గుంటూరు

యువకుడి హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, మార్చి 19: మండల పరిధిలోని బేతపూడిలో ఈ నెల 10వ తేదీన జరిగిన తాడిబోయిన సాంబశివరావు అనే యువకుడి హత్య కేసులో నిందితులైన మంగళగిరి మండలం నిడమర్రుకి చెందిన ఉల్లం నవీన్, తోట చిట్టిబాబు, తాడిబోయిన బాలగోపి, కుర్రా పిచ్చయ్య, కుర్రా నాగరాజు, తాడిబోయిన అంకమ్మరావు, కుర్రా సాంబశివరావు అనే ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు నార్త్‌జోన్ డిఎస్పీ గోగినేని రామాంజనేయులు వెల్లడించారు. శనివారం మంగళగిరి రూరల్ సిఐ కార్యాలయంలో సిఐ హరికృష్ణ, ఎస్సైలు నరేష్, అశోక్‌లతో కలిసి ఏర్పాటు
చేసిన విలేఖర్ల సమావేశంలో ఏడుగురు నిందితులను మీడియాకు చూపి కేసు వివరాలు డిఎస్పీ రామాంజనేయులు తెలిపారు. నిడమర్రుకి చెందిన మృతుడు తాడిబోయిన సాంబశివరావు వాటర్‌ప్లాంట్‌లో పనిచేస్తూ మినరల్ వాటర్‌ను సరఫరా చేస్తుంటాడు. నిడమర్రుకే చెందిన తాడిబోయిన అంకమ్మరావు కుటుంబ సభ్యులకు, మృతుడు సాంబశివరావు కుటుంబ సభ్యులకు గతంనుంచే వివాదాలు ఉన్నాయి. 2014లో అంకమ్మరావును ఒక దాడి కేసులో అరెస్ట్ చేయగా తన అరెస్ట్‌కు కారకుడైన మృతుడి బంధులపై కక్ష పెంచుకుని ప్రతీకారం కోసం ఎదురుచూశాడు. ఈ నేపథ్యంలో అంకమ్మరావు బంధువైన ఉల్లం నవీన్ పాములపాడు నుంచి వచ్చి నిడమర్రులో స్థిరపడ్డాడు. ఈ నెల 7వ తేదీన ఉల్లం నవీన్, మృతుడు సాంబశివరావు వేర్వేరుగా మహా శివరాత్రి సందర్భంగా నారాకోడూరు తిరునాళ్లకు వెళ్లారు. ఆ సమయంలో నవీన్‌కు మృతునికి ఫోనులో గొడవ జరిగి నవీన్‌ను, అతని తల్లిని మృతుడు తిట్టడంతో సహించలేక అంకమ్మరావుకు, మేనమామ కుర్రా సాంబశివరావుకు నవీన్ ఈ సంగతి చెప్పాడు. దీంతో సాంబశివరావు హత్యకు అందరు కలిసి పథకం పన్నారు. ఈ నెల 10వ తేదీన మినరల్ వాటర్ రవాణా చేసే వాహనంలో బేతపూడి వైపు సాంబశివరావు వెళుతుండగా తాడిబోయిన అంకమ్మరావు, కుర్రా సాంబశివరావు సమాచారం ఇవ్వడంతో మిగతావారు కారులో వెంబడించి బేతపూడి వద్ద సాంబశివరావు నడుపుతున్న వాహనాన్ని ఆపి మారణాయుధాలతో సాంబశివరావు శరీరంపై 15 చోట్ల గాయపరిచారు. సాంబశివరావు అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రత్యక్ష సాక్షి కిరణ్‌సాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సిఐ హరికృష్ణ దర్యాప్తు చేశారు. ఈ నెల 18వ తేదీ సాయంత్రం చినకాకాని ఎన్నారై ఆస్పత్రి వెనుక ముద్దాయిలు ఏడుగురిని అరెస్ట్ చేసి హత్యకు వారు ఉపయోగించిన మారణాయుధాలను, కారును స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ రామాంజనేయులు తెలిపారు. నిందితులపై రౌడీషీట్ తెరుస్తున్నట్లు చెప్పారు. కేసు దర్యాప్తు చేసిన సిఐ హరికృష్ణ, ఎస్సైలు నరేష్, అంకమ్మరావు సిబ్బందిని అభినందించి వారికి రివార్డుల కోసం ఉన్నతాధికారులకు సిఫార్సు చేయనున్నట్లు డిఎస్పీ రామాంజనేయులు తెలిపారు.