గుంటూరు

ప్రజాభిమానముంటే ఓటమి దరిచేరదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొన్నూరు, జనవరి 24: రైతాంగ అభిమాని అయిన మాజీ మంత్రి, దివంగత ధూళిపాళ్ల వీరయ్యచౌదరి స్మృత్యర్ధం ఆ మహానేత 23వ వర్ధంతి సందర్భంగా రైతులకు వ్యవసాయ పరికరాలను పంపిణీ చేయడం ముదావహమని రాష్ట్ర డెప్యూటీ ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి పేర్కొన్నారు. వీరయ్య చౌదరి వర్ధంతి కార్యక్రమంలో భాగంగా పొన్నూరు మండలంలో మంగళవారం జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పొన్నూరు మండల రెవెన్యూ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన ఐసిడిఎస్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం రైతులకు రోటోవేటర్లు, తైవాన్ స్ప్రేయర్లు, మిషన్లు, వరికోత యంత్రాలను పంపిణీ చేశారు. అనంతరం మండల తెలుగుదేశం పార్టీ నేత బొర్రు రామారావు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి కెఇ కృష్ణమూర్తి మాట్లాడుతూ రైతుగా జీవితాన్ని ప్రారంభించి, సంగం డెయిరీ చైర్మన్‌గా, రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రిగా సేవలందించిన స్వర్గీయ వీరయ్యచౌదరి చిరస్మరణీయులన్నారు. రైతాంగ అభిమానిగా ఖ్యాతిగాంచిన వీరయ్యచౌదరి బాటలోనే జనంతో మమేకమై ముందుకు సాగుతున్న ఆయన తనయుడు నరేంద్రకుమార్‌ను కూడా ఐదుసార్లు ప్రజలకు గెలిపించుకోవడం జరిగిందన్నారు. అసెంబ్లీలో మాట్లాడే దిట్టగా గుర్తింపు పొందిన నరేంద్రను ఓ సారి ఎన్నికల్లో గెలిపించి ఢిల్లీకి పంపితే బాగుంటుందని మంత్రి కృష్ణమూర్తి చమత్కరించారు. మహిళా గ్రూపులను ఏర్పాటుచేసి అన్న ఎన్‌టిఆర్ మహిళాభ్యుదయానికి బాట వేయగా మహిళల శ్రేయస్సుకు సిఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రాధాన్యత నిచ్చి ముందుకు సాగుతున్నారన్నారు. డాష్‌బోర్డు ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమస్యలను తెలుసుకుని సత్వరం పరిష్కరిస్తున్న ముఖ్యమంత్రి నిత్యం ప్రజల్లో ప్రకాశించే చంద్రుడిగా గుర్తింపు పొందుతున్నారని మంత్రి కొనియాడారు. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవులు మాట్లాడుతూ తెలుగుతనం మూర్త్భీవించిన మహానేత వీరయ్య చౌదరి తనయుడు నరేంద్రకుమార్ కూడా మంచి నేతగా ప్రజాభిమానం పొందారని కొనియాడారు. శాసనసభ్యుడు డి నరేంద్రకుమార్ ప్రసంగిస్తూ తాను రాజకీయాల్లో కొనసాగినంతకాలం తండ్రి ఆశయాలతో ముందుకు సాగుతానని, ప్రజాభిమానాన్ని నిలుపుకుంటానని హామీ ఇచ్చారు. సభలో రాష్ట్ర కల్లుగీత కార్మికుల సొసైటీ చైర్మన్ తాతా జయప్రకాష్, డిసిఎంఎస్ చైర్మన్ ఇక్కుర్తి సాంబశివరావు, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ శాలిని, ఎంపిపి బొర్రు సీతమ్మ, ఎండిఒ టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సభారంభంలో బ్రాహ్మణకోడూరు, చింతలపూడి, జూపూడి తదితర గ్రామాల్లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కెఇ కృష్ణమూర్తి పాల్గొన్నారు.

ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రూ.32 కోట్లు
* వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పల్లె రఘునాథరెడ్డి
గుంటూరు, జనవరి 24: రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల సంక్షేమానికి 32 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ నుండి 13 జిల్లాల మైనార్టీ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునాథరెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలను ఆదుకోవడంలో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీన విజయవాడలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా 5 వేల మంది ఇమాంలు, మరో 5 వేల మంది వౌజన్లకు రూ.5 వేలు, రూ.3వేలు వంతున గౌరవ వేతనాన్ని చెక్కుల ద్వారా అందజేయనున్నట్లు తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలల మరమ్మతులకు రూ.75 కోట్లు, హాస్టల్స్ మరమ్మతులకు రూ.4.75 కోట్లు, మసీదు మరమ్మతులకు శ్మశాన వాటికల అభివృద్ధికి మరో రూ.8.61 కోట్ల రూపాయలను విడుదల చేశామన్నారు. రాష్ట్రంలోని అన్ని షాదీఖానాల మరమ్మతులకు 11.72 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమానికి 710 కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించిందన్నారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధికి చేపట్టిన పనులు ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

అవగాహనతో రోడ్డు ప్రమాదాల నివారణ

గుంటూరు, జనవరి 24: రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన లేమి కారణంగా రోడ్డు ప్రమాదాలు అధికమై ఎంతోమంది విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. ప్రతి ఏడాది రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడం లేదని ఒకింత అసంతృప్తి వ్యక్తంచేశారు. మంగళవారం స్థానిక పోలీసు కళ్యాణ మండపంలో రవాణాశాఖ ఆధ్వర్యాన 28వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా జరిగిన డ్రైవర్లకు అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రోడ్డు విస్తృతి అధికమై, నాణ్యత పెరిగి, సాంకేతిక ప్రమాణాలు పెరిగి ప్రతి ఏడాది 10 నుండి 15 వేల వరకు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తుండటం బాధాకరమన్నారు. రోడ్డు ప్రమాదాల్లో అధికశాతం అధిక బరువు గల వాహనాలు ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోవడం వల్లే చోటు చేసుకుంటున్నాయన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు గోల్డెన్ అవర్స్‌లో వైద్య చికిత్సకు ట్రామా సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. మరో అతిథి రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ ప్రతి జిల్లాలో అంతర్జాతీయ స్థాయి డ్రైవింగ్ శిక్షణ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. రోడ్డు భద్రతపై ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా ప్రజల్లో మార్పు ద్వారానే శాశ్వత ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ డ్రైవర్ల చేతిలో వారితో పాటు ప్రయాణికుల భవిష్యత్తు కూడా ఉంటుందని గ్రహించి అప్రమత్తతతో వాహనాలు నడపాలన్నారు. వేగాన్ని అదుపుచేసుకోవడం ద్వారా వాహనంతో పాటు మనిషికి కూడా భద్రత ఉంటుందన్నారు. సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటలలోపు రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, ఈ సమయంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం సూచించారు. 58 శాతం ప్రమాదాలకు మితిమీరిన వేగం కారణమని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలన్నారు. తొలుత రహదారి భద్రత చరిత్రకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్, వైద్య శిబిరాలను, రవాణాశాఖ ముద్రించిన కరపత్రాలు, గోడపత్రికలు, డైరీలను స్పీకర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కలెక్టర్ కాంతిలాల్ దండే, జెడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, అర్బన్ ఎస్‌పి సర్వశ్రేష్ట త్రిపాఠి, రోడ్డు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి సుమిత్రా దావరా, ఎపి ఎస్ ఆర్టీసీ ఎండి జగన్నాధం, ఆర్‌ఎం జ్ఞానంగారి శ్రీహరి, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ రాజారత్నం తదితర అధికారులు, డ్రైవర్లు పాల్గొన్నారు.

మహిళతోనే
సమాజాభివృద్ధి
మంగళగిరి, జనవరి 24: మహిళలతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖామంత్రి పీతల సుజాత అన్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని జెమ్స్ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసిన బాలికల ర్యాలీని పట్టణంలో మంగళవారం మంత్రి సుజాత ప్రారంభించి ప్రసంగించారు. బాలికా విద్య ప్రాధాన్యతను, బాల్య వివాహాలను అరికట్టాల్సిన ఆవశ్యకతను, స్ర్తి శిశు సంక్షేమానికి, బాలికల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మంత్రి సుజాత వివరించారు. జెడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, మహిళా శిశుసంక్షేమ ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఎస్ జీవన్‌బాబు, సిడిపిఓ బివిఎస్‌ఎల్ భారతి, అడిషనల్ సిడిపిఓ శైలజ, మున్సిపల్ కౌన్సిలర్లు ఆషాబాల, పద్మజ, ఎఎంసి చైర్మన్ ఆరుద్ర భూలక్ష్మి తదితరులు మాట్లాడారు. పట్టణంలోని ఊర్వశి ధియేటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు బాలికలు ర్యాలీ నిర్వహించారు.

బైబిల్ మిషన్ మహోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
పెదకాకాని, జనవరి 24: 79వ బైబిల్ మిషన్ మహోత్సవాలకు ఏర్పాట్లు పూరె్తైనట్లు బైబిల్ మిషన్ కన్వీనర్ రెవరెండ్ జె శామ్యూల్ కిరణ్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికపరంగా భక్తులు ఇచ్చే విరాళాలతోనే బైబిల్ మిషన్ నడుస్తుందన్నారు. కుల, మత బేధాలు లేకుండా ఈ మహోత్సవాల్లో 79 సంవత్సరాలుగా భక్తులు పాల్గొని సహపంక్తి భోజనాలు చేస్తారని, వచ్చే భక్తులకు ఆర్టీసీ వారు, రైల్వేవారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారని, అంతేగాక రెవెన్యూ, వైద్యశాఖ, పోలీసు శాఖల వారు విస్తృత సేవలు అందిస్తున్నారని తెలిపారు.
గ్యాస్ సిలిండర్ పేలి మహిళకు గాయాలు
అమరావతి, జనవరి 24: అమరావతి మండల పరిధిలోని మునగోడు గ్రామశివారు తురగావారిపాలెంలో మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో పి సీతమ్మ స్వల్పంగా గాయపడింది. దీంతో రేకుల ఇల్లు ధ్వంసమై, ఇంట్లో ఉన్న వంటపాత్రలు, సామాన్లు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో 23 వేల రూపాయల నగదు కూడా దగ్ధమైనట్లు బాధితురాలు వాపోయింది. సర్పంచ్ ఖాజాబీ షరీఫ్ బాధితులను పరామర్శించి ప్రభుత్వపరంగా బాధితులను ఆదుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.
విశిష్ఠమైన విద్యాదానం
అమరావతి, జనవరి 24: దానాల్లో కెల్లా విద్యాదానం మిన్నగా భావించి స్థానిక శ్రీ రామకృష్ణ హిందూ హైస్కూల్‌లో భోజనాల కోసం సుమారు 35 లక్షల రూపాయల వ్యయంతో భోజనశాలను నిర్మించారు. ప్రవాసాంధ్రులు తుమ్మల సురేష్, ఆయన సతీమణి సాలోఖ్యలు మంగళవారం ప్రారంభించారు. స్థానిక వ్యాపారవేత్త విన్నకోట గోపాలరావు ఆర్థిక సహకారంతో 5 లక్షలతో నిర్మించిన వంటగదిని కూడా ప్రారంభించారు. స్కూలు అభివృద్ధికి సహకరించిన దాతలను హైస్కూల్ పాలకమండలి కరస్పాండెంట్ మల్లెల శ్రీనాధ్‌చౌదరి, అధ్యక్షుడు వజినేపల్లి శేఖర్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కొల్లి లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే వైవి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

సంగం డెయిరీలో పర్యటించిన బిసి సంక్షేమ శాసనసభా కమిటీ
చేబ్రోలు, జనవరి 24: రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు రాష్ట్రప్రభుత్వం వారికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అమలయ్యేలా చూసేందుకు తగిన కృషి చేస్తామని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాసనసభ కమిటీ చైర్మన్ గుండుమల తిప్పేస్వామి పేర్కొన్నారు. దక్షిణభారత క్షీరసాగరంగా పేర్గాంచిన వడ్లమూడి సంగం డెయిరీలో శాసనసభా కమిటీ బృందం మంగళవారం పర్యటించింది. ఈనెల 23 నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ బృందం పర్యటనలో భాగంగా రెండవ రోజు సంగం డెయిరీకి వచ్చింది. సంగం డెయిరీలో బిసి కార్మికులు, ఉద్యోగులు ఎంతమంది పనిచేస్తున్నారు. వారు ప్రభుత్వపరంగా పొందుతున్న రిజర్వేషన్లు, వారికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంపై కమిటీ బృందం సంగం డెయిరీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాక రాష్ట్రప్రభుత్వం వెనుకబడిన తరగతుల వారికి అమలు చేస్తున్న పథకాలు సక్రమంగా అందుతున్నాయా, లేదా, ఇంకా ఏవైనా కొత్త పథకాలు అమలు చేయాలా అన్న విషయాలను ఆరాతీశారు. అనంతరం సంగం డెయిరీలో పాలు, పెరుగు, లస్సీ, వెన్న వంటి వివిధ రకాల పాల ఉత్పత్తుల తయారీ విభాగాలను కమిటీ బృందం సునిశితంగా పరిశీలించారు. బిసిల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. ఈ కమిటీ బృందం వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ కృతికాశుక్లా, కమిటీ సభ్యులు బి అశోక్, బి రమణమూర్తి, ఆర్ జితేంద్రగౌడ్, వనమూడి వెంకటేశ్వరరావు, నిమ్మల రామానాయుడు, బి వెంకట రామారావు, పి విశ్వప్రసాద్, సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకుడు సూర్యనారాయణ, సంగం డెయిరీ ఎండి కె గోపీనాథ్, డైరెక్టర్లు ఎన్‌వికె ప్రసాద్, వలివేటి ధర్మారావు, వడ్లమూడి విఆర్‌ఒ టి లోకనాధం తదితరులున్నారు.

చెక్ బౌన్స్ కేసులో రెండేళ్ల జైలు రూ 14 లక్షల జరిమానా
తెనాలి, జనవరి 24: చెక్‌బౌన్స్ కేసులో నిందితునికి రెండేళ్ళు జైలు, 10 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పిన సంఘటన తెనాలి అదనపు మనిసిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం జరిగింది. పిపి మురళీకృష్ణ కధనం ప్రకారం తెనాలి చాకలి చెరువు ప్రాంతానికి చెందిన ముద్రబోయిన శివనాగేశ్వరమ్మ ఇదే ప్రాంతానికి చెందిన వ్యాపారి భవనం శ్రీనివాసరెడ్డికి 2015లో అప్పుగా కొంత నగదు ఇచ్చింది. అయితే అతడు ఎంతకూ నగదు తిరిగి చెల్లించక పోవటంతో కోర్టును ఆశ్రయిస్తానని చెప్పటంతో బ్యాంకు చెక్‌ను ఇచ్చాడు. అయితే అది బౌన్స్ కావటంతో నాగేశ్వరమ్మ కోర్టును ఆశ్రయించింది. దాదాపుగా సంవత్సరం పాటుగా కేసుపై మంగళవారం విచారణ జరిపిన అనంతరం బాధితురాలికి శ్రీనివాసరెడ్డి బ్యాంకులో నగదు లేకుండానే చెక్కు ఇచ్చి మోసం చేశాడని రుజువుకావటంతో ఏఎంఎం కోర్టు న్యాయమూర్తి జి ప్రభాకరరావు నిందితునికి 2 సంవత్సరాల జైలు, 14 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. నిందితుని తరుపున న్యాయవాదిగా విజయకుమార్ వాదించగా, బాధితురాలి తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మురళీకృష్ణ వాదించారు.

వృద్దురాలిపై దాడి..
25 సవర్ల బంగారం దోపిడీ
సత్తెనపల్లి, జనవరి 24:వృద్ధురాలిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి 25 సవర్ల బంగారం దోచుకుపోయిన సంఘటన సత్తెనపల్లి పట్టణంలోని ఘంటసాలవారి వీధిలో పట్టపగలు జరిగింది. ఈ సంఘలనకు సంబందించి స్థానికులు, పోలీసులు తెల్పిన వివరాల ప్రకారం రైల్వే స్టేషన్ సమీపంలోని ఘంటసాలవారి వీధిలో నివాసముంటున్న మండ శ్యామలపై గుర్తుతెలియని దుండగులు దాడిచేసి గాయపరచి 25 సవర్ల బంగారంను దోచుకెళ్ళారు. ఆ సమయంలో ఆమె భర్త కూరగాయలు తీసుకువచ్చేందుకు బజారుకు వెళ్ళాడు. దీనిని గమనించిన దుండగులు మధ్యాహ్నం 12 గంటల సమయంలో దాడి చేశారు. ఆమె స్పృహతప్పి పడిపోయిన అనంతరం వంటిపైనున్న ఆభరణాలను తీసుకెళ్లాడు. కాగా తీవ్ర గాయాలు పాలైన ఆ 82 సంవత్సరాల వృద్ధురాలిని హుటాహుటిన గుంటూరు ప్రైవేటు వైదశాలకు తరలించి చికిత్స చేయిస్తున్నారు.