చిత్తూరు

ఘనంగా రథసప్తమి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 14: చిత్తూరు జిల్లావ్యాప్తంగా పలు అలయాల్లో సూర్యజయంతి ఉత్సవాలను ఘనం గా నిర్వహించారు. సూర్యజయంతిని పురస్కరించుకుని ఆదివారం తిరుమల్లో టిటిడి నిర్వహించిన రథసప్తమి వేడుకల్లో స్వామివారు సప్తాశ్వాలు పూన్చిన సూర్యప్రభ వాహనంపై సప్తగిరీశుడైన శ్రీ స్వామివారు విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈసందర్భంగా సుమారు రెండు లక్షలమందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుని పరవశించారు. ఉదయం 5గంటలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమైన రథసప్తమి వేడుకలు చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలనుస్వామివారు అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఒకే రోజు 15 గంటల్లో స్వామివారు ఏడు వాహనాలపై విహరించి బ్రహ్మోత్సవాలను తలపించారు. కాగా మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల నడుమ శ్రీవారి పుష్కరణిలో నిర్వహించిన చక్రస్నానంలో వేల సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టిటిడి ఇ ఒ సాంబశివరావు, జె ఇ ఒ శ్రీనివాసరాజు, సి వి ఎస్ ఓ నాగేంద్రకుమార్, ఎస్పీ గోపినాథ్ జెట్టిలు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
టిటిడి అనుబంధ అలయాల్లో పలు వాహన సేవలపై ఊరేగిన స్వామి అమ్మవార్లు
తిరుపతి: జిల్లాలోని గుడిమల్లం, తిరుచానూరులోని సూర్యనారాయణస్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునే భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేశారు. ప్రధానంగా తిరుపతిలో పరిసర ప్రాంతాల్లోని టిటిడి అనుబంధ అలయాల్లో రథసప్తమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి గోవిందరాజస్వామి, తిరుచానూరు పద్మావతి అమ్మవారి అలయం, శ్రీనివాసమంగాపురం కళ్యాణవేంకటేశ్వరస్వామి, చంద్రగిరి కోదండరామస్వామి అలయాల్లో ఉత్సవ మూర్తులు పలువాహనాలపై మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు కనువిందు చేశారు. తిరుచానూరులోని సూర్యనారాయణస్వామివారిఅలయంలో సూర్యజయంతిని పురస్కరించుకుని మూలమూర్తికి వేకువజామునే పాలు, పెరుగు, నెయ్యి, తేనే, పసుపు, చందనం, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారు అశ్వవాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే శ్రీపద్మావతి అమ్మవారి అలయంలో రథసప్తమి సందర్భంగా ఉదయం 7గంటలకు సూర్యప్రభ, సింహా, అశ్వ, గరుడ, పెద్దశేష, చంద్రప్రభ వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. చివరిగా రాత్రి 9గంటలకు గజవాహనంపై తిరుమాఢా వీధుల్లో అమ్మవారి ఊరేగింపు కన్నులపండుగగా సాగింది. తిరుచానూరులో జరిగిన వేడుకల్లో తిరుపతి జెఈఓ పోలా భాస్కర్, అలయ డిప్యూటీ ఓ చెంచులక్ష్మి, పేష్కార్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి గోవిందరాజస్వామివారి అలయంలో అదివారం తెల్లవారుజామునే స్వామి అమ్మవార్లను కోలువుదీర్చి చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించారు. వేకువజామున 5.30గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనాన్ని అధోరోహించి మాడవీధుల్లో ఊరేగారు. అటు తర్వాత స్వామివారు హంస, హనుమంత, పెద్దశేష, ముత్యపుపందిరి, సర్వభూపాల, గరుడ వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్దసంఖ్యలో హాజరై నాలుగుమాడ వీధుల్లో స్వామివారికి అడుగడుగునా కర్పూరనీరాజనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రథసప్తమి వేడుకల్లో అలయ డిప్యూటీ ఓ వసంతకుమారి, ఏఈఓ ప్రసాదమూర్తి తదితరులు పాల్గొన్నారు. కాగా శ్రీనివాసమంగాపురంలో కళ్యాణవేంకటేశ్వర స్వామివారి అలయంలోనూ, చంద్రగిరి కోదండరామాలయంలోనూ స్వామి అమ్మవార్లు బంగారు తిరుచ్చి వాహనాలను అధిష్టించి పురవీధుల్లో విహారించారు. అలయ డిప్యూటీ ఓ వెంకటయ్య, ఏఈఓ ధనంజయ తదితరులు పాల్గొన్నారు.
అలిపిరి నుంచి శ్రీ కాళహస్తికి
రైలు మార్గం
* అటవీశాఖ మంత్రి బొజ్జల వెల్లడి
శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 14: తిరుపతిలోని అలిపిరి నుంచి శ్రీ కాళహస్తికి ప్రత్యేక రైల్వే లైన్ వేయించడానికి ముఖ్యమంత్రి అంగీకరించారని రాష్ట్ర అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలోని ఎంజి ఎం ఆసుపత్రి ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్యశిబిరంలో ఆయన మాట్లాడారు. శ్రీ కాళహస్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటున్నారని కొనియాడారు. అలిపిరి నుంచి శ్రీ కాళహస్తికి రైల్వేలైన్ వేయడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని చెప్పారు. ఐఐటి , ఐఐఎస్‌ఇఆర్ వంటి విద్యాసంస్థలు సిఎం కృషితోనే వచ్చాయని మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను త్వరలో అమలు చేస్తామని చెప్పారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్యనాయుడు సహకారంతో శ్రీ కాళహస్తి మునిసిపాలిటీకి అమృతవర్షం కింద 6 వేల ఇండ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇళ్లు లేని పేదలందరికీ ఇంటి నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. 5 సార్లు తాను ఎమ్మెల్యేగా గెలిచానని, నియోజకవర్గానికి ఎంత చేసినా రుణం తీరదని అన్నారు. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధిచాలదని మరిన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉందని చెప్పారు. రక్తదానం శిబిరాన్ని, ఎంజి ఎం పెట్రోల్ బంకును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ గురవయ్యనాయుడు తిరుపతికి చెందిన డాక్టర్లు విద్యాసాగర్, రత్నమాలిక, టిడిపి నాయకుడు మాల్యాద్రి, సుబ్రహ్మణ్యం నాయుడు, ఎం జి ఎం సంస్థల చైర్మన్ మల్లికార్జున నాయుడు, డైరెక్టర్లు డాక్టర్ మనోజ్ , మయూర్, నీతు, ఐశ్వర్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్లు విద్యాసాగర్, రత్నమాలిక్‌ను మంత్రి సన్మానించారు. వైద్యశిబిరంలో సుమారు 400 మంది రోగులు పరీక్షలు చేసుకున్నారు. ఉచిత మందుల పంపిణీ జరిగింది. 40 మంది రక్తదానం చేశారు.
మాంగల్య బంధంతో ఒక్కటైన అనాథ విద్యార్థులు
* 25వేలు నజరానా ప్రకటించిన జిల్లా కలెక్టర్ * 15వేలిచ్చిన డాక్టర్ సుధారాణి
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, ఫిబ్రవరి 14: వారు చదువుకున్న అనాథ విద్యార్థులు. అయితే వారికి విద్యాబుద్ధులు నేర్పించిన గురువు వారిని మాంగల్య బలంతో ఒక్కటి చేశారు. వధువు సాయిలత తరుపున చిత్తూరు ఎంపి శివప్రసాద్ కుమార్తె నీలిమ, ఆమె భర్త నర్సింహప్రసాద్ పెద్దలుగా నిలిచి కన్యాదానం చేశారు. ఈనవ వధూవరుల పేరిట జిల్లా కల్టెర్ సిద్దార్థ్ జైన్ సామాజిక చైతన్యాన్ని ప్రోత్సహిస్తూ రూ. 25వేలు ఫిక్సిడ్ డిపాజిట్ వేసి తన పాలనాదక్షతను చాటుకున్నారు. ఇక అదే రీతిలో టిడిపి ఎన్‌టిఆర్ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి రూ.15వేలుఅందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గమనించ దగ్గ విషయం ఏమిటంటే ధనవంతులు పిల్లల వివాహాలకు కూడా కొన్ని సందర్భాల్లో హాజరుకాలేని అతిరథ మహారథులు ఈ నవదంపతుల వివాహానికి హాజరై వారిని ఆశీర్వదించారు. వివరాలు ఇలా ఉన్నాయి. సాయిలత, భరత్‌కుమార్ శర్మ తిరుపతిలోని అనాథ శరణాలయంలో విద్యా బుద్ధులు నేర్చుకున్నారు. అనాథ శరణాలయంలో పనిచేసే నందగోపాల్ అనే అధికారి వీరి వివాహానికి ముందుండి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో వారికి ఆదివారం మంగళం సమీపంలోని ప్రభుత్వ పరిశీలన గృహంలో నిరాడంబరంగా వివాహం జరిపించారు. ఈకార్యక్రమానికి హాజరైన ఎంపి శివప్రసాద్ మాట్లాడుతూ ఈ రోజు ప్రేమికుల దినమని, అందులోను అతిపవిత్రమైన రథసప్తమి పర్వదినమని ఈరోజు వారు దంపతులు కావడం ఒక గొప్ప విశేషమన్నారు. ఇందుకు కృషి చేసిన నందగోపాల్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈకార్యక్రమానికి ఎమ్మెల్యే సుగుణమ్మ, డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం, డాక్టర్ శ్రీహరి, డాక్టర్ ఆశాలత, డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ కృష్ణప్రశాంతి, ఎంపి సతీమణి డాక్టర్ విజయలక్ష్మి, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రాజకీయాలు, అవినీతికి దూరంగా
క్రీడలు అభివృద్ధి చేయాలి
* ఏపి స్పోర్ట్స్ అధార్టీ చైర్మన్ మోహన్ సూచన
తిరుపతి, ఫిబ్రవరి 14: క్రీడా రంగం అత్యంత విశిష్టమైనదని, దీనిని రాజకీయాలు, అవినీతికి దూరంగా అభివృద్ధి చేసి ప్రతిభకు పట్టం కట్టాలని ఏ పి స్పోర్ట్స్ అధార్టీ చైర్మన్ పిఆర్ మోహన్ అన్నారు. తిరుపతిలోని స్విమ్స్ వైద్యశాల 23వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అదివారం స్విమ్స్ స్పోర్ట్స్ డే ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర స్పోర్ట్స్ అధార్టీ చైర్మన్ పిఆర్ మోహన్ విచ్చేసి క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అందులో భాగంగా త్వరలోనే జాతీయ క్రీడలను అంధ్రప్రదేశ్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు శారీరక, మానసిక పటుత్వం సాధించాలంటే క్రీడల పట్ల అసక్తిని పెంపోందించుకోవాలని పిలుపునిచ్చారు. వైద్యవిద్యార్థులు క్రీడల్లో కొంత వెనుబడ్డారని మిగిలిన విద్యార్థులతో పాటు వీరు కూడా క్రీడల్లో రాణించాలని అభిలషించారు. స్విమ్స్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు కూడా చాలా అవసరమన్నారు.క్రీడల ద్వారానే మానసిక, శారీరక ఎదుగుదల సాధ్యవౌతుందని వెల్లడించారు. తద్వారా సమాజానికి మెరుగైన సేవలను అందించే అవకాశం కలుగుతుందని చెప్పారు. స్విమ్స్ ప్రాంగణంలోనే ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, జిమ్, నిర్మాణానికి ఏపి స్పోర్ట్స్ అధార్టీ ద్వారా సహాయ సహకారాలు అందించాలని పి ఆర్ మోహన్ ను కోరారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయి క్రీడల్లో రాణించిన విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు.

శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో ఆగిన రథసప్తమి
నాగలాపురం, ఫిబ్రవరి 14: తిరుమల తిరుపతి దేవస్థానం అనుసంధానం లో ఉన్న నాగలాపురంలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో ఆనవాయితీగా రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించేవారు. ఈ సారి కూడా రథసప్తమి వేడుకలను తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. కానీ రథసప్తమి వేడుకలు నిర్వహించకపోవడంతో భక్తులు నిరాశతో వెనుతిరిగారు. గత ఏడాది ఆగస్టులో కురిసిన గాలి వానకు ఆలయంలోని ధ్వజస్థంభం పూర్తిగా ఒరిగిపోయింది. ఇంత వరకు టిటిడి అధికారులు ధ్వజస్థంభాన్ని ఏర్పాటుచేయలేదు. ధ్వజస్థంభం లేకుండా ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదనే టిటిడి ఆనవాయితీ ప్రకారం కావడంతో ఈసారి ధ్వజస్థంభం లేకపోవడంతో రథసప్తమి వేడుకలను నిర్వహించలేదు. దీనిపై ఇకనైనా టిటిడి అధికారులు స్పందించి నాగలాపురం వేదనారాయణ స్వామి ఆలయంలో ఉన్న ఒరిగిన ధ్వజస్థంభాన్ని వెంటనే ఏర్పాటుచేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
మనుషుల అక్రమరవాణా వ్యతిరేక ఉద్యమానికి ప్రతి ఒక్కరు సహకరించాలి
* జిల్లా రెండవ అదనపు న్యాయమూర్తి జయరాజ్

మదనపల్లె, ఫిబ్రవరి 14 : ప్రభుత్వం మనుషుల అక్రమ రవాణాను నిరోధించడానికి ఎన్నో చట్టాలు అమల్లో ఉన్నాయని, ఈ చట్టాల గురించి, సమాజంలో జరుగుతున్న దురాగతాలపై మహిళలకు అవగాహన ఎంతో అవసరమని రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్‌ఎస్‌ఎస్ జయరాజ్ తెలిపారు. ఆదివారం ప్రజ్వల స్వచ్చంధ సంస్థ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో మనుషుల అక్రమరవాణా వ్యతిరేక ఉద్యమంపై అవగాహన కల్పించడానికి జిల్లాలో మొదటగా మదనపల్లె పట్టణంలో ఆదివారం శ్రీకారం చుట్టారు. ముందుగా స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి మహిళల భారీర్యాలీని ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, మున్సిపల్ చైర్మన్ శివప్రసాద్, ఎంపిపి సుజన ప్రారంభించి పాల్గొన్నారు. అనంతరం జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో సమావేశం ఏర్పాటుచేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎడిజె జయరాజ్ మాట్లాడుతూ ఈ అక్రమ రవాణాకు సంబంధించి కోర్టులలో కేసులు రుజువైతే వారికి జీవితఖైదు విధించే అవకాశం ఉందన్నారు. సమాజంలో ఎక్కడైనా బలవంతంగా వ్యభిచారంలోకి దింపి, ఈ వృత్తిని నిర్వహించే నిర్వాహకులు, ఇందుకు సంబంధించి పనిచేసే ఇతర వ్యక్తులు అందరినీ అదుపులోకి తీసుకుని పట్టుబడిన కేసుల నిర్వాహకులకు ఎక్కువకాలం శిక్షపడే అవకాశం ఉందన్నారు. 20 మిలియన్ల మంది మహిళలు తెలిసీ తెలియక ఈ వృత్తిలో ఉన్నారన్నారు. ప్రజ్వలిక స్వచ్చంధసంస్థ, ఇతర స్వచ్చంధ సంస్థల సహకారంతో మదనపల్లెలో ఏ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో మంచిదన్నారు. సమాజంలో ప్రేమపేరుతో అమ్మాయిలను మోసంచేసి ఈ వృత్తిలోకి దించుతున్నారని, ఇటువంటి వారి మాయమాటలను విని మోసపోవద్దన్నారు. తల్లిదండ్రులుగా పిల్లల ఆలోచనలు, ప్రవర్తనను గమనించుకోవాలన్నారు. మదనపల్లె వైస్‌చైర్మన్ భవానిప్రసాద్ మాట్లాడుతూ మన సంస్కృతిని కాపాడుకోవాలని, పిల్లలందరం సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచిగా వినియోగించుకోవాలన్నారు. ఎంపిపి సుజన మాట్లాడుతూ అత్యాశకు పోయి జీవితాలు నాశనం చేసుకోవద్దని, అమ్మాయిలకు రంగుల ప్రపంచాన్ని చూపిస్తామనే వారి మాటలు నమ్మకూడదని, తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలన్నారు. అనంతరం సిఐ హనుమంతనాయక్ మాట్లాడుతూ సీమ జిల్లాల్లోని ఆడపిల్లలను జీవనోపాధి, డబ్బులు ఎరజూపి ఉపాధి కల్పిస్తామని చెప్పి, ఈ వృత్తిలోకి దించుతున్నారని తెలిపారు. మీ చుట్టుపక్కల ఇటువంటి దురాగతాలు జరుగుతున్నప్పుడు బాధ్యతగా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ సమావేశంలో ముందుగా జిల్లాలో మోసపోయిన మహిళలు, యువతుల అనామిక వీడియోను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు శరత్‌బాబు, భాస్కర్‌రావు, ప్రజ్వల స్వచ్చంధ సంస్థ సీనియర్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ బలరామకృష్ణ, మల్లేష్, మెహత్‌బేగం, సుజాత, రమాదేవి, సంజీవులు, నాగరాజు, నాగేశ్వర్‌నాయుడు, రామచంద్రారెడ్డి, సిడిపిఓ సరళాదేవి, సుజాత, ఐకెపి ఎపిఎంలు శివ, మహిళాసంఘాల సభ్యులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

మద్యం మత్తులో ఘర్షణ
* గొంతుకోసి యువకుడి హత్య
పలమనేరు, ఫిబ్రవరి 14: పలమనేరు పట్టణంలో శనివారం రాత్రి మద్యం మత్తులో ఇద్దరు ఘర్షణకు పాల్పడి ఓ వ్యక్తిని దారుణంగా గొంతుకోసి హత్య చేసిన సంఘటన సంచలనం రేపింది. వివరాలిలా ఉన్నాయి. పలమనేరు పట్టణంలోని జిలానిక్రాస్‌లో నౌషాద్ అనే వ్యక్తి స్వీట్‌స్టాల్ నిర్వహిస్తున్నాడు. అదే దుకాణంలో స్వీట్ మాస్టర్‌గా పనిచేస్తున్న బాలాజీ (35) శనివారం రాత్రి తన స్వీట్ స్టాల్‌లోనే వీరు మద్యం సేవించారు. వీరి మధ్య అప్పుల విషయంలో తగాదా ఏర్పడింది. టీ స్టాల్ యజమాని నౌషాద్ తీవ్రమైన అప్పుల బాధలో ఉన్నాడు. 30 లక్షల మేర అప్పులు తీసుకున్నాడు. వ్యాపారంలో తీవ్రంగా నష్టం రావడంతో అప్పులు తిరిగి చెల్లించలేని పరిస్థితిలో కాల్‌మనీ వ్యవహారంలో జిల్లా ఎస్పీకి తన భార్యతో కలిపి అప్పుల వారితో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై స్వీట్ స్టాల్‌లో పనిచేస్తున్న బాలాజీ మద్యం మత్తులో హేళనగా మాట్లాడటంతో ఆగ్రహించిన చెందిన నౌషాద్ తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతుకోశాడు. దీంతో అరుపులు, కేకలు వినపడటంతో అక్కడకు చేరుకున్న వారిపై కూడా నౌషాద్ దాడికి యత్నించాడు. అనంతరం పలమనేరు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. దుకాణంలో పనిచేస్తున్న స్వీట్‌మాస్టర్ బాలాజీని ఎందుకు హత్య చేశావని పోలీసులు విచారించగా అప్పుల వారు తనను వేధిస్తున్నారని, దుకాణంలో పనిచేస్తున్న మాస్టర్‌ను కూడా హేళన చేస్తున్నాడని కోపంతో హత్య చేసినట్లు చెప్పాడు. అప్పుల వారు కూడా ఈ హత్యతో భయపడి తనకు వద్దకు రారని ఉద్దేశంతో హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇంకా సమగ్ర దర్యాప్తు నిర్వహించి అరెస్ట్ చేస్తామని పలమనేరు సిఐ సురేంద్రరెడ్డి తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి
శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 14: శ్రీ కాళహస్తి పట్టణంలోని పానగళ్లులో శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఇంటి ముందు ముగ్గులేస్తున్న వరలక్ష్మి (35) మహిళను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతోఅక్కడి కక్కడే మృతిచెందింది. ఆదివారం రథ సప్తమి కావడంతో ప్రత్యేకంగా ముగ్గులు వేస్తుండగా తిరుపతినుంచి వెళ్లేకారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వరలక్ష్మి అక్కడికక్కడే మృతిచెందింది. ఈ విషయమై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. శ్రీ కాళహస్తి పట్టణ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
తక్షణం డిపాజిట్లు చెల్లించాలి
* మొండి బకాయిల వసూళ్లు చేయాలి
* చిత్తూరు టౌన్ బ్యాంకు మహాజన సభలో ఖాతాదారుల డిమాండ్
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, ఫిబ్రవరి 14 : చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులో మెచ్యూరిటీ అయిన డిపాజిట్లను తక్షణమే చెల్లించి మొండి బకాయిల వసూళ్లకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఖాతాదారులు డిమాండ్ చేశారు. ఆదివారం చిత్తూరులో కోఆపరేటివ్ టౌన్‌బ్యాంకు మహాజన సభ చైర్మన్ షణ్ముగం అధ్యక్షతన జడ్పీ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు ఖాతాదారులు మాట్లాడుతూ ఫ్రుడెన్షియల్, వాసవి బ్యాంకుల్లో పేరుకుపోయిన డిపాజిట్లను త్వరగా అందేవిధంగా పాలక వర్గం చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ డిపాజిట్లు అందకపోవడం వల్ల చిత్తూరు కోఆపరేటివ్ టౌన్‌బ్యాంకు ఆర్థికంగా సంక్షోభంలో పడిందని, ఈ పరిస్థితుల్లో ఈ బ్యాంకుల నుంచి ఆ డిపాజిట్లను త్వరగా తీసుకొచ్చే విధంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అలాగే ఈ వ్యవహారం కోర్టులో పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకు ఆర్థిక పరిపుష్టి కోసం కార్యాచరణ చేపట్టాలన్నారు. అలాగే పట్టణంలో ఉన్న ప్రముఖుల వద్ద నుంచి డిపాజిట్లు సేకరించాలని సూచించారు. బ్యాంకు పాలన వ్యవహారం పారదర్శకంగా కొనసాగించాలని, షేర్ క్యాపిటల్ విషయంలో 5 శాతం డ్యూడెంట్ చర్యలు తీసుకోవాలన్నారు. డిపాజిట్‌దారుల్లో ఆందోళన ఉందని, వారికి సత్వరం చెల్లిస్తామన్న భరోసా ఇవ్వాలన్నారు. మొండి బకాయి వసూళ్లకు ప్రత్యేక కమిటీలు వేయాలని సూచించారు. బ్యాంకులో ఖాతాదారుల సంఖ్యను పెంచాలన్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ షణ్ముగం మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ నుంచి మెచ్యూరిటీ అయిన డిపాజిట్లను చెల్లిస్తామని రాష్ట్ర సహకార శాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో డిపాజిట్ల చెల్లింపు ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. ఖాతాదారులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, వాసవి ఫ్రుడెన్షియల్ బ్యాంకుల్లో పేరుకుపోయిన డిపాజిట్లలో కొంతమొత్తం ప్రభుత్వం ద్వారా రాబట్టామని తెలిపారు. మిగిలిన మొత్తాలను కూడా త్వరలోనే వచ్చే విధంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అలాగే బ్యాంకులో వృధా ఖర్చులు తగ్గించి పారదర్శకంగా పాలన కొనసాగించే విధంగా అందరూ చర్యలు తీసుకోవాలన్నారు.
షేర్ క్యాపిటల్స్‌పై డివిడెన్స్ ఇచ్చే విషయాన్ని ప్రతి ఆర్థిక సంవత్సరం నుంచి పరిష్కరిస్తామన్నారు. ప్రధానంగా టౌన్‌బ్యాంకులోని శాఖలు ఆదివారంలో కూడా ఖాతాదారులకు అందుబాటులో ఉండే విధంగా, అలాగే సాయంత్రం బ్యాంకు సదుపాయాలు కల్పించే ఆలోచనలో ఉన్నామన్నారు. డిపాజిట్‌దారులకు ఎలాంటి సదుపాయం లేదని, నగరంలోని ప్రముఖుల వద్ద డిపాజిట్లు రాబట్టడంతో పాటు ఖాతాల సంఖ్య పెంచే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. మెచ్యూరిటీ అయిన డిపాజిట్లను ఈ నెల 25వ తేదీ నుంచి విధిగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రఘునందన్, సిఇవో వెంకటరమణ, పలువురు డైరెక్టర్లు, ఖాతాదారులు పాల్గొన్నారు.