గుంటూరు

ఐకమత్యంతో మెలగండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యడ్లపాడు, జనవరి 13: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా ఐకమత్యంతో ఉండాలని, అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. విభేదాలకు తావిచ్చి ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వవద్దని కోరారు. యడ్లపాడు మండలం జగ్గాపురం గ్రామంలో శుక్రవారం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గంలో మరో పార్టీ జెండా ఎగిరే అవసరం లేకుండా కృషిచేస్తున్నానని, అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కోరినన్ని నిధులు మంజూరు చేయిస్తున్నామని మంత్రి ప్రత్తిపాటి అన్నారు. రానున్న ఎన్నికల్లో అవినీతికి నిలయమైన ప్రతిపక్ష నాయకులకు అధికారం ఇవ్వవద్దని చంద్రబాబుకు మద్దతునివ్వాలని కోరారు. అభివృద్ధి కార్యక్రమాల కొనసాగింపు కోసం తెలుగుదేశం పార్టీకి మరోసారి మద్దతు ఇవ్వాలన్నారు.
జగ్గాపురంలో ముగ్గురు మంత్రుల పర్యటన..
జగ్గాపురం గ్రామంలో శుక్రవారం ముగ్గురు మంత్రులు పర్యటించారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, సమాచార పౌర సంబంధాలు, మైనార్టీ సంక్షేమ శాఖ పల్లె రఘునాధరెడ్డి, విద్యాశాఖ గంటా శ్రీనివాసరావులు గ్రామంలో 9 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన పలు నిర్మాణాలకు ప్రారంభోత్సవం చేశారు. హిందూ శ్మశానవాటిక, ఎస్సీ కాలనీలో శ్మశానవాటిక, ఎస్టీ, బిసి కాలనీల్లో సిమెంటు రోడ్లు, కాల్వలను ప్రారంభించారు. పశువైద్యశాల భవన నిర్మాణానికి, పొలాల్లోకి వెళ్లే రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రులకు తెలుగు యువత భారీ మోటారుసైకిల్ ర్యాలీతో స్వాగతం పలికింది. కార్యక్రమంలో ఉద్యాన విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యుడు పోపూరి శివరామకృష్ణ, చిలకలూరిపేట మున్సిపల్ చైర్‌పర్సన్ గంజి చెంచుకుమారి, మార్కెట్ కమిటీ చైర్మన్ నెల్లూరి సదాశివరావు, రాష్ట్ర తెలుగురైతు ఉపాధ్యక్షుడు ఆలోకం సత్యనారాయణ, టిడిపి మండల శాఖ అధ్యక్షుడు స్థానికులు, ముద్దన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

నయనానందకరంగా శ్రీ గోదారంగనాధుల ‘తిరు’ కళ్యాణోత్సవం
* విష్ణు మందిరాలకు వేలాదిగా తరలివచ్చిన భక్తజనం
గుంటూరు (కల్చరల్), జనవరి 13: ధనుర్మాస వ్రతం ఆచరిస్తే సాక్షాత్తు శ్రీ రంగనాధుడి కైంకర్యానికి జీవితాన్ని అంకితం చేసుకోవచ్చని, భక్తిశ్రద్ధలతో ఈ విశిష్ఠ వ్రతాన్ని ఆచరించి, తాను తరించి, లోకానికి మహోపకారం చేసిన శ్రీ గోదాదేవిని స్మరించుకుంటూ శ్రీగోదారంగనాథుల తిరు కళ్యాణోత్సవాన్ని శుక్రవారం నగరంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా నగరంలోని అన్ని డివిజన్లలో గల 21 విష్ణు మందిరాలన్నింటికీ వేలాదిగా భక్తులు ప్రభాతవేళలోనే తరలివచ్చారు. సంప్రదాయ వస్త్రాలను ధరించి స్వయంగా తిరుప్పావై పాశురాలను పఠిస్తూ, ఆచార్య స్వామివార్ల నిర్దేశకత్వంలో నాలుగు గంటలకు పైగా శ్రద్ధాశక్తులతో ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ముఖ్యంగా కృష్ణనగర్‌లోని సుందర శ్రీ లక్ష్మీనారాయణ మందిరంలో ప్రసిద్ధ ఆధ్యాత్మిక వేత్త శ్రీమాన్ ధనకుదరం సీతారామానుజాచార్య స్వామి స్వీయపర్యవేక్షణలో శ్రీ గోదా ఆండాళ్‌తల్లి రంగనాథుల కళ్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. విభిన్న రకాల పుష్పాలతో ఉత్సవ వేదికను రమణీయంగా తీర్చిదిద్ది, ఉత్సవ మూర్తులను సర్వాభరణాలతో నేత్రపర్వంగా అలంకరించారు. మొట్టమొదటగా విష్వక్సేనారాధన అనంతరం పుణ్యాహవచనం, గోదారంగనాధుల ఇరువరుల ప్రవరలు పటించిన భద్రాచలం, శ్రీ సీతారామచంద్రమూర్తుల దేవస్థానం నుంచి విచ్చేసిన ఉపప్రధాన అర్చకస్వాముల బృందం, పాంచరాత్ర ఆగమ సంప్రదాయంలో ఈ కళ్యాణోత్సవాన్ని శ్రీరంగం, భద్రాచల క్షేత్రంలో నిర్వహించేలాగా జరిపింది. ఉత్సవానికి ప్రత్యేకంగా మానస సరోవరం నుంచి భక్తులు తీసుకువచ్చిన సరోవర పుణ్యతీర్ధాన్ని, 40 తీర్ధాల పవిత్ర జాలాలను మూలవరులు, ఉత్సవ మూర్తులకు అభిషేకించారు.
భక్తులకు జయం కలగాలని ఆచార్య స్వాములు మంగళాశాసనాలు చేశారు. కృష్ణనగర్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో కూడా ధనకుధరం శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో గోదారంగనాధుల కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆర్ అగ్రహారం లక్ష్మీనరసింహ సన్నిధి, వెంకటేశ్వర స్వామి ఆలయం, అరండల్‌పేటలోని మోహన రంగనాయక స్వామి దేవస్థానం, పాత గుంటూరులోని పలు దేవాలయాలు, ఎస్‌విఎన్ కాలనీ శ్రీనివాసుని సన్నిధిలో కూడా గోదారంగనాధుల తిరు కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది.

గుర్తుతెలియని వ్యక్తులచే బేకరీ దగ్ధం
మంగళగిరి, జనవరి 13: పట్టణంలోని ఆర్‌టిసి బస్‌స్టేషన్ ఎదుట గల ఒక బేకరీలో శుక్రవారం తెల్లవారుఝామున అగ్ని ప్రమాదం సంభవించి దగ్ధమైంది. గుర్తుతెలియని వ్యక్తులు బేకరీకి నిప్పంటించారని బాధితుడు పట్టణ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశాడు. బేకరీలో ఉన్న తినుబండారాలు, కూల్‌డ్రింకులు అగ్నికి ఆహుతయ్యాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వ్యాపారుల మధ్య నెలకొన్న పోటీవలన బేకరీ దగ్దమైనట్లు స్థానికుల కధనంగా ఉంది.
ఉత్సాహంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు
మంగళగిరి, జనవరి 13: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పట్టణ, పరిసర గ్రామాల్లోను శుక్రవారం సంక్రాంతి ముగ్గుల పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. మండల పరిధిలోని ఎర్రబాలెం శ్రీరామానగర్ కాలనీలో శ్రీ లలితా సత్సంగా సేవా మండలి ఆధ్వర్యాన ముగ్గుల పోటీలు నిర్వహించారు. జడ్‌పిటిసి మెంబర్ ఆకుల జయసత్య న్యాయనిర్ణేతగా ఉండి విజేతలను ఎంపిక చేశారు. కె సుగుణ, లలిత, లీల, బి వెంకటరత్నం, నాగలక్ష్మి, కామాక్షి, గాయత్రి, దేవి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని ఆర్‌ఆర్ టవర్స్‌లో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. స్నేహ మహిళా మండలి అధ్యక్షురాలు వల్లభనేని వాణి న్యాయనిర్ణేతగా వ్యవహరించి విజేతలను ఎంపిక చేసి బహుమతులను అందజేశారు. ఆత్మకూరులో డివైఎఫ్‌ఐ ఆధ్వర్యాన ముగ్గుల పోటీలు నిర్వహించారు.

కోర్టు ఆవరణలో భోగి మంటలు
సత్తెనపల్లి, జనవరి 13:స్థానిక తాలూకా కోర్టు పరిధిలో శుక్రవారం సత్తెనపల్లి బార్ అసోసియోషన్ ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిధిగా సీనియర్ సివిల్ జెడ్జి ఎ సాల్మన్, బార్ అధ్యక్షుడు కొల్లా వెంకటేశ్వరరావు, చిత్తూరు నాలుగవ అదనపు జూనియర్ సివిల్ జెడ్జి పీసపాటి భరద్వజ్, పూజల చినవెంకటకోటయ్య, గంగూరి అజయ్, చలపతిరావు, వెంకటేశ్వరరావు, తదితర న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి కె అనురాధ బహుమతులను అందజేశారు.

సంస్కృతి, సంప్రదాయాలే జాతి విలువలకు పట్టుకొమ్మలు
గుంటూరు (కల్చరల్), జనవరి 13: తరతరాలుగా మానవీయ అభ్యుదయానికి అంతకుమించి జాతి జీవన వికాసానికి ప్రాచీనమైన మన సంస్కృతి, సంప్రదాయాలే పట్టుకొమ్మలుగా నిలిచిపోతున్నాయని, వీటికి ఆచరించి పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి నగరంలోని ఎన్‌టిఆర్ స్టేడియంలో జరిగిన భోగి, సంక్రాంతి సంబరాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు, అంతకుమించి గోమాత సేవకు అధిక ప్రాధాన్యతనిచ్చే ఆవు పిడకల ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా నిర్వాహకుల ఆధ్వర్యంలో లక్ష పిడకలను కొవ్వొత్తితో వెలిగించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టేలా రాష్ట్రప్రభుత్వం మన కళా పరిరక్షణకు పెద్దపీఠ వేస్తుందని, ప్రజలందరి సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన అన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలను అందరికీ తెలియజేశారు. నూతన అమరావతి రాజధానిలో నవ్యాంధ్రప్రదేశ్ ప్రగతిపధాన పురోగమించాలని, అందుకు ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అవసరమన్నారు. ఉత్సవంలో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, మార్కెట్‌యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు పలువురు పార్టీ నాయకులు, ఎన్‌టిఆర్ స్టేడియం కార్యినిర్వాహక సభ్యులు పాల్గొని ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
మానవ హక్కుల పరిరక్షణ వేదిక ఏర్పాటు

మంగళగిరి, జనవరి 13: పట్టణంలోని వాణి మోడల్ స్కూల్ ప్రాంగణంలో శుక్రవారం పిడిఎస్‌ఓ, ఎన్‌వైఎస్ ఆధ్వర్యాన ఉపాధ్యాయులు , ప్రజాసంఘాలు, వృత్తి సంఘాలు, ప్రజాతంత్ర వాదుల సమావేశం నిర్వహించారు. మానవ హక్కుల పరిరక్షణ వేదిక ఏర్పాటయింది. వి దుర్గాప్రసాద్ అధ్యక్షత వహించారు. పిడిఎస్‌ఓ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ బాజీసైదా మాట్లాడుతూ వేయి, 500 రూపాయల నోట్లు రద్దుతో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని, పాలకులు ప్రజల హక్కులను హరించి వేస్తున్నారని, విద్యా, వైద్యం, ఉపాధి సాంస్కృతిక రంగాలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించి వారు దోపిడీ చేసుకునేందుకు వీలుగా ప్రజలను బలవంత పెడుతున్నారని, అందులో భాగమే నగదు రహిత లావాదేవీలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పడిన మానవ హక్కుల పరిరక్షణ వేదిక ద్వారా సంఘటిత శక్తిగా పనిచేద్దామని ఆయన అన్నారు. స్టీరింగ్ కమిటీగా కొల్లి నాగేశ్వరరావు, అప్పికట్ల శ్రీహరినాయుడు, వివి ప్రసాద్, పిల్లలమర్రి నాగేశ్వరరావు, ఎస్‌కె బాజీసైదా, కారుమంచి రామారావు, దుర్గాప్రసాద్, రామనాధం పూర్ణ, సుధాకర్, కోటయ్య, అమర్‌నాధ్, బాలకృష్ణ, పాపారావు తదితరులు ఎన్నికయ్యారు. ఈనెల 24న మంగళగిరిలో నోట్ల రద్దు, నగదు రహిత లావాదేవీలపై సదస్సు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది.

సాంఘిక నాటకాలకు పట్టుకొమ్మ గుంటూరు
* సమైక్యపధాన నడిపించే రచనలు రావాలి
* కళాపరిషత్ నాటకోత్సవాల ముగింపు సభలో ప్రముఖులు
గుంటూరు (కల్చరల్), జనవరి 13: తొలినాళ్ల నుంచి కూడా కళలకు కాణాచి అయిన గర్తపురి సాంఘిక నాటకాలకు పట్టుకొమ్మ అయ్యిందని విజయవాడ నగర మాజీ డిప్యూటీ మేయర్ సుమధుర కళాపరిషత్ అధ్యక్షుడు సామంతపూడి నర్సరాజు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గుంటూరు కళాపరిషత్ ఆధ్వర్యాన మూడు రోజులుగా జరుగుతున్న 21వ వార్షిక నాటకోత్సవాల ముగింపు సభలో ఆయన గౌరవ అతిథిగా మాట్లాడారు. సభకు పరిషత్ గౌరవాధ్యక్షుడు ఆలోకం పెద్దబ్బయ్య అధ్యక్షత వహించారు. నర్సరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న కళాపరిషత్‌లన్నింటిలో నాటకరంగానికి ద్విగుణీకృతమైన సేవలందిస్తున్న వేళ్లమీద లెక్కపెట్టగల్గిన సంస్థల్లో గుంటూరు కళాపరిషత్ 21వ సంవత్సరాలుగా తనదైన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూనే ఉందన్నారు. ఇదివరకు విజయవాడ, గుంటూరు అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాల్లో ఒకదానికొకటి పోటీగా ఉండేవని, ఇప్పుడు అమరావతి రాజధానిగా రూపుదిద్దుకోవడంతో రెండూ ఇకముందు ఒకటిగానే కళాసేవలు కొనసాగిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. విశిష్ఠ అతిథి ప్రజాసాహతీ సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు మాట్లాడుతూ ప్రజలను అనునిత్యం చైతన్యవంతులను చేసే రచనలు అందించాలని, అంతేకాకుండా సమైక్యపధాన పురోగమింపజేసే ఆలోచనలు కలిగించే కధాంశాలను ఎంచుకుని ముందుకు సాగాలని ఆయన సూచించారు. వార్షిక నివేదికను అందించిన గుంటూరు కళాపరిషత్ ప్రధాన కార్యదర్శి బండ్ల పూర్ణ ఇన్ని సంవత్సరాలుగా కళాపరిషత్ నాటకోత్సవాలు నిర్వహిస్తుండటానికి ప్రతి కళాభిమాని చేయూతనిస్తూనే ఉన్నారని ధన్యవాదాలు తెలిపారు. రానున్న సంవత్సరాల్లో బాలకళాకారులను ప్రోత్సహిస్తూ నాటకోత్సవాలు నిర్వహించనున్నామని ప్రకటించారు. సభలో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ బి శ్రీరామకృష్ణమూర్తి, సీనియర్ సిటిజన్స్ నాయకుడు నూతలపాటి తిరుపతయ్య, పలువురు ప్రముఖులు ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. సభకు ముందుకు సాగరి చిలకలూరిపేట కళాకారులు ప్రదర్శించిన నల్లజర్ల రోడ్డు సాంఘిక నాటిక ధనం కన్నా మానవత్వం మిన్న అని చాటిచెప్పింది. అనంతరం గణేష్ ఆర్ట్స్ థియేటర్ గుంటూరు వారి అంతా మనసంచికే హాస్యనాటిక ప్రేక్షకులపై నవ్వుల జల్లులు కురిపించింది. గంగోత్రి పెదకాకాని వారి దగ్ధగీతం నాటిక సమాజ స్థితిగతులను ప్రధాన అంశంగా చేసుకుని, ప్రజలందరూ జాగృతం కావాలని సూచించింది. నాటిక దర్శకులను, కళాకారులను సహకరించిన దాతలు, ప్రముఖులు సత్కరించారు. మూడు రోజుల పాటు జరిగిన గుంటూరు నాటక కళాపరిషత్ నాటకోత్సవాలు కళాభిమానుల హర్షధ్వానాల మధ్య ముగిశాయి.