ఫోకస్

ఆధార్‌తో లాభమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధార్ అనేది 12 అంకెల విశిష్ట సంఖ్య. ఈ విశిష్ట సంఖ్యను తెలిపే పత్రమే ఆధార్ కార్డు. దేశంలో ఎక్కడ ఉన్నా ఆధార్ విశిష్ట సంఖ్య ద్వారా ప్రతి వ్యక్తి పూర్వోత్తరాలను గ్రహించడమేగాక, వర్తమాన కార్యకలాపాలను గుర్తించగలిగేలా ప్రభుత్వం సమాచార శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. టెలిఫోన్ నెంబర్, బ్యాంకు అకౌంట్లు, ప్యాన్ కార్డు, ఎన్నికల కార్డు, చిరునామా, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు ఆసరాగా ప్రతి వ్యక్తి కార్యకలాపాలను మానిటర్ చేసే వ్యవస్థ నేడు భారత్‌కు దక్కింది. భారతదేశ జనాభా నేటి గణాంకాల ప్రకారం 129 కోట్ల 4 లక్షల 34వేల 056, కాని దేశంలో 105 కోట్ల ఆధార్ కార్డులను జారీ చేశారు. హిందువులు 80.5 శాతం, ముస్లింలు 13.4 శాతం, క్రైస్తువులు 2.3 శాతం, సిక్కులు 1.9 శాతం, ఇతరులు 1.9 శాతం మందికి ఆధార్‌లు అందాయి. ఇంకా దాదాపు 24 కోట్ల మందికి ఆధార్ కార్డులు అందాల్సి ఉంది. బ్యాంకు ఖాతా తెరవాలన్నా, నగదు బదిలీ చేయాలన్నా, స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేయాలన్నా, ప్రవేశపరీక్షకు దరఖాస్తు పెట్టాలన్నా, బీమా పాలసీ తీసుకోవాలన్నా, పాస్‌పోర్టు పొందాలన్నా, గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలన్నా, చివరికి విమాన టిక్కెట్ కొనుగోలు చేయాలన్నా ఆధార్ విశిష్ట సంఖ్యను ఇవ్వాల్సి వస్తోంది. రానున్న రోజుల్లో ప్రతి కార్యక్రమానికి ఆధార్‌ను తప్పనిసరి చేసినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం ఉన్న బ్యాంకు ఖాతాలకు, టెలిఫోన్లకు, డిపాజిట్లకు, ఇతర కీలక అంశాలకు ఆధార్‌ను అనుసంథానం చేసే గడువు మార్చి 31తో ముగియనుంది. తర్వాత అనుసంథానం కాని బ్యాంకు ఖాతాల్లోని నిథులు ఎస్క్రో ఖాతాలకు వెళ్లే ముప్పు లేకపోలేదు. ప్రభుత్వం చెప్పే లెక్కలు ఎలా ఉన్నా ఆధార్ కార్డులు జారీ అయినా చేతికి అందని వారు, ఆధార్ కార్డులో పొరపాట్లు పడి ఇబ్బందులు పడుతున్న వారు, సమాచారంలో దోషాలు, గతంలో ఆధార్ కార్డుకు ఇచ్చిన రిజిస్టర్డు టెలిఫోన్ నెంబర్లు లేక ఇబ్బందులు పడుతున్న వారు లెక్కలేనంత మంది. ఆధార్ బయోమెట్రిక్‌లోనూ లోపాలు ఉన్నాయని మరికొంత మంది ఫిర్యాదు చేస్తున్నారు. ప్రతి వ్యక్తి తన జీవితానికి సంబంధించి అన్ని రకాల వివరాలను ఆధార్‌తో అనుసంథానమయ్యే రోజు కూడా దగ్గరలోనే ఉంది. ఈ కారణం చేతనే ఆధార్ కార్డు అతి ముఖ్యమైనదిగా మారింది.
ఆధార్ డాటా లీక్ అవుతుందా?
ఆధార్ డాటా లీక్ అవుతుందనేది అపోహ మాత్రమే. ఆధార్ డాటాకు రెండంచెల భద్రతా వ్యవస్థ ఉంది. వర్చ్యువల్ ఐడి ద్వారా ప్రతిసారీ ధృవీకరణకు ఆధార్ నెంబర్‌ను షేర్ చేసే అవసరం ఉండదు. 16 డిజిట్లతో ఉండే వర్చ్యువల్ ఐడి ర్యాండమ్‌గా జనరేట్ అవుతుంది. ఆధార్ నంబర్‌కు బదులు ధృవీకరణకు ఈ కొత్త ర్యాండమ్ ఐడీని వాడుకోవచ్చు.
వ్యక్తులను మార్చే వీలులేదు
ప్రతి వ్యక్తి కళ్లను ఐరిష్ పద్ధతిలో స్కాన్ చేయడంతో పాటు పది చేతి వేళ్ల ముద్రలను సేకరించాలని యుఐడిఎఐ సంస్థ నిర్ణయించింది. దాని వల్ల ఒకరి డాటా మరొకరు పొందేందుకు లేదా మార్చేందుకు ఎలాంటి అవకాశం లేదు. రానున్న రోజుల్లో ఆధార్ సంఖ్యను 16 అంకెలకు పొడిగించే యోచన ఉంది.

ఆధార్‌లో తప్పులుంటే...
ప్రభుత్వ పథకాలు అన్నింటికీ ఆధార్ కార్డును అనుసంథానం చేశారు. అయితే అందులో ముద్రణ సమయంలో తప్పులు దొర్లడం సహజం. చాలా మందికి తమ పేరు, పుట్టిన తేదీ సరిగా పడకపోతే దానికోసం ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఇంటర్ నెట్ సదుపాయం ఉంటే ఇంట్లో కూర్చుని వాటిని మార్చుకోవచ్చు.
https://ssup.uidai.gov.in/web/guest/update అనే వెభ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేసిన తర్వాత కింద నల్లటి అక్షరాల్లో కనిపిస్తున్న వెరిఫికేషన్ కోడ్ టైప్ చేయాలి. సెండ్ బటన్ క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్‌కు ఒటిపి వస్తుంది. ఆ ప్రాసెస్ చేసినపుడు మొబైల్ పక్కనే ఉండాలి. ఎడిట్ పేజీకి వెళ్లి సూచన మేరకు వివరాలను అప్‌డేట్ చేయాలి.
కొత్త ఆధార్ కార్డు కోసం
కొత్త ఆధార్ కార్డు కోసం https://eaadhaar.uidai.gov.in/ అనే సైట్ ఓఫెన్ చేయాలి. ఎన్‌రోల్‌మెంట్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ సెలెక్టు చేసుకుని కింద ఉండే కాలమ్‌లో ఎంటర్ చేయాలి. పూర్తిపేరు, పిన్‌కోడ్ తర్వాత కాలమ్ కింద కనిపించే అక్షరాలు, మొబైల్ నెంబర్ నమోదు చేయాలి. గెట్ వన్ టైమ్ పాస్‌వర్డు క్లిక్ చేస్తే మొబైల్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా పాస్‌వర్డు వస్తుంది. దానిని ఎంటర్ చేయగానే పీడీఎఫ్ రూపంలో ఆధార్ కార్డు డౌన్‌లోడ్ అవుతుంది.
రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేకపోతే
ఆధార్ కార్డులోని తప్పులను సవరించేందుకు ఆధార్ వెబ్‌సైట్లో నమోదైన మొబైల్ నెంబరే ప్రధాన ఆధారం. అది ప్రస్తుతం వాడటం లేదంటే ఆన్‌లైన్ ఆధార్ అప్‌డేట్ కుదరదు. ఎందుకంటే ఆ మొబైల్‌కు ఒటిపి వస్తుంది. దాని ద్వారానే మార్పులు చేయడం సాధ్యపడుతుంది. ఒక వేళ కార్డు తీసుకునే సమయంలో ఇచ్చిన నంబర్ మారిపోయి ఉంటే దగ్గర్లోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి మొబైల్ నెంబర్‌ను మార్చుకునేందుకు దరఖాస్తు చేయాలి. అలా వీలు కాని వారు పోస్టు ద్వారా యుఐడిఎఐ, పోస్టు బాక్స్ -99, బంజారా హిల్స్, హైదరాబాద్- 500034 చిరుమానాకు తమ దరఖాస్తు ఫారం పంపించాలి.
ఆధార్ ఎందుకు?
వృత్తి, వ్యాపారం రీత్యా ఇల్లు మారుతున్న వారికి ఆధార్ శాశ్వత నివాస గుర్తింపును ఇస్తుంది. 2006లో కేంద్రం ప్రత్యేక సంస్థను స్థాపించి ఆధార్ గుర్తింపు సంఖ్యను ఇవ్వడం ప్రారంభించింది. పాన్‌కార్డు, ఇన్‌కంటాక్స్ రిటర్నులు, సంక్షేమ పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేశారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర, బ్యాంకు ,బీమా, పన్నుల సేవలతో పాటు రాయితీలు, లబ్ది, పించన్లు, ఉపకార వేతనాలు, సామాజిక , పథకాల లబ్ది, విద్య, ఉద్యోగం, ఆరోగ్యరక్షణ తదితర అంశాలకు ఆధార్ అనుసంథానం చేయడం వల్ల ఆధార్ సమాచారం సిఐడిఆర్‌లో అత్యంత ఖచ్చితంగా అధునాతనంగా ఉండటం తప్పనిసరి. జన సంఖ్యా సంబంధ నవీకరణకు కూడా ఇది అవసరం కావచ్చు. జీవితంలో జరిగే సహజ మార్పులు, వివాహం కావడం మూలంగా నివాసులు తమ పేరు, చిరునామా మార్చుకోవల్సిన అవసరం రావచ్చు.
ఆధార్‌తో చాలా లాభాలు
ఆధార్ విశిష్ట సంఖ్య ఉండటం వల్ల కొన్ని పనులు చాలా తేలిక అయిపోతాయి. మన డాటాను వెరిఫై చేయడం క్షణాల్లో పూర్తవుతుంది. పాస్‌పోర్టు దరఖాస్తు సమయంలో ఆధార్ నెంబర్‌తో వెరిఫై చేసుకోవచ్చు. అలాగే సెల్‌ఫోన్‌కు కొత్త సిమ్ తీసుకోవాలంటే ఆధార్ తప్పనిసరి. ల్యాండ్ లైన్ తీసుకోవాలన్నా ఆధార్ ఇవ్వాల్సిందే. రేషన్ పొందేందుకు పౌర సరఫరాల విభాగానికి ఆధార్ సమర్పించాల్సిందే. మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు జరుగుతుందో లేదో తెలుసుకునేందుకు ప్రభుత్వం ఆధార్‌ను తప్పనిసరి చేసింది. ఆధార్ కార్డును ఆదాయపన్ను విభాగంలోని పాన్‌తో అనుసంథానం చేస్తున్నారు. ఇలా అనుసంథానం చేసిన వారు ఐటిఆర్‌ను ప్రింట్ తీసి పంపించాల్సిన అవసరం లేదని కూడా ఆదాయ పన్నుశాఖ ప్రకటించింది. బ్యాంకింగ్ ఖాతాకు , ఖాతాలోని చిరునామా మార్పునకు, ఆధార్ ఉపయోగపడుతుంది. ఆధార్ ఉంటే చాలు ఇక ఏ ఇతర గుర్తింపు పత్రాలు అవసరం లేదు. డిజిటల్ లైఫ్ సర్ట్ఫికేట్ పెన్షనర్లు బ్యాంకులో ఆధార్ నెంబర్ ఇస్తే వారి ప్రక్రియ మరింత సులువు అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ యుఐడిఎఐ జారీ చేసిన ఆధార్ లెటర్, ఈ ఆధార్‌ను ప్రామాణికంగా అంగీకరించాలని సెబి, ఐర్‌డిఎలు నిర్ణయించాయి. నెలవారీ పించన్లకు కూడా ఆధార్‌ను తప్పనిసరి చేశారు. ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ ఖాతా నుండి డబ్బు ఉపసంహరించుకోవాలంటే ఆధార్ కావాలి. అలాగే డిజిటల్ లాకర్ ద్వారా సర్ట్ఫికేట్లను ఆన్‌లైన్‌లో భద్రపరుచుకోవాలన్నా, వర్చ్యువల్ ఆధార్ నెంబర్ కావాలన్నా ఆధార్ అవసరమే.
ఉపకార వేతనాలకు గ్యాస్ సబ్సిడీ బదలాయింపునకు, మినీ సిలిండర్లను కొనుగోలు చేయాలన్నా ఆధార్ అవసరమే.
*
డేటా దుర్వినియోగం కారాదు
*
దేశంలో ప్రతి పౌరునికి ఒక గుర్తింపు కార్డులా ఆధార్ కార్డు ఉపయోగపడుతుంది. ఇతర దేశాల్లో సామాజిక భద్రత కార్డు మాదిరిగా ఇక్కడ ఆధార్‌కార్డు వల్ల ప్రజలు ప్రయోజనం పొందుతున్నారు. ఆధార్ అన్నదీ ప్రతి ఒక్కరికి చాలా అవసరం. అయితే డేటా దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తప్పుడు వ్యక్తుల చేతుల్లో ఆధార్ డేటా పడితే వారి వ్యక్తిగత సమాచారం బహిర్గతమయ్యే ప్రమాదం ఉంది. సాధారణంగా ప్రభుత్వ వ్యవస్థలో కూడా 5శాతం మంది దుర్వినియోగానికి పాల్పడటం అనేక సందర్భాల్లో రుజువైంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకుండా ఉండాలి. ఆధార్ కార్డు డేటాతో దుర్వినియోగానికి పాల్పడితే అతని వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లినట్టే లెక్క. ఆధార్ కార్డులో డేటాను సక్రమంగా పొందుపరచాల్సి ఉంది. అందులో తప్పులు దొర్లితే దానివల్ల అనర్హులు అర్హులుగా మారే ప్రమాదం ఉంది. ఆధార్‌ను ఆదాయ పన్ను శాఖకు అనుసంధానం చేస్తే తప్పులేదు. దానివల్ల పన్ను ఎగవేత లేకుండా సక్రమంగా పన్ను వసూలు చేసే వీలుంటుంది. అదేవిధంగా మొబైల్ సెల్‌ఫోన్లకు ఆధార్ కార్డు అనుసంధానం చేయమంటున్నారు. దీనివల్ల కూడా ప్రభుత్వానికి కొన్ని ఉగ్రవాద శక్తులను గుర్తించే అవకాశం ఉంటుంది. ఇపుడు సాధారణంగా అనేక కేసుల్లో నేరస్థులను సెల్‌ఫోన్ ఆధారంగా గుర్తించగలుగుతున్నారు. కాగా, ఇటీవల ఆధార్ కార్డును అన్నింటికీ అనుసంధానం చేస్తే ప్రమాదమని సూచించింది. ఆధార్ వల్ల లాభాలు ఉన్నాయి, మరోపక్క నష్టాలూ ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఆధార్ కార్డులో వయస్సు తికమకగా పడటంవల్ల అనర్హులు పించన్లు అందుకుంటుండగా, అర్హులు పించన్లకు దూరమయ్యారు. ఇటువంటి వాటిని ప్రభుత్వం సరిదిద్దాల్సి ఉంది. అన్ని వర్గాల వారికి ప్రయోజనం కలిగేలా ఆధార్ కార్డును ఉపయోగించగలిగితే అందరికీ మేలు జరుగుతుంది. ఇక ఎన్నికల సమయంలో సర్వే పేరుతో ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చిస్తోంది. ఆధార్ కార్డుతో ఎన్నికలు నిర్వహించగలిగితే ఆ దుబారా వ్యయాన్ని నియంత్రించవచ్చు.
- ప్రొఫెసర్ జిఎస్‌ఎన్ రాజు
వైస్ ఛాన్సలర్, సెంచూరియన్ వర్శిటీ.
*
లోపాలను సవరించాలి
*
ఒక మంచి సదుద్దేశ్యంతో లోగడ కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం ‘ఆధార్’ కార్డు తీసుకుని వచ్చింది. ప్రజలందరికీ ఈ ‘ఆధార్’ కార్డు భారతీయులనే నిర్ధారణకు ఉపయోగపడుతుంది. ఈ కార్డుతో ఎంతో మేలు జరుగుతుంది. అయితే ఇంకా అందరికీ ‘ఆధార్’ అందడం లేదు. ముఖ్యంగా నిరక్షరాస్యులు, గూడు లేని వారికి, సంచారం చేసే వారికీ ‘ఆధార్’ అందలేదు. వారి గురించి కేంద్రం ఆలోచన చేయలేదు. వారికి ఈ కార్డు ఎలా తీసుకోవాలో తెలియదు, చిరునామా ఏదీ ఇవ్వడానికీ ఆస్కారమే లేదు. ఈ సమస్యను అధిగమించి వారికీ ‘ఆధార్’తో గుర్తింపునివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దీనిపై దృష్టి సారించకుండా, వ్యక్తుల ‘గుట్టు’ను బట్టబయలు చేసేలా నియంతృత్వ చర్యలకు కేంద్రం పాల్పడింది. దీంతో అనేకానేక చిక్కు సమస్యలు తలెత్తి, చివరకు కోర్టుల్లో కేసులు పడ్డాయి. నాడు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ భారతీయులన్న గుర్తింపు కార్డు ఇవ్వాలనుకుంటే, ఈ ప్రభుత్వం అన్నింటికీ అనుసంధానం చేస్తూ ఇబ్బంది పెడుతోంది. దేశ ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా చేస్తోంది. ‘ఆధార్’ నెంబర్‌తో వ్యక్తిగత స్వేచ్ఛ కోల్పోతున్నారు. ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛను హరించరాదు. ఆధార్ కార్డుపై ఉండే నెంబర్‌తో వ్యక్తిగత విషయాలన్నీ బట్టబయలు అవుతున్నాయి. ఇది ఎంతవరకు సమంజసం. కేవలం 500 రూపాయలు చెల్లిస్తే చాలు, వ్యక్తిగత విషయాలన్నీ ఇట్టే బయట పెడుతున్న వైనాన్ని ఒక జర్నలిస్టు తన కథనం ద్వారా బయటపెడితే, సదరు జర్నలిస్టుపై కేసు నమోదు చేయడం దుర్మార్గం. జరుగుతున్న లోపాల గురించి వెలుగులోకి తేవడం నేరమా? దేశంలోకి చొచ్చుకుని వచ్చిన బంగ్లాదేశ్, పాక్ టెర్రరిస్టులూ ‘ఆధార్’ను సంపాదిస్తున్నారంటే లోపం ఎక్కడ ఉందో ప్రభుత్వం తెలుసుకోవాలి. అటువంటి లోపాలను సరి చేసి పగడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. ఇంకా విషయంలో లోపాలను సరి చేసుకుని పగడ్బంధీగా అమలు చేసేందుకు అవసరమైతే జాతీయ స్థాయిలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది.
- కనుకుల జనార్ధన్ రెడ్డి
మాజీ ఎమ్మెల్సీ
చైర్మన్, రాష్ట్ర సేవాదళ్, తెలంగాణ కాంగ్రెస్
*
ఆధార్ ఉండాల్సిందే!
*
స్వాతంత్య్రానంతరం దేశంలో తొలిసారిగా తెరపైకి వచ్చిన ‘ఆధార్’ను కొందరు తమ ప్రయోజనాల కోసం వ్యతిరేకిస్తున్నారు. వాస్తవానికి వారి వాదన అర్థరహితం. సత్ప్రవర్తన కలిగిన వారెవరూ దీనికి భయపడాల్సిన అవసరం లేదు. నేను అనునిత్యం గ్రామీణ ప్రజానీకంతో మమేకమై ఉంటున్న వ్యక్తిని. గ్రామాల్లో దీన్ని ఏఒక్కరూ వ్యతిరేకించడం లేదు. అయితే సాంకేతిక లోపాలతో అక్కడక్కడా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడంతో పాటు ప్రతి వ్యక్తి సంపూర్ణ డేటాను కూడా ఆధార్‌లో సంక్షిప్తం చేస్తే ఏదైనా నేరం జరిగినప్పుడు సంబంధిత వ్యక్తుల పూర్తి సమాచారాన్ని క్షణాల్లో రాబట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా కీలక బాధ్యతను అప్పగించే సమయంలో ముందుగా అతని వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆధార్ కారణంగా ఒక్క కృష్ణా జిల్లాలోనే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేసే అవకాశం లభించింది. చౌకడిపోల్లో ఆధార్‌తో గడచిన రెండేళ్లలో దేశంలోనే తొలిసారి పెద్దమొత్తంలో 170 కోట్ల రూపాయల ప్రభుత్వ సబ్సిడీని అక్రమార్కుల పాలు కాకుండా కాపాడగలిగారు. ప్రస్తుత ఖరీఫ్‌లో 60వేల మెట్రిక్ టన్నుల సబ్సిడీ ఎరువులను ఆదా చేయగలిగారు. ప్రతి ఏటా సొసైటీల ద్వారా 2లక్షల 70వేల మెట్రిక్ టన్నుల ఎరువుల అమ్మకాలు జరిగితే ఆధార్ కారణంగా ఈ ఏడాది కేవలం 2లక్షల 10వేల మెట్రిక్ టన్నుల అమ్మకాలే జరిగాయి. ఇలా ఆధార్ కార్డుల వల్ల అనేక విధాలుగా సత్ఫలితాలు కనిపిస్తున్నాయి.
- యలమంచిలి బాబూరాజేంద్రప్రసాద్
ఎమ్మెల్సీ, కృష్ణా జిల్లా
*
వివరాలన్నీ భద్రంగా ఉండాలి
*
ఆధార్ కార్డులోని ఒక పౌరుడి వ్యక్తిగత అంశాలకు గోప్యత, భద్రతను కల్పించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. భద్రత లేనందు వల్ల కీలకమైన సమాచారం లీకవుతుంది. దాని వల్ల వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం వాటిల్లుతుంది. అలాగే మన దేశంలో పౌరుల వ్యక్తిగత సమాచారం శత్రు దేశాలకు చేరుతుంది. ఆదార్ కార్డు విషయంలో సుప్రీం కోర్టు అనేక తీర్పులు ఇచ్చింది. కేంద్రం కూడా అనేక రకాలైన ఆదేశాలు ఇస్తూ వెళుతోంది. గడువులను పొడిగిస్తున్నారు. మొబైల్ ఫోన్, బ్యాంకులు, బీమా కంపెనీలు, ఇంటి రిజిస్ట్రేషన్, బ్యాంకు ఖాతాను తెరవాలన్నా, రుణం తీసుకోవాలన్నా, ప్రభుత్వ బెనిఫిట్లు పొందాలన్నా ఆదార్ కార్డు జిరాక్స్‌ను అడుగుతున్నారు. చివరకు రైల్వే శాఖ ఐఆర్‌సిటిసి కూడా ఆదార్ కార్డును అనుసంధానం చేస్తే ఆన్‌లైన్ ద్వారా గరిష్టంగా నెలకు ఇప్పుడు తీసుకునే టిక్కెట్లను ఆరు నుంచి 12కు పెంచింది. ఆదార్‌ను సంక్షేమ పథకాలతో అనుసంధానం చేయడం మంచిదే. దీని వల్ల అవకతవకలను నిరోధించవచ్చును. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు దేశంలోని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు వేల కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్నాయి. ఇవి లబ్ధిదారుడికి చేరాలంటే ఆదార్ ఉండాల్సిందే. ఫీజు రీ ఎంబర్స్‌మెంట్‌కు కూడా ఆదార్ అనుసంధానం చేశారు. దీనిని కూడా అంగీకరించవచ్చును. కాని ప్రైవేట్ ఏజన్సీలు కూడా ఆదార్ కార్డు నంబర్, జిరాక్స్‌ను చూపించమంటున్నాయి. దేశంలో నిరక్షరాస్యత 40 శాతం ఉంది. ఈ నేపథ్యంలో ఆదార్ కార్డు డాటా లీకు కాకుండా పటిష్టమైన విధనానాన్ని కేంద్రం అమలు చేయాలి. ప్రతి ఒక్కరు ఆదార్ కార్డు, నంబర్ అడుగుతుంటే జనం ఆందోళనకు గురవుతున్నారు. ఆదార్ కార్డును సామాజిక సంక్షేమ ప్రగతికి ఉపయోగించుకుంటే చాలు. అంతేకాని ఆర్థిక రంగంలో కూడా వినియోగిస్తున్నారు. ఈ వేలం వెర్రి ఇలా పెరిగితే అనర్థాలకు దారితీస్తుంది. ఒక పౌరుడి వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లడం దేశ ప్రయోజనం దృష్ట్యా మంచిది కాదు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆదార్ డేటా దుర్వినియోగం కాకుండా కళ్లెం వేయాలి. ఇందులో చిక్కులేమైనా ఉంటే తొలగించాలి.
- కె శివకుమార్
ప్రధాన కార్యదర్శి, వైకాపా, తెలంగాణ రాష్ట్ర శాఖ
*
ప్రభుత్వానిదే బాధ్యత
*
మా పార్టీ ఆధార్ వ్యవస్థకు ఏమాత్రం వ్యతిరేకం కాదు. ఆధార్ వద్దని, తీసుకోవద్దని తామెప్పుడూ చెప్పలేదు. మొదట్లో ఇది కేవలం ఒక గుర్తింపు సంఖ్య మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు అన్నింటికీ ఇది తప్పనిసరి అంటున్నారు. కానీ జారీ చేయడం ప్రారంభించిన సమయంలో పౌరులకు తగిన సమాచారం ఇవ్వలేదు. హడావుడిగా కాలపరిమితులు నిర్ణయించి ప్రజలను గందరగోళంలోకి నెట్టారు. దీంతో పరుగులు తీసి మరీ ఆధార్ నమోదు చేయించుకున్నారు. ఆధార్ నమోదు కేంద్రాల సంఖ్య తక్కువగా ఉండడమే కాకుండా కేంద్రాల్లోనూ సరిగ్గా సాంకేతిక సహకారం లేకపోవడం వల్ల అనేక తప్పులు దొర్లాయి. ఆ తర్వాత కొంతవరకు సరిచేసి కాలపరిమితి లేకుండా అందరికీ ఇచ్చారు. మంచిదే, కాదనం కానీ సంక్షేమ పథకాలకు ఆధార్‌ను అనుసంధానం చేయడం వల్ల ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ ఇబ్బందుల వల్ల సంక్షేమ పథకాలు అర్హులకు అందడం లేదు. ఇలాంటి పరిస్థితిలో సంక్షేమ పథకాలకు ఆధార్‌ను అనుసంధానం చేయడం అనేది కొన్ని రోజులు ఆగిన తర్వాత చేపడితే మంచిది. ఎందుకంటే అందరి చేతికి ఆధార్ వచ్చాకే సంక్షేమ పథకాలకు అనుసంధానం చేస్తే బాగుంటుంది. ఈలోగా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు వీలవుతుంది. ఈమధ్య కాలంలో పత్రికల్లోనూ, ప్రసార మాధ్యమాల్లోనూ విపరీతి ప్రచారం జరుగుతోంది. ఎంతో విలువైన పౌరుల ఆధార్ డేటా కారు చౌకగా అంగట్లో దొరుకుతోందని అంటున్నారు. ఈ ప్రచారం కరక్టయితే మనం పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొనాల్సి వస్తుందేమో. ఆధార్ డేటా అమ్ముడు పోతోందని దేశవ్యాప్తంగా పెద్ద అలజడే వచ్చింది. ఇదే నిజమైతే ఆధార్ డేటాను భద్రంగా ఉంచాల్సిన బాధ్యత నూటికి నూరు శాతం కేంద్ర ప్రభుత్వం పైనే ఉంది. ఇప్పటికే అనేక లోపాలు, వ్యవస్థలో ఉన్న లోపభూయిష్టం విధానాల వల్ల ప్రతి దానిలో అక్రమాలకు అంతే లేకుండా పోతోంది. ఈ పరిస్థితిలో ఆధార్ డేటాకు కూడా భద్రత లేకపోతే ఇక ఏం చేయాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విషయంలో చాలా సీరియస్‌గా తీసుకోవాలి. ఎంతో ప్రతిష్టాత్మకంగా, వేల కోట్లు వెచ్చించి చేపట్టిన ఈ ప్రాజెక్టు నిరుపయోగం కారాదు. డేటా ఇతరుల చేతికి గాని వెళితే ఇక ప్రభుత్వం ఆశించిన లక్ష్యం ఎలా నేరవేరినట్లు అవుతుంది. ఇంకా చెప్పాలంటే నకిలీ ఆధార్ కార్డులు చలామణిలోకి వచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చాలా సులభంగా ఆధార్ కార్డులు నకిలీవి సృష్టిస్తున్నారని వింటున్నాము. ఇక ఆధార్ కార్డు కూడా నకిలీది వస్తే వ్యవస్థలో మనం ఎక్కడ ఉన్నట్లు. మొదటికే మోసం వస్తుంది. ప్రభుత్వం జాగ్రత్త వహించాలి. ఆధార్ డేటాను పటిష్ట పర్చి, భద్రత కల్పించాలి. అలా చేస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. లేదంటే అభాసుపాలవుంది.
- కె.రామకృష్ణ
సిపిఐ, ఎపి రాష్ట్ర కార్యదర్శి
*
ఆధార్‌పై అపోహలు వద్దు
*
ఆధార్ కార్డులపై అపోహలు పెట్టుకోవద్దు. సామాజిక అభివృద్ధికి, వ్యక్తిగత అభివృద్ధికి ఆధార్ దోహదపడుతుంది. అవినీతికి ఆస్కారం లేకుండా చూసేందుకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు సజావుగా సాగాలంటే ఏదో ఒకరకమైన నియమావళి, కట్టుబాట్లు ఉండాలి. ఇందుకు దోహదపడేదే ఆధార్ కార్డు. కేంద్ర ప్రభుత్వం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ద్వారా ఆధార్‌ను తీసుకువచ్చింది. దేశంలోని ప్రతి పౌరుడిని గుర్తించేందుకు ఆధార్ ద్వారా ఒక యూనిక్ నెంబర్ ఇస్తున్నారు. అంటే 120కోట్ల మందికి 120కోట్ల నెంబర్లు లభిస్తాయి. జనాభా ఎంత ఉంటే అంతమందికి ఈ నెంబర్లు ఇస్తారు. ప్రతి వ్యక్తి ఏ ప్రాంతానికి చెందినవాడో, ఎక్కడ ఉంటున్నాడో తదితర వివరాలు తెలుసుకునేందుకు ఇది తోడ్పడుతుంది.
ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి తదితర పనులకు వెచ్చించే డబ్బు ప్రజలది. ప్రభుత్వం నేరుగా నోట్ల కట్టలను ముద్రించదు. ప్రజల నుండి పన్నులు తదితర రూపాల్లో లభించే డబ్బునే ప్రజలకోసం వ్యయం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రజా సంక్షేమంకోసం పకడ్బందీగా, చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ప్రతి పైసా ప్రజలకోసమే ఉపయోగపడాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నారు. అరవై ఏళ్ల ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణ ప్రజల జీవనం సమస్యల మధ్య నడిచింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత కెసిఆర్ ప్రభుత్వం ఒక నిర్దిష్ట లక్ష్యం, మంచి ఉద్దేశంతో పనిచేస్తోంది.
రైతులు, వృత్తిపనివారు, ఉద్యోగులు, వ్యాపారులు, వాణిజ్యవేత్తలు, స్వయం ఉపాధితో జీవిస్తున్నవారు, కార్మికులు తదితరుల సంక్షేమం కోసం కేసీఆర్ అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టారు. సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు మాత్రమే చేరేందుకు ఆధార్‌ను ఉపయోగిస్తున్నారు. ఇందుకు ఎవరూ అభ్యంతరం చెప్పనవసరం లేదు. ప్రభుత్వం ఖర్చుచేసే నిధుల్లో ప్రతి పైసా పేదలకు చేరాలన్నదే కెసిఆర్ తపన. ఇందుకు మనమంతా సహకరించాలి. బంగారు తెలంగాణ సాధించేందుకు తోడ్పడాలి.
- గువ్వల బాలరాజు
ఎమ్మెల్యే, అచ్చంపేట నియోజకవర్గం
నాగర్‌కర్నూలు జిల్లా