గుంటూరు

శివనామస్మరణతో మార్మోగిన త్రికూటాద్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట, ఫిబ్రవరి 24: కోటప్పకొండ తిరునాళ్ళకు రాష్ట్ర పండుగ హోదా వచ్చిన నాటి నుండి ప్రభుత్వం తరపున స్వామివారికి నూతన పట్టు వస్త్రాలు, వెండి ప్రభను స్వామివారికి అందచేయడం ఆనవాయితీగా వస్తుంది. అదే ఆనవాయితీని శుక్రవారం ప్రభుత్వం తరపున స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి పత్తిపాటి పుల్లారావు, డాక్టర్ కోడెల శివరాం, పద్మప్రియ, పూనాటి విజయలక్ష్మీ తదితరులు ఆలయ అర్చకులకు నూతన పట్టు వస్త్రాలను అందచేశారు. వాటితో పాటు వెండి ప్రభను అర్చకులకు అందచేశారు. అనంతరం స్వామివారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి స్వామివారి శేషవస్త్రాలను, పూలమాలలను అందచేశారు.
* పర్యావరణ, పర్యాటక పుణ్యక్షేత్రం కోటప్పకొండ :స్పీకర్ కోడెల
ఈ కోటప్పకొండ పుణ్యక్షేత్రం అనేక శతాబ్ధాలుగా ఖ్యాతి చెందిందని, కోట్లాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఈ దేవాలయం అభివృద్ధికి భక్తుల, దాతల సహకారం ఉందన్నారు. దేశంలోనే అతి పవిత్ర పుణ్యక్షేత్రం ఈ కోటప్పకొండ అని అన్నారు. స్వామి వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఉంటాయని అన్నారు. రానున్న సంవత్సరం కొండలో రోప్‌వే, సౌండ్ అండ్ లైటింగ్‌ను ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. ఈ కోటప్పకొండ పుణ్యక్షేత్రం పర్యావరణ, పర్యాటక పుణ్యక్షేత్రమని అన్నారు. నాటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ దేవాలయ నిర్మాణానికి ఎంతో సహాయ, సహకారాలను అందించారని అన్నారు. తనకు సేవచేసే అవకాశం లభించిందన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, తిరునాళ్ళను విజయవంతం చేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరినట్లు కోడెల తెలిపారు. మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు వల్లనే ఈ దేవాలయం ఇంత అభివృద్ధి చెందిందని అన్నారు. కోటి వేల్పుల అండ కోటప్ప కొండ అన్నారు. రైతులు సుభిక్షంగా ఉండాలని, చంద్రబాబునాయుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. అక్కడే ఉన్న జెఎన్‌టీయూకే వలంటీర్లతో కొద్దిసేపు ముచ్చటించారు.

ఇటు ఉచితం..అటు అమ్మకం
* సరిహద్దులు దాటుతున్న ఇసుక
* నిబంధనలకు విరుద్ధంగా క్వారీ తవ్వకాలు
* దొడ్డిదారిన మట్టి, నాపరాయి అమ్మకాలు
* తెరవెనుక రాజకీయ ప్రముఖులు

గుంటూరు, ఫిబ్రవరి 24: ఇక్కడ ఉచితంగా వచ్చిన ఇసుకను పొరుగు రాష్ట్రాల్లో విక్రయిస్తు అక్రమార్కులు కోట్లాది రూపాయలు అక్రమమార్గాల్లో సంపాదిస్తున్నారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్చగా సాగుతోంది. యంత్రాల ద్వారా ఇసుక క్వారీయింగ్‌తో పాటు భారీ వాహనాల్లో రవాణాను నిషేధించాలని ఇటీవలే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జారీచేసిన ఆదేశాలు బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా పొక్లెయినర్లతో తవ్వకాలు జరపటంతో పాటు లారీల్లో రవాణా చేసి వ్యాపారులు జేబులు నింపుకుంటున్నారు. కొందరు రాజకీయ ప్రముఖుల ప్రత్యక్ష, పరోక్ష భాగస్వామ్యంతో ఇసుక తెలంగాణ జిల్లాలకు తరలిస్తున్నారు. పల్నాడు ప్రాంతంలోని మాచవరం, దాచేపల్లి, వెల్దుర్తి మండలాల్లోని కృష్ణానదీ పరివాహక గ్రామాల నుంచి పడవల్లో నల్గొండ జిల్లాకు తరలిస్తున్నారు. ఇక ప్రధానంగా అమరావతి, రేపల్లె, కొల్లూరు, కొల్లిపర మండలాల్లోని పలు రీచ్‌ల నుంచి ఇసుకను ఒకే టోకెన్‌పై లెక్కకు మిక్కిలి తరలిస్తున్నట్లు సమాచారం. అమరావతి, అచ్చంపేట తదితర ప్రాంతాల్లో ఓ ప్రజా ప్రతినిధి నేరుగా ఇసుక వ్యాపారంలో పూర్తిస్థాయిలో నిమగ్నమైనట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతి నుంచి కృష్ణాజిల్లా కంచికచర్ల, నందిగామ మీదుగా ఎన్‌హెచ్ 16 మీదుగా హైదరాబాద్‌కు ఉచిత ఇసుక రవాణా అవుతున్నట్లు అధికారులు గుర్తించినా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా అక్రమ మట్టి తవ్వకాలు కూడా ఊపందుకున్నాయి. నీరు- చెట్టు కింద చెరువుల ఆధునికీకరణ నేరుగా కాంట్రాక్టులు పొంది ఆ టన్నుల కొద్దీ మట్టిని స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై విజిలెన్స్ విచారణ చేపట్టినా నివేదికను గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా మట్టి, నాపరాయి క్వారీయింగ్ జరుగుతోంది. చేబ్రోలు మండలం వడ్లమూడి, సుద్దపల్లి, శేకూరు, క్వారీ, వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు నియోజకవర్గ గ్రామాల్లో మట్టి తవ్వకాలు, అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి..ఇక పల్నాడు ప్రాంతంతో పాటు పేరేచర్ల, మేడికొండూరు మండలాల్లో నాపరాయి క్వారీయింగ్‌లో పెద్దఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. మట్టి క్వారీలను మూడు అడుగులకు మించి తవ్వరాదని ఆంక్షలు ఉన్నప్పటికీ అగాధాలుగా మార్చుతున్నారు. గతంలో పలు సందర్భాలలో ఈ క్వారీ గుంతల్లో పలువురు మృత్యువాత పడిన దాఖలాలు ఉన్నాయి. మైనింగ్, శాండ్ అధికారుల పర్యవేక్షణ లోపించిన కారణంగానే అక్రమ తవ్వకాలకు కారణంగా చెప్పక తప్పదు..ఇప్పటికైనా అధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

నారాకోడూరులో కుప్పకూలిన భారీ విద్యుత్ ప్రభ
* తృటిలో తప్పిన ప్రమాదం
చేబ్రోలు, ఫిబ్రవరి 24: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామంలో మహా శివరాత్రి తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటుచేసిన 120 అడుగుల భారీ విద్యుత్ ప్రభ కుప్పకూలింది.. ప్రతి ఏటా శివరాత్రి పండుగకు వడ్లమూడి క్వారీ వద్దగల బాలకోటేశ్వర స్వామి తిరునాళ్ల ఆనవాయితీగా జరుగుతోంది.. ఈ తిరునాళ్లకు అన్ని గ్రామాల నుంచి పెద్దఎత్తున విద్యుత్ ప్రభలు ఏర్పాటుచేసి ఊరేగింపుగా స్వామివారి ఆలయం వద్దకు తీసుకువస్తారు.. ప్రభల నిర్మాణంలో గ్రామాల మధ్య పోటీ ఉంటుంది.. ముఖ్యంగా నారాకోడూరు గ్రామం ప్రభల కట్టుబడికి పెట్టిందిపేరు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా అదే స్థాయిలో ప్రభలను సిద్ధం చేశారు. గతంలో కంటే ఈ ఏడాది ఇక్కడి నుంచి ఐదు విద్యుత్ ప్రభలను అలంకరించారు. నారాకోడూరు- తెనాలి రోడ్డులో మునుపెన్నడూలేని విధంగా 120 అడుగుల ఎత్తులో భారీ విద్యుత్ ప్రభ రూపుదిద్దుకుంది. తెల్లవారుఝాము వరకు గ్రామంలోనే ఊరేగింపు నిర్వహించి మరుసటిరోజు స్వామివారి ఆలయం వద్దకు తీసుకువెళతారు. అయితే ప్రభను విద్యుత్ బల్బులతో అలంకరిస్తున్న సమయంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా నేలకొరిగింది. ప్రభ కింద ఏర్పాటుచేసిన చక్రాలు పైకిలేచి పక్కనే ఉన్న భవనంపై పడింది. అదృష్టవశాత్తు ప్రాణహాని జరగలేదు. గతంలో ఇదే ప్రాంతంలో తిరునాళ్ల నుండి తిరిగొచ్చే సమయంలో 150 అడుగుల వరకు ఏర్పాటుచేసిన చేబ్రోలు ప్రభలో షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమై ప్రాణనష్టం జరిగింది. అప్పటి నుంచి చేబ్రోలులో ప్రభలను నిలిపివేశారు. గతంలో విద్యుత్ ప్రభలపై రికార్డింగ్ డ్యాన్స్‌లు నిర్వహించే వారు. గత పదేళ్లుగా తిరునాళ్లలో డాన్సులను నిషేధించడంతో కొన్ని గ్రామాల నుంచి విద్యుత్ ప్రభల నిర్మాణం పట్ల ఆసక్తి తగ్గింది. అయితే నారాకోడూరులో మాత్రం ఏటా తప్పనిసరిగా భారీ విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేస్తారు. ఈ సారి ఆదిలోనే అపశృతి చోటు చేసుకోవడంతో గ్రామాల ప్రజలు నిరాశకు గురయ్యారు.

కోటప్పకొండకు చేరుకున్న 14 విద్యుత్ ప్రభలు
నరసరావుపేట, ఫిబ్రవరి 24: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం రాత్రి తిరునాళ్ళకు 14 విద్యుత్ ప్రభలు కొండకు చేరుకున్నాయి. భారీ నుండి అతి భారీ ప్రభలు త్రికోటేశ్వరుడిని దర్శింపచేసి, ఆయా గ్రామస్థులు మొక్కుబడులు తీర్చుకుంటారు. ప్రభలపై వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా త్రికోటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం విద్యుత్ దీపాలతో వెలుగొందుతుంది.

కాల్వలోకి పల్టీకొట్టిన కారు..
* మహిళకు తీవ్ర గాయాలు
పెదనందిపాడు, ఫిబ్రవరి 24: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కోటప్పకొండకు వెళ్లి వస్తున్న సమయంలో కారు అదుపుతప్పి పల్టీ కొట్టిన సంఘటన పెదనందిపాడు సమీపంలో శుక్రవారం జరిగింది. బాపట్ల మండలం జమ్ములపాలెంకు చెందిన పంగులూరి శ్రీనివాసరావు బంధువులతో కలిసి కోటప్పకొండ వెళ్లి మధ్యాహ్న సమయంలో తిరిగి వస్తున్నారు. ఈక్రమంలో కారు టైరు పంక్చరైకాల్వలోకి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో సుబ్బరావమ్మ తీవ్రంగా గాయపడంతో 108 ద్వారా గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

వైభవంగా గాయత్రీ యజ్ఞం
పెదనందిపాడు, ఫిబ్రవరి 24: పెదనందిపాడు సోమేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గాయత్రీ యజ్ఞం శుక్రవారం కనుల పండువగా జరిగింది. స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకంతో పాటు లింగోద్భవకాలంలో అన్నాభిషేకాన్ని అర్చకులు అమ్ము బాలసుబ్రహ్మణ్యం, పొన్నూరు చంద్రశేఖర్‌లు నిర్వహించారు. గాయత్రీ యజ్ఞంలో లక్ష్మీనరసింహం, గౌరీసావిత్రి దంపతులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వందలాది మందికి అన్నదానం జరిగింది. మండల పరిధిలోని పాలపర్రు, ఉప్పలపాడు, అన్నపర్రు, రావిపాడులోని దేవాలయాల్లో శివరాత్రి వేడుకలు జరిగాయి. కొండపాటూరు శ్రీ పెదమల్లేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ఓం నమశివాయ ఏకనామ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కిటకిటలాడిన మంగళగిరి శివాలయం
మంగళగిరి, ఫిబ్రవరి 24: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయం (శివాలయం) భక్తులతో కిటకిటలాడింది. పట్టణ పరిసర ప్రాంతాలనుంచి తరలివచ్చిన భక్తులు తెల్లవారుఝామునుంచే బారులుతీరి స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేకం, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. వివిధ ప్రాంతాలనుంచి తరలివచ్చిన భక్తులకు స్వచ్చంద సంస్థలు ప్రసాదం పంచిపెట్టాయి. మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, కౌన్సిలర్ మునగపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వాసవి సేవాసమితి ఆధ్వర్యాన భక్తులకు పులిహోర, కేసరి, గుగ్గిళ్లు పంచిపెట్టారు. భగీరధ సగరసేవాట్రస్ట్ ఆధ్వర్యాన పులిహోర, చక్కెరపొంగలి, గుగ్గిళ్లు పంచిపెట్టారు. రాత్రి స్వామివారి కల్యాణోత్సవానికి ముందు ఎదురుకోల ఉత్సవం వైభవంగా నిర్వహించారు.
చేరుకో కోటయ్యా..మమ్మాదుకో కోటయ్యా..
నరసరావుపేట, ఫిబ్రవరి 24: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోటప్పకొండ త్రికూటాద్రి శివనామస్మరణతో శుక్రవారం మార్మోగింది. హరహర మహాదేవ శంభోశంకరా...హరహర మహాదేవ శంభోశంకరా..అంటూ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మెట్ల మార్గం నుండి వచ్చే భక్తులు చేరుకో కోటయ్యా..మమ్మాదుకో కోటయ్యా అంటూ శివనామస్మరణ చేసుకుంటూ కొండకు చేరుకున్నారు. చిన్నారులు, వృద్ధులు, నూతన వధూవరులు కోటయ్య స్వామిని దర్శించుకుని వారి మొక్కుబడులు తీర్చుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన భక్తులు స్వామివారికి కేశాలను సమర్పించి తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. నూతనంగా వివాహమైన జంట ఈఏటికి ఇద్దరం...ముందు నాటికి ముగ్గురం కావాలంటూ స్వామివారిని వేడుకుని, స్వామిని దర్శించుకుని తరించారు. ఆలయ ప్రాంగణంలో పొంగళ్ళు పొంగించి, స్వామివారిని మొక్కులను తీర్చుకున్నారు. తెల్లవారు జాము నుండే భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది. స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయ అధికారి శ్రీనివాసరావు మూడు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ధర్మదర్శనం, శీఘ్రదర్శనం, ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు స్వామివారిని దర్శించుకుని తరించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, గొల్లబామకు పట్టు చీరెను ప్రభుత్వం తరపున స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి పత్తిపాటి పుల్లారావు, కోడెల శివరామ్, ఆయన సతీమణి పద్మప్రియ, పూనాటి విజయలక్ష్మీ తదితరులు స్వామివారికి సమర్పించారు. అనంతరం వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త రాజా మల్రాజ్ రామకృష్ణ గుండారావు బహూద్దూర్ ఆలయానికి వచ్చే భక్తులు, విఐపీలకు స్వాగతం పలికారు.
శివనామ స్మరణతో మార్మోగిన అమరారామం
అమరావతి, ఫిబ్రవరి 24: పంచారామక్షేత్రాల్లో అగ్రగామియైన అమరావతిలో మహాశివరాత్రి సందర్భంగా అమరేశ్వర స్వామి దేవస్థానం, అమరావతి పురవీధులు శివనామ స్మరణతో మార్మోగాయి. రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన వేలాది మంది భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. నదిలో నీటిమట్టం తక్కువగా ఉండటంతో కొందరు తుంపర్ల స్నానానికే పరిమితమయ్యారు. తెల్లవారుజామున 4 గంటల నుండే బాలచాముండికా అమరేశ్వర స్వామివార్ల దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు. తొలుత స్వామివారి పేర అభిషేకాలు నిర్వహించాక భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం 10 గంటల వరకు భక్తులరద్దీ సాధారణంగా ఉండగా 10 దాటిన తర్వాత క్రమక్రమంగా భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం 5 గంటల వరకు భక్తుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. మహాశివరాత్రి సందర్భంగా కలెక్టర్ కాంతిలాల్ దండే దంపతులు, ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్ కుటుంబ సమేతంగానూ, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్ నాయుడు, మంగిశెట్టి కోటేశ్వరరావులు స్వామివార్లను దర్శించుకున్నారు. అమరేశ్వర స్వామి దేవస్థానంలో, కృష్ణానది ఒడ్డున ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు ఇబ్బంది కలగకుండా తుళ్లూరు ఎఎస్‌పి విషాల్‌నిశాంత్, అమరావతి సిఐ మురళీకృష్ణ, గుంటూరు ఆర్డీవో బి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ఆలయ ప్రాంగణంలో విఐపి దర్శనాలను కఠినతరం చేయడంతో భక్తులకు విఐపిలకు, అధికారులకు స్వల్ప ఘర్షణ, వాగ్వాదం చోటు చేసుకుంది. ఎట్టకేలకు పోలీసు అధికారులు స్పందించి భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శన సౌకర్యం కల్పించారు. దేవస్థానం ప్రాంగణంలో అమరావతి జూనియర్ కాలేజీ వారు ఏర్పాటుచేసిన పులిహోర ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని పెదకూరపాడు ఎమ్మెల్యే శ్రీ్ధర్ ప్రారంభించారు. మహాశివరాత్రి సందర్భంగా దేవస్థానం వారు ఏర్పాటుచేసిన భక్తిరస సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకర్షించాయి. మహాశివరాత్రి పర్వదినం నాడు అమరేశ్వర స్వామి దేవస్థానాన్ని సుమారు 60 వేల మందికి పైగా భక్తులు దర్శించి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
బోళాశంకరుని దర్శనం కోసం బారులుతీరిన అశేష భక్తజనం
గుంటూరు (కల్చరల్), ఫిబ్రవరి 24: ‘త్రిగుణం త్రిదళాకారం, త్రినేత్రంచ త్రయాయుధం, త్రిజన్వపాపసంహారం ఏకబిళ్వం శివార్పణం’ అంటూ శివపంచాక్షరీ మంత్రాన్ని గళమెత్తి, గొంతెత్తి భక్తులు పటిస్తుండగా త్రినేత్రధారికి మహారుద్రాభిషేకాలు జరిగాయి. సర్వపాపాలను పోగొట్టే పవిత్రమైన ఈ మాఘమాసంలో త్రయోదశి ఘడియలు దాటి చతుర్దశి ప్రవేశిస్తున్న తరుణంలో శుక్రవారం శ్రవణానక్షత్రం శుభవేళ విచ్చేసిన మహాశివరాత్రిని నగరంలోని శివభక్తులు శ్రద్ధాశక్తులతో రోజంతా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నగరంలోని 13 ప్రధాన శివాలయాలు, లింగధారుడు వేంచేసియున్న వాయులింగ ప్రాంతాలు, మందిరాలకు అసంఖ్యాకంగా భక్తులు తెలతెలవారుతూనే పుణ్యస్నానాలు ఆచరించి తలరిరావడంతో అన్ని శైవమందిరాలు కిటకిటలాడాయి. ఉపవాసదీక్షలను ఆచరిస్తూనే భక్తులంతా వయోబేధం లేకుండా జాగరణకుకూడా సిద్ధమైనారు. నగరంలోని పాత గుంటూరు శ్రీ అగస్తేశ్వరస్వామి దేవస్థానాన్ని మహాశివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకుని వేలాది మంది భక్తులు సందర్శించారు. ధ్వజస్తంభం వద్ద ఆవునేయితో దీపాలను వెలిగించి మూడు పర్యాయాలు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. నాగేంద్రస్వామికి స్వయంగా అభిషేకాలు నిర్వహించుకున్నారు. అంతరాలయంలో పానవట్టంపై కొలువై లింగరూపంలో విరాజిల్లుతున్న పరమేశ్వరుడికి రోజంతా మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరిగాయి. ఆర్ అగ్రహారంలోని శ్రీ గంగాభ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామిని కూడా పెద్దసంఖ్యలో భక్తులు ఓపికతో నిరీక్షించి దర్శించుకున్నారు. దేవస్థాన కార్యనిర్వహణ అధికారి, ఆలయ అనువంశిక ధర్మకర్త, సిబ్బంది, భక్తబృందం భక్తుల సౌకర్యార్ధం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పలువురు భక్తులు, దంపతులు స్వామి సేవకు వినియోగించే నిమిత్తం నూతనంగా తయారు చేసిన వెండి హారతులు, ఢమరుకాలను బహూకరించారు. సంపత్‌నగర్‌లోని శ్రీ శృంగేరీ శారదాపరమేశ్వరి దేవస్థానంలో శారదా చంద్రవౌళేశ్వరులకు సంప్రదాయబద్ధంగా అభిషేకాలు, బిళ్వార్చనలు జరిగాయి. శృంగేరీపీఠ గుంటూరు పీఠ గౌరవ ప్రతినిధి పోలిశెట్టి శ్రీహరిప్రసాదరావు, పోలిశెట్టి శ్యామ్‌సుందర్, శారదాపీఠ భక్తబృందం అభిషేకంలో పాల్గొన్నారు. అరండల్‌పేటలోని శ్రీ గంగామీనాక్షి సమేత సోమసుందర స్వామి ఆలయాన్ని కూడా భక్తులు అధిక సంఖ్యలో సేవించుకున్నారు. నమక చమక రుద్రాలతో స్వామికి అభిషేకం జరుగుతున్నంత సేపు కనురెప్ప ఆర్పకుండా శంభోశంకర అంటూ భక్తులు శివనామ స్మరణ చేస్తూ దర్శించుకున్నారు. మారుతినగర్‌లోని మారుతిక్షేత్రంలో శ్రీ గంగాగౌరీశంకర స్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు జరిగాయి. పలు భక్తబృందాలు, భజనమండళ్లు భక్తిగీతాలను ఆలపించి సంకీర్తనలు చేశారు. పట్ట్భాపురం హరిహర దత్తక్షేత్రం, శ్యామలానగర్ ఇష్టకామేశ్వరి దేవస్థానం, జూట్‌మిల్లు శివాలయం, బ్రాడీపేట సిద్ధేశ్వరీపీఠ ఓంకారక్షేత్రం, అదే ప్రాంతంలోని గౌరీ విశే్వశ్వరాలయం, కొత్తపేట శివాలయం, నెహ్రూనగర్ ఉమామహేశ్వర మార్కండేయ మందిరం, లాం శివాలయాలతో పాటు గుంటూరు సమీపంలోని అన్ని గ్రామాల్లో ఉన్న శివాలయాల్లో మహాశివరాత్రి ఉత్సవాన్ని మహావైభవంగా జరుపుకున్నారు. సరిగ్గా లింగోద్భవకాలంలో లింగరూపంలో అవతరించిన శంకరస్వామికి 26 రకాల ద్రవ్యాలతో మహాభిషేకం చేశారు. కాగా పలువురు దాతలు, శివభక్తుల సహకారంతో నగరంలోని మూడు ప్రధాన ప్రాంతాల్లో వేలాది మంది భక్తుల సమక్షాన మహాభిషేకాలు జరిగాయి. ప్రధాన శివాలయాల్లో మహాశివరాత్రి ఉత్సవాన్ని వేడుకగా జరుపుకున్న భక్తజనం, అదేరీతిలో శివపార్వతుల కళ్యాణాన్ని కూడా నిర్వహించుకుంది. విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు, ఉమామహేశ్వరులను సేవించుకున్నారు. కుంకుమార్చనల్లో పాల్గొన్నారు.