గుంటూరు

పటణాభివృద్ధిపై స్పీకర్ ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, నవంబర్ 20: సత్తెనపల్లి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏవిధంగా జరుగుతున్నాయని పట్టణ కౌన్సిలర్లను స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆరాతీశారు. ఆదివారం స్థానిక స్పీకర్ కార్యాలయంలో పట్టణాభివృద్ధి పురోగతిపై కౌన్సిలర్లతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో స్పీకర్ మాట్లాడారు. వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రతి రోజూ పర్యవేక్షించాలని కౌన్సిలర్లకు సూచించారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలయ్యేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని అన్నారు. విద్యా, వైద్యం, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర ప్రజా వౌలిక సదుపాయాల కల్పనలో వేగవంతం ఉండాలని సభాపతి పేర్కొన్నారు. ప్రతి వార్డులో మున్సిపల్ చైర్మన్ ఇతర అధికారులతో కలసి పర్యటిస్తే సమస్యలు త్వరితగతిన పరిష్కరించవచ్చునని సభాపనతి వివరించారు. ఈ సమావేశంలో మార్కెట్ యార్డు చైర్మన్ ఆళ్ళ సాంబయ్య, ఎంపిపి బొర్రా కోటేశ్వరరావు, పట్టణ టిడిపి అధ్యక్షులు పెద్దింటి వెంకటేశ్వర్లు, మండల పార్టీ అధ్యక్షులు కోమటినేని శ్రీనివాసరావు, కార్యదర్శి పుస్పరాజ్ సోలానంబి, పాకాపాడు సొసైటి అధ్యక్షులు తొరటి వెంకట్రావ్, కౌన్సిలర్లు చౌటా శ్రీనివాసరావు, బచ్చు మనోహర్, మార్కెట్ రాజు, నాయకులు అడుసుమల్లి నారాయణ, గంగూరి శివయ్య, బోయపాటి పూర్ణ తదితరులు పాల్గొన్నారు.

ఇదో ఆర్థిక ఉగ్రదాడి
* నగదు రహిత సమాజం అసాధ్యం * నోట్ల రద్దుతో సంక్షోభం * ఆర్థిక రంగ విశే్లషకుల చర్చాగోష్టి

గుంటూరు, నవంబర్ 20: కేంద్ర ప్రభుత్వం 500, 1000 నోట్లను రద్దుచేయటం సామాన్యులపై సర్జికల్ దాడిగా పలువురు ఆర్థికరంగ నిపుణులు అభివర్ణించారు. కార్పొరేట్ శక్తులను రక్షిస్తూ పేదలపై ఆర్థికదాడికి సంకేతంగా నిలుస్తోందని విమర్శించారు. 12 రోజులుగా నోట్ల రద్దు నిర్ణయం దేశాన్ని అతలాకుతలం చేస్తోందని ధ్వజమెత్తారు. ఆదివారం సాయంత్రం రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ డొక్కా మాణిక్యవరప్రసాద్ కార్యాలయంలో అమరావతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైనె్సస్ ఆధ్వర్యంలో నోట్ల రద్దుతో ఏర్పడిన పరిణామాలపై చర్చాగోష్టి నిర్వహించారు. గోష్టికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. ఆర్థిక రంగ విశే్లషకులు డి పాపారావు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ ఆకస్మిక నిర్ణయం దూకుడుగా ఉందన్నారు. దేశ సరిహద్దుల్లో శత్రువులపై సర్జికల్ దాడి చేస్తూ పెద్దనోట్ల రద్దుతో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలను అగాధంలోకి నెట్టారని వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ధన మార్పిడి కేవలం 10.4 శాతం మాత్రమే ఉందన్నారు. మిగిలిన 85 శాతంగా ఉన్న నల్లధనం వెలికితీతలో ప్రభుత్వానికి తాత్కాలిక ప్రయోజనాలు కూడా దక్కడం అనుమానాస్పదమే అన్నారు. రూ. 7601 కోట్ల కార్పొరేట్ల రుణమాఫీలో మాల్యాను పక్కన పెట్టటంతో పాటు మిగిలిన 62 మంది నుండి బాకీలు వసూలు చేయటంలో బ్యాంకులు వైఫల్యం చెందడం ప్రభుత్వ దివాళాకోరు తనానికి నిదర్శనమన్నారు. దేశాన్ని ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టిన ఎన్డీయే, బిజెపి ప్రభుత్వం తన తప్పిదాన్ని అంగీకరించకపోగా నియంత్రుత్వంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. హిందూ కళాశాల రిటైర్డు అధ్యాపకులు ఎల్‌ఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ కాకులను కొట్టి గద్దలకు పంచిన చందంగా కేంద్ర నిర్ణయాలు ఉన్నాయన్నారు. ప్రజలు మేల్కొనకపోతే రానున్న రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. స్విట్జర్లాండ్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో ఉన్న క్యాష్‌లెస్ సొసైటీ మనదేశం, రాష్ట్రంలో అమలు కావటం అసాధ్యమని తేల్చిచెప్పారు. అమరావతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైనె్సస్ అధ్యక్షులు డొక్కా మాణిక్యవరప్రసాద్, కొరివి వినయకుమార్, నూతక్కి సతీష్, న్యాయవాది పి.రాజారావు, ప్రొఫెసర్ అంజిరెడ్డి, విద్యా, ఆర్ధికరంగ ప్రముఖులు చర్చాగోష్టికి హాజరయ్యారు.

రూల్స్‌కు విరుద్ధంగా సస్పెండ్ చేసిన చేతకాని ప్రభుత్వం
* ప్రత్యేక హోదా కందిపప్పు - ప్రత్యేక ప్యాకేజి గనే్నరు పప్పు * నగరి ఎమ్మెల్యే రోజ
మాచర్ల, నవంబర్ 20: లోపాలు ఎత్తి చూపుతున్నందుకే రూల్స్‌కు విరుద్ధంగా చేతకాని ప్రభుత్వం తనను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసిందని నగరి ఎమ్మెల్యే రోజ అన్నారు. ఆదివారం స్థానిక కెసీపీ అతిధిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై పోరాడుతున్న తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చెయ్యటం తెలుగుదేశం పార్టీ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. ప్రత్యేక హోదా కందిపప్పు లాంటిదని ప్రత్యేక హోదా గనె్నరు పప్పున్నారు. తాము కందిపప్పు కోసం పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా.. అన్న చంద్రబాబు ఏ అర్హతలతో దళితులతో సన్మానం చేయించుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు. రెండున్నర సంవత్సరాలలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దళితులకు ఒక్క ఇళ్ళు అయినా కట్టించారా.. సెంటు భూమి ఇచ్చారా అని ప్రశ్నించారు. పల్నాడు ప్రాంతంలో దళిత పేద బడుకు బలహీన వర్గాలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అధికారపార్టీ నాయకులు పోలీసుల సహాకారంతో పక్క రాష్ట్రాలకు అమ్ముకోవటం సిగ్గు చేటన్నారు. అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించినంత మాత్రాన చంద్రబాబును దళితులు నమ్మే స్థితిలో లేరన్నారు. గడపగడపకు వైయస్సార్ కార్యక్రమంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఆగ్రహంతో వెల్లగక్కుతున్నారన్నారు. యువ చైతన్య యాత్రల్లో నారా లోకేష్‌ను యువకులు ఓటుకు నోటు, విదేశాల్లో అమ్మాయిలతో చిందుల గురించి ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అసెంబ్లీని ఎన్టీఆర్ భవన్‌లా మార్చి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు విషయం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ముఖ్యమంత్రికి ముందే ఉప్పు అందించి ఉంటాడని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసేందుకు అనుమతి కోరితే నేటి వరకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని వైయస్సార్‌సీపీ విప్ ఎమ్మెల్యే పినె్నల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. సమస్యలు ఏకరవు పెడతారనే భయంతోనే ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ఇవ్వటంలేదన్నారు. అంతకు ముందు శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి దేవాలయాన్ని, చింతల రామలింగేశ్వరస్వామి దేవాలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమావేశంలో జడ్పీటీసీ శేరెడ్డి గోపిరెడ్డిలు పాల్గొన్నారు.

మహిళాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
అమరావతి, నవంబర్ 20: మహిళాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం పనిచేస్తుందని పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్ అన్నారు. ఆదివారం స్థానిక శ్రీ రామకృష్ణ హిందూ హైస్కూల్‌లో జరిగిన మండల సమాఖ్య సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. సమావేశానికి వెలుగు ప్రాజెక్టు ఎపిఎం సునీత అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే శ్రీ్ధర్ మాట్లాడుతూ మహిళల్లో ఆర్థిక చైతన్యం తీసుకురావడానికి ప్రభుత్వం గేదెలను, మేకలను పంపిణీ చేయడంతో పాటు రేషన్‌షాపులు, వినియోగదారులకు ఉపయగపడే షాపులు, అన్న సంజీవని మెడికల్ షాపులను ఏర్పాటుచేసి తక్కువ ఖర్చుకే అన్ని వస్తువులు అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు. రాజధాని అమరావతిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు త్వరలో కలుగుతాయని, అందుకు అర్హులైన వారికి ప్రభుత్వం శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. అమరావతి మండలంలో 12,359 మంది మహిళా సంఘాల సభ్యులకు రెండోవిడత ప్రభుత్వం ఏర్పాటుచేసిన 3,58,41,000 రూపాయలకు సంబంధించిన చెక్కును ఈ సందర్భంగా సంఘాల ప్రతినిధులకు అందజేశారు. త్వరలో ప్రతి ఒక్క సభ్యురాలికి వారి వారి ఖాతాల్లో 3 వేలు వేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డిపిఎం శేఖర్, ఏరియా కో-ఆర్డినేటర్, కమ్యూనిటీ కో ఆర్డినేటర్లు సతీష్, అయోధ్య రాఘవ, మరియరాణి, సుధ, యలమంద, దానియేలు జోసఫ్‌తో పాటు పెనుముచ్చు రామకృష్ణ, షేక్ జాని, జి నిర్మలాదేవి, కె వసంతరావు, షేక్ అల్లాభక్షు తదితరులు పాల్గొన్నారు. తొలుత గ్రామంలో స్వచ్చ్భారత్ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే అధికారులకు పలు సూచనలు చేశారు.

చంద్రబాబు పాలన అవినీతిమయం: ఎమ్మెల్యే రోజా
రెంటచింతల, నవంబర్ 20: ప్రజలను మోసం చేయడం చంద్రబాబునాయుడికి వెన్నతో పెట్టిన విద్య అని నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆదివారం పిడుగురాళ్ళ వెళ్తూ మార్గమధ్యంలో రెంటచింతలలో దిగి వైఎస్సార్ సిపి నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్కటి కూడా అమలు చేయలేదని విరుచుకుపడ్డారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన ఆయన నిరుద్యోగులందరినీ నట్టేట ముంచారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను నంబర్ వన్ చేస్తానని, అధికారంలోకి వచ్చిన ఆయన ప్రత్యేక హోదా తీసుకురాకపోగా, ప్రత్యేక హోదా అవసరం లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. మూడు పంటలు పండే భూములను నాశనం చేసి, అక్కడే రాజధాని నిర్మించాల్సిన అవసరం ఏమిటని ఆమె ప్రశ్నించారు. రాజధాని నిర్మించడానికి అన్ని వేల ఎకరాల భూమి అవసరమా అన్నారు. వైఎస్సార్ హయాంలో ప్రతి ఒక్కరికీ అన్ని సంక్షేమ పథకాలను అమలుచేసిన ఘనత వైఎస్‌కే దక్కిందన్నారు. ప్రతి అర్హుడికి పింఛన్లు అందజేశారని అన్నారు. చంద్రబాబు ఇప్పటివరకు ఒక్కరికైనా ఇల్లు నిర్మించారా అని ప్రశ్నించారు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరినీ చంద్రబాబు పాలన ఏలా ఉందని అడిగి తెలుసుకున్నారు.

గురితప్పిన మోదీ అస్త్రం
గుంటూరు (పట్నంబజారు), నవంబర్ 20: పెద్దనోట్ల రద్దులో ప్రధాని మోదీ గురి తప్పిందని అవగాహన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక అరండల్‌పేటలోని సంస్థ కార్యాలయంలో ఎమర్జెన్సీని తలదనే్న పరిస్థితులు అనే అంశంపై జరిగిన సభకు సీనియర్ అధ్యాపకులు వి సుబ్బారావు అధ్యక్షత వహించారు. సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ వస్తే చేంజ్ చాలా వస్తుందనుకున్న ప్రజలకు చేంజ్ కోసం బజారుపడాల్సిన పరిస్థితి వస్తుందనుకోలేదన్నారు. దేశ ప్రజలను నోట్ల రద్దుతో తీవ్ర ఇక్కట్లకు గురిచేసిన పాపం ఎన్డీయే ప్రభుత్వానిదేనన్నారు. సామాజిక దృక్పధంతో కేంద్రం ఆచరిస్తే ప్రజల సమస్యలకు పరిష్కారం తప్పక లభిస్తుందన్నారు. ఆర్థికశాస్త్ర ఉపన్యాసకులు డాక్టర్ వి సుధీర్ మాట్లాడుతూ బ్యాంకుల్లో డిపాజిట్లు, నగదు డ్రాలపై నిఘా పెంచడం, సిరా గుర్తులు వేయడం వంటి చర్యలు ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయన్నారు. నల్లధనం పేరిట ఆయన ప్రయోగించిన ఆయుధాలు, పేదలు, మధ్య తరగతి ప్రజలు, శ్రమజీవులను ముప్పతిప్పలు పెడుతున్నాయన్నారు. సంస్థ ఉపాధ్యక్షుడు పిఎస్ మూర్తి మాట్లాడుతూ తగినన్ని నోట్లను ప్రజలకు అందుబాటులో ఉంచిన తరువాత రద్దు ప్రక్రియ చేపడితే ఇటువంటి ఇబ్బందులు తలెత్తేవి కావన్నారు. ఈ సమావేశంలో ఇ చంద్రయ్య, శ్రీమన్నారాయణ, కాలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మహిళాభ్యుదయమే టిడిపి ధ్యేయం
పొన్నూరు, నవంబర్ 20: డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేయడం ద్వారా మహిళల ఉపాధికి బాటలువేసి వారి అభ్యున్నతికి కృషిచేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనన్న వాస్తవాన్ని మరువవద్దని పొన్నూరు ఎమ్మెల్యే డి నరేంద్రకుమార్ సూచించారు. మహిళల జీవనోపాధికి మంజూరు చేసిన చంద్రన్న చైతన్య పెట్టుబడి నిధిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదుగుదల సాధించాలని హితవు పలికారు. పొన్నూరు ఎండిఒ కార్యాలయలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన చంద్రన్న చైతన్య పెట్టుబడి రుణాలను మహిళలకు పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 13,707 మంది మహిళలకు రూ.4.11 కోట్ల పెట్టుబడి రుణాలను అందజేశారు. 32 సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు రూ.1.17 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను, 60 మందికి రూ.36 లక్షల ఎస్సీ సబ్‌ప్లాన్ రుణాలను నరేంద్రకుమార్ అందజేశారు. మండల పరిషత్ అధ్యక్షురాలు బొర్రు సీతమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ పిడి ఎస్‌కె హబీబ్‌బాషా, ఎండిఒ శ్రీనివాసరావు, సంగం డెయిరీ డైరెక్టర్ బొర్రు రామారావు, బ్యాంకు మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి కోల్పోయిన వ్యవసాయ కార్మికులు
మంగళగిరి, నవంబర్ 20: ఎన్నికల సమయంలో బాబు వస్తే జాబు వస్తుందంటూ ప్రచారం జరిపి చంద్రబాబు వచ్చాక జాబు రాకపోగా ఉన్న ఉపాధి కోల్పోయి వ్యవసాయ కార్మికులు అల్లాడుతున్నారని, రాజధాని గ్రామాల్లో పేదలు పడరానిపాట్లు పడుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిహెచ్ బాబూరావు అన్నారు. బేతపూడి, కురగల్లు, నీరుకొండ గ్రామాల్లో ఆదివారం సిపిఎం ఆధ్వర్యాన పాదయాత్ర జరిపి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ పేదల నివాసానికి సెంటు భూమి కోరితే లాఠీలతో కొట్టిస్తున్నారని, వేలాది ఎకరాల భూమిని రాజధాని పేరుతో సేకరించి ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని దుయ్యబట్టారు. సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి, సుందరయ్య, లెనిన్, ప్రకాశరావు, నవీన్ ప్రకాష్, తులశమ్మ, శేషారత్నం, సుశీల, వందనం, లోకయ్య, గణేష్, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మేడికొండూరు, నవంబర్ 20: గుంటూరు-సత్తెనపల్లి ప్రధాన రహదారిలోని పేరేచర్ల ఓవర్‌బ్రిడ్జిపై ఆదివారం లారీ, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందారు. సత్తెనపల్లి పట్టణానికి చెందిన జి సుబ్బారావు (35) ద్విచక్ర వాహనంపై గుంటూరు వస్తుండగా విశాఖపట్నం నుండి ఇనుప లోడ్‌తో వస్తున్న లారీ పేరేచర్ల బ్రిడ్జిపై ఢీకొనగా సుబ్బారావు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి మేడికొండూరు సిఐ బాలాజీ ఆధ్వర్యంలో ఎఎస్‌ఐ లింగమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఘనంగా గ్రంథాలయ వారోత్సవాల ముగింపు
పెదనందిపాడు, నవంబర్ 20: జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఆదివారం పెదనందిపాడు శాఖా గ్రంథాలయంలో ముగిశాయి. పుస్తక పఠనంపై ఆసక్తి కల్గించే నిమిత్తం వివిధ అంశాలపై జరిగిన పలు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులకు శాఖా గ్రంథాలయ అధికారిణి బంకా అరుణ అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందించారు. కార్యక్రమానికి విచ్చేసిన వక్తలు మాట్లాడుతూ విజ్ఞాన దాయకమైన సమాజాభివృద్ధిలో గ్రంథాలయాలు వారధిగా పనిచేస్తున్నాయన్నారు. వీటికి ఆదరణ కొరవడుతున్న తరుణంలో వారోత్సవాలు జరగడం హర్షణీయమన్నారు. సర్పంచ్ కె కోటేశ్వరరావు, పారిశ్రామికవేత్త శేషగిరిరావు, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు కె సాంబశివరావు, జి మోహనరావు, ఎన్ శేషగిరరావు, బి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.