండో రాజధాని అవసరం లేదా అనే అంశంపై కొంతమంది నిపుణుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.
*
దక్షిణాదినే ఉండాలి
దేశంలో రెండవ రాజధాని ఏర్పాటు గురించి ఎప్పట్నుంచో వాదనలు వినిపిస్తున్నాయి. దక్షిణ భారత దేశాన రెండవ రాజధాని ఏర్పాటు ఎంతైనా అవసరం. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఈ విషయాన్ని రాజ్యాంగంలో ఎప్పుడో పొందుపరిచారు. అయితే ఎందుకనో కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీలు ఈ విషయం గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ నగరం అన్ని విధాలా అనుకూలం. ఆ దిశగా కేంద్రం ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. శీతాకాలంలో ఢిల్లీ నగరంలో పార్లమెంటు సమావేశాలు నిర్వహించడం వలన వాతావరణానికి తట్టుకోలేక సభ్యుల హాజరు కూడా తక్కువగా ఉంటుంది. దీనికితోడు ఢిల్లీ నగరంలో ఏర్పడ్డ వాతావరణ కాలుష్యం వలన తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయి. రెండో రాజధాని ఏర్పాటు వలన ఢిల్లీ నగరంలో వాహన కాలుష్యం కూడా అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. జమ్ముకాశ్మీర్ వంటి రాష్ట్రంలో కూడా వాతావరణానికి అనుకూలంగా రెండు రాజధానుల ఏర్పాటు జరిగింది. పరిపాలన ఒకేచోట కేంద్రీకృతం కాకుండా ఉండాలనే ఆలోచనతోనే అంబేద్కర్ రెండో రాజధాని ఏర్పాటు గురించి ప్రస్తావించారు. హైదరాబాద్‌లో రెండవ రాజధాని ఏర్పాటు చేయడం వలన అటు ఉత్తర భారతానికి, ఇటు దక్షిణ భారతానికి మధ్యలో ఉండడంతోపాటు అన్ని కాలాల్లోనూ వాతావరణ సానుకూలంగా కూడా ఉండే నగరంగా హైదరాబాద్‌ను పేర్కొనవచ్చు. అలాగే ప్రస్తుతం ఢిల్లీలో ఉత్తర భారత ఎంపీలు, తదితర ప్రజాప్రతినిధుల పెత్తనం ఎక్కువగా సాగుతోంది. దక్షిణ భారతదేశ పార్లమెంటేరియన్లను సరిగా పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. కేంద్ర పరిపాలనను వికేంద్రీకరించడంలో భాగంగా దేశంలో రెండో రాజధాని ఏర్పాటుకు కేంద్రం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకు హైదరాబాద్ నగరం అన్నవిధాలా సానుకూలం.
- మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైకాపా లోక్‌సభ ఫ్లోర్ లీడర్
*
హైదరాబాద్ అనువైనదే
భారతదేశానికి హైదరాబాద్‌ను రెండవ రాజధానిగా చేయాలి. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్‌కు రాజధానికి ఉండాల్సిన అన్ని అర్హతలూ ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోని ప్రజానీకానికి దేశ రాజధాని సుదూరంగా ఉంది. రాష్టప్రతితోసహా అనేకమంది విడిదికోసం హైదరాబాద్‌ను ఎంచుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్ర విభజన తరువాత కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ ప్రపంచ ప్రసిద్ధిచెందిన నగరాల్లో ఒకటిగా నిలిచింది. దేశంలో ఏ నగరంలో జరగని అభివృద్ధి హైదరాబాద్‌లో జరుగుతున్నది. తెలంగాణ కొత్తరాష్ట్రం అయినప్పటికీ అభివృద్ధిలో ముందంజలో ఉంది. హైదరాబాద్‌లో ఇప్పుడు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. దేశ రెండవ రాజధానిగా హైదరాబాద్ ఉండటంవల్ల దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు వీలుగా ఉంటుంది. పలు దేశాలకు రెండు రాజధానులు ఉన్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత దేశ రాజధాని ఉత్తర భారతదేశంలో ఉన్నందున దక్షిణ భారతదేశంలోని అన్ని కులాలు, మతాలు, వర్గాలు, జాతులు ప్రశాంతంగా నివసించే హైదరాబాద్‌ను రెండవ రాజధానిగా చేస్తే బాగుంటుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు ప్రశాంతంగా ఇక్కడే జీవిస్తున్నారు. కాబట్టి అన్ని అర్హతలు ఉన్న హైదరాబాద్‌ను భారతదేశ రెండవ రాజధానిగా చేయడం అవసరం.
- పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ (టీఆర్‌ఎస్)
*
భాషే ప్రధాన సమస్య
పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా దేశానికి రెండో రాజధాని అవసరం లేదు కానీ భాష దృష్ట్యా రెండో రాజధాని అవసరం ఉంది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న పార్లమెంటులో హిందీ భాషను అధికంగా ఉపయోగిస్తున్నారు. ఉత్తర భారతదేశంలో ఎక్కువ మంది హిందీ మాట్లాడేవారే. దీనితో దక్షిణాది నుండి వెళ్లే యువ ఎంపీలు భాషా సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుండి వెళ్లే వారికి హిందీ భాషపై పట్టు ఉండదు. పార్లమెంటులో కానీ, ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ అవసరమైన సమాచారం తీసుకోవడం, సమస్యలను అధికారులకు, నేతలకు వివరించడం చేయలేక పోతున్నారు. మన కష్టసుఖాలు చెప్పుకోవాలంటే హిందీ రాకపోవడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీనికితోడు దక్షిణాది వారిపట్ల చూపుతున్న నిర్లక్ష్యం కూడా ఇబ్బందిగానే ఉంది. పార్లమెంటులో సమస్యలు ప్రస్తావించేటప్పుడు సభ్యులు ఆ సమస్యలను వింటే వింటారు లేదంటే లేదు. రెండో రాజధాని ఏర్పాటు ఖర్చుతో కూడుకున్నదే అయినప్పటికీ భాషా పరంగా చూస్తే అవసరమే. ఆయా రాష్ట్రాల స్థానిక భాషలలో మాట్లాడేందుకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించినప్పటికీ దక్షిణాది ఎంపీలు తమ దృష్టికి తీసుకెళ్లే అంశాలను స్పష్టంగా వివరించలేక పోతున్నారు. మాతృభాషలో చెప్పినప్పటికీ మిగతా సభ్యులకు అంటే హిందీ మాట్లాడేవారికి అర్థమయ్యే పరిస్థితి కూడా లేదు. హిందీపై పట్టు రావాలంటే చాలాకాలం పడుతోంది. ఇక దక్షిణాదిలో ఎక్కడ రాజధాని ఏర్పాటు చేస్తామన్న విషయంపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందా అన్నది తేలాల్సి ఉంది.
- నిమ్మల కిష్టప్ప, హిందూపురం ఎంపీ, అనంతపురం జిల్లా.
*
రెండో రాజధానితో ప్రయోజనమే
సువిశాల భారతదేశం విభిన్న ప్రాంతాలు, జాతులు, సంస్కృతులతో కూడి ఉంది. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకయైన భారతదేశం సమగ్రాభివృద్ధికి, ఉత్తర, దక్షిణ భారత దేశాల మధ్య అభివృద్ధిలో అసమానతల నివారణకు, దేశ సమగ్రతను మరింత పటిష్టం చేసేందుకు దక్షిణ భారతదేశంలో రెండో రాజధాని ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. రాజ్యంగ నిర్మాత డాక్టర్ బిఆర్. అంబేద్కర్ కూడా రాజ్యంగ రచన సందర్భంగా దేశానికి రెండో రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. ఉత్తర, దక్షిణ భారతదేశానికి గేట్‌వేగా ఉన్న హైదరాబాద్ ఇందుకు అనువైనదని అంబ్కేదర్ సైతం చెప్పారు. దేశ రాజధానిలో పెరిగిపోతున్న కాలుష్యం, జనాభా సమస్యలను అధిగమించేందుకు, పరిపాలన మరింత వికేంద్రీకరించేందుకు రెండో రాజధాని ఏర్పాటు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన నేటి రోజుల్లో పనులన్నీ ఆన్‌లైన్‌లో సాగుతున్నందున పరిపాలన కోణంలో సైతం రెండో రాజధాని ఉపయుక్తం. పెను విపత్తులు, యుద్ధాలు సంభవించినప్పుడు దక్షిణాదిన రాజధాని ఉంటే దేశ పరిపాలన చేసేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే దేశ రాజధానికి చుట్టుపక్కల ఏర్పాటు చేసే వౌలిక వసతుల ప్రాజెక్టులు రెండో రాజధానితో దక్షిణాదికి కూడా దక్కడం ద్వారా అభివృద్ధిలో సమతుల్యత సిద్ధిస్తుంది. ఉత్తరాదితో పోల్చితే, జనాభా వారిగా పరిశీలిస్తే దక్షిణాది రాష్ట్రాల వారికి కేంద్ర ఉద్యోగాల్లో, నిధుల కేటాయింపుల్లోగాని, వౌలిక వసతుల ప్రాజెక్టుల విషయంలో సరైన ప్రాతినిధ్యం అందడం లేదు. ఇప్పటికే రైల్వేలో, కేంద్ర బలగాల్లో, ఇతర కేంద్ర ఉద్యోగాల్లో దక్షిణాది వారికి తక్కువ ప్రాధాన్యత దక్కుతుంది. ఇప్పటికే లోక్‌సభలో తాను రెండు పర్యాయాలు రెండో రాజధాని ఏర్పాటును ప్రస్తావించానని అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైతే దీనిపై ఆలోచన లేదని చెప్పింది. నిజానికి కేంద్ర ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పరిపాలన చేసేందుకు, దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య అభివృద్ధిలో అసమానతలను నివారణకు, ప్రజల మధ్య మరింత ఐక్యతను పెంచేందుకు దక్షిణాదిలో దేశ రెండో రాజధాని ఏర్పాటు చేయాలని గట్టిగా కోరుతున్నాను.
- డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, భువనగిరి పార్లమెంట్ సభ్యుడు
*
పాలనా సౌలభ్యానికి తప్పదు
పాలనా సౌలభ్యంతోపాటు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు రెండవ రాజధాని తప్పనిసరి. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, బ్యూరోక్రాట్లు ఢిల్లీలో చిన్నచూపునకు గురవుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలదే పైచేయిగా మారుతోంది. దశాబ్దాల కాలంగా వివక్షత కొనసాగుతోంది. అదేమని ప్రశ్నించే సాహసం ఎవరూ చేయడం లేదు. దక్షిణాది రాష్ట్రాల అవసరాలు తీరడం లేదు. ఢిల్లీ కర్రపెత్తనంతో శాసిస్తోంది. ఈ పరిస్థితుల్లో దక్షిణాదిన ఢిల్లీతోపాటు సమానంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో రెండవ రాజధాని ఏర్పాటు చేస్తే మంచిది. రాజధాని ఏర్పాటైనా అంతిమంగా ఢిల్లీదే పెత్తనం. ఇందుకు ఉత్తరాది హవాయే కారణం. తెలుగు రాష్ట్రాలను విడదీయడం వెనుక ఉత్తరాది ప్రయోజనాలు కూడా ఉండొచ్చు. ఢిల్లీలో దక్షిణాదితోపాటు పశ్చిమ రాష్ట్రాలు కూడా వివక్షతను ఎదుర్కొంటున్నాయి. బ్యూరోక్రాట్లు అనేకమంది దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా కొద్దిమంది ఉత్తరాది అధికారులే శాసిస్తున్నారు. దీంతో రెండవ రాజధాని అవసరం తెరమీదకు వస్తోంది. నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన వాటాలు, ఆర్థిక సాయం, జాతీయ సంస్థలు తదితర అంశాల్లోనే తరచూ ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులు ఢిల్లీ చుట్టూ తిరగడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్రాల అవసరాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి చేరవేసేందుకు రెండవ రాజధాని ఆవశ్యకత ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏకపక్షంగా విధాన నిర్ణయాలు తీసుకునే ముందు రాష్ట్రాలతో చర్చించేందుకు వీలుగా ఉంటుంది. యుపి, బీహార్, ఎంపీ, రాజస్థాన్ ప్రాంతాలకు చెందినవారే ఢిల్లీలో కీలకపాత్ర పోషిస్తున్నారు. దక్షిణాదిన రాష్ట్రాలను విడగొట్టి సీట్ల సంఖ్య తక్కువ చేయడం కూడా పెత్తనం కొనసాగించేందుకు ప్రధానంగా యుపీఏ ప్రభుత్వం ఆజ్యం పోసింది. అది వారి మెడకే ఉచ్చులా బిగుసుకుంది. రెండవ రాజధాని ఆవశ్యకతను సమయం వచ్చినప్పుడు పార్లమెంటులో లేవదీస్తా.
- శ్రీరాం మాల్యాద్రి, పార్లమెంటు సభ్యుడు, బాపట్ల
*
ఢిల్లీలో మితిమీరిన కాలుష్యం
ఢిల్లీ వాతావారణ కాలుష్యంతో దెబ్బతింది. అధిక జనాభా వల్ల స్ధలాభావం ఏర్పడింది. దేశ సరిహద్దులకు ఢిల్లీ దగ్గర. ఏ రకంగా చూసినా 130 కోట్ల జనాభాకు రెండవ రాజధాని అవసరం. ఈ విషయంలో అన్ని హంగులు, వౌలిక సదుపాయాలు ఉన్న హైదరాబాద్ నగరం రెండవ రాజధానిని నెలకొల్పేందుకు అనుకూలమైన ప్రదేశం. హైదరాబాద్‌ను రెండవ రాజధాని చేయాలని రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో చెప్పారు. ఆ మహానుభావుడి దార్శనికతను పరిగణనలోకి తీసుకుని కేంద్రం తీసుకోవాలి. హైదరాబాద్‌లో అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల సదస్సును నిర్వహిస్తున్నారు. దీనికికారణం అన్ని హంగులు ఈ నగరానికి ఉన్నట్లే కదా. నగరానికి నాలుగు వైపుల కావాల్సినంత భూమి ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాలకు వెళ్లే విమాన సదుపాయం ఉంది. అంతర్జాతీయ, జాతీయ సంస్ధలు ఉన్నాయి. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌కు సమీపంలో పార్లమెంటు భవనాన్ని నిర్మించి సాలీనా కనీసం నెల రోజులకు తక్కువ కాకుండా సమావేశాలను నిర్వహించాలి. రాష్టప్రతి నిలయం ఇప్పటికే బొలారంలో ఉంది. ఎయిర్ ఫోర్స్, ఆర్మీ విభాగాలు ఇక్కడ ఉన్నాయి. హైదరాబాద్ పరిసరాల్లో మంచి వాతావరణం ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు కూడా దేశ రాజధాని ఢిల్లీలో ఉందనే భావం ఉంది. కాకుండా రెండవ రాజధానిగా హైదరాబాద్‌ను చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు దగ్గరవుతుంది. పైగా సుప్రీంకోర్టును కూడా విభజించాలి. ఒక బెంచ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలి. రాజకీయాలకు అతీతంగా ఈ ప్రతిపాదనను అన్ని పార్టీలు చర్చించి సమర్థించాలి. దేశ ప్రయోజనాలు, భద్రత రీత్యా హైదరాబాద్ మహానగరాన్ని భారత్‌కు రెండవ రాజధానిగా చేయడం శ్రేయస్కరం. హైదరాబాద్‌లో జాతీయ, అంతర్జాతీయ విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. ఇక్కడ అవసరమైన భవనాలు లభ్యత కూడా ఉంది. హైదరాబాద్‌కు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ కేపిటల్ కల్చర్ ఉంది. దేశంలో మరే నగరానికి ఈ చరిత్ర లేదు.
- కె శివకుమార్, వైకాపా ప్రధాన కార్యదర్శి, తెలంగాణ
*
రాష్ట్రాల సంఖ్య పెరిగిపోయంది
సువిశాలమైన భారతదేశ పరిపాలనకు రెండవ పార్లమెంటు అత్యవసరం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ రాష్ట్రాల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. ప్రజలకు జవాబుదారీ పాలన అందించాలన్న ఒత్తిడి పెరుగుతోంది. దక్షిణ భారతదేశంలో రెండవ పార్లమెంటును ఏర్పాటు చేస్తే పరిపాలన సౌలభ్యం చేకూరుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు హైదరాబాద్ నగరం అన్ని అర్హతలతో కేంద్ర బిందువుగా సిద్ధంగా ఉంది. హైదరాబాద్‌లో రెండవ పార్లమెంటును ఏర్పాటు చేస్తే మరింత అభివృద్ధి చెందడమే కాకుండా చట్టసభలపై ప్రజలకు మరింత అవగాహన ఏర్పడుతుంది. రెండవ పార్లమెంటును ఏర్పాటు చేయడం వల్ల కేంద్రానికి సంబంధించిన వివిధ శాఖల కార్యాలయాలు తరలి రావడం వల్ల జవాబుదారీతనం కలసివస్తుంది. అన్ని విధాలుగా ఆమోదయోగ్యమైన హైదరాబాద్‌లో రెండవ పార్లమెంటును ఏర్పాటుచేస్తే దేశ ప్రజలకు, ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలకు శ్రేయస్కరంగా ఉంటుంది.
- చింతా ప్రభాకర్, సంగారెడ్డి ఎమ్మెల్యే, తెలంగాణ
*
ఆహ్వానించదగిన పరిణామమే
దేశ రెండవ రాజధానిని దక్షిణాది ప్రాంతంలో ఏర్పాటుచేసేందుకు కేంద్రం ముందుకువచ్చిన పక్షంలో అది ఆహ్వానించదగిన పరిణామమే! పరిపాలనా సౌలభ్యం కోసం దక్షిణాది ప్రాంతంలో రెండో రాజధాని ఆలోచన మంచిదే! అయితే ఈ విషయంలో గత అనుభవాల దృష్ట్యా న్యాయపరమైన చిక్కులు, ప్రాంతాల మధ్య వైషమ్యాలకు తావులేకుండా అందరి ఆమోదానికి కృషి చేయాల్సి ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీతో సమానంగా దక్షిణ భారత దేశంలో రెండో రాజధాని అభివృద్ధి చెందితే మంచిదే! కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అఖండ భారతావని విస్తరించి ఉన్న దృష్ట్యా కేవలం ఒక ప్రాంతాభివృద్ధి మాత్రమే కాకుండా మిగిలిన ప్రాంతాల అభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది. అత్యంత కీలకమైన ఈ అంశంలో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి! అందరి అభిప్రాయాలను తీసుకున్న పక్షంలో ఏ విధమైన అభిప్రాయ బేధాలకు తావుండదు.
- తోట నరసింహం, పార్లమెంట్ సభ్యుడు, కాకినాడ
*
గందరగోళానికి
దారి తీస్తుంది
దేశానికైనా, రాష్ట్రాలకైనా ఒకే రాజధాని ఉంటే మంచిది. అయితే రెండు లేదా మూడు రాజధానులు ఉంటే అనవసరమైన గందరగోళానికి దారి తీస్తుంది. ఒకటికి మించి రాజధానులుంటే ప్రజలకు పాలకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఎలా అందుబాటులోకి వస్తారు. వారిని ప్రజలు ఎక్కడికి వెళ్ళి కలుసుకోవాలి, ఎక్కడని వెతకాలి? ఎంత సమయం వృధా అవుతుంది? అది ప్రజలపై అనవసరమైన భారం వేసినట్లే అవుతుంది. అయితే మన దేశ రాజధాని ఉత్తర రాష్ట్రాలకు అందుబాటులో ఉందన్న భావన దక్షిణాది రాష్ట్రాల నేతలకు, ప్రజలకూ ఉంది. ఈ కారణంగా లోగడ అంటే కొనే్నళ్ళ క్రితం దక్షిణాదిన కూడా రాజధాని నిర్మాణంపై చర్చ జరిగింది. దక్షిణాది రాష్ట్రాలకోసం విడిగా రాజధాని నిర్మాణం చేపడితే సంబంధిత అధికారులు, పాలకులు ద్విపాత్రాభినయం ఎలా చేయగలరు? కొన్ని దేశాల్లో పరిపాలనా రాజధాని, ఆర్థిక రాజధాని అని వేర్వేరుగా ఉండడం వల్ల వాటిని చూసి మన దేశానికి రెండు రాజధానులు ఉంటే బాగుంటుందన్న ఆలోచన చేస్తే ‘పులిని చూసి నక్క వాత పెట్టుకున్న’ చందంగా మారుతుంది. దక్షిణాది రాష్ట్రాల వారు తాము ఆశించిన విధంగా న్యాయం జరగడం లేదన్న భావన ఉండే అవకాశం ఉంది. కాబట్టి నీతి ఆయోగ్ ద్వారా అన్ని రాష్ట్రాలను, అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తూ, ఉత్తరాది, దక్షిణాది అనే భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాజధాని విషయంలో అటువంటి భావన ప్రజలకు కలగకుండా చూసుకోవాలి. అలా చూసుకోలేనప్పుడే ఉద్యమాలకు ‘తెర’ లేస్తుందని గ్రహించాలి. ముఖ్యమైన పరిపాలన అంటే సచివాలయం ఒకే దగ్గర ఉండాలి. పరిపాలనా అంతా ఒకే దగ్గర ఉంటేనే, ప్రజలకు తేలిక అవుతుంది. వారికి కావాల్సిన పనులను చకచకా చేసుకుని వెళతారు. జిల్లా కేంద్రాల్లో అధికార యంత్రాంగం అందుబాటులో ఉంటుంది. కేవలం పాలకులను కలుసుకోవడం లేదా సచివాలయంలో ఏవైనా ముఖ్యమైన పనుల కోసమే రాజధానికి ప్రజలు వెళుతుంటారు. రెండు రాజధానులు ఉన్నా, వేర్వేరు ప్రాంతాల్లో పరిపాలనా భవనాలు ఉన్నా ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది. పైగా సమయం వృధా అవుతుందని, ప్రజలపై అనవసరమైన వ్యయ భారం పడుతుందని గ్రహించాలి. కాబట్టి పరిపాలనా సౌలభ్యంకోసం రెండు రాజధానులు నిర్మించాలన్న ఆలోచన చేయడం సరైంది కాదు, అది ఆచరణ సాధ్యం కూడా కాదు. అనవసరంగా గందరగోళానికి దారి తీస్తుంది. దీంతో పరిపాలన కుంటుపడి, ప్రభుత్వాలు అప్రతిష్టపాలు అవుతాయి.
- నాదెండ్ల మనోహర్, మాజీ స్పీకర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్,
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు
*
నవ్యాంధ్ర అనుకూలం
రెండో రాజధాని ఏర్పాటు అవకాశం ఉంటే అది నవ్యాంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేస్తే మంచిది. దేశవ్యాప్తంగా దక్షిణాదిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాలున్నాయి. ఆ రాష్ట్రాలకు రెండో రాజధాని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దేశభద్రత దృష్ట్యా రెండవ రాజధాని ఏర్పాటు ఏ మేరకు అవసరం ఉంటుందో కేంద్రం చూడాలి. దేశానికి ఢిల్లీ కేపిటల్‌గా ఉండటం అందరికీ అలవాటైపోయింది. దేశానికి రెండవ రాజధానిని ఏర్పాటుచేస్తే అభివృద్ధి వేగంగా జరుగుతుంది. ఢిల్లీలో రాజధాని ఉండటం వలన అధికార, రాజకీయ యంత్రాంగం ప్రజలకు దూరంగా ఉంటుంది. మరో రాజధాని దక్షిణాదిన ఏర్పాటుచేస్తే ప్రజలకు యంత్రాంగంతోపాటు అధికారులు దగ్గరగా ఉండటంతో అభివృద్ధి ఇంకా వేగంగా జరుగుతుంది. దేశప్రజల సమస్యలపై కేంద్రానికి అవగాహన ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిపై మానిటరింగ్ వేగంగా జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లోని సమస్యలను అవగాహన చేసుకునేందుకు కేంద్రానికి వీలుంటుంది. మొత్తంమీద ఏపీలో రెండవ రాజధాని ఏర్పాటుచేస్తే ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది.
- వైవి సుబ్బారెడ్డి, ఒంగోలు పార్లమెంటు సభ్యుడు
*
భాగ్యనగరం బెస్ట్!
భారతదేశానికి రెండో రాజధాని అవసరమే. రెండో రాజధానిగా హైదరాబాద్‌ను ఎంపిక చేయడం ఉత్తమమైంది. ఏ కోణంలో చూసినా హైదరాబాద్ రెండో రాజధానికి అర్హత కలిగి ఉంది. మనదేశం 120 కోట్ల జనాభాతో 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలతో ఉన్న విశాలమైన దేశం. న్యూఢిల్లీ మొదటి నుండి దేశ రాజధానిగా కొనసాగుతున్నప్పటికీ, రెండో రాజధాని అవసరం ఎంతైనా ఉంది. ఢిల్లీ తర్వాత విభిన్న భాషలవారు, విభిన్న రాష్ట్రాల వారు నివసిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ పేరుగాంచింది. అంతర్జాతీయంగా పరిశీలిస్తే చాలా దేశాలకు రెండు, అంతకు మించి రాజధానులు ఉన్నాయి. మన దేశానికి కూడా రెండో రాజధాని ఉంటే ఎలా ఉంటుందన్న చర్చ చాలాకాలంగా కొనసాగుతోంది. ఒక దేశం నైసర్గిక స్వరూపం, జనాభా, ప్రజల అవసరాలు, ప్రభుత్వ విధానాలు తదితర అంశాలతో పాటు, దేశ రక్షణను దృష్టిలో ఉంచుకుని రాజధానుల ఎంపిక జరుగుతుంది. భారత రాష్టప్రతి ప్రతి ఏటా వేసవి విడిదిగా హైదరాబాద్ వస్తారు. పదిహేను రోజులపాటు దక్షిణభారత్‌లోని ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. అంటే న్యూఢిల్లీ తర్వాత హైదరాబాద్‌కు దేశంలోనే అత్యంత ప్రాధాన్యత లభించినట్టే. హైదరాబాద్‌లో జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు, సదస్సులు జరుగుతున్నాయి. జాతీయ కార్యాలయాలు కూడా ఉన్నాయి. రక్షణకు సంబంధించి ఆర్‌సిఐ, ఎఆర్‌సిఐ, డిఆర్‌డిఎల్, మిథాని, డిఎంఆర్‌ఎల్ తదితర సంస్థలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. జాతీయ మత్స్య అభివృద్ధి కార్యాలయం, ఎన్‌ఐఎన్, సిసిఎంబి, తదితర జాతీయ పరిశోధనా కేంద్రాలకు కూడా హైదరాబాద్ నిలయంగా ఉంది. వాతావరణ పరిశోధనకు సంబంధించి ఇన్‌కాయిస్ కూడా ఇక్కడే ఉంది. ఇసిఐఎల్ తదితర జాతీయ ఎలక్ట్రానిక్స్ సంస్థలు కూడా హైదరాబాద్‌లో ఉన్నాయి. రాజకీయంగా, ఆర్థికంగా, రక్షణపరంగా, వ్యాపార, వాణిజ్య పరంగా, భాషాపరంగా ఏ విధంగా చూసినా దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌కు ప్రత్యేకత ఉంది.
- కె. శ్రీనివాసరావు, రాజకీయ విశే్లషకుడు