గుంటూరు

హోదాపై భగ్గుమన్న విపక్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 27: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం విపక్షాలు రోడ్డెక్కాయి. భారీ ర్యాలీలు, ధర్నాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై భగ్గుమన్నాయి. కేవలం ప్రత్యేక ప్యాకేజీని పంచుకునేందుకే హోదాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అండ్ కో కలసి పక్కన పెట్టారని ప్రతిపక్ష నాయకులు విరుచుకుపడ్డారు. శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాల నేతలు విడివిడిగా ప్రత్యేక హోదా సాధన కోరుతూ ఆందోళన నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు-2 ఎమ్మెల్యే మహ్మద్ ముస్త్ఫా నేతృత్వంలో పెద్దఎత్తున కార్యకర్తలు, నాయకులు అరండల్‌పేటలోని నగర పార్టీ కార్యాలయం నుండి లాడ్జి సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి ప్రభుత్వ నియంతృత్వ ధోరణిపై పెద్దఎత్తున నినాదాలు చేస్తూ విరుచుకు పడ్డారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా భిక్ష కాదని ఐదుకోట్ల ఆంధ్రుల హక్కన్నారు. కేసుల మాఫీ కోసం జరుగుతున్న అవినీతి, అరాచకాలు, అవకతవకలపై ఢిల్లీ పెద్దలకు సాగిలపడి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహిస్తుంటే పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ అరెస్టులు చేస్తారా అంటూ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ముస్త్ఫా మాట్లాడుతూ హోదా కోసం పోరాడే పార్టీలతో కలసి కట్టుగా కేంద్రంపై ఒత్తిడితెచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కొలకలూరి కోటేశ్వరరావు, శ్రీకాంత్ యాదవ్, అత్తోట జోసఫ్, ప్రేమ్‌కుమార్, ఏరువ నర్సిరెడ్డి, గనికా ఝాన్సీ, మిరియాల గోపీ, చైతన్య, దాసరి కిరణ్, సుంకర రామాంజీ, బాలరాజు, పోలూరి వెంకటరెడ్డి, శివపార్వతి తదితరులు పాల్గొన్నారు.
వామపక్షాల ఆధ్వర్యంలో..
ప్రత్యేక హోదా కోరుతూ సిపిఐ, సిపిఎం నాయకులు, కార్యకర్తలు నగరంలో ప్రదర్శన నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి మాట్లాడుతూ ప్రత్యేక హోదాకు అడ్డుపడే వారంతా చరిత్ర హీనులుగా మిగిలిపోవటం ఖాయమన్నారు. సిపిఎం నగర కార్యదర్శి భావన్నారాయణ మాట్లాడుతూ ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కని శాంతియుతంగా ఉద్యమాలను కొనసాగించే వారిపై దాష్టికానికి దిగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆంధ్రుల ఆకాంక్షను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు పులి సాంబశివరావు, నూతలపాటి చిన్నా, అమీర్‌వలీ, రాగం అలివేలుమంగమ్మ, ఎ.అరుణ్‌కుమార్, సిపిఎం నాయకులు నళినీకాంత్, సుబ్బారావు, వేమారెడ్డి, ప్రమీల, రమాదేవి, నికల్సన్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలోని అభయారణ్యాలలో 42 పులులు
మాచర్ల, జనవరి 27: రాష్ట్రంలోని అభయారణ్యాలలో 42 పులులను గుర్తించినట్లు రాష్ట్ర అటవీ శాఖ అధికారి కెఎస్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక కెసీపీ అతిథిగృహంలో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అడవుల్లో ఉన్న పులుల గుర్తింపు చర్యలు చేపట్టామని ఇప్పటి వరకు 42 పులులను గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఎన్‌హెచ్ 565 నిర్మాణానికి సంబంధించి విజయపురిసౌత్ నుండి మార్కాపురం వరకు ఉన్న అటవీ భూమిని పరిశీలించేందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. పూర్తిస్థాయి నివేదికను కేంద్రానికి పంపనున్నామన్నారు. వన్యప్రాణులను కాపాడేందుకు కృషి చేస్తున్నామన్నారు. అటవీ భూములను సంరక్షించేందుకు కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. ఎవరైనా అటవీ భూముల ఆక్రమించుకోవాలని చూస్తే కఠిన చర్యలకు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రహదారి వెంట ఉన్న అటవీ భూములను పరిశీలించేందుకు కెఎస్ రెడ్డితో పాటు అసిస్టెంట్ అధికారి రమణారెడ్డి, జిల్లా అధికారి జయచంద్రారెడ్డిలు ఉన్నారు.

అగ్రిగోల్డు బాధితుల దీక్షలో ఉద్రిక్తత
పలువురి అరెస్టు

గుంటూరు, జనవరి 27: అగ్రిగోల్డు ఆస్తుల వేలాన్ని త్వరితగతిన పూర్తిచేసి బాధితులకు పంచాలని డిమాండ్ చేస్తూ అగ్రిగోల్డు కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాధితులు కొనసాగిస్తున్న ఐదోరోజు నిరాహారదీక్షలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహారదీక్షలను అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు జంగాల అజయ్‌కుమార్ ప్రారంభించారు. నిరాహారదీక్షలకు రాష్ట్రం నలుమూలల నుంచి వందలాదిమంది బాధితులు హాజరయ్యారు. దీక్ష అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట మానవ హారం ఏర్పాటుచేశారు. కలెక్టరేట్‌లో మానవహారం నిర్వహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. వాహనాలు బారులుతీరాయి. దీంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు యత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు, బాధితుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఎఎస్‌పి భాస్కరరావు, డిఎస్‌పి సరిత, మెహర్‌బాబ ఆధ్వర్యంలో సిబ్బంది కలెక్టరేట్ వద్దకు చేరుకుని రహదారి నుంచి వైదొలగాలంటూ హెచ్చరించారు. తమకు న్యాయం జరిగేంత వరకు కదిలేదిలేదంటూ బాధితులు భీష్మించారు. పోలీసులు పదేపదే చెప్తున్నప్పటికీ బాధితులు కదలకపోవడంతో పోలీసు వాహనాలలో బాధితులను ఎక్కించి నగరంపాలెం పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ తమకు న్యాయం చేయాలని మానవహారంగా ఏర్పడిన బాధితులను పోలీసులు అరెస్టు చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 20 లక్షల మంది బాధితుల గోడు ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా స్పందించాలని లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. లక్షలాది మందిని అన్యాయం చేసిన అగ్రిగోల్డు యజమానులందరినీ అరెస్టుచేసి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికష్టాలు ఎదుర్కొంటున్నా బాధితుల గోడు ప్రభుత్వానికి పట్టటంలేదని, రానున్న ఎన్నికల్లో ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. అరెస్టయిన వారిలో అసోసియేషన్ నాయకులు కెవి ప్రసాద్, షాహిద్, కెఎం నాయక్, సాంబశివరావు, కోట మాల్యాద్రి, బైరాపట్నం రామకృష్ణ, సాగర్‌బాబు, రమణ తదితరులు ఉన్నారు.

బాల్యంనుంచి విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించాలి
మంగళగిరి, జనవరి 27: విద్యార్ధుల్లో బాల్యం నుంచే దేశభక్తి పెంపొందించాలని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అన్నారు. మండల పరిధిలోని పెదవడ్లపూడి నాగార్జునా హైస్కూల్ వార్షికోత్సవ సభలో శుక్రవారం ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మంగళగిరి మార్కెట్‌యార్డు చైర్మన్ ఆరుద్ర భూలక్ష్మి, గ్రామసర్పంచ్ చిట్టిబొమ్మ వెంకటేశ్వర్లు, పోతినేని శ్రీనివాసరావు, అనే్న చంద్రశేఖర్, మాదల రమేష్, నందకిషోర్, రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు.
విజయకీలాద్రిపై విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు
తాడేపల్లి, జనవరి 27: సీతానగరంలోని విజయకీలాద్రి పర్వతంపై నిర్మించిన సుమారు తొమ్మిది దేవాలయాల ప్రతిష్ఠా మహోత్సవాలు ఫిబ్రవరి 1 నుండి 6వ తేదీ వరకూ జరగనున్నాయి. ఈ మేరకు శుక్రవారం విజయకీలాద్రిపై ఏర్పాటు చేసిన ప్రత్యేక విలేఖర్ల సమావేశంలో ఎంపి గంగరాజు మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ముఖద్వారం వద్ద విజయకీలాద్రిపై ప్రతిష్టాత్మకమైన తొమ్మిది దేవాలయాలు ఏర్పాటు చేయటం ఎంతో పుణ్యదాయకమన్నారు. భగవత్ కటాక్ష్యంతో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని, ఈక్రమంలో దేవాలయాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో దేవాలయాల ప్రారంభోత్సవం జరుగుతుందని, అందుకు అవసరమైన అన్ని సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాలు జరిగే రోజుల్లో దేవాలయ ప్రాంగణంలో నదీజలాలతో అభిషేకం, శోభాయాత్ర, అంకురార్పణ, అగ్నిప్రతిష్ఠ, మంత్రోపదేశం, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, కల్యాణ మహోత్సవం, భజనలు, వేదపారాయణం వంటి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో సీతానగరంలోని వేదపాఠశాల స్వామీజీ, మేనేజర్ వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.

క్రీడల్లో విద్యార్థులు రాణించాలి
- జడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్
ప్రత్తిపాడు, జనవరి 27: విద్యతో పాటు క్రీడలలో రాణించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. మండల పరిధిలోని యనమదల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జానీమూన్ జోనల్ ఆటల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థి దశలోనే క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకుంటే భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా ఎదుగుతారన్నారు. క్రీడలలో పాల్గొనటం వల్ల శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఐదో తేదీ నుంచి సాయంత్రం పూట అల్పాహారాన్ని అందిస్తామని ప్రకటించారు. యనమదల జడ్పీ పాఠశాలకు సంబంధించి అదనపు గదుల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో ప్రతి విద్యార్థి భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పి.మాధవరావు, జడ్పీటిసి డి.్భగ్యారావు, ఎంపిపి సిహెచ్ శ్రీనివాసరావు, రోటరీ క్లబ్ కార్యదర్శి ఆర్.కోటేశ్వరరావు, డిప్యూటీ డిఇఓ రమేష్, స్వచ్ఛ్భారత్ నిర్వాహకులు బాలసుబ్రహ్మణ్యం, పలువురు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

తీవ్రవాది కంటే జగన్ ప్రమాదకరం
* టిడిపి ఎమ్మెల్యేల ధ్వజం
గుంటూరు (కొత్తపేట), జనవరి 27: ప్రత్యేక హోదా పేరుతో రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్రవాదుల కంటే ప్రమాదకరమైన వ్యక్తి అని టిడిపి ఎమ్మెల్యేలు జివి ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే జివి మాట్లాడుతూ భవిష్యత్తులో సిఎం అవుతానని కలలుగంటూ ప్రజలు, విద్యార్థులను రెచ్చకొట్టే విధంగా జగన్ వ్యవహారశైలి ఉందన్నారు. ప్రత్యేక హోదా కంటే కేంద్రం నుంచి ఎక్కువ రాయితీలు పొందుతున్నామని, పోలవరం 7 ముంపు మండలాలను ఏపిలో విలీనం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. లోటు బడ్జెట్‌లో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో తీసుకువెళుతున్నారని, మోడీ కంటే చంద్రబాబు రాజకీయాల్లో సీనియర్ అయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం సంయమనం పాటిస్తున్నారని తెలిపారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ హోదా పేరుతో జగన్ మరోసారి తుని సంఘటనలా అల్లర్లను ప్రేరేపించేందుకు యత్నించారని ప్రభుత్వం ముందుచూపుతో అందరినీ అదుపులోకి తీసుకోవటం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ముందుచూపు వల్లే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వలేదన్నారు. జైలు జీవితం గడిపిన జగన్ సిఎం అవుతానని పగటి కలలు కంటున్నాడని, సిఎం కాకుండానే కాబోయే సిఎంను టచ్ చేస్తున్నావని పోలీసులతో వాదులాడటం హాస్యాస్పదమన్నారు. ప్రత్యేక హోదాపై ఎంపిగా ఉన్న సమయంలో జగన్ మాట్లాడకుండా వౌనం వహించి నేడు ఉద్యమాన్ని ఉసిగొల్పడం రాష్ట్ర ప్రజలను మరోసారి వంచించటమే అని విమర్శించారు. తన తండ్రి వైఎస్ రాష్ట్రంలో చెన్నారెడ్డిని పదవిలోనుంచి దించేందుకు అల్లర్లకు పాల్పడినట్లే జగన్ కూడా అలజడి సృష్టించి ప్రయోజనం పొందాలనుకుంటే సాగదన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు కంచర్ల శివరామయ్య, చిట్టాబత్తుని చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
విదేశీ ఎగుమతి విధానం సులభతరం
సహాయ కస్టమ్స్ కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి
గుంటూరు, జనవరి 27: ఎగుమతి విధానాలు, డాక్యుమెంటేషన్ మరింత సులభతరం చేస్తూ కేంద్రప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసిందని, దీన్ని పారిశ్రామిక వేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ కె.రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం లక్ష్మీపురంలోని కాటన్ అసోసియేషన్ హాలులో జరిగిన వేడుకలలో ఆయన మాట్లాడుతూ ఎగుమతి కోసం దూరప్రాంతాలకు వెళ్లే అవసరంలేకుండా గుంటూరు సమీపాన మర్రిపాలెం వద్ద ఇన్‌లాండ్ కంటైనర్ డిపో (ఐసిడి)లో మరిన్ని సేవలు పొందవచ్చని సూచించారు. ఇక్కడ కస్టమ్స్ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారని, కేవలం రెండు గంటల్లోనే ఎగుమతులకు సంబంధించిన అన్ని అనుమతులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న డ్రాబాక్ వంటి నగదు ప్రోత్సాహకాలు గడువు తేదీ కంటే ముందుగానే బ్యాంకు ఖాతాలలో జమ చేస్తున్నామని వివరించారు. ఐటిసి లిమిటెడ్ వైస్‌ప్రెసిడెంట్ పినాకి ముఖర్జీ మాట్లాడుతూ దేశీయ ఎగుమతుల రంగంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల పాత్ర కీలకమన్నారు. విదేశీ వాణిజ్య విధానంలో గణనీయమైన మార్పులు వస్తున్నాయని, విదేశీ వాణిజ్యంపై జిఎస్‌టి అనుకూల, ప్రతికూల అంశాలు ఎగుమతులు, పరిశ్రమలకు సవాల్‌గా మారాయన్నారు. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ ఎగుమతి, దిగుమతులపై నిబంధనలు, మార్గదర్శకాలు లాజిస్టిక్స్ గురించి వ్యాపారులకు అవగాహన కలిగించేందుకు కస్టమ్స్ శాఖ తరచుగా సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఏపి కాటన్ అసోసియేషన్ అధ్యక్షులు గంటా జగన్నాధరావు మాట్లాడుతూ ఎగుమతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేపట్టిన పథకాలను వ్యాపారులందరూ ఉపయోగించు కోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ కస్టమ్స్ కమిషనర్ రెహ్మాన్ ప్రత్యక్ష వీడియో ద్వారా తన ప్రసంగాన్ని ట్రేడ్‌కు వివరించారు. కార్యక్రమంలో కస్టమ్స్ సూపరింటెండెంట్ గుమ్మడి సీతారామయ్యచౌదరి, ఐవి రమణారావు, ఇన్‌స్పెక్టర్లు అస్లాం, అశోక్, నవీన్, కస్టమ్స్ ఏజెంట్లు బి.సత్యనారాయణ, సందీప్, శ్రీనివాస్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

బాబుకు ప్రజలే బుద్ధిచెబుతారు..
పొన్నూరు, జనవరి 27: ప్రత్యేక హోదా సాధనకై విశాఖలో ఆంధ్ర యువత తలపెట్టిన వౌనదీక్షలో పాల్గొనేందుకు తరలివెళుతున్న వైకాపా అధినేత జగన్‌ను విమానాశ్రయంలో పోలీసులను దించి అడ్డగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్‌కు కాలం చెల్లిందని ప్రజలే గోరీ కడతారని శుక్రవారం పొన్నూరులో జరిగిన ధర్నాలో పాల్గొన్న వైకాపా నేతలు ధ్వజమెత్తారు. విశాఖలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు తరలివెళ్తున్న తమ పార్టీ నేతలను అడ్డగించిన చర్యలను గర్హిస్తూ పట్టణ కూడళ్లలో వైసిపి నేతలు, కార్యకర్తలు శుక్రవారం ధర్నా నిర్వహించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని నవ్యాంధ్రలో దౌర్జన్య పాలన సాగిస్తున్నారని, యధేచ్చగా ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. అదేమని ప్రశ్నించిన విపక్ష నేతలను లాఠీలతో జులం ప్రదర్శింప చేస్తున్నారని వైకాపా శ్రేణులు మండిపడ్డారు. పార్టీ నేత గ్యారా సుబ్బయ్య అధ్యక్షతన జరిగిన ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ పార్టీ కన్వీనర్ రావి వెంకటరమణ మాట్లాడుతూ కల్లబొల్లి మాటలు చెప్పటం, మోసగించడంలో దిట్ట అయిన సిఎం చంద్రబాబు ప్రత్యేక హోదా రాదని మాటమార్చి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు మోసపు మాటలను గమనిస్తున్న ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఇంటికి పంపుతారన్నారు. వైకాపా రాష్ట్ర మైనారిటీ నేత వహిదుల్లా, పార్టీ నేతలు బి.వేణు, ఆకుల వెంకటేశ్వరరావు, రాజారావు, హజముల్‌బేగ్, కరీం తదితరులు పాల్గొన్నారు.

ప్రభోదాత్మకంగా ప్రారంభమైన సాంఘిక నాటిక ప్రదర్శనలు
* నవ్వుల పువ్వులు కురిపించిన బావాబావా పన్నీరు
* కలసి ఉంటే కలదు సుఖమన్న ఆనంద నందనం
గుంటూరు కల్చరల్, జనవరి 27: ఇప్పటి వరకు యువ, బాల కళాకారులు తమ సీనియర్ రంగస్థల నటీనటుల నాటకాలను తిలకించిన నాటక కళాప్రియులు నంది నాటకోత్సవాల పదోరోజైన శుక్రవారం ఆరు కళా సంస్థలు సమర్పించి ప్రదర్శించిన పలు సాంఘిక నాటికలు, నాటకాలను ఆసక్తికరంగా తిలకించారు. ఈ నాటకాలన్నీ కూడా ప్రభోదాత్మకమై సాంఘిక చైతన్యానికి పిలుపునిచ్చాయి. మొదటి ప్రదర్శనగా లలితా కళానికేతన్, స్టేట్‌బ్యాంక్ ఎంప్లాయిస్ కల్చరల్ అసోసియేషన్ గుంటూరు కళాకారులు ప్రదర్శించిన ఆనంద నందనం నాటిక కుటుంబ జీవన పరిస్థితులకు అద్దం పట్టింది. భార్యాభర్తల మధ్య అనురాగమయ జీవనం ఉండాలని, కలసి ఉంటే కలదు సుఖమన్న వాస్తవాన్ని తెలియచెప్పింది. రెండో ప్రదర్శనగా యడ్లపాడు నటీనటులు ఆంధ్ర ప్రజానాట్యమండలి పేరిట సమర్పించిన బావాబావా పన్నీరు నాటిక నవ్వుల పువ్వులు కురిపించింది. ఈ నాటికలోని పాత్రధారులంతా ఆయా పాత్రలకు తమదైన నటనతో న్యాయంచేశారు. కోదండంగారి ఇల్లు కోతుల సంత, కోటప్పకొండ తిరునాళ్లా ఏంటని అనే సందర్భంలోను, అచ్చీబుచ్చీ అన్న సంభాషణల దృశ్యాలు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టాయి. ఇక మూడో ప్రదర్శన విజయవాడ ఇజాలా ఆయాచితుల ఫౌండేషన్ సమర్పించిన అదాలత్ నాటకం సామాన్యుడి జీవనాడిని ప్రతిధ్వనించింది. పేదోడ్ని అయినా చీమునెత్తురు ఉన్నవాడ్ని అన్న డైలాగ్ అందరి హృదయాలను కదిలించివేసింది. వ్యవస్థలో మార్పువచ్చినప్పుడే సమాజంలోని అన్నివర్గాలు ఉదాత్తమైన జీవన విధానంతో ముందుకు సాగుతారని, స్వార్ధ సమాజం అంతరించాలని సూచించింది. అనంతరం రేపల్లె కళాకారులు ప్రదర్శించిన అమ్మను కాపాడుకుందాం సాంఘిక నాటిక తరతరాల మన తెలుగుభాష ఔన్నత్యాన్ని ప్రస్ఫుటంగా చాటిచెప్పింది. దివ్య వేదాల పనస మన తెలుగుభాష అనే పద్యాలు అందరిలో మాతృభాష పట్ల గౌరవాన్ని తట్టిలేపాయి. తాడేపల్లి గుంటూరు జిల్లా కళాకారులు ద్రాక్షారామ కళాపరిషత్ పేరిట సమర్పించి ప్రదర్శించిన అతనికి అటు..ఇటు నాటిక, చివరి ప్రదర్శనగా వసంతరాయపురం, హైదరాబాద్ వారి గోవాడ క్రియేషన్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన సమర్పించిన ఆకాశదేవర సాంఘిక నాటకం ప్రేక్షక జనావళిని ఎంతగానో ఆలోచింపచేసింది. గౌరవ అతిధిగా హాజరైన ప్రముఖ రంగస్థల, సినీ నటుడు జయప్రకాష్‌రెడ్డి , పలువురు కళారంగ ప్రముఖులు నటీనటులకు ఎఫ్‌డిసి పక్షాన ప్రదర్శన పారితోషికాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.