తూర్పుగోదావరి

మోరంపూడి వద్ద ఫ్లయిఓవర్ వంతెన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమోదం తెలిపిన కేంద్రమంత్రి గడ్కరీ:ఎంపి మురళీమోహన్
రాజమండ్రి, డిసెంబర్ 4: జాతీయరహదారిపై రాజమండ్రి సమీపంలోని మోరంపూడి వద్ద ఫ్లైఓవర్ వంతెన నిర్మాణానికి కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారని రాజమండ్రి ఎంపి మాగంటి మురళీమోహన్ చెప్పారు. మోరంపూడి సెంటర్ వద్ద తరచు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఫ్లైఓవర్ వంతెన నిర్మించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఇదే అంశాన్ని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి గడ్కరీ దృష్టికి తీసుకెళ్లామని, దాంతో ఆయన అంగీకారం తెలిపారని ఎంపి మాగంటి తెలిపారు. మోరంపూడి వద్ద ఫ్లైవర్ వంతెన నిర్మిస్తే ప్రమాదాలను నివారించటంతో పాటు ట్రాఫిక్ సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఫ్లైఓవర్ వంతెన నిర్మాణానికి సుమారు రూ.44కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ వంతెనకు సంబంధించిన ఎంపి మురళీమోహన్ సమర్పించిన ప్రతిపాదనలపైనే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని విజయవాడలో శనివారం జరగనున్న సమావేశంలో అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

దళిత గిరిజనుల అభ్యున్నతికి కృషి
ఎస్సీ, ఎస్టీ రుణమేళాలో మంత్రి రావెల
పెద్దాపురం, డిసెంబర్ 4: దళిత, గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు స్పష్టం చేశారు. శుక్రవారం పట్టణంలోని లూథరన్ హైస్కూల్లో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి ఎస్సీ, ఎస్టీ రుణమేళా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దళిత నాయకుడు బాబూ జగజ్జీవన్‌రామ్‌ల చిత్రపటాలకు మంత్రులు రావెల, యనమల, నిమ్మకాయల చినరాజప్ప, చింతకాయల అయ్యన పాత్రుడు, ఇతర ప్రజా ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి రుణమేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ దళితులు, గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తుందన్నారు. దీనిలో భాగంగా లక్ష మంది దళిత, గిరిజన యువతీ, యువకులకు జీవనోపాధి కల్పించేలా రూ.526 కోట్లతో కాఫీ ప్రాజెక్టును గిరిజన ప్రాంతమైన రంపచోడవరంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా గిరిజన రైతులే ఉత్పత్తులు అమ్ముకునే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. కాఫీ ఉత్పత్తులకు కేజీకి రూ. 190 చెల్లించి కాఫీ గింజలు జిసిసి ద్వారా సేకరిస్తామన్నారు. చంద్రన్న రుణమేళాలో భాగంగా 2473 ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు రూ.48 కోట్ల విలువ గల సబ్సిడీతో కూడిన, బ్యాంకు లింకేజీతో కూడిన రుణాలు ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, ఆటోలు, ఇతర పలు జీవనోపాధి యూనిట్ల రూపంలో మంజూరు చేశామన్నారు. వంద మంది గిరిజనులను అంబేద్కర్ ఓవర్‌సీస్ విద్యానిధి పథకంలో విదేశాల్లో ఉన్నత విద్యకు పంపినట్టు తెలిపారు. త్వరలో మరో 150 మందిని పంపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రాష్ట్ర వ్యాప్తంగా 28 యువజన శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. దీని కోసం ప్రత్యేకంగా స్కిల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పెద్దాపురంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డిప్యూటీ సిఎం చినరాజప్ప కోరిక మేరకు రూ. 21 కోట్లతో ఎస్సీ గురుకుల పాఠశాలను పదెకరాల్లో కార్పొరేట్ స్థాయిలో నిర్మిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత, గిరిజనులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ నిధులను దుర్వినియోగం చేశాయని ఆరోపించారు. దళితుల అభివృద్ధికి కేటాయించిన సబ్‌ప్లాన్ నిధులను హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి మళ్లించి, దళితులను మోసగించాయన్నారు. టిడిపి ప్రభుత్వం హయాంలోనే సబ్‌ప్లాన్ కింద ఎస్సీలకు రూ.4 వేల కోట్లు, ఎస్టీలకు రూ.2 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించడమే కాకుండా ప్రతి పైసా వారి అభివృద్ధికి వెచ్చిస్తున్నట్టు తెలిపారు. గిరి పుత్రికా కల్యాణ పథకంలో భాగంగా ఎస్టీ వర్గాల వివాహ ఖర్చులకు రూ. 50 వేల ఆర్థిక సహకారం అందిస్తున్నట్టు చెప్పారు. దళితుల్లో కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు రూ.30 వేలు ప్రోత్సాహకంగా అందించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన, దళిత నూతన జంటలకు ఆయా పథకాలకు చెందిన ప్రోత్సాహకాల చెక్కులను అందజేశారు.

బలహీన వర్గాల అభివృద్ధికి బడ్జెట్‌లో రూ. 256 వేల కోట్లు
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బిసి మొదలగు బలహీన వర్గాల అభివృద్ధికి రూ. 256 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రుణమేళాలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న యనమల మాట్లాడుతూ అట్టడుగున ఉన్న వర్గాలకు పారిశ్రామికాభివృద్ధి ఫలితాలు అందితేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాజ్యాంగ నిర్మాతలు సమ సమాజ నిర్మాణం, పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానల తొలగింపే ధ్యేయంగా పలు చట్టాలు రూపొందించారన్నారు. అయితే పాలకుల నిర్లక్ష్యం, చట్టాల అమలు తీరులో లోపాలు కారణంగా రాజ్యాంగం అమలు లోకి వచ్చి 66 ఏళ్లు అవుతున్నా, సమాజంలో ఇంకా అసమానతలు సమసిపోలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ శాఖల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు సక్రమంగా వినియోగించుకుని ఆయా వర్గాలు ఆర్థికంగా బలపడాలన్నారు. రాష్ట్ర బడ్జెట్ లక్షా 3వేల కోట్లు కాగా, అందులో యాభై శాతం కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధికి కేటాయిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మొదటిసారిగా 2014లో రాజమండ్రిలో ఎస్పీ, ఎస్టీ రుణమేళాను రూ.50 కోట్లతో నిర్వహించగా, ప్రస్తుతం రు.48 కోట్లతో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప నిమోజకవర్గమైన పెద్దాపురంలో రెండో మేళా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రుణాలు పొందిన లబ్దిదారులు సక్రమంగా బ్యాంకు వాయిదాలు చెల్లించి, సకాలంలో అప్పు తీర్చుకుని, తిరిగి కొనసాగింపుగా రుణాలు పొంది అభివృద్ధి చెందాలన్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. వంద కోట్ల రుణమేళాలను భారీస్థాయిలో నిర్వహిస్తామన్నారు.

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఉప కులపతిగా
ముత్యాల నాయుడు బాధ్యతల స్వీకరణ
రాజానగరం, డిసెంబర్ 4: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఉప కులపతిగా ఆచార్య ఎ ముత్యాల నాయుడు శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆయనకు యూనివర్సిటీ రిజిస్ట్రార్, ఇన్‌ఛార్జి విసి ధనంజయరావు ఘన స్వాగతం పలికారు. అనంతరం ముత్యారావు నాయుడు రిజిస్ట్రార్ ధనంజయరావు నుండి ఉప కులపతి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ముత్యాల నాయుడు స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ తెలుగు భాషకు వనె్న తెచ్చిన ఆదికవి నన్నయ పేరు మీద ఏర్పడిన ఈ విశ్వవిద్యాలయం రాజమండ్రిలో ఏర్పడటం ఆనందదాయకమని, ఈ విశ్వ విద్యాలయానికి ఉప కులపతిగా రావడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ముత్యాల నాయుడు పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ధనంజయరావుతోపాటు పలు కళాశాలల ప్రిన్సిపాల్స్, డీన్లు, హెచ్‌ఒడిలు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజావసరాలు తీర్చడమే ప్రభుత్వ ధ్యేయం
ఆర్థికమంత్రి యనమల
మండపేట, డిసెంబర్ 4: ప్రజావసరాలు తీర్చడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపేందుకు తెలుగుదేశం ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషిచేస్తుందని రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. పట్టణం, రూరల్లో రూ.40 కోట్లతో మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మండలంలోని ద్వారపూడిలో శుక్రవారం సాయంత్రం మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అధ్యక్షతన బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి యనమల మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే వేగుళ్ల చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. తాపేశ్వరంలోని ట్రాఫిక్ పరిష్కారంలో భాగంగా బైపాస్‌రోడ్డు నిర్మాణం కోసం ఎమ్మెల్యే వేగుళ్ల కోరిక మేరకు రూ.22.07 కోట్లు మంజూరుచేసినట్టు యనమల తెలిపారు. మొదటి విడతగా రూ.6.10 కోట్లు విడుదల చేశామన్నారు. మిగిలిన నిధులు త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ రూ.2.75 లక్షలు చొప్పున రాష్టవ్య్రాప్తంగా 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ పంచాయతీరాజ్ రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని, వాటి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరగా, ఆ దిశగా చర్యలు తీసుకుంటామని చినరాజప్ప హామీ ఇచ్చారు. తొలుత మండపేటలో రూ.26 లక్షలతో చేపట్టనున్న లైబ్రరీ భవనానికి, మండపేట నుండి కపిలేశ్వరపురం వరకు రూ.16 కోట్లతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణపనులకు, రూ.18.కోట్లతో చేపట్టనున్న డ్రైనేజీల అభివృద్ధికి మంత్రులు శంఖుస్థాపనలు చేశారు. అనంతరం మండలంలో రూ.2.05 కోట్లతో చేపట్టనున్న ఇప్పనపాడు-మెర్నిపాడు రోడ్డు పనులకు, జడ్ మేడపాడులో రూ.1.08 కోట్లతో చేపట్టనున్న సిసి రోడ్డు నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. అలాగే వేములపల్లిలో రూ.31.06 లక్షలతో నిర్మించిన పాఠశాల భవనాలను, రూ.32.లక్షలతో నిర్మించిన స్ర్తిశక్తి భవనాలను మంత్రులు ప్రారంభించారు. అనంతరం వేములపల్లిలో జరిగిన బహిరంగసభలో రూ.1.47 కోట్ల రుణాలను డ్వాక్రా గ్రూపులకు పంపిణీ చేశారు. అదేవిధంగా ఎల్‌ఇడి బల్బుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ద్వారపూడి పిహెచ్‌సి ఛైర్మన్‌గా తానింకి చంద్రశేఖర్‌చేత రాష్ట్ర మంత్రులు యనమల, చినరాజప్ప సమక్షంలో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, మండపేట ఎఎంసి ఛైర్మన్ చేకూరి రమేష్‌రాజు, ఎంపిపి దొండపాటి ఝాన్సీలక్ష్మి, వైస్ ఎంపిపి అడబాల బాబ్జీ, జడ్పీటిసి పిల్లి మీనా, మండపేట సొసైటీ అధ్యక్షుడు మల్లిపూడి గణేశ్వరరావు, టిడిపి జిల్లా అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు వి సాయికుమార్‌బాబు, పార్టీ నాయకులు ఉంగరాల రాంబాబు, యరగతపు బాబ్జీ, కొవ్వూరి రాజగోపాలరెడ్డి, సత్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ.700 కోట్లు
పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు
పెద్దాపురం, డిసెంబర్ 4: ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ కింద ఈ ఏడాది రూ. 700 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. శుక్రవారం పెద్దాపురం లూథరన్ హైస్కూల్లో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి ఎస్సీ, ఎస్టీ రుణమేళా కార్యక్రమంలో మరో అతిథిగా పాల్గొని మంత్రి ప్రసంగించారు. ఈ నిధులతో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సిసి రోడ్లు, డ్రెయిన్లు, విద్దుద్దీకరణ, వౌలిక సదుపాయాల కల్పన వంటి అభివృద్ధి పనులు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ విద్యోన్నతి, అంబేద్కర్ ఓవర్‌సీన్ విద్యానిధి పథకాలతో విదేశీ ఉన్నత విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. వివిధ పథకాలను ప్రభుత్వం నూతనంగా ప్రారంభించి దళితులు, గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. వీలీన మండలాలైన కూనవరం, చింతూరు, విఆర్ పురం, ఎటపాక మండలాలను కలిపి ప్రత్యేక గిరిజన సమీకృత అభివృద్ధి పథకం ( ఐటిడిఏ) ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు మాట్లాడుతూ జిల్లాలో లక్షా 23 వేల కొత్త రేషన్ కార్డులు నూతనంగా మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. గిరి గోరుముద్దలు పథకం ద్వారా గిరిజన చిన్నారులకు ప్రత్యేక పౌష్టికాహార పథకాన్ని ఐసిడిఎస్ ద్వారా అమలు చేస్తున్నట్టు కలెక్టర్ అరుణ్‌కుమార్ తెలిపారు. కార్యక్రమంలో ముందుగా స్థానిక సుధా కాలనీలో పార్టీ జెండాను మంత్రులు యనమల, అయ్యన్నపాత్రుడు, చిన రాజప్ప, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కర రామారావు, జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు ఆవిష్కరించారు. అనంతరం స్థానిక ఆర్‌అండ్‌బి కార్యాలయంలో రూ. కోటితో నూతనంగా నిర్మంచనున్న వసతి గృహానికి శంకుస్థాపన చేశారు. తహసీల్దారు కార్యాలయంలో నిర్మించిన స్ర్తి శక్తి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యాలయాలను వారు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కర రామారావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, ఐటిడిఎ పిఒ చక్రధర్‌బాబు, ఎస్సీ కార్పోరేషన్ ఇడి అనూరాధ, సాంఘిక సంక్షేమ శాఖ డిడి శోభారాణి, ద్వామా పిడి నాగేశ్వరావు, ఆర్డీవో విశే్వశ్వర్రావు, కమిషనర్ వెంకట్రావు, ఎంపిడిఒ వసంత మాధవి, తహసీల్దార్ వరహాలయ్య, జిల్లా గ్రంధాలయ సంస్థల ఛైర్మన్ వీరారెడ్డి, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, డిసిసిబి ఛైర్మన్ వరుపుల రాజా, మున్సిపల్ ఛైర్మన్ వత్సవాయి సూర్యనారాయణరాజు (రాజా సూరిబాబురాజు), ఎఎంసి ఛైర్మన్లు ముత్యాల రాజబ్బాయి, పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, సామర్లకోట ఎంపిపి గొడత మార్త, జడ్పీటీసీ సభ్యుడు శివనాగరాజు, భరతమాత సేవా పరిషత్ ఛైర్మన్ గొరకపూడి చిన్నయ్యదొర, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, అడబాల కమార్‌స్వామి, పట్టణ, రూరల్ ప్రాంతాలకు చెందిన టిడిపి నాయకులు, అధిక సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి రావెల గిరిజన కళాకారులతో కలిసి కొమ్ము నృత్యాన్ని ప్రదర్శించి ఆహూతులను అలరించారు. అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ , గిరిజన శాఖల లబ్దిదారులు ఏర్పాటు చేసిన స్టాళ్లను వారు పరిశీలించారు.

భారీగా గంజాయి స్వాధీనం: ముగ్గురు అరెస్టు
చిలకడ దుంపల బస్తాల మాటున రవాణా: వ్యాన్ సీజ్
రాజవొమ్మంగి, డిసెంబర్ 4:విశాఖ జిల్లా మన్యంలో వేలాది ఎకరాల్లో పండిస్తున్న గంజాయిని దిగువ ప్రాంతాలకు తరలించేందుకు స్మగ్లర్లు అనేక మార్గాలను ఎన్నుకొంటున్నారు. పోలీసులు కళ్లుకప్పి గంజాయిని తరలించేందుకు విశ్వప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మండలంలో జడ్డంగి పోలీస్టేషన్ పరిధిలో జమ్మిచావిడి గ్రామం సమీపంలో పోలీసులు 407వ్యానులో తరలిస్తున్న 744కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వ్యానుడ్రైవర్‌తోపాటు ఇరువురు స్మగ్లర్లను అరెస్టు చేసి వ్యానును స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా చింతపల్లి సమీప అడువుల్లో పెంచిన ఎండు గంజాయిని 24 బస్తాల్లో నింపి, గంజాయిని బస్తాలుపైన అనుమానం రాకుండా మరో 10 చిలకడ దుంపల బస్తాలు వేసి రాజమండ్రి తరలిస్తుండగా మార్గమధ్యంలో పట్టుబడింది. కొయ్యూరుకు చెందిన మాగాపు చక్రవర్తి, అద్దరివీధికి చెందిన వ్యాను డ్రైవర్ సమవరపు స్వామి, గంజాయి రవాణా సూత్రధారి మోరంపూడికి చెందిన చెక్కా అప్పలరాజులను పోలీసులు అరెస్టు చేశారు. తహసీల్దారు పద్మావతి పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయికి పంచనామా నిర్వహించారు. రాజవొమ్మంగి సిఐ మెహన్‌రెడ్డి, ఎస్సై లక్ష్మణబాబులు గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు దర్యాఫ్తు చేస్తున్నారు. స్మగ్లర్లు ఏజెన్సీలో గిరిజనులు పండించిన గంజాయిని కిలో మూడు వేల రూపాయలకు కొనుగోలుచేసి చెన్నైకు చేరి 10వేల రూపాయల వరకు విక్రయిస్తారు. స్వాధీనం చేసుకున్న గంజాయి ఇక్కడ విలువ ప్రకారం రూ.23 లక్షలుంటుందని అంచనా.జడ్డంగి పోలీసులు ఈ గంజాయి వ్యాను పట్టుకోకముందు విశాఖ జిల్లా చింతపల్లి నుండి వస్తుండగా మార్గమధ్యంలో వ్యాన్ చింతలపూడి ఘట్ రోడ్డులో మెరాయించి రోడ్డుకి అడ్డంగా నిలిచిపోడంతో అక్కడే మావోయిస్టుల ఆచూకీకై క్యూంబింగ్ చేస్తున్న సాయుధ ప్రత్యేక పోలీసులు గంజాయి ఉన్నట్లు గమనించకుండా వ్యాను స్టార్ట్ చేయడానికి సహకరించడం గమనార్హం. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని శనివారం అరెస్టు చేస్తామని ఎస్సై తెలిపారు.

జిల్లాలో 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ
గండేపల్లి, డిసెంబర్ 4: జిల్లాలో 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్టు జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రమైన గండేపల్లిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేఖరులతో జెసి మాట్లాడుతూ జిల్లాలో 278 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అందులో 163 కేంద్రాలు బాగా పనిచేస్తున్నాయన్నారు. ఇప్పటివరకు లక్షా 46 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఆన్‌లైన్ ద్వారా 39 వేల 365 మందికి ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు జరిగాయని తెలిపారు. మండలంలో ఎస్ రాగంపేట, నాయకంపల్లి, గండేపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని జెసి సత్యనారాయణ కోరారు. రంగుమారిన ధాన్యం, నాసిరకం ధాన్యం కూడా మార్చి నెలాఖరుకు 10 శాతం తగ్గింపు రేటుకు కొనుగోలు చేయనున్నట్టు చెప్పారు. అనంతరం 4వ నంబరు రేషన్ దుకాణాన్ని జెసి తనిఖీ చేశారు. కొన్ని చోట్ల రేషన్ డీలర్లు అవగాహన లోపంతో పొరపాట్లు చేస్తున్నారని, సరిదిద్దుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఎస్‌ఒ చిన్నారావు, తహసీల్దారు గీతాంజలి, ఎంపిడిఒ రమేష్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ఇల్లు లేని వారికి ఇల్లు
గులాబి కార్డు ఉన్న వారికి అవకాశం : రాజమండ్రి సిటి ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల
రాజమండ్రి, డిసెంబర్ 4: ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇవ్వాలన్న లక్ష్యంతో కేంద్రప్రభుత్వం ఉందని రాజమండ్రి సిటి ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ చెప్పారు. శుక్రవారం రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వంతో కలిసి అమలుచేసే పథకాలకు కేంద్రప్రభుత్వం నిధులు మంజూరుచేస్తోందని, వీటితో పాటు కేంద్రప్రభుత్వమే ప్రత్యేకంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గృహనిర్మాణాలకు నిధులు మంజూరుచేస్తోందన్నారు. కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న పథకంలో భాగంగా రాజమండ్రి నగరానికి 4వేల 200ఇళ్లు మంజూరయ్యాయని, వీటితో పాటు ఇంకా డిమాండ్ ఉంటే అదనంగా ఇళ్లను మంజూరుచేసేందుకు కేంద్ర పట్టాణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు సిద్ధంగా ఉన్నారన్నారు. రాజమండ్రి నగరానికి ఎన్ని ఇళ్లు కావాలన్నా మంజూరుచేస్తామని వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారన్నారు. రాజమండ్రి నగరంలో ఎంత మంది దరఖాస్తుచేస్తే, అంత మందికి ఇళ్లు అందించాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు. అయితే దరఖాస్తుచేసుకున్న వారిలో అర్హతను తప్పనిసరిగా చూస్తామన్నారు. ఎక్కడైనా ఇళ్లు ఉన్నట్టు నిర్ధారణైతే మాత్రం ఇల్లు మంజూరుచేసేది లేదన్నారు. తెలుపు రంగు కార్డు ఉన్న ఇల్లు లేని వారికి తప్పనిసరిగా ఇల్లు మంజూరుచేయిస్తామని ఎమ్మెల్యే ఆకుల చెప్పారు. 3లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి 350చదరపు అడుగుల ఇల్లు, 6లక్షల ఆదాయం ఉన్న వారికి 650చదరపు అడుగుల ఇళ్లు మంజూరుచేయిస్తామన్నారు. స్థలం ఉన్న వారు ఇల్లు నిర్మించుకునేందుకు కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో నిధులు మంజూరుచేస్తామన్నారు.
ఈ పథకంలో ఇల్లు మంజూరయిన వారికి ముందుగానే కేంద్రప్రభుత్వం రూ.2లక్షల 20వేల నిధులను లబ్ధిదారుడి ఖాతాలో జమచేస్తుందని, దీనివల్ల నెలవాయిదా తగ్గటంతోపాటు వడ్డీ భారం బాగా తగ్గుతుందన్నారు. తెలుపు రంగు కార్డు ఉన్న వారితో పాటు గులాబి రంగు కార్డు ఉన్న వారికి కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో ఇల్లు ఇచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు చెప్పారు. రాజమండ్రికి మంజూరయిన 4వేల 200ఇళ్లకు భూమిని కేటాయించే విధంగా రెవెన్యూ అధికారులతో చర్చిస్తున్నట్టు చెప్పారు. అసలు ఎంత భూమి కావాలో నిర్ణయించే ముందు, లబ్ధిదారుల సంఖ్యను తేల్చాల్సి ఉందన్నారు. అందువల్ల రాజమండ్రి నగరంలోని అన్ని వార్డుల్లోను ప్రధానమంత్రి ఆవాస్‌యోజన పథకం పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషిచేస్తున్నట్టు చెప్పారు. ఇల్లు లేని వారు దరఖాస్తు, బ్యాంకు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు నకలుతో కలిపి సమర్పించాల్సి ఉంటుందన్నారు. తన కార్యాలయంలో దరఖాస్తులు అందించినప్పటికీ, దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు.
వార్డుల్లో ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల పర్యటన
కేంద్రప్రభుత్వం మంజూరుచేసిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అర్హులైన వారిని దరఖాస్తుచేసుకోవాల్సిందిగా కోరుతూ రాజమండ్రి సిటి ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ గత కొద్ది రోజులుగా వార్డులో సాగిస్తున్న పర్యటనలకు విశేష స్పందన లభిస్తోంది. గత పదేళ్లుగా సబ్‌కలెక్టర్ కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయం చుట్టూ ఇళ్ల కోసం దరఖాస్తులతో తిరుగుతున్నా ఫలితం లేకపోతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే స్వయంగా వార్డుల్లో తిరుగుతూ ఇళ్లు ఇస్తాం దరఖాస్తుచేసుకోమని చెబుతుండటంతో రాజమండ్రి సిటి నియోజకవర్గ పరిధిలోని ప్రజలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఎంత మంది దరఖాస్తుచేసుకున్నా అర్హత ఉంటే మాత్రం ఇల్లు ఇచ్చి తీరుతామని, అందుకు తన వద్ద పక్కా ప్రణాళిక, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి సహకారం ఉన్నాయని ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల చెబుతున్నారు.

తేమతో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తాం: ఎమ్మెల్యే ఆనందరావు
అమలాపురం, డిసెంబర్ 4: తేమతో ఉన్న ధాన్యాన్ని కూడాకొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని రైతులు అధైర్యపడవద్దని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. శుక్రవారం బండారులంక శ్రీరాజగోపాల పిఎసిఎస్ ఆద్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతులంతా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియొగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి అధికారి జయవెంకటలక్ష్మి, ఎంపిపి బొర్రా ఈశ్వరరావు, పిఎసిఎస్ అధ్యక్షుడు దంగేటి వీరవెంకట సత్యనారాయణ, సర్పంచ్ బడుగు సత్యనారాయణ, తహసీల్దార్ నక్కా చిట్టిబాబు పాల్గొన్నారు.

యువతకు ఉపాధి కల్పిస్తాం
అమలాపురం, డిసెంబర్ 4: కేంద్ర ప్రభుత్వంచే క్వాయర్‌బోర్డు డైరెక్టర్‌గా నియమితులైన పివిఎస్ వర్మ కోనసీమ ప్రాంతంలో క్వాయర్ ఇండస్ట్రీస్‌లను పరిశీలించారు. శుక్రవారం అమలాపురంలో పట్టణ బిజెపి నాయకులు వర్మకు పుష్పమాలలు వేసి స్వాగతం పలికారు.ఆర్‌వి నాయుడు, మోకా వెంకట సుబ్బారావు, బసవా శివరామప్రసాద్, ముదునూరి రంగరాజు, కర్రి తాతారావు, యల్లమెల్లి కొండ పూలమాలలు వేసి ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ గ్రామీణ రంగంలోని యువతకు పని కల్పించి అభివృద్ధిపథంలో పనిచేయించేలా కృషి చేస్తున్నారని అన్నారు. కేరళ తరువాత ఉభయ గోదావరి జిల్లాలు కొబ్బరికి దేశంలోనే ప్రాధాన్యత ఉందన్నారు. క్వాయర్ ఇండస్ట్రీస్ అనుబంధ పరిశ్రమలు ద్వారా ఈప్రాంతం అభివృద్ధి చెందిందని వర్మ చెప్పారు. కొత్తగా ఇండస్ట్రీస్ స్థాపనకు క్వాయర్ ఇండస్ట్రీస్ లాభసాటిగా పనిచేసేలా యజమానులకు వారి అభివృద్ధికి కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలోటి రామకృష్ణ, రెడ్డి సింహాద్రి, సత్యనారాయణవర్మ తదితరులు పాల్గొన్నారు.

అన్నాయిపేటలో సహస్ర జ్యోతిర్లింగార్చన
రామచంద్రపురం, డిసెంబర్ 4: ద్రాక్షారామ సమీపంలోని అన్నాయిపేట గ్రామంలో నెలకొనియున్న ఎల్లారాంబిక అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం రాత్రి సహస్ర జ్యోతిర్లింగార్చన కార్యక్రమాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వెయ్యి 126 దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు మహిళల ప్రోత్సాహంతో నిర్వహించారు. అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.