గుంటూరు

అభివృద్ధి చెందిన నగరాలతో పోటీపడాలంటే హోదా తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 16: మనపక్కనున్న హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి అభివృద్ధి చెందిన నగరాలతో పోటీపడాలన్నా, సాధించిన అభివృద్ధిని నిలబెట్టుకోవాలన్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పనిసరి అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి స్పష్టంచేశారు. గురువారం గుంటూరు మిర్చియార్డు సమీపంలో నిర్వహించిన యువభేరిలో ఆయన పాల్గొని యువతనుద్దేశించి మాట్లాడారు. యువభేరికి రిటైర్డ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్‌ఎస్‌ఎన్ ప్రసాద్ అధ్యక్షత వహించగా, మేథావివర్గానికి చెందిన లావు రత్తయ్య, ఆతుకూరి ఆంజనేయులు, న్యాయవాది కె శ్యామల, వైద్యులు పివి సుబ్బారావు, చదలవాడ రవి, జి సుబ్బారావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, విద్యావేత్తలు సలీంబాషా, లావు కృష్ణదేవరాయ, సెంట్రల్ పబ్లిక్ స్కూలు డైరెక్టర్ ఆర్ రాము తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ మన పక్కనున్న తెలంగాణ వాసులు రాదు అనుకున్న రాష్ట్రాన్ని సాధించుకున్నారని, పార్లమెంటు సాక్షిగా మనకిచ్చిన మాటను మనమంతా గట్టిగా నిలబడి, నిలదీస్తూ వెళ్తేనే ప్రత్యేకహోదా సాధ్యపడుతుందని పేర్కొన్నారు. ప్రత్యేకహోదా అన్నది ఒక్క జగన్ మాత్రమే పోరాడితే సాధ్యమయ్యే పని కాదని, మనందరం కలసికట్టుగా పోరాడాలని, మనం అడగడం మానేస్తే హోదా గురించే అడిగేవారెవ్వరూ ఉండరన్నారు. ఇప్పుడున్న నగరాలతో మనం పోటీపడాలంటే ప్రభుత్వ సాయం లేకుండా సాధ్యపడదన్నారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లకపోతే 20 నుంచి 30 యేళ్లు వెనక్కు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. గతంలో ఎన్నికలకు ముందు వెంకయ్య నాయుడు, చంద్రబాబు హోదా గురించి మాట్లాడారని, పోటీపడి ఐదు కాదు పది అని పది కాదు పదిహేనేళ్లు కావాలని డిమాండ్ చేశారన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ప్లేటు ఫిరాయించడంతో తెలుగుజాతి యావత్తు నివ్వెరపోయి చూస్తుందని, చంద్రబాబు దగ్గరుండి కత్తితో తెలుగుజాతిని వెన్నుపోటు పొడుస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రత్యేకహోదా వస్తే మన పిల్లలకు మన ప్రాంతంలోనే, మన జిల్లాలోనే, మన రాష్ట్రంలోనే మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు వస్తాయని, ఉద్యోగాల కోసం మన పిల్లలు వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి రాదన్నారు. ఉద్యోగాలే వేరే రాష్ట్రాల నుంచి మన ప్రాంతానికి రావడం ఒక్క ప్రత్యేక హోదాతోనే సాధ్యపడుతుందని స్పష్టంచేశారు. తనకు పదవీకాంక్ష, అధికారంపై వ్యామోహం లేదని, ప్రజా సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం నిరంతరం ప్రజల మధ్యే ఉంటానన్నారు. చనిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సస్యశ్యామలంగా మార్చిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో పక్కన తన ఫొటో ఉండాలన్నదే అంతిమ ఆశయంగా జగన్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం కలసికట్టుగా రాజీలేని పోరాటం చేస్తామని, 2019 ఎన్నికలకు హోదానే రిఫరెండం అని జగన్ స్పష్టంచేశారు. కార్యక్రమంలో పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా, నగర కన్వీనర్లు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, పినె్నల్లి రామకృష్ణారెడ్డి, కోనా రఘుపతి, మహ్మద్ ముస్త్ఫా, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తెనాలి నియోజకవర్గ కన్వీనర్ అన్నాబత్తుని శివకుమార్, ముఖ్య నేతలు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు.

గుంటూరు డివిజన్‌కుప్రాధాన్యత కల్పించండి
* రైల్వే జిఎంకు రాయపాటి, మోదుగల విజ్ఞప్తి
గుంటూరు, ఫిబ్రవరి 16: నవ్యాంధ్ర రాజధానిగా అవతరించిన గుంటూరు డివిజన్‌కు అధిక ప్రాధాన్యత కల్పించాలని, రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం సమకూరుతున్నప్పటికీ నూతన రైళ్లు, ప్రత్యేక రైళ్ల ఏర్పాటులో డివిజన్‌కు సముచిత ప్రాధాన్యత లభించడం లేదని నర్సరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డిలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గుంటూరు విచ్చేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన రాజధాని అమరావతి మీదుగా నూతన రైలు మార్గాలను త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలని కోరారు. మాచర్ల-నల్గొండ మధ్య 92 కిలోమీటర్ల మేర ఆధునీకరణకు 458 కోట్ల రూపాయలు అంచనా వ్యయం కాగా ఇప్పటివరకు కేవలం 36 కోట్లు మాత్రమే మంజూరయ్యాయన్నారు. గుంటూరు నుండి వినుకొండ, గుంటూరు నుండి మాచర్లకు లోకల్ రైళ్లను వీలైనన్ని ఎక్కువసార్లు నడపాలని, దీనివల్ల ప్రయాణికుల సమయం ఆదా అవుతుందన్నారు. గుంటూరు-చెన్నై, గుంటూరు-తిరుపతిలకు పగటిపూట నడిచేలా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లు ఏర్పాటు చేయాలని కోరారు. విజయవాడ-ఎర్రగుంట్ల మధ్య ఫాస్ట్ ప్యాసింజర్ రైలును ఏర్పాటు చేయాలని కోరారు. దీని వలన నూతన రాజధాని అమరావతికి రాయలసీమ ప్రాంతంలోని కడప, కర్నూలుకు కనెక్టివిటీ ఏర్పడుతుందని సూచించారు. గతంలో తెనాలి నుంది సికింద్రాబాద్‌కు ఉన్న నాగార్జున ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్దరించాలని కోరారు. పలు రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచాలని, జిల్లాలోని వివిధ స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లకు హాల్ట్ కల్పించాలని విజ్ఞప్తిచేశారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పనులను మార్చిలోగా పూర్తిచేయాలి
గుంటూరు (కార్పొరేషన్), ఫిబ్రవరి 16: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో, విలీన గ్రామాల్లో చేపడుతున్న ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పనులను మార్చిలోగా పూర్తిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ నాగలక్ష్మి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం తన ఛాంబర్‌లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులపై జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తొలుత పనుల వివరాలను ఎఇ, ఇఇ, డిఇల వారీగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2016-17కు సంబంధించి ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద 40 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, ఈ అభివృద్ధి పనులన్నీ మార్చి ఆఖరు నాటికి 100 శాతం పూర్తి కావాలని, అలాగే వాటికి సంబంధించిన బిల్లులను ఆన్‌లైన్‌లో వెంటనే నమోదు చేయాలని ఆదేశించారు. ఈ బిల్లులను ఉప ప్రణాళిక కిందనే మంజూరవుతుందని, పనుల్లో జాప్యం జరిగితే వాటిని సాధారణ నిధుల కింద బిల్లులు చెల్లించడం ఉండదని, కావున ఇంజనీరింగ్ అధికారులు బాధ్యతగా వ్యవహరించి పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ ఉపప్రణాళికలో భాగంగా శివనాగరాజు కాలనీ, రాజీవ్‌గాంధీనగర్, సంజీవయ్యనగర్, వెంగళరావునగర్, బొంగరాలబీడు, లాలుపురం రోడ్డు, పీకలవాగు, విలీన గ్రామాలు, తదితర ప్రాంతాల్లో చేపట్టినట్లు తెలిపారు. వీటితో పాటు నగరపాలక సంస్థకు చెందిన 110 పాఠశాలలు ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఉన్న 35 పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్ల అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆదేశించారు. పాఠశాలలో ఎల్ ఇ డి స్క్రీన్స్, ప్రొజక్టర్లు, లైట్లు, కుర్చీలు ఇతర వౌళిక సదుపాయాలు కల్పించేందుకు ఈ నిధులను వినియోగించాలన్నారు. సమావేశంలో ఎస్ ఇ గోపాలకృష్ణారెడ్డి, ఇఇలు రామ్‌నాయక్, చిన కోటేశ్వరరావు, సూపరింటెండెంట్ రవికుమార్, డిఇలు సాంబశివరావు, ప్రభాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

యువభేరికాదు..వంచన భేరి:జీవి
గుంటూరు (కొత్తపేట), ఫిబ్రవరి 16: ప్రత్యేక హోదాపై ఏనాడు పార్లమెంట్‌లో గళమెత్తని ప్రతిపక్షనేత జగన్ రాష్ట్ర ప్రజలను వంచిస్తూ యువత, విద్యార్థులను పెడత్రోవ పట్టించేందుకే యువభేరి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జివి ఆంజనేయులు ధ్వజమెత్తారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్లు రాష్ట్రంలో దోచుకున్నారని ఆరోపించారు. 66 కోట్లకే తమిళనాడులో శశికళకు నాలుగేళ్ల జైలుశిక్ష పడితే లక్ష కోట్లు దోచుకున్న జగన్‌కు నూరేళ్లు జైలుశిక్ష పడటం ఖాయమన్నారు. 11 కేసులలో ఏ వన్ ముద్దాయిగా 16 నెలలు జైలుశిక్ష విధించిన జగన్ యువతకు సందేశమిచ్చే అర్హత లేదన్నారు. హోదాకు, ప్యాకేజీకి తేడా తెలియని జగన్ చంద్రబాబుపై విమర్శలు చేయటం అర్ధరహితమన్నారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీపై చర్చకు సిఎం ఆహ్వానిస్తే బహిరంగ చర్చకు రాని జగన్ యువతను అడ్డుపెట్టుకుని నీఛ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. టిడిపి పార్లమెంటరీ పార్టీ పరిశీలకులు రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రానికి పరిశ్రమలొస్తే ముడుపుల కోసం కక్కుర్తిపడిన బొత్స సత్యనారాయణ లాంటి వారిని పక్కనపెట్టుకుని జగన్ సందేశం ఇస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని వ్యాఖ్యానించారు. మార్కెట్ యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ జగన్ ఒక ఫోర్‌ట్వంటీ అని రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక టిడిపి, సిఎం చంద్రబాబుపై బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. చివరకు ఆ పార్టీ సభ్యులే పార్టీని వీడుతుంటే మతిభ్రమించి సభలు, సమావేశాల పేరుతో ప్రజలను రెచ్చకొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో హస్తకళల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ హర్షవర్ధన్, గంజి చిరంజీవి, షౌకత్, మన్నవ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
11 పూరిళ్లు దగ్ధం
శావల్యాపురం, ఫిబ్రవరి 16: మండల పరిధిలోని బొందిలిపాలెం గ్రామంలో గురువారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో 11 పూరిళ్లు పూర్తిగా దగ్ధమైనాయి. ఈ సంఘటనలో సుమారు 15 లక్షల రూపాయల ఆస్తినష్టం ఉంటుందని గ్రామస్థులు తెలిపారు. గ్రామానికి చెందిన కొండ్రముట్ల మూర్తెమ్మ, ధనలక్ష్మి, టి వెంకటేశ్వర్లు, ప్రసాద్, పోట్లూరి అంజయ్య, ఇండ్ల అంకమ్మరావు, మరో ఐదుగురి గృహాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలను గ్రామస్తులు, వినుకొండకు చెందిన అగ్నిమాపక సిబ్బంది నాలుగు గంటల పాటు శ్రమించి అదుపులోకి తెచ్చారు. సంఘటనా స్థలాన్ని మండల తహశీల్దార్ చెంచులక్ష్మి, ఎండిఒ విజయకుమార్, విఎఒ సునీత, మండల పరిషత్ అధ్యక్షులు వై అనంతమ్మ కోటేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యులు రవికుమార్, సర్పంచ్ బి వెంకటేశ్వర్లు, విశ్వనాథం, హైమారావు పలువురు ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ప్రభుత్వపరంగా ఒక్కో గృహానికి ఐదు వేల రూపాయల ఆర్థికసాయాన్ని, పది కేజీల బియ్యాన్ని అందజేస్తున్నట్లు తహశీల్దార్ తెలిపారు.
గుంటూరు చానల్ పొడిగింపుపై పరిశీలన
పెదనందిపాడు, ఫిబ్రవరి 16: గుంటూరు చానల్ పొడిగింపుపై గ్రామీణ ప్రాంతాల్లో ఇరిగేషన్ శాఖ అధికారులు పరిశీలన నిర్వహించారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ఆదేశాలపై ఓఎస్‌డి రాజేంద్రప్రసాద్, ఇరిగేషన్ శాఖ ఇఇ బాబురావు, నల్లమడ రైతు సంఘం కన్వీనర్ కొల్లా రాజమోహనరావు తదితరులు గుంటూరు రూరల్ మండలం, ఓబులునాయుడుపాలెం వద్ద నుండి ప్రకాశం జిల్లా పర్చూరు వరకు పరిశీలన చేశారు. దీనికి సంబంధించిన సర్వే మ్యాప్‌ను పెదనందిపాడులో మంత్రి రావెల కిషోర్‌బాబు పరిశీలించి, త్వరితగతిన ప్రతి పాదనలు తయారు చేయాలని సూచించారు. చానల్ పొడిగింపు వలన దాదాపు 50 గ్రామాలకు తాగునీటి సౌకర్యం అందనుందని బాబురావు తెలిపారు. డిఇ సాంబశివరావతో పాటు సంఘం ప్రతినిధులు అంకమ్మచౌదరి, ఆర్ శివరామకృష్ణయ్య, కె హరిబాబు, బాలకృష్ణ పాల్గొన్నారు.
పార్టీ పటిష్ఠతకు భంగం
కల్గించేలా వ్యవహరిస్తే సహించం..
* జివి ఆంజనేయులు
గుంటూరు (కొత్తపేట), ఫిబ్రవరి 16: జిల్లాలో పార్టీ పటిష్ఠతకు భంగం కల్గించేలా ఎవరైనా వ్యవహరిస్తే సహించేది లేదని, ఎంతటివారైనా పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జివి ఆంజనేయులు పేర్కొన్నారు. గురువారం బృందావనగార్డెన్స్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళగిరి నియోజకవర్గ పార్టీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జివి మాట్లాడుతూ రాష్ట్ర, జిల్లా పార్టీల అనుమతి లేకుండా ఏ నియోజకవర్గంలోనూ గ్రామ కమిటీలను పత్రికా ప్రకటనలు ఇవ్వవద్దని సూచించారు. ఎక్కడైనా వివాదాలుంటే గ్రామ కమిటీకి పోటీ చేసే వారి పేర్లను జిల్లా పార్టీ కార్యాలయానికి పంపించాలన్నారు. జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీకి ఆ పేర్లను పంపించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర పార్టీ ఐవిఆర్ ఫోన్‌కాల్స్ ద్వారా గ్రామ ప్రజల అభిప్రాయాలను సేకరించి గ్రామ కమిటీల ఎన్నిక చేస్తుందన్నారు. గ్రామ, వార్డు కమిటీల ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని, కిందిస్థాయి నుండేపార్టీని పటిష్ఠపర్చాలని కోరారు. పదవులు అలంకారప్రాయం కాకూడదని, పార్టీ కోసం పనిచేసే వారికి ప్రాధాన్యత తప్పక ఉంటుందని ఆంజనేయులు పేర్కొన్నారు. సమావేశంలో మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త మన్నవ సుబ్బారావు, ఇన్‌చార్జి గంజి చిరంజీవి, గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు గొట్టిపాటి రామకృష్ణప్రసాద్, నాయకులు పోతినేని శ్రీనివాసరావు, వట్టికూటి హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
భోజనం చాలలేదని అడిగిన విద్యార్థులపై దాడి
మేడికొండూరు, ఫిబ్రవరి 16: హాస్టల్‌లో భోజనం సరిపోలేదని విద్యార్థులు అడిగినందుకు కరస్పాండెంట్, అతని అనుచరులు విద్యార్థులపై దాడిచేసిన సంఘటన బుధవారం రాత్రి పేరేచర్లలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. ప్రకాశం జిల్లా, మార్టూరు మండలం, నాగరాజుపాల్లె గ్రామానికి చెందిన శానంపూడి నాగార్జున మండలంలోని పేరేచర్లలో అభ్యాస్ జూనియర్ కళాశాల క్యాంపస్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం రాత్రి భోజనం కింద చికెన్ వడ్డించారు. అందరికీ చాలలేదని నాగార్జునతో పాటు మరికొందరు విద్యార్థులు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రసాదరావు దృష్టికి తీసుకెళ్లేందుకు వెళ్తుండగా ప్రసాదరావు ఈ విషయాన్ని కరస్పాండెంట్ లక్ష్మణరావుకు తెలియపర్చారు. వెంటనే లక్ష్మణరావు కొంతమంది అనుచరులను పంపగా వారు వాహనంలో వచ్చి విద్యార్థులు నాగరాజు, సాయి, జగదీష్, సందీప్ తదితరులను తిడుతూ కర్రలతో దాడిచేసి గాయపర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి సరిదిద్దారు. నాగరాజు అనే విద్యార్థి పోలీసులకు ఘటనపై ఫిర్యాదు చేశారు. అనంతరం తల్లిదండ్రులకు విషయం తెలియడంతో గురువారం ఉదయం పేరేచర్లకు చేరుకుని గుంటూరు-సత్తెనపల్లి ప్రధాన రహదారిపై పేరేచర్ల వద్ద రాస్తారోకో నిర్వహించారు. సిఐ బాలాజీ సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చజెప్పినా వినిపించుకోకపోవడంతో గుంటూరు అర్బన్ సౌత్ డిఎస్‌పి బి శ్రీనివాసరావు అక్కడికి చేరుకుని చర్చలు జరిపి దోషులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ధర్నా సందర్భంగా రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

బాబుతోనే రాష్ట్రానికి పెట్టుబడులు
గుంటూరు (కొత్తపేట), ఫిబ్రవరి 16: దేశంలో ఏ రాష్ట్రంలోలేని విధంగా ఏపికి పెట్టుబడులు రావటానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న విశ్వసనీయతే అని, పారిశ్రామిక వేత్తలు ఏపిలో పరిశ్రమలు పెట్టేందుకు పరుగులు తీస్తుంటే సహించలేక ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మనస్తాపానికి గురై బాబుపై ఆరోపణలు చేస్తున్నారని కనీస వేతనాల సలహా మండలి చైర్మన్, టిడిపి అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్ విమర్శించారు. గురువారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో నాలుగు సార్లు రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిని చేశారని గుర్తుచేశారు. కేంద్రంతో సమన్వయం పాటిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం సిఎం అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రత్యేక హోదాపై కేంద్రంతో గొడవ పెట్టుకుంటే రాష్ట్రానికి ఫలితంలేదని చంద్రబాబు చాకచక్యంగా హోదా వల్ల వచ్చే నిధుల కంటే ప్రత్యేక ప్యాకేజీ ద్వారానే సమీకరిస్తున్నారని వివరించారు. కేసుల విషయంలో భయపడుతున్నారని జగన్ చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, దేశంలో బాబును బెదిరించే నాయకుడు ఇంత వరకు ఎవరూ లేరన్నారు. జగన్ తగిన సమాచారం లేకుండానే రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే అడ్డుకోవటమే ధ్యేయంగా పనిచేస్తున్నారు తప్ప ప్రతిపక్ష నేతగా ఏ ఒక్కరోజు ప్రజలకు ఉపయోగపడే సలహా ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా టిడిపి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

నడికుడి రైల్వే జంక్షన్‌ను తనిఖీ చేసిన దక్షిణ మధ్య రైల్వే జిఎం
దాచేపల్లి , ఫిబ్రవరి 16 : నడికుడి రైల్వే జంక్షన్ ను దక్షిణ మధ్య రైల్వే జియం వినోద్‌కుమార్ యాదవ్ గురువారం పరిశీలించారు. జంక్షన్‌లో ప్రయాణికులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలపై ఆయన ఆరా తీశారు. జంక్షన్‌లో వివిద విభాగాలను ఆయన పరిశీలించి సంబధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా జిఎం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైల్వే ప్రయాణికుల భద్రతకు, సౌకర్యాలకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నట్లు చెప్పారు. కేంధ్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వేకు అధిక నిధులు కేటాయించినట్లు చెప్పారు. ఈ నిధులతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు నూతన రైలు మార్గాలు, అభివృద్ది కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నడికుడి-శ్రీకాళహాస్తి రైల్వే మార్గం పనులు చురుకుగా జరుగుతున్నాయని ఆయన చెప్పారు. అదే విధంగా మాచర్ల నల్గొండ నూతన రైల్వేమార్గం ప్రతిపాదనలు రైల్వేశాఖ పరిశీలనలో వున్నట్లు ఆయన వెల్లడించారు. నడికుడి రైలు మార్గాన్ని డబల్‌లైన్‌గా విస్తరించడంతో పాటు విద్యుద్దీకరణ పనులు కూడా చేపట్టనున్నట్లు జిఎం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రైల్వే ఉన్నతాధికారులు, స్థానిక అధికారులు పాల్గొన్నారు.