రచ్చ బండ

గ్రేటర్ పోరులో తప్పని..తిప్పలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిహెచ్‌ఎంసి ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల ఎంపికలో తిప్పలు తప్పలేదు. టిఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీల్లో ఇవి కొంత తక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ, బిజెపిల్లో ఆగ్రహజ్వాలలు రగిల్చాయి. టిక్కెట్లు అమ్ముకున్నారని టిక్కెట్లు దక్కని ఆశావాహులు ఆందోళనలకు దిగారు, నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేంత వరకూ కొన్ని డివిజన్ల విషయంలో కాంగ్రెస్, టిడిపి, బిజెపిలు అభ్యర్థులను ఖరారు చేయకుండా, బి-్ఫరంలు ఇవ్వకపోవడంతో ఆందోళనలు పెరిగాయి. ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేసి బి-్ఫరంలు ఇచ్చి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. మిగతా పార్టీల అభ్యర్థులను చూసిన తర్వాతే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించాలనుకోవడంతో ఈ తప్పిదం జరిగింది. కొన్ని డివిజన్లలో పోటీ ఎక్కువగా ఉండడం, వత్తిళ్ళు, ఆందోళనల కారణంగా కూడా సకాలంలో అభ్యర్థుల ఎంపికను చేయలేకపోయారు. తద్వారా పార్టీ నేతలకు తలనొప్పే కాకుండా అసలైన అభ్యర్థులకు ప్రచారానికి సమయం తగ్గిపోయింది. చాలా డివిజన్లలో మీరు నామినేషన్లు వేసి ఉంచండి, తర్వాత చూద్దాం అని కొంత మంది నాయకులు కార్యకర్తలకు చెప్పడం కూడా వివాదస్పదమైంది. మీరు చెప్పినందుకే మేము నామినేషన్ వేశామని, ఇప్పుడు మరో అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చారని, అమ్ముకున్నారని, లేదా మిత్రపక్షానికి కేటాయించారని, మీకు నచ్చిన వారికి ఇచ్చుకున్నారని టిక్కెట్లు రాని ఆశావాహులు ఆందోళన వ్యక్తం చేయడానికి కారణమైంది.
ఇది కాంగ్రస్‌లో శృతి మించింది. కాంగ్రెస్‌లో సీనియర్ అయిన తనను పార్టీ గుర్తించలేదని, గాంధీ భవన్‌లో ఒక కార్యకర్త పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తనకు డూప్లికేట్ బి-్ఫరం ఇచ్చారని ఒక మహిళా కార్యకర్త రోజంతా ధర్నా చేయగా, టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి కనిపించడం లేదని మరో మహిళా కార్యకర్త పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. లంగర్‌హౌస్, ఫలక్‌నుమా ఇలా అనేక డివిజన్లు సమస్యాత్మకంగా మారాయి.
టిడిపి-బిజెపి ముఖ్య నాయకులు వారం రోజులుగా చర్చలు జరిపినా, కొన్ని డివిజన్లలో ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. చిలుకానగర్, హబ్సిగుడా, ఉప్పల్, మాదాపూర్, బోరబండ, ఆర్‌కె పురం తదితర 10 డివిజన్లలో రెండు పార్టీలూ బి-్ఫరాలు ఇచ్చాయి. 10 డివిజన్లలో స్నేహపూర్వక పోటీ చేయాలని నిర్ణయించాయి. పోటీ అంటేనే ప్రత్యర్థిపై పోటీ చేసి గెలుపొందడమైతే, స్నేహపూర్వక పోటీ అంటూ ఇరు పార్టీల నేతలు చెప్పడం ద్వితీయ శ్రేణి నాయకులకు, కార్యకర్తలకు అర్థం కాలేదు. పొత్తు ఉందంటూనే 10 డివిజన్లలో స్నేహపూర్వక పోటీ ఏమిటో ఎవరికీ బోధపడడం లేదు. బిజెపి రాష్ట్ర కార్యాలయం నుంచి బి-్ఫరం తీసుకున్న మాదాపూర్ అభ్యర్థి గరికపాటి సతీష్‌ను పార్టీ కార్యాలయం ప్రధాన గేటు దాటకుండా ఆ టిక్కెట్ ఆశించిన హరికృష్ణ తన అనుచరులతో అడ్డుకున్నారు. సుమారు గంటన్నర పాటు సతీష్‌ను బయటకు వెళ్ళనీయకుండా నినాదాలు చేయడమే కాకుండా సదరు అభ్యర్థి నుంచి బి-్ఫరం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నా పార్టీ ముఖ్య నేతలెవ్వరూ ఈ విపత్కర పరిస్థితి నుంచి కాపాడే ప్రయత్నం చేయలేదు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని, సతీష్‌ను బయటకు పంపించారు. పార్టీ ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ నివాసం వద్ద చర్లపల్లి డివిజన్ కార్యకర్తలు ఎమ్మెల్యే కారుపై దాడి చేశారు.
మిత్రపక్షాలైన టిడిపి-బిజెపి నాయకులు సీట్ల సర్దుబాటు చేసుకుని, టిడిపి 87, బిజెపి 63 డివిజన్లలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నా, అనేక డివిజన్లలో తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన వారు నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి నిరాకరించారు. నామినేషన్లు ఉపసంహరించుకోని వారి పేర్లు బ్యాలెట్ పేపర్‌లో స్వతంత్ర అభ్యర్థులుగా వస్తాయి కాబట్టి వారిని అధికార పార్టీ అభ్యర్థికి మద్దతుగా డమీ చేయించి, వారితోనూ ప్రచారం చేయించాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు. టిఆర్‌ఎస్‌తో లోపాయికారి ఒప్పందం ఉన్న మజ్లిస్ పార్టీ 61 స్థానాల్లో పోటీ చేస్తుండగా, టిఆర్‌ఎస్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నది. అధికార పార్టీ కాబట్టి టిఆర్‌ఎస్ రెబెల్స్ ఎక్కువ మంది గడువు ముగిసేలోగా ఉపసంహరించుకున్నారు. విరమించుకోకపోతే ఇబ్బందుల్లో పడతామని, రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందన్న భయంతో పోటీ నుంచి తప్పుకున్నారు.
మజ్లిస్‌కు గట్టి పోటీ ఇస్తుందని భావించిన ఎంబిటి 27 స్థానాల్లో పోటీ చేస్తున్నది. ఆ పార్టీ నేత, మాజీ కార్పోరేటర్ అంజదుల్లాఖాన్ అక్బర్‌బాగ్ డివిజన్ నుంచి, ఆయన సతీమణి ఆజంపురా డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు. లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ ఈ ఎన్నికల్లో 30 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించారు. వీరిలో వివిధ పార్టీల్లో టిక్కెట్లు రాని కొంత మంది ఆశావాహులు ఉన్నారు. సిపిఐ-15, సిపిఎం-24 డివిజన్లలో పోటీ చేస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. తెలంగాణలో ఆశించిన విధంగా ఇంకా బలపడలేదు కాబట్టి గౌరవంగా పోటీ నుంచి తప్పుకోవాలని ఆ పార్టీ భావించింది. కానీ పోటీ చేయడం ద్వారా పార్టీ కార్యకర్తలకు ఉత్సాహం కలిగేదన్న వాదన లేకపోలేదు. ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు సవాల్‌గా మారాయి. అన్ని పార్టీల నాయకులు తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగిస్తూ, ప్రచారంపై దృష్టి సారించారు.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి