ఫోకస్

వర్శిటీలు.. వివాదాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశాంత వాతావరణానికి ప్రతీకలుగా, సరస్వతి నిలయాలుగా విరాజిల్లవలసిన ఉన్నత విశ్వవిద్యాలయాలు అలజడులతో అట్టుడికిపోతున్నాయి. విద్యార్థుల ఉద్యమాలు, అధ్యాపకుల నిరసనలు, పాలనా సిబ్బంది అలసత్వం, ప్రభుత్వ నిర్లిప్తత, సమన్వయ లోపం, నిధుల లేమివంటి రకరకాల కారణాలతో విశ్వవిద్యాలయాలు కునారిల్లుతున్నాయి. వర్శిటీల్లో ఉద్యమాలు కొత్తేమీ కాదు. హక్కుల కోసం, సదుపాయాల కోసం, విద్యా ప్రమాణాల కోసం, విలువల కోసం ఉద్యమాలు జరగడం సాధారణం. అలాంటి ఉద్యమాలను ఎవరైనా హర్షిస్తారు.. స్వాగతిస్తారు. కాని ఇటీవలి కాలంలో విశ్వవిద్యాలయాల్లో ఉద్యమాలు గాడి తప్పుతున్నాయి. విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, మత సంఘాలు, ప్రాంతీయ సంఘాలు ఇలా వేటికవి తమ సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రయత్నాలే విశ్వవిద్యాలయాల పరిస్థితులను తలకిందులు చేసేస్తున్నాయి. వార్షిక ప్రణాళిక ప్రకారం నడవాల్సిన విశ్వవిద్యాలయాల్లో అనేకమార్లు పరీక్షలు, ఫలితాలు వాయిదా పడుతున్నాయి. సవ్యంగా క్లాసులు జరగడం లేదు. నాగార్జున వర్శిటీలో ర్యాగింగ్, కాకతీయ వర్శిటీలో నియామకాల్లో అక్రమాలు, ఉస్మానియాలో బీఫ్ ఫెస్టివల్ పేరిట నిరసనోద్యమాలు తాజాగా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సెంట్రల్ యూనివర్శిటీలో విద్యార్థి రోహిత్ ఆత్మహత్యతో మరోమారు వర్శిటీలు వివాదాలకు కేంద్రాలుగా నిలిచాయి. రోహిత్ ఆత్మహత్యకు విశ్వవిద్యాలయం సిబ్బంది తీరుతెన్నులే కారణమని, అక్కడి పరిస్థితులే ఆత్మహత్యకు పురిగొల్పాయని విద్యార్థి తరఫు బంధువులు, మిత్రులు ఆరోపిస్తున్నారు.
రోహిత్ ఆత్మహత్య అనంతరం సెంట్రల్ యూనివర్శిటీ గత పది రోజులుగా అట్టుడికిపోతోంది. గత వైస్ చాన్సలర్ హయాంలో జరిగిన ఈ వివాదం కాస్తా రచ్చకెక్కి వైస్ చాన్సలర్ అప్పారావు మెడకు చుట్టుకుంది. దళిత విద్యార్థులకు, ఎబివిపి కార్యకర్తలకు మధ్య జరుగుతున్న వివాదానికి ఎక్కడో ఒకచోట ఫుల్ స్టాప్ పెట్టాలనుకుని విసి తీసుకున్న నిర్ణయాలు తలకిందులయ్యాయి. మరోవైపు అనూహ్యంగా రోహిత్ ఆత్మహత్యకు పాల్పడటంతో వివాదం చినికి చినికి గాలివానగా మారింది. విద్యార్థులు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. యూనివర్శిటీల బంద్‌కు పిలుపునిచ్చారు. రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. అరెస్టులకు వెరవడం లేదు. విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ రాసిన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను మంత్రివర్గం నుండి తొలగించాలని, వైస్ చాన్సలర్ అప్పారావును డిస్మిస్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు దత్తాత్రేయ ఒత్తిడికి తలొగ్గిన కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రభుత్వం విసి అప్పారావును సెలవుపై వెళ్లమని కోరింది. ఆయన స్థానంలో శ్రీవాస్తవను ఇన్‌చార్జి వైస్ చాన్సలర్‌గా నియమించారు. వ్యవహారం అక్కడితో ఆగలేదు. సమస్య వచ్చినపుడే పరిష్కారాలను వెతికి ఉండే బావుండేది, సమస్య జటిలమయ్యాక పరిష్కారాల వల్ల లాభం ఏమిటి? అని ప్రశ్నించేవారూ లేకపోలేదు. ఇది కేవలం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వివాదం మాత్రమేకాదు. మిగిలిన వర్శిటీలు ఇంతకంటే భిన్నంగానో, మెరుగ్గానో ఉన్నాయని చెప్పలేము. చదువుల నెలవులుగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలు ఉద్యమాలకు నెలవుగా ఎందుకు మారాయి? దీనికి పరిష్కారం ఏమిటనేది ఈ వారం ఫోకస్.