గుంటూరు

ఫర్టిలైజర్ షాపులో తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, జనవరి 5: పట్టణంలోని శ్రీ రామాంజనేయ ట్రేడర్స్, శ్రీ ధనలక్ష్మి హార్డువేర్ షాపులపై జిల్లా విజిలెన్స్ అధికారులు గురువారం సాయంత్రం మెరుపుదాడి చేసి సుమారు 6 లక్షల రూపాయల విలువైన నకిలీ పురుగు మందులను స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ ఏవో వెంకట్రావు వివరాలు అందించారు. పట్టణంలోని రామాంజనేయ ట్రేడర్స్‌లో నకిలీ బయో పురుగు మందులు విక్రయిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులకు ముందస్తు సమాచారం అందింది. ఈమేరకు జిల్లాకు చెందిన విజిలెన్స్ అధికారులు ఈ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు జరిపారు. శ్రీ రామాంజనేయ ట్రేడర్స్, పక్కనే వున్న శ్రీ ధనలక్ష్మి హార్డ్‌వేర్ షాపులో సుమారు రూ.6 లక్షల విలువైన వివిధ కంపెనీల బయో, పురుగు మందులను స్వాధీనం చేసుకున్నారు. రామాంజనేయ ట్రేడర్స్ కోమెరపూడి గ్రామానికి చెందిన జిల్లెల్లమూడి నిర్మల పేరుతో వున్నట్టు అధికారులు తెలిపారు. షాపు గుమస్తా రామారావు, ధనలక్ష్మి హార్డ్‌వేర్ యజమాని అన్నపురెడ్డి అంకమరావుపై కేసు నమోదు చేశారు. తనిఖీల్లో విజిలెన్స్ సిఐ ఆంథోనిరాజు, సత్తెనపల్లి వ్యవసాయ శాఖ ఎడి రవికుమార్, ఎవో నరేంద్రబాబు, హెచ్‌సి రాంబాబు, సిసి నారాయణ, పట్టణ ఎఎస్‌ఐ కటకం గోపాలరావు, హెచ్‌సి మునెయ్య పాల్గొన్నారు.

ప్రహసనంగా జన్మభూమి!
* చంద్రన్న కానుకలతో మమ..
* వెల్లువెత్తుతున్న దరఖాస్తులు
* గుంటూరులో అధికారుల గైర్హాజరు
* అధికార పార్టీ ఎమ్మెల్యే ఆగ్రహం

గుంటూరు, జనవరి 5: ప్రభుత్వం ఈ నెల 2 నుంచి నిర్వహిస్తున్న జన్మభూమి - మా ఊరు కార్యక్రమం ప్రహసనంగా మారుతోంది. మంత్రులు మినహా ఎమ్మెల్యేలకు అధికారులు అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన చంద్రన్న కానుక సంచులను ఎరగావేసి ప్రజలను శాంతింప చేస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇళ్లస్థలాలు, రేషన్‌కార్డులు, గృహ నిర్మాణ పథకం, ఫించన్లకు వేలల్లో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక సమస్యల పరిష్కారంపై అనేక గ్రామసభల్లో ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు. స్వయానా అధికార పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గం పరిధిలో జరిగే జన్మభూమి కార్యక్రమానికే అధికారులు గైర్హాజరు కావడం గమనార్హం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో 26వ డివిజన్‌లో గురువారం జరగాల్సిన జన్మభూమి కార్యక్రమానికి ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి హాజరయ్యారు. ఆయనతో పాటు పలువురు పార్టీ నేతలు తరలివచ్చారు. అయితే మునిసిపల్ అధికారులు కార్యక్రమానికి రాకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని జన్మభూమి సభలు నిర్వహిస్తుంటే అధికారులు గైర్హాజరు కావడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రజలకు జవాబుదారీ కావాల్సిన మునిసిపల్ అధికారులు రానప్పుడు సభలు నిర్వహించటం ఎందుకంటూ వెనుతిరిగి వెళ్లారు. అంతేకాదు సభకు హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారు. కాగా అధికార పార్టీ ప్రాతినిధ్యం వహించని నియోజకవర్గాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు జన్మభూమి కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిలదే పెత్తనంగా మారింది. దీంతో ఏకపక్షంగా నిర్వహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

జలయజ్ఞం వంచన కాదా?
* జగన్‌పై మంత్రి ఉమ విసుర్లు

గుంటూరు, జనవరి 5: వైఎస్ హయాంలో జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చి కమీషన్లు దండుకోవటం ప్రజలను వంచించటం కాదా? అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. సీమకు నీరిచ్చి ఘనత వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అర్థరహిత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ఆరోపణలపై గురువారం ఆయన స్పందిస్తూ ముందు తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ హయాంలో 80 శాతం ప్రాజెక్టులను పూర్తిచేశారో, నిధులు కాజేశారో తేల్చాలన్నారు. ప్రాజెక్టులపై 95వేల కోట్లు ఖర్చుచేశారని చెప్తున్న జగన్ చుక్కనీరు ఎందుకు ప్రవహించలేదో వివరించాలన్నారు. కమీషన్ల కక్కుర్తితో మొదటి, రెండో ప్రాధాన్యతలైన స్పిల్‌వే, రాక్‌ఫిల్ డాం, భూసేకరణ, పునరావాస ప్యాకేజీలను ఎందుకు నిర్లక్ష్యం చేశారో ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. గండికోట, పులిచింతల రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా పనులు చేపట్టకుండా పదేళ్లపాటు తాత్సారం చేశారని ఆరోపించారు. గాలేరు-నగరి ప్రాజెక్టుకు కీలకమైన అవుకు టనె్నల్‌ను ఎందుకు నిర్మించలేదన్నారు. కృష్ణా, గోదావరి జలాల పంపిణీ, ముంపు మండలాలను ఎపిలో కలిపే విషయాల్లో అడ్డుపడిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వైఖరిని జగన్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. దీనిపై ఎంపిగా ఉన్న జగన్ లోక్‌సభలో ప్రస్తావించక పోవటం ప్రజలకు తెలుసన్నారు. కృష్ణానది మిగులు జలాలు కోరబోమని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు లేఖ రాసింది వైఎస్ అవునో, కాదో చెప్పాలన్నారు. తెలుగుగంగను వైఎస్ అడ్డుకుంటే పట్టిసీమను జగన్ అడ్డుకున్నారని, రాయలసీమ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసింది తండ్రీ కొడుకులే అని ధ్వజమెత్తారు. మీరు చేసిన దోపిడీపై ఆత్మవిమర్శ చేసుకోకుండా చంద్రబాబు కష్టాన్ని క్యాష్ చేసుకుంటూ ప్రాంతాలు, రైతుల మధ్య చిచ్చుపెట్టటం మానుకోవాలని జగన్‌కు మంత్రి ఉమ హితవు పలికారు.

నిడమర్రు గ్రామసభలో
సమస్యలపై నిలదీసిన జనం
మంగళగిరి, జనవరి 5: జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని నిడమర్రులో గురువారం సర్పంచ్ మండెపూడి మణెమ్మ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో పలు సమస్యలపై అధికారులను ప్రజలు నిలదీశారు. సమావేశం ప్రారంభం కాగానే జన్మభూమి సభకు విద్యార్థులను ఎందుకు తీసుకొచ్చారని ఎంపిటిసి సభ్యులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ఎంపిడివో పద్మావతి స్పందిస్తూ 8, 9 తరగతుల విద్యార్థులను మాత్రమే తీసుకురావాలని కోరామని, సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నందున ఉపాధ్యాయులు కింది తరగతులకు చెందిన పిల్లలను కూడా తీసుకొచ్చారని బదులిచ్చారు. విద్యార్థులను పాఠశాలలకు పంపించేయాలని పలువురు కోరగా అధికార్లు పంపించేశారు. అనంతరం రేషన్ కార్డుకు 500 నుంచి వేయి రూపాయల వరకు వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపించారు. రెవిన్యూ అధికారులు మాట్లాడుతూ 10 రూపాయల కంటే ఎక్కవ ఎవరికీ ఇవ్వద్దని, ఎవరైనా డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలని సూచించారు. రాజధాని కోసం భూములిస్తే వ్యవసాయ కూలీలకు పెన్షన్ ఇవ్వడం లేదని పలువురు అధికారులను నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యే ఉండగా జన్మభూమి సభకు ఇన్‌చార్జ్‌గా కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయను ఎందుకు నియమించారని గ్రామ ఉప సర్పంచ్ ఉయ్యూరు వెంకటరెడ్డి నిలదీశారు. రామానుజయను నియమించినట్లు తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని, పత్రికల్లో వచ్చినవాటికి తాము జవాబివ్వలేమని ఎంపిడివో పద్మావతి స్పష్టం చేశారు. జెడ్పీటిసి సభ్యుడు ఆకుల జయసత్య మాట్లాడుతూ నిడమర్రు అభివృద్ధికి 50 లక్షల రూపాయల నిధులు సిఆర్‌డిఎ మంజూరు చేసిందని, ఈ నెలాఖరుకు విడుదల అవుతాయని చెప్పారు. రేషన్‌కార్డులు మంజూరైన లబ్ధిదారులకు వాటిని అందజేశారు. చిన వడ్లపూడిలోనూ జన్మభూమి- మా ఊరు సభ నిర్వహించారు. సమస్యలపై అధికారులు నిలదీస్తున్నప్పుడు నిడమర్రు సభలో పోలీసులు అడ్డుతగలడంతో వైసీపీ నేతలు వారితో వాగ్వివాదానికి దిగారు. సమస్యలు చెప్పుకోనివ్వరా అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘అమరావతి మారథాన్’కు విస్తృత ఏర్పాట్లు
గుంటూరు (స్పోర్ట్స్), జనవరి 5: విజయవాడలో ఈ నెల 8న జరిగే అమరావతి మారథాన్ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. మారథాన్ నిర్వహణపై గురువారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. రిలయన్స్ జియో సహకారంతో డీప్ ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ అమరావతి మారథాన్‌ను నిర్వహిస్తోందన్నారు. నూతన రాజధాని అమరావతిలో 8న జరిగే మారథాన్ రెండోదని ఆయన చెప్పారు. గత ఏడాది జనవరిలో రెండో ఆదివారం నిర్వహించిన మారథాన్‌లో సుమారు 15వేల మంది భాగస్వాములై విజయవంతం చేశారని తెలిపారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం నుండి ఉదయం 5గంటలకు ప్రారంభమై ప్రకాశం బ్యారేజీ మీదుగా వెంకటపాలెం వద్ద ఉన్న మంతెన సత్యనారాయణరాజు ఆసుపత్రి వరకు వెళ్లి తిరిగి ప్రారంభ స్థలికి చేరుకుంటుందన్నారు. ఈ మారథాన్‌లో 3కె, 5కె, 10కె, 21కె కేటగిరిలు ఉంటాయని, భాగస్వాములందరికీ టీషర్టు, స్నాక్స్, తదితర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నూతన రాజధాని అమరావతి పేరుపై మారథాన్ నిర్వహించడం హర్షణీయమని దండే అన్నారు. జిల్లా అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మాట్లాడుతూ గత సంవత్సరం నిర్వహించిన మారథాన్‌లో పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారని, ఈ నెల 8న జరిగే అమరావతి మారథాన్‌లోనూ మరింత ఎక్కువ సంఖ్యలో భాగస్వాములై రాజధాని అమరావతికి మంచిపేరు తేవాలని కోరారు. రిలయన్స్ జియో ఆంధ్రప్రదేశ్ సిఇవో ఎం మహేష్‌కుమార్ మాట్లాడుతూ అమరావతి మారథాన్‌లో భాగస్వామ్యం దక్కడం సంతోషదాయకమన్నారు. ఆరోగ్యకరమైన సమాజానికి మారథాన్ కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 50 మారథాన్లలో పాల్గొన్న గుంటూరు జిల్లా, శలపాడు గ్రామవాసి కిరణ్మయి మాట్లాడుతూ మంచి ఆరోగ్యానికి మారథాన్ ఎంతో ఉపయోగకరమన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి కె నాగబాబు, జిల్లా పరిషత్ సిఇవో ఎస్ వెంకటసుబ్బయ్య, జిల్లా విద్యా శాఖాధికారి కెవి శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.

భూసేకరణను అంగీకరించం
* రైతుల స్పష్టీకరణ
తాడేపల్లి, జనవరి 5: 2013 భూసేరణ చట్టానికి సవరణ చేస్తూ కేబినెట్ ఆమెదం తెలపటం, తదుపరి ఆమోదం కోసం అసెంబ్లీకి పంపటాన్ని నిరసిస్తూ రాజధాని పరిధిలోని ఉండవల్లి, పెనుమాక గ్రామాల రైతులు గురువారం ఉండవల్లి సెంటర్‌లోని రైస్‌మిల్ వద్ద సమావేశమయ్యారు. ఈసందర్భంగా రైతు సంఘం నాయకుడు జొన్న శివశంకర్ మాట్లాడుతూ అధికారులు ఇప్పటివరకూ గ్రామకంఠాల సమస్యలను తేల్చలేదని నిరసన తెలిపారు. ఈ రెండు గ్రామాల్లో రైతులు భూసమీకరణకు భూములివ్వలేదని, రైతులు నిరాకరించిన భూములను వదిలేసి, రైతులు ఇప్పటికే ఇచ్చిన భూముల్లో రాజధాని నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.

సామాజిక సేవలో ధన్యజీవి పరమహంస
గుంటూరు (కల్చరల్), జనవరి 5: ఎవరికి వారు చేతనైన రీతిలో తోటివారికి, అంతకుమించి సమాజంలోని దీనులు, పేదలకు నిస్వార్థ సేవలు అందిస్తారో వారి జీవితం ఎప్పుడూ ధన్యమవుతుందని స్వామి పరమహంస యోగానందజీ తమ ప్రబోధాల ద్వారా మానవాళికి సెలవిచ్చారని పలు రంగాల ప్రముఖులు అంజలి ఘటించారు. గురువారం నగరంలోని అరండల్‌పేటలో భక్తిశ్రద్ధలతో జరిగిన శ్రీ పరమహంస యోగానందజీ స్వామివారి శత వసంతాల ప్రారంభోత్సవ వేడుకల్లో తొలుత అతిథులంతా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. యోగద సత్సంగ ధ్యానమండలి గుంటూరు శాఖ ఆధ్వర్యాన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. జ్యోతిప్రజ్వలన చేసిన భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపకులు బొల్లేపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ యోగానంద జీవితం నిస్వార్థ త్యాగమయమన్నారు. సామాన్యుడిగా జన్మించి అసామాన్యుడై ఆధ్యాత్మిక జగత్తులో తనదైన ప్రత్యేకతను స్వామీజీ చాటుకున్నారన్నారు. ప్రబోధాలకన్నా ఆచరణాత్మకమైన సేవ ముఖ్యమని వారు నిరూపించారని నెహ్రూనగర్ శేషాచల ఆశ్రమాధిపతి శ్రీ నిర్వికల్పానంద గిరి స్వామీజీ ప్రశంసించారు. ఉత్సవంలో భాగంగా ప్రభాత సింధూరి విద్యాసంస్థ విద్యార్థుల విద్యాభివృద్ధికి, ఇతర సౌకర్యాల కోసం 30 వేల రూపాయల చెక్కును అందజేశారు. పండ్లు, నూతన వస్త్రాలను సంపత్‌నగర్‌లోని శృంగేరీ వృద్ధాశ్రమానికి అందజేశారు. యోగద సత్సంగ ధ్యానమండలి కార్యదర్శి డాక్టర్ బలభద్రపాత్రుని రాఘవరావు మాట్లాడుతూ పరమహంస శతవసంతాల ఉత్సవాలు మార్చి 22 వరకూ జరుగుతాయని, ఈసందర్భంగా విభిన్న సేవా కార్యక్రమాలు నిర్వహంచనున్నామన్నారు. డి సుబ్బారావు, డాక్టర్ బి వరలక్ష్మి, పలువురు భక్తులు పాల్గొన్నారు.

బాక్సింగ్ ఛాంప్స్ గుంటూరు, విజయనగరం జట్లు
గుంటూరు (స్పోర్ట్స్), జనవరి 5: జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్టస్థ్రాయి గ్రూప్-5 అండర్- 14,17 బాలబాలికల బాక్సిం గ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో అండర్-14 బాలికల విభాగంలో 15 పాయింట్లతో గుం టూరు జట్టు, బాలుర విభాగంలో 14 పాయింట్లతో విజయనగరం జట్టు ఛాంపియన్‌షిప్ ట్రోఫీలను కైవసం చేసుకున్నాయి. ద్వితీయ, తృతీయ స్థానాల్లో బాలికల్లో 14 పాయింట్లతో విశాఖపట్నం, 8 పాయింట్లతో తూర్పు గోదావరి నిలిచాయి. బాలురలో 14 పాయింట్లతో విశాఖపట్నం, 11 పాయింట్లతో గుంటూరు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. అండర్-17 బాలుర విభాగంలో వరుసగా 21 పాయింట్లతో శ్రీకాకుళం, 16 పాయింట్లతో విశాఖపట్నం, 6 పాయింట్లతో కడప, బాలికల్లో 13 పాయింట్లతో విశాఖపట్నం, 10 పాయింట్లతో తూర్పు గోదావరి, 9 పాయింట్లతో సంయుక్తంగా కడప, విజయనగరం జట్లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేత జట్లకు ఛాంపియన్ షిప్ ట్రోఫీలను, వ్యక్తిగత క్రీడాకారులకు పతకాలను, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారుల ఓటమి చెందితే నిరాశ పడకుండా గెలుపునకు బాటలుగా మళచుకోవాలన్నారు. కృషి, పట్టుదలతోనే పతకాలు సాధించగలరన్నారు. మరో అతిథి కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ రాష్ట్ర పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు. పోటీల నిర్వాహక కమిటీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి శ్రీనివాసరావు, స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి సంపత్‌కుమార్, ఓఎస్‌డి పి రామకృష్ణ, శిక్షకుడు విశ్వనాథ్, బిఆర్ స్టేడియం, ఎన్‌టిఆర్ స్టేడియం శిక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.

బీసీల సమస్యల పరిష్కారానికి కృషి
* జెల్లి మధుసూదన్
గుంటూరు, జనవరి 5: రానున్న కాలంలో బలహీన వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తూ అన్నివర్గాల వారిని కలుపుకుని సమష్ఠికృషితో బిజెపిని అభివృద్ధి పధంలోకి తీసుకెళ్తామని ఆ పార్టీ ఓబిసి సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జెల్లి మధుసూదన్ అన్నారు. గురువారం పార్టీ నగర కార్యాలయంలో ఓబిసి సెల్ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎం కనకారావు (విశాఖ), జె రామ్మోహనరావు (గుంటూరు రూరల్), సిహెచ్ సుశీలమ్మ (గుంటూరు కార్పొరేషన్), వి సుబ్రహ్మణ్య యాదవ్ (చిత్తూరు), బి శివప్రసాద్ (ప్రకాశం), ప్రధాన కార్యదర్శులుగా పాలపాటి రవికుమార్ (గుంటూరు కార్పొరేషన్), కె సురేష్‌కుమార్ (రాజమండ్రి కార్పొరేషన్), రాచూరి రాధాకృష్ణ (కడప), కార్యదర్శులుగా బివి శివన్నారాయణ (గుంటూరు రూరల్), పివివి నాగరాజు (రాజమండ్రి కార్పొరేషన్), బి శ్యాంబాబు (నెల్లూరు), ఎం నాగేంద్రకుమార్ (గుంటూరు రూరల్), జి రోశయ్య (నెల్లూరు), ఎం మల్లేశ్వరి (విజయవాడ కార్పొరేషన్), యు సుజాత రాజ్ (విశాఖ కార్పొరేషన్), కోశాధికారిగా కెవి శివప్రసాద్ (కడప) లను నియమించినట్లు మధుసూదన్ పేర్కొన్నారు.