గుంటూరు

మహిళల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, ఫిబ్రవరి 21:ఆడ బిడ్డల ఆత్మగౌరవం కోసమే అంతర్జాతీయ మహిళా పార్లమెంట్ సమావేశాలను నిర్వహించామని, మహిళల అభివృద్ధే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. మంగళవారం స్థానిక స్పీకర్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా పార్లమెంట్ సమావేశాలను పురస్కరిచుకొని సభాపతి రాష్ట్ర అంగన్‌వాడి కన్వీనర్ భీమినేని వందనాదేవి ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాల మహిళలు, అంగన్‌వాడి కార్యకర్తల ఆధ్వర్యంలో సభాపతికి సత్కారం చేసి జ్ఞాపికను అందజేశారు. అనంతరం సభాపతి కోడెల మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం, వారి అభివృద్ధిలో ప్రతి అడుగు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. మహిళలు మగవారికి ధీటుగా ప్రతి పనిలోనూ ప్రతి ఉద్యోగంలోనూ పురుషులతో పోటీ పడుతున్నారని, వారి ఆశయాలను, వారికలలను నెరవేర్చుకుంటూ అభివృద్ధి పథంలో నడుస్తున్నారని సభాపతి అన్నారు. ఆడపిల్ల పుడితే తల్లిదండ్రులు గర్వపడాలని, ప్రతి కుటుంబంలో ఆడపిల్లలువుంటే ఆ ఇల్లు సంతోషంగా వుంటుందని కోడెల వివరించారు. ఈ రోజుల్లో ఆడబిడ్డలు ఎన్నో వాణిజ్యరంగాల్లోనూ ఎంతో వున్నతమైన హోదాల్లోనూ, ఉద్యోగాల్లోనూ పనిచేస్తూ దేశ అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తున్నారని కోడెల అన్నారు. ఇదిలావుండగా దేశ అభివృద్ధికోసం రాష్ట్ర అభివృద్ధి ప్రయోజనాలకోసం ప్రజల అభివృద్ధికి నిరంతరం ప్రభుత్వం కష్టపడుతుంటే అది చూడలేక ప్రతిపక్షంవారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, పాలల్లో ఒక్కచుక్క విషం చాలని, రాష్ట్ర అభివృద్ధిని ఏ శక్తి ఆపలేదని తెలిపారు.

కృష్ణానదిలో స్నానానికెళ్లిన
ఇద్దరు ఇంటర్ విద్యార్థుల మృతి
అమరావతి, ఫిబ్రవరి 21: గుంటూరు నారాయణ జూనియర్ కళాశాలలో సీనియర్ ఇంటర్ చదువుతున్న ఆరుగురు విద్యార్థులు మంగళవారం సాయంత్రం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతి సందర్శనార్ధం వచ్చారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో అమరేశ్వరాఘాట్‌లో స్నానానికి దిగారు. లోతుతో పాటు ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గుంటూరు రూరల్ గొర్లవారిపాలెంకు చెందిన కొమ్మండ్రు లక్ష్మీసతీష్ (18), గుంటూరు నగరంలోని నవభారత్ నగర్‌కు చెందిన కోదారి అభినయ్ (18)లు మృత్యువాత పడ్డారు. వీరు నీటమునిగి చనిపోగా వీరితో పాటు వచ్చిన కొమ్మండ్రు రామ్‌సతీష్, నాగమోతు సాయిచరణ్, ఆనందాసు పవన్‌సాయి, పెమ్మరాజు నిఖిల్‌లు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. రామ్‌సతీష్, లక్ష్మీసతీష్‌లు కవలపిల్లలు కావడం విశేషం. సమాచారం తెలుసుకున్న వెంటనే అమరావతి ఎస్‌ఐ ఎస్‌కె రహంతుల్లా, రైటర్ మోహనరావులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీయించారు. సంఘటనా స్థలాన్ని అమరావతి పోలీసుస్టేషన్ ఎస్‌హెచ్‌ఒ తక్కెళ్లపాటి మురళీకృష్ణ పరిశీలించారు. మృతదేహాలను అమరావతి 30 పడకల ఆసుపత్రికి తరలించి ఎస్‌ఐ రహంతుల్లా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అగ్నిప్రమాదంలో రూ.20 లక్షల ఆస్తి నష్టం
* లేగదూడలు, గొర్రెలు సజీవ దహనం
వినుకొండ, ఫిబ్రవరి 21: మండలంలోని విఠంరాజుపల్లె గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఇళ్ళు, పోగాకు బస్తాలు, వరిగడ్డి వాములు, లేగదూడలు, గొర్రెలు అగ్నికి ఆహూతయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 20లక్షలకు పైగా ఆస్థినష్టం వాటిల్లింది. గ్రామంలోని చర్చి వద్ద ఊరేగింపుగా వెళ్తూ బాణాసంచా కాలుస్తుండగా, వాటి నుండి వచ్చిన నిప్పురవ్వలు గడ్డివామిలో పడి మంటలు చెలరేగాయి. దీంతో గడ్డివాముల పక్కనే ఉన్న గృహాలకు అంటుకున్నాయి. చల్లా రాంబాబు, రమణ గృహాలకు ఈ మంటలు వ్యాపించడంతో ఇళ్ళల్లోని రెండు గ్యాస్ సిలెండర్లు పేలిపోయి మంటలు వ్యాపించాయి. కుటుంబ సభ్యులు వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉండగా ఇళ్ళకు తాళాలు వేసి ఉండడంతో ఇంట్లోని సామాగ్రితో పాటు నగదు, వస్తువులు కాలి బూడిదైనాయి. పక్కనే ఉన్న రాములు, నాగరాజు, రమణ గృహాలు అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. అలాగే సత్యనారాయణ, చినయోగయ్యకు చెందిన గడ్డివాములు దగ్ధమయ్యాయి. ఈ కొట్టాల్లో కట్టేసిన నాలుగు లేగదూడలు, పది గొర్రెపిల్లలు ఈ ప్రమాదంలో మాడిపోయాయి. అదే సమయంలో ఫైరింజన్లు మొరాయించడంతో గ్రామస్థులు మంటలను అదుపుచేశారు. సమాచారం తెలుసుకున్న రెవెన్యూ, పోలీస్ సంఘటనా స్ధలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంగళవారం శివశక్తి అంజన్ ఫౌండేషన్ గోనుగుంట్ల లీలావతి, వైఎస్సార్‌సీపీ నాయకులు బొల్లా బ్రహ్మనాయుడు, తహశీల్దార్ సిబ్బంది బాధితులను పరామర్శించి, నగదుతోపాటు బియ్యం అందచేశారు. ఈ సందర్భంగా అగ్నిబాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు.

పురుగు మందు తాగి భార్యాభర్తల ఆత్మహత్య
* భార్య నిండు గర్భిణీ
సత్తెనపల్లి, ఫిబ్రవరి 21: భార్యాభర్తలకు ఏమైందో తెలియదు రోజూ ముచ్చటగా కష్టపడి పనులు చేసుకుని ఆనందంగా జీవించేవారు. గుంటూరు వెళ్లి వైద్యుడ్ని కలిసి ఇంటికి వచ్చిన అనంతరం రాత్రికి రాత్రే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఉదంతంపై గ్రామస్తులు, బంధువుల నివ్వెరపోయారు. ఆ కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై స్థానికులు, బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామానికి చెందిన జొన్నలగ్డ జ్ఞానానందం (30) అతని భార్య శైలజ (26) సోమవారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం మంగళవారం బయటవారికి తెలిసింది.
వివరాలు సేకరించేక్రమంలో పోలీసులు వెళ్లగా పోస్టుమార్టం నిర్వహించేందుకు బంధువులు నిరాకరించారు. విలేకర్లను సైతం దగ్గరకు రానివ్వలేదు. అయితే రూరల్ ఎస్సై వెంకట్రావు తన సిబ్బంది గ్రామ పెద్దలతో మాట్లాడి వారి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి మృత దేహాలను సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సాయంత్రం ఆరు గంటలకు పోస్టుమార్ట పూర్తి చేసి మృత దేహాలను బంధువులకు అప్పగించారు. మృతులకు మూడు సంవత్సరాల కుమారుడు విశ్వంత్ ఉండగా శైలజ నిండు గర్భిణి అని మరో ఐదు రోజుల్లో ప్రసవిస్తుందని వైద్యులు తెలిపినట్టు బంధువులు పేర్కొన్నారు. ఇదిలావుండగా డిగ్రీ వరకు చదువుకున్న జ్ఞానానందం ఇంటి వద్ద ట్యూషన్ చెపుతుండగా భార్య శైలజ కూలీపనులు చేస్తుంది. సోమవారం రాత్రి 11 గంటల వరకు అందరితో సంతోషంగా గడిపిన వీరిద్దరూ మంగళవారం ఉదయం కల్లా మృతి చెందారంటే నమ్మలేక పోతున్నారు. ఉదయం ఇంటి తలుపులు ఎంతకొట్టినా తియ్యక పోవడంతో సమీప బంధువులు తలుపులను పగులగొట్టి చూసేసరికి ఇద్దరు మరణించి వున్నారని, వారి మధ్య వున్న మూడు సంవత్సరాల బాబు విశ్వంత్ వారిని లేపాలని ప్రయత్నిస్తున్నట్లుగా తెలిపారు. విఆర్‌ఓ శ్రీరాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి రూరల్ ఎస్‌ఐ కె వెంకట్రావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

శివరాత్రి తిరునాళ్లకు విస్తృత బందోబస్తు
* అశ్లీల నృత్యాలు..మద్యం విక్రయాలు నిషేధం
* అధికారులతో అర్బన్ ఎస్‌పి సమీక్ష

గుంటూరు, ఫిబ్రవరి 21: ఈనెల 24వ తేదీన మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా విస్తృత బందోబస్తు నిర్వహించాలని అర్బన్ ఎస్‌పి సర్వశ్రేష్ట త్రిపాఠి ఆదేశించారు. ఈ విషయమై మంగళవారం తన కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అశ్లీల నృత్యాలు, మద్యం అమ్మకాలను నిషేధించాలన్నారు. అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జూదం, మట్కా తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే 100కు డయల్‌చేసి సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. అల్లర్లను ప్రేరేపించే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు ఎస్‌పిలు జె.్భస్కరరావు, తిరుపాల్, డిఎస్‌పిలు శ్రీనివాసరావు, సంతోష్, సిఐలు శ్రీనివాసరావు, శ్రీనివాసులురెడ్డి, మధుసూదనరావు, వెంకటేశ్వర రెడ్డి, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో మరిన్ని
మోడల్ పోలీసుస్టేషన్లు
* గుంటూరు భవనాలను పరిశీలించిన సిబిఐ డిఐజి

గుంటూరు, ఫిబ్రవరి 21: గుంటూరు మోడల్ పోలీసుస్టేషన్ల తరహాలో రాష్ట్రంలో మరిన్ని ఆదర్శ స్టేషన్ల ఏర్పాటు చేయనున్నట్లు సిబిఐ డిఐజి వినీత్ బ్రిజ్‌లాల్ తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం నగరంపాలెంలో ఇటీవల ముఖ్యమంత్రి ప్రారంభించిన మోడల్ పోలీసుస్టేషన్ భవనాలను ఆయన పరిశీలించారు. స్టేషన్ పరిసరాలు.. ఖైదీల గది (లాకప్), పోలీసు సిబ్బందికి ప్రత్యేక గదులు.. నిర్మాణానికి అయ్యే ఖర్చు తదితర వివరాలను అర్బన్ ఎస్‌పి సర్వశ్రేష్ట త్రిపాఠిని అడిగి తెలుసుకున్నారు. ఆదర్శ స్టేషన్ల పట్ల ప్రజల్లో స్పందన, సిబ్బంది పనితీరు, అధునాతన టెక్నాలజీ వినియోగం తదితర అంశాలపై ఇరువురు చర్చించారు.

పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పెద్దపీట
మంగళగిరి, ఫిబ్రవరి 21: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ప్రోత్సహిస్తోందని గుంటూరు లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్ అన్నారు. మంగళగిరి ఆటో నగర్‌లో ఏర్పాటు చేసిన ఐటి లేఅవుట్‌కు 5 కోట్ల 68 లక్షల రూపాయలతో నీటి సరఫరా పథకం పనులను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి అధ్యక్షతన జరిగిన సభలో జయదేవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏర్పాటవుతున్న పరిశ్రమల ద్వారా వేలాదిమంది యువతకు ఉపాధి దొరుకుతుందని, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రవాస భారతీయులు, పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని ఆయన అన్నారు. గంజి చిరంజీవి మాట్లాడుతూ మంగళగిరి ఆటో నగర్‌లో ఏర్పాటు చేసి ఐటి పరిశ్రమలో 3వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. ప్రజారోగ్య శాఖ జిల్లా ఎస్‌ఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ 4 ఎంఎల్‌డి వాటర్ ప్రాజెక్టును ఈ ఏడాది సెప్టెంబరుకల్లా పూర్తి చేస్తామని, గుంటూరు ఛానల్‌నుంచి 4.25 కిమీ పొడవునా పైపులైన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గుంటూరు ఎఎంసి చైర్మన్ మన్నవ సుబ్బారావు, నియోజకవర్గ టిడిపి మాజీ ఇన్‌చార్జ్ పోతినేని శ్రీనివాస్, ఎఎంసి చైర్మన్ ఆరుద్ర భూలక్ష్మి, వైస్‌చైర్మన్ మనె్నం రమేష్, పట్టణ, రూరల్ మండల టిడిపి అధ్యక్షులు నందం అబద్దయ్య, చావలి ఉల్లయ్య, పొన్నూరు మున్సిపల్ మాజీచైర్మన్ షాలిని, ప్రజారోగ్య శాఖ ఈఈ సంపత్‌కుమార్, డీఈ ప్రసాదరావు, రామాంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నెలాఖరులోగా పల్స్ సర్వేను పూర్తిచేయాలి
గుంటూరు, ఫిబ్రవరి 21: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పల్స్ సర్వే నూరుశాతం పూర్తిచేసేందుకు చివరి అవకాశంగా వారం రోజులు గడువు ఇచ్చిందని, ఈ దృష్ట్యా ఈనెల 28వ తేదీలోగా కార్యక్రమాన్ని పూర్తిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. ప్రత్యేక కౌంటర్లద్వారా, ఫిర్యాదుల విభాగం నుంచి అందిన దరఖాస్తులను రెండు రోజుల్లో సర్వే పూర్తిచేసి డేటాను పొందుపర్చాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల జాబితాలో పేర్లు నమోదై ఉండి ప్రజాసాధికార సర్వేలో నమోదు కాని వారిపై జాబితాల ప్రకారం వారి వారి అసిస్మెంట్ నెంబర్, పెన్షన్, ఎస్‌హెచ్‌జి ఆధారాలతో నమోదు చేయాలని సూచించారు. ప్రతిరోజూ సాయంత్రం 7 గంటలకు సర్వేపై సమీక్షా సమావేశం ఉంటుందని, నిర్ణీతకాలంలో నూరుశాతం సర్వే పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఫలాలు పొందాలంటే ప్రజాసాధికార సర్వేలో పేరు నమోదై ఉండాలని స్పష్టంచేశారు. నమోదుకాని వారి కోసం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో, సర్కిల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసి వివరాలు అందించిన వెంటనే సంబంధిత వార్డు ఎన్యూమరేటర్లు సర్వే కోసం వస్తారని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ ఎన్ ఏసుదాసు, సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లు హాజరయ్యారు.
వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు...
రానున్న వేసవిలో నగరపాలక సంస్థ పరిధిలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని పురపాలక ప్రిన్సిపల్ సెక్రటరి కరికలవలవన్, డిఎంఎ కన్నబాబు తదితరులు సూచించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల కమిషనర్లు, రీజనల్ డైరెక్టర్లు, ఆయా విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. వివిధ అభివృద్ధి పనుల పురోగతి, తాగునీరు, గృహనిర్మాణం, నైట్‌షల్టర్స్ నిర్మాణం, వీధి వర్తకుల గుర్తింపుకార్డుల మంజూరు, పాఠశాల విద్య, ఆస్తిపన్ను వసూలు తదితర అంశాలపై సమీక్షించారు.

పేదల కాలనీలకు ఇంటి పన్ను వర్తింపచేయాలి
గుంటూరు (కొత్తపేట) 21: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గుంటూరు నగరంతో పాటు, జిల్లాలోని వివిధ ప్రాంతాలలో పేదలు నివశించే కాలనీలకు ఇంటి పన్ను వర్తింపచేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. నగరంలోని ప్రగతినగర్, చండ్ర రాజేశ్వరనగర్‌లకు ఇంటి పన్ను సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రదర్శన జరిపారు. కలెక్టరేట్ ఎఒ కె సాయిప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అజయ్‌కుమార్ మాట్లాడుతూ అధికారులు సానుకూలంగా స్పందించి 15 రోజుల్లో ఇంటిపన్ను సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. పేదలు నివశించే కాలనీలకు ఇంటి పన్ను వేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ ఇంటిపన్ను వేసే ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకపోవడం దారుణమన్నారు. ప్రగతినగర్, సిఆర్ నగర్ వాసులకు ఇంటిపన్ను వేయడంతో పాటు వౌళిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ దశాబ్ధాల కాలంగా పేదలు నివశిస్తున్న కాలనీలకు ప్రభుత్వాలు పట్టాలు ఇవ్వక పోవడం వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు నూతలపాటి చిన్న, అమీర్‌వలి, కుమారనాయక్, గుమ్మా పాపారావు, సుబ్బారావు, రాగం అలివేలుమంగమ్మ, చేపర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి, వైజాగ్‌లలోను

చేనేత ఐక్యగర్జన సభలు

మంగళగిరి, ఫిబ్రవరి 21: ఆంధ్రప్రదేశ్ పద్మశాలీయ సాధికారత సంఘం ఆధ్వర్యాన ఈ ఏడాది మేలో తిరుపతిలోను, ఆగస్టులో విశాఖపట్నంలోను చేనేత ఐక్య గర్జన సదస్సు సభలు నిర్వహిస్తామని సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారపు శ్రీనివాసరావు వెల్లడించారు. మంగళవారం స్థానిక చిల్లపల్లి కల్యాణ మండపంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగ్గారపు రామ్మోహనరావు , యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బీవీ శివన్నారాయణ, కొలను కృష్ణ, ఉదయ్ తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆచార్య నాగార్జునా విశ్వ విద్యాలయం ఎదుట ఈనెల 20న నిర్వహించిన చేనేత ఐక్యగర్జన విజయవంతం చేసిన చేనేత వర్గాల ప్రజలకు, పవన్‌కల్యాణ్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో 14 శాతంగా ఉన్న చేనేత కులాల ప్రజలకు దామాషా ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు 20 అసెంబ్లీ సీట్లను కేటాయించాలని, అన్ని పార్టీల అధ్యక్షులను కలిసి కోరతామని ఆయన అన్నారు. ఎన్నికలప్పుడే కులం గుర్తుకు వచ్చే నేతలు పద్ధతి మార్చుకోవాలని జగ్గారపు రామ్మోహనరావు అన్నారు.