గుంటూరు

వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 29.. రైతాంగాన్ని అన్నివిధాల ఆదుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథిగృహంలో గురువారం ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశుసంవర్థకశాఖలు విడివిడిగా రూపొందించిన 2017 సంవత్సరం క్యాలండర్, డైరీలను మంత్రి పుల్లారావు ఆవిష్కరించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ఈ ఏడాది 29.6 శాతం వర్షపాతం తక్కువ నమోదైనప్పటికీ వరి, ప్రత్తి పంటలలో అధిక దిగుబడులు సాధించామన్నారు. నూతన సంవత్సరంలో వ్యవసాయం లాభసాటిగా ఉండాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం మద్దతుధర కల్పిస్తోందని ఇప్పటి వరకు 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయని వివరించారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోపే నగదును రైతుల ఖాతాలో జమ చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇన్‌పుట్ సబ్సిడీ కింద 2015-16 సంవత్సరానికి 605 కోట్లు, 2014-15 సంవత్సరంలో పెండింగ్‌లో ఉన్న మరో 75 కోట్ల నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వచ్చేనెల 2వ తేదీ నుంచి జరిగే జన్మభూమి కార్యక్రమాలలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ చేస్తామన్నారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో వేరుసెనగ పంట వేసి నష్టపోయిన రైతులకు వాతావరణ ఆథారిత పంటల బీమా కింద 434 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. 14లక్షల ఎకరాలకు సాగునీరు, 550 గ్రామాలకు మంచినీటిని అందించే లక్ష్యంతో నిర్మించనున్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని ఇందులో భాగంగా తొలివిడత 1980 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. వచ్చే ఏడాది పోలవరం నిర్మాణ పనులు పూర్తిచేస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, ఆచార్య ఎన్‌జి రంగా విశ్వవిద్యాలయం అధికారులు పాల్గొన్నారు.

నాల్గోతేదీ నాటికి మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలి
గుంటూరు (కార్పొరేషన్), డిసెంబర్ 29: నగరంలో వివిధ దశలో ఉన్న నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లను జనవరి 4 నాటికి పూర్తిచేయాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి తెలిపారు. గుంటూరు నగరం బహిరంగ మల, మూత్ర రహిత నగరంగా చేయటంలో భాగంగా వ్యక్తిగత, పబ్లిక్, కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణాలపై గురువారం తన చాంబర్‌లో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తొలుత వార్డుల వారిగా, అసిస్టెంట్ ఇంజనీర్ల వారీగా మరుగుదొడ్ల నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రస్తుతం కొత్తగా మరుగుదొడ్ల నిర్మాణం కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకుని వేగవంతం చేయాలన్నారు. ఏఈల వద్ద జియోట్యాగింగ్ చేయకుండా చాలా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే జియోట్యాగింగ్ చేయాలన్నారు. అలాగే న్యూ, ఎగ్జాస్టింగ్, స్కూళ్లు, కమ్యూనిటీ, పబ్లిక్ టాయిలెట్లను కూడా జియోట్యాగింగ్ చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే మొదటి, రెండవ విడత పేమెంట్లను పెండింగ్ లేకుండా క్లియర్ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో జనవరి 4 నాటికి మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తికావాలని ఆదేశించారు. అలాగే స్కూలు, కమ్యూనిటీ, పబ్లిక్ టాయిలెట్ల ఫొటోలను కంప్యూటర్‌లో ఉంచాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోటేశ్వరరావు, డిఇఇలు, ఏఈలు, ఉపాసెల్ ప్రాజెక్టు ఆఫీసర్ సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

సమయపాలనే విజయానికి సోపానం
* వ్యవస్థలో బాధ్యతాయుతంగా వ్యవహరించండి
* సంపాదనే విజయం కాదు
గుంటూరు (లీగల్), డిసెంబర్ 29: గడిచిన క్షణం తిరిగిరాదని యుగయుగాలుగా చెప్తున్నప్పటికీ చాలా మంది సమయాన్ని దుర్వినియోగం చేస్తుంటారని, సమయపాలనతో వ్యవహరిస్తే ఏ వృత్తిలోనైనా విజయం సాధించవచ్చని సుప్రింకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కోర్టులలో న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన గుంటూరు బార్ మాజీ సభ్యుడు నాగేశ్వరరావు అంచలంచెలుగా ఎదిగి సుప్రింకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన నేపథ్యంలో గురువారం బార్ అసోసియేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు జరిగిన సత్కారసభకు బార్ అధ్యక్షుడు గుత్తా వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జస్టిస్ నాగేశ్వరరావు మాట్లాడుతూ న్యాయవాద వృత్తిని తాను ప్రతినిమిషం ఎంజాయ్ చేశానని, తాను సుప్రింకోర్టు న్యాయమూర్తి పదవిని గొప్ప విజయంగా భావించడం లేదన్నారు. ప్రతి న్యాయవాది తన వృత్తిని ప్రారంభించిన అనంతరం నిరంతరం నేర్చుకోవాల్సిన ఎన్నో అంశాలుంటాయని, ఏ ఒక్క చట్టాన్నీ వదలకుండా కక్షిదారుడ్ని ఆయా కేసుల్లో సంతృప్తి పర్చడమే నిజమైన వృత్తిగానూ, అందులో ధన్యత సాధించినట్లుగానూ ఆయన పేర్కొన్నారు. యువ న్యాయవాదులు ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకుండా బార్ అసోసియేషన్‌లు, జిల్లా కోర్టులు నిర్వహించే సదస్సులు, కార్యశాలలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తాను న్యాయవాదిగా గుంటూరు బార్ అసోసియేషన్‌లో ఉన్నప్పటి కంటే ఎన్నోరెట్లు సౌకర్యాలు ప్రస్తుతం ఉన్నాయని, గుంటూరు బార్‌ను అన్ని బార్‌లలో కంటే మోడల్ బార్‌గా తీర్చిదిద్దాలని కోరారు. న్యాయవాదులు, న్యాయమూర్తులు సంయుక్తంగా యువ న్యాయవాదులకు మార్గనిర్ధేశకత్వం వహించాలని విజ్ఞప్తిచేశారు.
పెండింగ్ కేసుల్లో రాష్ట్రానిదీ పెద్దపాత్రే...
తాను సుప్రింకోర్టు న్యాయమూర్తిగా నియమితుడైన అనంతరం ప్రధాన న్యాయమూర్తితో జరిగిన సమావేశంలో దేశంలో ఎక్కువ పెండింగ్ కేసులు ఉన్న రాష్ట్రాల గురించి ప్రస్తావిస్తూ తొలి 8 స్థానాల్లో ఆంధ్ర రాష్ట్రం ఉండటాన్ని తాను గమనించానని జస్టిస్ లావు నాగేశ్వరరావు పేర్కొన్నారు. వివిధ కారణాల నేపథ్యంలో న్యాయవాదులు, వాయిదాలు అడగడం వంటివి చేస్తుంటారని, సమాజానికి సేవ చేయడమంటే కేసుల పెండింగ్‌ను తగ్గించి కక్షిదారులకు ఊరట కల్పించడమేనన్నారు. మోటారు వాహన ప్రమాదాల వంటి కేసులు మాత్రమే చేస్తూ కొందరు న్యాయవాదులు ధనం మాత్రమే సంపాదిస్తున్నారని, అయితే న్యాయవాద వృత్తి ప్రస్థానంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చట్టం పట్ల ఏ మాత్రం అవగాహన లేనితనాన్ని వారు గమనించాల్సి ఉంటుందన్నారు. డబ్బు అనేది విజయాన్ని అనుసరిస్తుందే తప్ప డబ్బే విజయం కాదన్న వాస్తవాన్ని మేధావివర్గం గమనించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, గుంటూరు జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ సురేష్‌కుమార్ కైత్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిలుకూరి సుమలత, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, గుత్తా వెంకటేశ్వరరావు, నట్టువ సత్యనారాయణ, జి శాంతకుమార్, చిగురుపాటి రవీంద్రబాబు, చింతల మల్లిఖార్జునరావు, బండ్లమూడి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తొలుత జస్టిస్ లావు నాగేశ్వరరావు గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని గ్రంథాలయంలో ఈ-లైబ్రరీని ప్రారంభించారు. ఇందుకు సహకరించిన దాతలతో పాటు బార్ అసోసియేషన్ నూతన భవనానికి సహకరించిన పలువురు దాతలను జస్టిస్ నాగేశ్వరరావు సత్కరించారు. అనంతరం జస్టిస్ నాగేశ్వరరావును గుంటూరు బార్ కార్యవర్గం ఘనంగా సత్కరించింది.
గణనీయంగా తగ్గిన నేరాలు
* ఈ ఏడాది 4,224 క్రిమినల్ కేసులు
* రోడ్డు ప్రమాదాల్లో 303 మంది మృతి
* రూ. 2.36 కోట్ల అపరాధ రుసుం వసూలు
గుంటూరు (పట్నంబజారు), డిసెంబర్ 29: గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని జిల్లా అర్బన్ ఎస్‌పి సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. గురువారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 485 మందికి శిక్ష పడిందని, అక్రమ మద్యం కేసులు 113 నమోదయ్యాయని, ఎన్‌డిపిఎస్ యాక్టు కింద మరో 13 కేసులు, 692 పేకాట కేసులు నమోదయ్యాయని వివరించారు. పేకాట కేసుల్లో 21,43,367 రూపాయలు స్వాధీనం చేసుకున్నామని, కోడిపందాల నిర్వాహకులపై 60 కేసులు నమోదయ్యాయని వివరించారు. మోటారు వాహనాల చట్టం కింద నమోదైన కేసుల ద్వారా 2,36,63,050 రూపాయలు, డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా 33,08,500 రూపాయలు అపరాధ రుసుం వసూలు చేశామన్నారు. ఆస్థి తగాదాల కారణంగా జరిగిన హత్యల్లో 1, 3 డకాయిటీ కేసులు, 14 దొంగతనాల కేసులు, సాధారణ దొంగతనాలు మరో 597, పాతకక్షల నేపథ్యంలో జరిగిన హత్యలు 36, 50 హత్యాయత్నం కేసులు, 126 కిడ్నాప్‌లు, 42 అత్యాచారాలు, 374 చీటింగ్ కేసులతో కలిపి మొత్తం 4,224 కేసులు నమోదయ్యాయని వివరించారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి 285 కేసులు నమోదు కాగా 303 మంది మృతిచెందారని, 946 మంది గాయపడినట్లు తెలిపారు. నూతన సంవత్సరంలో నేరాలను మరింత కట్టుదిట్టంగా నియంత్రిస్తామని, ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామని ఎస్‌పి త్రిపాఠి చెప్పారు. సమావేశంలో అడిషనల్ ఎస్‌పి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

మావోయిస్టుల ముద్రతో వేధింపులు
పోస్టర్లతో దుష్ప్రచారం
సిఎంఎస్ ఆందోళన
హక్కుల నేతపై కరపత్రాలతో పోలీసుల కౌంటర్

గుంటూరు, డిసెంబర్ 29.. గత రెండు దశాబ్దాలకు పైగా మహిళా సమస్యలపై ఉద్యమిస్తున్న తమపై మావోయిస్టుల ముద్రవేసి ప్రభుత్వం, పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ చైతన్య మహిళా సంఘం (సిఎంఎస్), ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో తమ సంస్థ ప్రతినిధుల ఫొటోలు ముద్రించి దుష్ప్రచారం చేస్తున్నారని దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాజ్యహింసలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ఏపి సర్కార్ అమాయక ప్రజలపై దమనకాండ సాగిస్తోందని సిఎంఎస్ నేతలు ఆరోపించారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి రాధ, రాజేశ్వరి, కృష్ణా, గుంటూరు జిల్లాల కార్యదర్శులు సిసోర, పద్మ, కడపజిల్లా కార్యదర్శి ఇందు,సత్తాస్, అన్నపూర్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి శిల్ప విరసం కార్యదర్శి వరలక్ష్మి ఫొటోలతో పోస్టర్లను ముద్రించి మావోయిస్టుల ముసుగు వేసుకున్నారంటూ తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని దీనిపై ప్రభుత్వం విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. పోస్టర్లు ఎవరు ముద్రించారో నిగ్గుతేల్చాలన్నారు. సిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయ, ప్రధాన కార్యదర్శి రాధ, అమరుల బంధుమిత్రుల కమిటీ అధ్యక్షురాలు బొప్పూడి అంజమ్మ, విరసం రచయితలు రుక్మిణి, సంగ్రామ్, కిరణ్ తదితరులతో పాటు కుల నిర్మూలన పోరాట సమితి, పిడిఎం, పిడిఎస్‌యు, ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

నృసింహుని సన్నిధిలో జడ్జి పాటిల్, మంజునాధ
మంగళగిరి, డిసెంబర్ 29: కర్నాటక రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఎస్ పాటిల్, ఎపి బీసీ కమిషన్ చైర్మన్ మంజునాథ గురువారం మంగళగిరి విచ్చేసి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని పూజలు జరిపారు. జస్టిస్ పాటిల్ సతీసమేతంగా స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. ఆలయ ముఖ మండపంలో పాటిల్‌ను ఆలయ ఉపప్రధాన అర్చకులు నల్లూరి శ్రీరామచంద్ర భట్టాచార్యులు ఆశీర్వదించారు. స్వామివారి చిత్రపటాన్ని ఆలయ ఇఓ పానకాలరావు పాటిల్‌కు అందజేశారు. తీర్ధ ప్రసాదాలను అందించారు. జస్టిస్ మంజునాథ ఎగువ, దిగువ సన్నిధుల్లో పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారిని, రాజ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపారు. ఆలయ మర్యాదలతో అర్చకులు, ఇఓ స్వాగతం పలికారు. ధర్మకర్తలు ఊట్ల శ్రీమన్నారాయణ, కోసూరి శివనాగరాజు, పంచుమర్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కూల్చిన దళితుల సమాధులను పరిశీలించి ఆర్డీవో
* ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
చేబ్రోలు, డిసెంబర్ 29: మండల పరిధిలోని నారాకోడూరు గ్రామంలో దళితుల సమాధులను కూల్చివేసిన ఘటనపై గురువారం తెనాలి ఆర్డీవో జి నరసింహులు, తహశీల్దార్ కె శివరాంప్రసాద్, ఎండిఒ జోసఫ్‌కుమార్, ఎస్‌ఐ కె ఆరోగ్యరాజులు పరిశీలించారు. సమాధులను కూల్చివేసిన సంఘటనపై ఆర్డీవో నరసింహులు వివరాలను తెలుసుకున్నారు. దళితుల సమాధాలను కూల్చివేసిన సర్పంచ్, పంచాయతీ అధికారి, పొక్లయినర్ డ్రైవర్ ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో హామీ ఇచ్చారు.
రూ 8.53 కోట్లతో తెనాలి అభివృద్ధి
* మున్సిపల్ చైర్మన్ కొత్తమాసు
తెనాలి, డిసెంబర్ 29: తెనాలి పట్టణాన్ని నూతన సంవత్సరం మొదటి నెలలో సుమారు 8.53కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ కొత్తమాసు తులసీదాసు తెలిపారు. గురువారం ఆయన తన ఛాంబర్‌లో మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ పర్యవేక్షణలో, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశీస్సులతో ప్రతినెలా 2నుండి 8కోట్ల రూపాయల మేరకు అభివృద్ధి పనులు చేయిస్తున్నామన్నారు. ఈక్రమంలోనే ఈనెల 31న జరుగనున్న మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో 8.53కోట్లతో అభివృద్ధి పనులు చేసేందుకు కౌన్సిల్ ఆమోదం తెలుపనుందన్నారు. అలాగే చైర్మన్‌కు నెలకు 15వేలు, వైస్ చైర్మన్‌కు 7500 రూపాయల చొప్పున హానరోరియమ్, కౌన్సిలర్లకు 3500చొప్పున అలవెన్స్‌ల కింద చెల్లించేందుకు కౌన్సిల్ ఆమోదం లభించనుందన్నారు. పట్టణ పరిధిలోని 40వార్డులకుగాను 32వార్డులలో మాత్రమే ఈ పనుల అంచనాలు తయారుచేశారు. అత్యధికంగా 32వ వార్డులో 61.50 లక్షలు, 20,22వార్డుల్లో 60 లక్షలు,14వార్డులో 54 లక్షలు, 24,19వార్డుల్లో అత్యధికంగా 45 లక్షల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. కాగా 8వార్డుకు ఒక్క రూపాయి పనికూడా ఈనెలలో కల్పించక పోవటం విశేషం. ఈమొత్తం పనుల్లో 80లక్షల రూపాయలు మాత్రమే ఇతర పనులకు కేటాయించగా మిగిలిన వాటిలో 30లక్షల రూపాయల వరకు చినరావూరు పార్కు అభివృద్ధికి కేటాయించనున్నారు. అయితే గతంలోనే ఈపార్కు అభివృద్ధి కోసం దాదాపుగా 50లక్షల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు ఎఇ సుబ్బారావు తెలిపారు. అలాగే రింగ్‌రోడ్‌కు 20లక్షలు, చెంచుపేటలో ఉమేష్ చంద్ర ఐపిఎస్ విగ్రహం చుట్టూ అభివృద్ధి కోసం మరో 8.60లక్షల రూపాయలు, ఆలపాటి నగర్ అభివృద్ధికి మరికొన్ని లక్షలు, టెండర్ల ద్వారా 6.50కోట్ల వరకు పనులకు ఖర్చు చేసేందుకు కౌన్సిల్ ఆమోదం తెలపాల్సిఉంది.