గుంటూరు

దళితులపై దాడులకు వ్యతిరేకంగా ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), నవంబర్ 8: దళితులపై దాడులు, దౌర్జన్యాలకు వ్యితిరేకంగా, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు జరపాలని, ఇతర సమస్యలపై వ్యవసాయ కార్మిక సంఘం, దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ కోరారు. మంగళవారం స్థానిక కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్‌లో ఏర్పాటు చేసిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమితి సమావేశానికి కనకరాజు ప్రసాద్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన జంగాల మాట్లాడుతూ నేడు దేశంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తంచేశారు. నకిలీ గో రక్షక దళాల పేరుతో భగరంగదళ్ సభ్యులు దాడులు చేస్తున్నారన్నారు. దీనికి వ్యతిరేకంగా దళితులు, గిరిజనులు ఏకం కావాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లు సక్రమంగా అమలు చేయించేందుకు ఐక్య ఉద్యమాలు నిర్వహించాలన్నారు. కోనేరు రంగారావు కమిటీ సిఫారసు అమలుకు పోరాటాలు నిర్వహించి పేదలకు సాగుభూములు దక్కేలా కృషి చేయాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి ప్రత్తిపాటి రోశయ్య మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలులోకి వచ్చి పది సంవత్సరాలైనప్పటికీ సక్రమంగా అమలు జరగడం లేదని, ఈ పథకంలో 200 రోజుల పనిదినాలు, దినసరి వేతనం 300 రూపాయలు పెంచాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు కె ఈశ్వరరావు, బొంతా నాగేశ్వరరావు, షేక్ గౌస్, విజయరాజ్, చెవుల పున్నయ్య, తోకల వేమారావు, యార్లగడ్డ శివయ్య, అద్దేపల్లి మురళి, కేసాని కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం
గుంటూరు (పట్నంబజారు), నవంబర్ 8: విద్యార్థులు విద్యతో పాటు క్రీడలకు సమప్రాధాన్యమివ్వాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పట్ట్భాపురం శ్రీ పూజిత పబ్లిక్ స్కూలులోని క్రీడామైదానంలో యాన్యువల్ స్పోర్ట్స్‌మీట్‌ను మోదుగుల జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు శారీరకంగా దృఢంగా ఉంటేనే మానసికంగా ఉల్లాసంగా ఉంటారన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఎందరో క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ క్రీడల్లో పాల్గొని జిల్లా కీర్తిని ఇనుమడింపజేశారన్నారు. అర్బన్ బ్యాంకు చైర్మన్ బోనబోయిన శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ చిన్నారులను విద్యతో పాటు క్రీడాంశాల్లో కూడా పాల్గొనేలా ప్రోత్సహించాలన్నారు. స్కూల్ డైరెక్టర్ కంచర్ల హరిప్రసాదరావు మాట్లాడుతూ ప్రతి యేడాది జరిగే యాన్యువల్ స్పోర్ట్స్ మీట్‌లో విద్యార్థులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారన్నారు. విశ్వనాథ్ ఆనంద్, పివి సింధు వంటి క్రీడాకారులను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని ముందడుగు వేయాలన్నారు. ప్రిన్సిపాల్ కంచర్ల పద్మావతి మాట్లాడుతూ తమ స్కూల్ విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నామన్నారు. నేటి నుండి మూడు రోజుల పాటు స్పోర్ట్స్ మీట్ జరుగుతుందన్నారు.

టిడిపిలో చేరిన వైసిపి కౌన్సిలర్
చిలకలూరిపేట, నవంబర్ 8: వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో స్థానిక 34వ వార్డు వైసిపి కౌన్సిలర్ పుప్పాల ప్రశాంతి తెలుగుదేశం పార్టీలో మంగళవారం చేరారు. మంత్రి పుల్లారావు నివాస గృహంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు మల్లెల రాజేష్‌నాయుడు ఆధ్వర్యాన కౌన్సిలర్ ప్రశాంతి భర్త పుప్పాల శంకర్‌తో పాటు 40 మంది టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గంలో మంత్రి పుల్లారావు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై తాము కూడా భాగస్వాములు కావాలన్న ఉద్దేశంతో పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఇలా ఉండగా గతంలో వైసిపికి చెందిన కౌన్సిలర్లు పేట సునీత, అన్నపూర్ణ టిడిపిలో చేరి క్రియాశీలక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇకముందు కూడా మరింత మంది కౌన్సిలర్లు తమ పార్టీలో చేరుతారని టిడిపి శ్రేణులు పేర్కొంటున్నారు.

డిడిపి కార్యాలయానికి అదనపు భద్రత

గుంటూరు, నవంబర్ 8: మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్, మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భద్రతా ప్రమాణాలపై రూరల్ ఎస్పీ కె నారాయణనాయక్, అదనపు ఎస్పీ భాస్కరరావు తదితరులు సమీక్షించారు. మంగళవారం పార్టీ కార్యాలయాన్ని పోలీసు అధికారులు నిశతంగా పరిశీలించి అవసరమైన భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణకు గుంటూరు కార్యాలయంలోనే మకాం వేయటంతో పాటు మంత్రులు, ఇతర ముఖ్యనేతలు కార్యాలయానికి రాకపోకలు కొనసాగిస్తున్నారు. కార్యాలయంతో పాటు వివిఐపిల భద్రతకు సంబంధించిన అంశాలను పోలీసు అధికారులు పరిశీలించారు.

చంద్రన్న బీమాకు నిధులు తరలించడం చట్ట వ్యతిరేకం
* కార్మికశాఖ కార్యాలయం ఎదుట సిఐటియు ధర్నా
గుంటూరు, నవంబర్ 8: నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను ఇతర పథకాలకు తరలించవద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ రాష్ట్రప్రభుత్వం చంద్రన్నబీమాకు 230 కోట్ల రూపాయలు తరలించడం చట్టరీత్యా నేరమని సిఐటియు జిల్లా కార్యదర్శి కెబి ప్రసాద్ తెలిపారు. భవన కార్మికులకు చంద్రన్నబీమా ద్వారా కాకుండా సంక్షేమబోర్డు ద్వారానే పథకాలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. మంగళవారం భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) ఆధ్వర్యాన అరండల్‌పేటలోని కార్మికశాఖ డెప్యూటీ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికశాఖ అధికారులు బాధ్యత వహించి సంక్షేమబోర్డు ద్వారానే పథకాలు కొనసాగించాలని కోరారు. ప్రమాద మరణం, అంగవైకల్యం, సహజ మరణం చెల్లింపులు చంద్రన్న బీమాకు బదలాయిస్తూ ఇచ్చిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సంఘ ప్రధాన కార్యదర్శి కాపు శ్రీనివాస్ మాట్లాడుతూ నిర్మాణ కార్మికులకు పెన్షన్, గృహనిర్మాణం, స్కాలర్‌షిప్‌ల వంటి నూతన పథకాలను ప్రారంభించాలని, పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను వెంటనే పరిష్కరించాలని కోరారు. భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తిచేశారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డెప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నగర అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్ శ్రీనివాసరావు, ఎ నికల్సన్, ఎస్‌కె సిలార్, భుజంగరావు, రాకేష్, బి వెంకటేశ్వర్లు, కొండలు, సుబ్బరాయుడు, మస్తాన్, ఎస్‌కె బాషా తదితరులు పాల్గొన్నారు.

సెమీస్‌కు చేరిన టెన్నిస్ పోటీలు
గుంటూరు (స్పోర్ట్స్), నవంబర్ 8: స్థానిక ఎన్‌టిఆర్ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్ర స్కూల్‌గేమ్స్ టెన్నిస్ పోటీలు మంగళవారం సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయి. అండర్-17 బాలికల విభాగంలో డిఎస్ వౌనిక (కడప) 5-2 గేమ్స్‌తో ఫర్హానా ముస్కాన్ (కర్నూలు)పై గెలుపొందగా, మిగిలిన పోటీల్లో వి లక్ష్మీ సాహితీరెడ్డి (కడప) 5-2తో సిహెచ్ జ్ఞానశ్రీ (కృష్ణ)పై, ఎ జ్ఞానిత (వైజాగ్) 5-1తో కె సుప్రిత (వైజాగ్)పై, పి చందన (చిత్తూరు) 5-2తో కె శ్రీయపై గెలుపొందారు. అండర్-14 బాలుర విభాగంలో టి గణేష్‌సాయి (చిత్తూరు) 5-0తో అస్లాం పాషా (చిత్తూరు)పై, బివిఆర్ అక్షోభయ (వైజాగ్) 5-2తో ఇ హర్షిత్ (అనంతపూర్)పై, ఎ వెంకట అభిరామ్ (తూర్పు గోదావరి) 5-4తో ప్రభాస్ శ్రీకాకుళంపై, రామసాయి సంప్రీత్ (వైజాగ్) 5-0తో సల్మాన్ బాషా (నెల్లూరు)పై, ఎం అనంతమణి (వైజాగ్) 5-0తో యశ్వంత్ (చిత్తూరు)పై, జి నవీన్‌కుమార్ (అనంతపూర్) 5-2తో కె గిరీష్ (కృష్ణ)పై, కె నారాయణవర్మ (వైజాగ్) 5-4తో హేమవర్ధన్ (చిత్తూరు)పై, కె నితిన్‌సాయి చౌదరి (వైజాగ్) 5-3తో కె సుహృద అమృ (కృష్ణ)పై గెలుపొంది క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు.

పెట్టుబడులు, ఉద్యోగావకాశాలపై
బహిరంగ చర్చకు వైసిపి సిద్ధమా?
* టిడిపి నేతలు మాణిక్యవరప్రసాద్, మాల్యాద్రి సవాల్
గుంటూరు (కొత్తపేట), నవంబర్ 8: దేశంలోని ఏ రాష్ట్రంలో చేయని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎపిలో పెట్టుబడులు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని, వైసిపి మాత్రం కళ్లు మూసుకుని గుడ్డి ఆరోపణలు చేస్తోందని, అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని, మీరు సిద్ధమేనా అని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్, నాలెడ్జి సెంటర్ డైరెక్టర్ గురజాల మాల్యాద్రి సవాల్ చేశారు. మంగళవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతుంటే ఓర్వలేని వైసిపి సభల పేరుతో ప్రజలు ముఖ్యంగా యువతను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. రెండున్నరేళ్లలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిలో ఎపి నెంబర్ వన్ అని వరల్డ్‌బ్యాంకు, కేంద్రప్రభుత్వం కితాబునిచ్చాయన్నారు. పారిశ్రామిక పెట్టుబడుల్లో ఎపి నెంబర్ వన్ అని ఆర్‌బిఐ స్పష్టంచేసిందని, ఎనర్జీ, ఎఫిషియన్సీలో ఎపి నెంబర్ వని యావత్ దేశమంతా మన రాష్ట్రాన్ని మెచ్చుకుంటుంటే ప్రతిపక్ష నేత జగన్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రెండున్నరేళ్లలో 1,43,633 కోట్లు గ్రౌండ్ కాగా 517 యూనిట్ల ద్వారా 2,23,387 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయన్నారు. ప్రతిపక్షం మాత్రం తనకున్న మీడియాను అడ్డుపెట్టుకుని ఎపికి ఉన్న బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చించేందుకు ఎక్కడికైనా వస్తామని సవాల్ చేశారు. పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంట్ కోతలు, బిల్లుల వలన లక్షా 5 వేల పరిశ్రమలు మూతపడి 11 లక్షల మంది ఉపాధి, ఉపాధి అవకాశాలు కోల్పోయారన్నారు. ప్రతి యేటా డిఎస్సీ విడుదల చేస్తామని వైఎస్ ఎన్నికల మామీ ఇచ్చి పదేళ్లలో కేవలం రెండు డిఎస్సీలు మాత్రమే విడుదల చేశారన్నారు. చంద్రబాబు 11 యేళ్ల పాలనలో 9 డిఎస్సీలు విడుదల చేసి లక్షా 70 మందిని ఉపాధ్యాయులుగా నియమించారని గుర్తుచేశారు. హైటెక్ సిటీ నిర్మించి 13 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. బాబు ఉంటే జాబ్ రావడం ఖాయమన్న విషయాన్ని తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు గుర్తుంచుకోవాలన్నారు. టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి మాట్లాడుతూ జగన్మోహనరెడ్డి కిరాయి వ్యక్తులతో నకిలీ ఉద్యమాలు నడిపిస్తూ యువతను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగుల కోసం 34గా ఉన్న వయో పరిమితిని 42కు చంద్రబాబు పెంచారన్నారు.

సభ్యత్వ నమోదులో జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలి
* కార్యకర్తలకు టిడిపి ఎంపిలు రాయపాటి, జయదేవ్ పిలుపు
గుంటూరు (కొత్తపేట), నవంబర్ 8: తెలుగుదేశం పార్టీకి వెన్నంటి ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న కార్యకర్తలు, నాయకులు అదే స్ఫూర్తితో సభ్యత్వ నమోదులోనూ జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలని నరసరావుపేట, గుంటూరు ఎంపిలు రాయపాటి సాంబశివరావు, గల్లా జయదేవ్ పిలుపునిచ్చారు. జనచైతన్య యాత్రల్లో భాగంగా మంగళవారం పశ్చిమ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. తొలుత ఎంపి రాయపాటి కుటుంబ సభ్యులు తమ పార్టీ సభ్యత్వాలను పునరుద్ధరించుకున్నారు. రాయపాటి కుమారుడు రాయపాటి రంగారావుతో పాటు కుటుంబ సభ్యులకు ఎంపి గల్లా జయదేవ్ గుర్తింపుకార్డులు అందజేశారు. ఈ సందర్భంగా రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ పార్టీ కార్యక్రమాల్లో విధిగా పాల్గొంటూ కీలకపాత్ర పోషించాలని సూచించారు. రాష్ట్భ్రావృద్ధి కోసం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. దేశ, విదేశాల ప్రతినిధులతో ఒప్పందాలు చేసుకుంటూ ప్రతి ఒక్క యువకునికి ఉద్యోగం కల్పించేందుకు చంద్రబాబు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఎంపి గల్లా జయదేవ్ మాట్లాడుతూ తన కుటుంబంతో పూర్వం నుండి స్నేహసంబంధాలు ఉన్న రాయపాటి కుటుంబానికి తన చేతుల మీదుగా పార్టీ సభ్యత్వం అందజేయడం ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాజధాని అమరావతి నిర్మాణానికి కృషి చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. పార్టీకి అండదండగా ఉంటున్న కార్యకర్తలకు తప్పక గుర్తింపు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి హిదాయత్, డైరెక్టర్ లాల్‌వజీర్, గోనుగుంట్ల కోటేశ్వరరావు, టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు రావిపాటి సాయి, రాయపాటి అమృతరావు, బాజీచౌదరి, రాజపుత్ర సత్యంసింగ్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం
* ఒకరికి తీవ్రగాయాలు
భట్టిప్రోలు, నవంబర్ 8: గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం కోళ్ళపాలెం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ముందు వెళుతున్న లారీని తప్పించే సమయంలో ఎదురుగా వస్తున్న టాటాఏస్‌ను బైకు ఢీకొనడంతో ఈప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం కృష్ణాజిల్లా పామర్రు నుండి చెరుకుపల్లి మండలం కనగాల గ్రామానికి మోటారు బైకుపై వస్తున్న షేక్ షరా(36), షేక్ మస్తాన్‌వలి(37) అనే ఇద్దరు వ్యక్తులు కోళ్ళపాలెం గ్రామం వద్ద ముందుగా వెళుతున్న లారీని తప్పించే ప్రయత్నంలో గుంటూరు వైపునుండి కృష్ణాజిల్లా వైపువెళుతున్న టాటాఏస్ వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో అదుపుతప్పిన టాటాఏస్ రోడ్డుపైనే బోల్తా కొట్టగా, ద్విచక్ర వాహనదారులు ఇద్దరు అక్కడికి అక్కడే మృతి చెందారు. టాటాఏస్ డ్రైవర్ బాలా(45) తాను కూర్చున్న సీటు, స్టీరింగ్‌కు మధ్యలో ఇరుక్కుపోయి కొనఊరిపితో ఉండగా సమీప గ్రామస్తులు అతడిని బయటకు లాగి వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు ఎస్‌ఐ రవీంద్రారెడ్డి తెలిపారు. అలాగే టాటాఏస్‌లో ప్రయాణిస్తున్న మరోవ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు చెప్పారు. రేపల్లె సిఐ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో మృత దేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.