గుంటూరు

అధికారులు నిర్లక్ష్యం వీడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 20: సమాచార హక్కు చట్టం అమలును హైపవర్ కమిటీ పర్యవేక్షించక పోవడంతో అధికారుల్లో చట్టంపై నిర్లక్ష్యం పెరిగి పోతుందని, ఇది సరికాదని రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ పి విజయబాబు పేర్కొన్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన సమాచార హక్కు చట్టం కేసుల విచారణ అనంతరం స్థానిక కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు జిల్లాలకు సంబంధించి మూడు రోజుల్లో 65 కేసులు విచారించినట్లు కమిషనర్ తెలిపారు. ప్రతి మూడు నెలల కొకసారి కమిటీ సమావేశమై సమాచార హక్కు చట్టం అమలు జరుగుతున్న తీరుపై సమీక్షించాల్సి ఉంటుందన్నారు. కార్మికశాఖ అధికారులు సమాచారాన్ని సరైన సమయంలో ఇవ్వకపోగా ఈ చట్టం తమకు వర్తించదన్నట్టు మాట్లాడుతున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రకాశం జిల్లా బెస్తవానిపేటలో ప్రభుత్వానికి చెందిన ఓ స్థలాన్ని ఓ ఎంపిపి ఆక్రమించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. స్థలంలో అక్రమ కట్టడాలు చేస్తుంటే కలెక్టర్‌తో సహా అధికార యంత్రాంగం మిన్నకుండటం ఎందుకో అర్ధం కావడం లేదన్నారు. ప్రకాశం జిల్లా జెసి సమాచార హక్కు చట్టాన్ని పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వంలో జవాబుదారీతనం, పారదర్శకత కోసమే సమాచార హక్కు చట్టాన్ని తెచ్చారని, దీన్ని అధికారులే పట్టించుకోకుంటే ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. చట్టం అమలులోకి వచ్చి పదేళ్లు గడుస్తున్నా చట్టం లక్ష్యాలు నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయంపై సిఎం జోక్యం చేసుకుని హై పవర్ కమిటీతో చట్టం అమలు తీరును పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరతానన్నారు. సమాచారం అడిగినందుకు దాడులు చేసినా, బెదిరించినా, ప్రత్యేక విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జీవో చేసిందని, అధికారులు పట్టించుకోకపోవడం వల్ల అర్జీదారులపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. అధికార యంత్రాంగం ఈ జీవో అమలుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విజ్ఞప్తి చేయనున్నట్లు వెల్లడించారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటే ఆయుధం
* కలెక్టర్ కాంతిలాల్ దండే

గుంటూరు, జనవరి 20: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఒక ఆయుధమని, ఓటు హక్కును సక్రమంగా వినియోగించి పటిష్ఠమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే పేర్కొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓటరు నమోదు ప్రక్రియ, ఓటుహక్కు ఆవశ్యకతపై విస్తృత ప్రచారం కల్పించడంలో భాగంగా శుక్రవారం స్థానిక ఏటి అగ్రహారంలోని ఎస్‌కెబిఎం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలను, స్తంభాల గరువు వద్ద చేబ్రోలు మహాలక్ష్మి పుల్లయ్య నగరపాలక ఉన్నత పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. ఓటు హక్కు నమోదు, ఓటు హక్కు ఆవశ్యకత, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు విలువ, ఓటు వినియోగం తదితర అంశాలపై విద్యార్థులతో మాట్లాడి, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని, జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ సందర్భంగా ఎంపవరింగ్ యంగ్ అండ్ ఫ్యూచర్ ఓటర్స్ అనే నినాదంతో ముందుకు పోతున్నట్లు కలెక్టర్ తెలిపారు. యువ భవిష్యత్ ఓటర్ల సాధికారతే జాతీయ ఓటర్ల దినోత్సవం లక్ష్యమని, 18 ఏళ్ల వయస్సు దాటిన వారంతా ఓటర్లుగా నమోదు చేయించుకోవాలని తెలిపారు. ప్రతిపౌరుడు ఓటు హక్కు విలువ, ఆవశ్యకత గురించి, మంచి నాయకత్వానికి ఓటు వినియోగించినట్లైతే దేశంలో ప్రతిష్టమైన నాయకత్వం ఏర్పడి, ప్రజాస్వామ్యం నాణ్యత పెరగడానికి దోహదపడుతుందని విద్యార్థులకు తెలియజేశారు. జిల్లాలోని అన్ని పోలింగ్ బూత్‌ల వద్ద ఓటరు నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తారు, ఎందుకు 18 సంవత్సరాలు నిండితేనే ఓటు హక్కుకు అర్హత అని విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ వివరణ ఇచ్చి సందేహాలను నివృత్తిచేశారు. కార్యక్రమంలో గుంటూరు రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.