గుంటూరు

జగన్ రాష్ట్రానికి పట్టిన అరాచక శక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలకలూరిపేట, జనవరి 20: ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంటే, చెడ్డపేరు తెచ్చేందుకు ప్రతిపక్ష వైఎస్ జగన్మోహనరెడ్డి అరాచకశక్తిగా తయారయ్యారని హోం మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ధ్వజమెత్తారు. శుక్రవారం చిలకలూరిపేట పట్టణంలో జరుగుతున్న ఒంగోలు జాతి జాతీయ ఎడ్ల బండలాగుడు పోటీలను తిలకించడానికి విచ్చేసిన చినరాజప్ప అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్‌పై విరుచుకుపడ్డారు. రాజధానికి 2 వేల ఎకరాలే సరిపోతాయని అంటున్న జగన్, తన ఇంటికి మాత్రం 40 ఎకరాలు ఎలా అవసరమో చెప్పాలన్నారు. అవగాహన లేని ప్రతిపక్ష నాయకుడు ఉండటం ఈ రాష్ట్ర దౌర్భాగ్యమన్నారు. రైతు భరోసా యాత్రలంటూ కార్యక్రమాలు పెట్టి అవాకులు చవాకులు పేలుతున్నారని, రైతులకు అండదండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విమర్శించడం జగన్ కుసంస్కారానికి నిదర్శనమన్నారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పినా జగన్‌లో మార్పు రాలేదని, చివరకు ప్రతిపక్షంలో కూడా జగన్ కొనసాగబోడని ఎద్దేవాచేశారు.

ఒంగోలు జాతి ఎడ్ల సంపదను కాపాడుకోవాలి
* మంత్రి పురిటాల సునీత
చిలకలూరిపేట, జనవరి 20: ఒంగోలు జాతి ఎడ్లను పరిరక్షించుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. శుక్రవారం చిలకలూరిపేట పట్టణంలో మూడవ ఎడ్ల పోటీలను సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్ని క్రీడలు ఉన్నప్పటికీ రైతన్నకు నచ్చిమెచ్చే పోటీలు ఎడ్ల పోటీలన్నారు. ఇటువంటి పోటీలను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో నిర్వహించడం, ఒంగోలుజాతి ఎడ్లపై ఉన్న మమకారానికి తార్కాణమన్నారు. ఇటువంటి పోటీలు చిలకలూరిపేట ప్రజలకు గర్వకారణమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు అండదండగా నిలుస్తున్నారని, రైతు రుణమాఫీయే అందుకు నిదర్శనమన్నారు. అనంతపురం జిల్లాలో వర్షాభావం నెలకొన్న ప్రాంతాల్లో రెయిన్‌గన్‌లను ప్రవేశపెట్టి రైతులను ఆదుకున్నారని గుర్తుచేశారు. దివంగత పరిటాల రవికి ఈ పోటీలు అంటే చాలా ఇష్టమన్నారు. ఆమె ప్రసంగిస్తున్నంత సేపు సభలో హర్షధ్వానాలు మార్మోగాయి. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్రాల్లో అనేక ఎడ్ల పోటీలు జరుగుతున్నాయని, తాను తిలకించానని ఈ విధంగా పోటీలను నిర్వహించడం మంత్రి ప్రత్తిపాటికే సాధ్యపడిందన్నారు. రెండో సంవత్సరం కూడా పోటీలను నిర్వహిస్తున్న మంత్రి పుల్లారావును అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ, మున్సిపల్ చైర్‌పర్సన్ గంజి చెంచుకుమారి, మార్కెట్ యార్డు చైర్మన్ నెల్లూరి సదాశివరావు, స్వర్ణాంధ్ర ఫౌండేషన్ చైర్మన్ పేర్ని వీరనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు మల్లెల రాజేష్‌నాయుడు, తోట సత్యనారాయణ, తేళ్ల సుబ్బారావు, అబ్దుల్ కుమీర్, రెహమాన్, తోట బ్రహ్మస్వాములు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్ హయాంలో వైద్యం నిర్వీర్యం
* జగన్ జవాబు చెప్పాలి
* ఎన్టీఆర్ వైద్యసేవ పరిధిలోకి క్యాన్సర్,
కిడ్నీ, గుండె జబ్బులు
* మంత్రి సిద్ధా

గుంటూరు, జనవరి 20: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన హయాంలో వైద్యరంగాన్ని నిర్వీర్యంచేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబు అందరికీ ఆరోగ్య భద్రత లక్ష్యంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి సిద్ధారాఘవరావు అన్నారు. అవగాహనా రాహిత్యంతోనే ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ విమర్శలపై శుక్రవారం రాష్ట్ర టిడిపి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో మంత్రి సిద్ధా తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ఇప్పటి వరకు ఎన్టీఆర్ వైద్య సేవలు పొందుతున్నారని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసమే జగన్ బురదజల్లుతున్నారని మండిపడ్డారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ వైద్యశాలల స్థాయిని పెంచిన విషయం జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. గత ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యంచేసి ప్రజారోగ్యంలో 28వ స్థానానికి దిగజార్చారన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఆపరేషన్ సక్సెస్- పేషెంట్ డెడ్ అనే చందంగా వైద్యరంగాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు. తమ ప్రభుత్వం వైద్యసేవల ఖర్చును రెండు నుంచి రెండున్నర లక్షలకు పెంచిందని గుర్తుచేశారు. 1044 వ్యాధులకు వైద్యం అందుతోందని తెలిపారు. రెండున్నరేళ్లలో ప్రభుత్వం వైద్యానికి 1860 కోట్లు ఖర్చుపెడితే వైఎస్ సర్కార్ 23 జిల్లాలకు 11వందల కోట్లు మాత్రమే కేటాయించిందని చెప్పారు. ఎన్టీఆర్ వైద్యసేవ పథకం వర్తించని వారికి కూడా ప్రభుత్వం బీమా పథకాన్ని అమలు చేస్తోందని వివరించారు. ప్రాణాంతక గుండెజబ్బులు, క్యాన్సర్, కిడ్నీ వంటి వాటికి కూడా వైద్యం అందుతోందని జగన్ గ్రహించాలన్నారు. ప్రకాశం జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కిడ్నీ బాధితుల కోసం కందుకూరు, కనిగిరి, మార్కాపురం డయాలసిస్ కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఫ్లోరోసిస్‌పై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని, ముందుగా డెంటల్ ఫ్లోరోసిస్‌కు సంబంధించి మాత్రలు పంపిణీ చేస్తున్నారని ఉద్ఘాటించారు.వచ్చే ఏడాదికల్లా వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేసి జిల్లాలోని అన్ని ప్రాంతాల మంచినీటి సమస్య తీరుస్తామని ప్రకటించారు.
నా సంగతి తేల్చండి!
* జడ్పీ పీఠానికై లోకేష్‌తో పృధ్వీలత మంతనాలు
గుంటూరు, జనవరి 20: జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు తనకు అవకాశం ఇవ్వాలని అమృతలూరు జడ్పీటిసి డాక్టర్ పృధ్వీలత టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌ను కోరారు. శుక్రవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పృధ్వీలత లోకేష్‌ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. గత రెండున్నరేళ్ల క్రితం జానీమూన్, పృధ్వీలతల మధ్య జడ్పీ పీఠం విషయంలో జిల్లా ముఖ్యనేతలు రాజీఫార్ములా నిర్ణయించారు. వౌఖికంగా కుదిరిన ఈ ఒప్పందం మేరకు జానీమూన్ రెండున్నరేళ్లపాటు జడ్పీ చైర్‌పర్సన్‌గా కొనసాగారు. అయితే ఇప్పుడు తనకు అవకాశం ఇవ్వక పోవటాన్ని పృధ్వీలత ప్రశ్నిస్తున్నారు. బిసి వర్గానికి చెందిన తనకు ప్రాతినిధ్యం కల్పిస్తామని అప్పట్లో పార్టీనేతలు హామీ ఇచ్చారని ఆమె లోకేష్‌కు వివరించారు. కాగా అలాంటి ఒప్పందాలేవీ జరగలేదని జానీమూన్ తన వాదనలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పృధ్వీలత పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై జిల్లా పార్టీ నేతలతో చర్చిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

రావెలపై టిడిపి అధిష్టానం సీరియస్
* లోకేష్‌కు ప్రత్తిపాడు మంతనాలు

గుంటూరు, జనవరి 20: సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తీరుపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్‌గా పరిగణిస్తోంది.. గత కొద్దిరోజుల క్రితం సాక్షాత్తు అధికార పార్టీకే చెందిన జడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్ బహిరంగ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇరువర్గాల మధ్య చిచ్చు రగులుతోంది. దీనికితోడు మరోవర్గం మంత్రి రావెల వ్యవహారశైలిని శంకిస్తూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఫిర్యాదు చేశారు. గత రెండురోజులుగా మంత్రి రావెల సొంత నియోజకవర్గం ప్రత్తిపాడులో రావెల వ్యతిరేక వర్గానికి చెందిన పలు గ్రామాల నేతలు లోకేష్ ఎదుట తమ వాదనలు వినిపించినట్లు సమాచారం. మంత్రి ఒంటెత్తు పోకడలు పోతున్నారని, పార్టీకి అంకితభావంతో పనిచేసే కార్యకర్తలు, నాయకులకు గుర్తింపులేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు. పార్టీకి కట్టుబడి ఉన్నవారిని పక్కనపెట్టి ప్రతిపక్ష పార్టీకి చెందిన వారికి ప్రభుత్వ పథకాలు వర్తింప చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గుంటూరు రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి కార్యక్రమాలను నిర్దేశిస్తున్న లోకేష్ మంత్రి పనితీరుపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించినట్లు తెలిసింది. పార్టీకి పట్టు ఉన్న నియోజకవర్గంలో గ్రూపుల పోరుకు ఆజ్యం పోస్తున్నారని దీనివల్ల నష్టపోవాల్సి వస్తోందని రావెల వ్యతిరేక వర్గీయులు వాదిస్తున్నారు. జడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్‌కు వ్యతిరేకంగా మరో వర్గం రావెలకు మద్దతిస్తోంది. నియోజకవర్గంలో పార్టీ ముక్కచెక్కలు కాకముందే పార్టీ ప్రతిష్టను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని లోకేష్ భావిస్తున్నట్లు తెలిసింది. త్వరలో పార్టీలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని అస్మదీయులకు ఆయన నచ్చచెప్తున్నారు.