గుంటూరు

ప్రార్థనా మందిరాల జోలికెళ్లొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 18: రోడ్ల విస్తరణ పేరుతో మతపరమైన ప్రార్థనా మందిరాల జోలికెళ్లొద్దని హైకోర్టు నగరపాలక సంస్థను ఆదేశించింది. మస్తాన్‌దర్గాకు మార్కింగ్ ఇచ్చిన నేపథ్యంలో భక్తులు వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు రిట్ పిటీషన్ నెంబర్ 23645/2016 ఆదేశాల ప్రకారం భక్తుల తరపు వాదనలను పరిగణలోకి ఈ ఉత్తర్వులు జారీచేసింది. మస్తాన్‌దర్గా కట్టడాల తొలగింపునకు ఎలాంటి చర్యలు తీసుకోరాదని జస్టిస్ రామచంద్రరావు ఆదేశాలు జారీచేశారు. భక్తుల నిర్వహించే ప్రార్థనలను ఆటంకం కల్గించరాదని, ఎలాంటి దైవిక కార్యక్రమాలను అడ్డుకోరాదని, రోడ్ల విస్తరణలో సుప్రింకోర్టు మార్గదర్శకాలను అమలు చేయాలని, జీవో నెంబర్ 262 స్ఫూర్తితో నిబంధనలు పాటించాలే తప్ప దూకుడు పనికిరాదని తేల్చిచెప్పింది. మెయిన్ రిట్ పిటీషన్ పూర్తి విచారణ ముగిసే వరకు ఎలాంటి చర్యలు చేపట్టరాదని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. హైకోర్టు స్టే మంజూరు చేయడం పట్ల గుంటూరు ముస్లిం మతపెద్దలతో పాటు వివిధ మతాధిపతులు, పీఠాధిపతులు, భక్తులు హర్షం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యంలోని న్యాయపరమైన, కీలక, సున్నితమైన అంశాలలో ప్రజాలోచనలను పరిగణలోకి తీసుకోవాలని న్యాయమూర్తి హితవుపలికారు. శాంతి భద్రతలకు విఘాతం, పవిత్ర స్థలాల పరిరక్షణ, సమస్యాత్మకం కాకుండా ఉదారంగా వ్యవహరించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశాలను స్వాగతిస్తూ భక్తులు మస్తాన్‌దర్గా వద్ద పెద్దఎత్తున ప్రార్థనలు నిర్వహించారు.

యాత్రికులకు ఇబ్బందులేకుండా పుష్కరనగర్‌ను తీర్చిదిద్దాలి
గుంటూరు (కార్పొరేషన్), జూలై 18: కృష్ణా పుష్కరాల సందర్భంగా రానున్న యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా పుష్కరనగర్‌ను తీర్చిదిద్దాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. పుష్కర పనుల తనిఖీలో భాగంగా సోమవారం అమరావతిరోడ్డు, పలకలూరు, పొన్నూరు, ఏటుకూరు, జెకెసి రోడ్లలో పర్యటించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. తొలుత అమరావతిరోడ్డులోని గోరంట్లలో ఏర్పాటుచేయనున్న పుష్కరనగర్ ప్రాంతాన్ని పర్యటించారు. ఈ సందర్భంగా పుష్కర్‌నగర్ నిర్మించనున్న ఈవెంట్ ఆర్గనైజర్, ఆర్టీసి అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా బస్ రూట్లను ఏర్పాటచేయాలన్నారు. భోజన వసతులు కల్పించేందుకు, బస్సుల రాకపోకలకు రూట్‌మ్యాప్‌ను సిద్ధంచేయాలని ఆదేశించారు. అనంతరం పొన్నూరు రోడ్డులోని ఆంధ్రా ముస్లిం కాలేజీ, అమృత కాలేజీల వద్ద చేపడుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో మంగళవారం లోపు డ్రైన్లను అనుసంధాన పనులు చేపట్టి, ఆర్‌అండ్‌బి అధికారులకు అప్పగించాలని తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్ ఈ గోపాలకృష్ణారెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు, పట్టణప్రణాళికాధికారులు తదితరులు పాల్గొన్నారు.

జాస్మిన్ మృతి కేసులో మలుపు
* గ్రామంలో 144 సెక్షన్
నిజాంపట్నం, జూలై 18: మండలంలోని అడవులదీవి మహ్మద్‌వారిపాలెంలో ఆదివారం జరిగిన ఎస్‌కె జాస్మిన్ మృతి సోమవారం మలుపుతిరిగింది. అడవులదీవి గ్రామానికి చెందిన వేముల శ్రీసాయి, జొన్నలగడ్డ పవన్‌కుమార్‌లే ఆమె మృతికి కారణమని గ్రామస్థులు, మృతురాలి తల్లి ముహరున్నీసా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వేముల శ్రీసాయి, పవన్ కుమార్‌లను గ్రామస్థులు చెట్టుకు కట్టేసి కొట్టడంతో బలమైన దెబ్బలు తగలి సాయి మృతి చెందాడు. పవన్‌కుమార్‌కు తీవ్ర గాయాలు కావటంతో పోలీసులు పర్యవేక్షణలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే మృతి చెందిన జాస్మిన్, సాయిల మృతదేహాలు పోస్టుమార్టం అనంతరం వారి స్వగ్రామాలకు మృతుల బంధువుల ద్వారా పోలీసుల పర్యవేక్షణలో తీసుకువెళ్ళారు. మతపెద్దల సహకారంతో జాస్మిన్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కొద్ది సేపటికి శ్రీసాయి మృతదేహం కూడా పోలీసుల బందోబస్తుతో గ్రామానికి తీసుకువచ్చారు. అయితే గ్రామస్థులు, బంధువులు సాయి మృతదేహంతో వస్తున్న కారును అడ్డుకొని యువతితో తన కుమారునికి ఎటువంటి సంబంధం లేకున్నా మహ్మద్‌పాలెం గ్రామస్థులు కావాలనే పథకంతో జాస్మిన్‌ను వారే చంపేసి... ఆ నేరాన్ని సాయిపై వేసి చంపారని ఆరోపించారు. దీంతో మృతుని బంధువులు, పోలీసులకు మధ్య రెండు గంటలపాటు వాగ్వివాదం నెలకొంది. అనంతరం సాయి అంత్యక్రియలు మంగళవారం జరుగుతాయని పెద్దలు చెప్పటంతో పోలీసులు గ్రామంలో 144సెక్షన్ విధించారు. ఇదిలాఉండగా ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న పవన్‌కుమార్ పోలీసులకు మరణ వాగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది. సాయి తల్లి లీలాప్రియదర్శిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పైరెండు సంఘటనలతో ఆయా గ్రామలలో విషాద ఛాయలు చోటుచేసుకున్నాయి. డిఎస్పీ మషేష్, సిఐలు పెంచలరెడ్డి, మల్లికార్జునరెడ్డి, ఎస్‌ఐలు 16మంది, సిబ్బంది, ప్రత్యేక పోలీసులు నడుమ పికెటి నడుస్తోంది.