గుంటూరు

సాగర్ ఆయకట్టు సాగుపై చిగురిస్తున్న ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 13: గత రెండేళ్లుగా వ్యవసాయ సీజన్లు కోల్పోతున్న నాగార్జునసాగర్ ఆయకట్టు రైతాంగంలో సాగుపై ఆశలు చిగురిస్తున్నాయి.. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు నీరందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఎగువన తెలంగాణ రాష్ట్రంతో తలెత్తిన పేచీ కారణంగా ఈ ఏడాది మంచినీటికి అలమటించాల్సిన దైన్య స్థితి నెలకొంది.. ప్రస్తుతం వేసవి ముంచుకొచ్చినా వచ్చే నెల వరకు నీటిని విడుదలచేసే వెసులుబాటు లేదు. సాగర్ కుడి, ఎడమ కాల్వల పరిధిలో సుమారు 10లక్షల హెక్టార్లఆయకట్టు సాగవుతోంది.. కుడి కాల్వ పరిధిలో గత ఏడాది అనధికారిక క్రాప్‌హాలీడే కొనసాగింది.. రబీకి కూడా నీరందలేదు. దీంతో ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వం పప్పు్ధన్యాలను సబ్సిడీపై అందించింది. గుంటూరు, ప్రకాశం జిల్లాలో కుడికాల్వ పరిధిలో ఐదు లక్షల హెక్టార్లకు బదులు 50వేల ఎకరాల్లో పప్పు్ధన్యాల సాగు చేశారు. దాళ్వా వరిపంటకు స్వస్తిచెప్పారు. కుడికాల్వ నుంచి 80 టిఎంసిల నీటిని దామాషా ప్రకారం ఏపి వినియోగించుకోవాల్సి ఉంది. ఇందులో 45 టిఎంసిలు మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు వదలాల్సి ఉంది. జలాశయంలో గరిష్ఠ సామర్ధ్యంలో నీరు లేనందున దిగువకు నీటిని విడుదలచేసేదిలేదని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీంతో కృష్ణా రివర్‌బోర్డు ఆదేశాల మేరకు తాగునీటి అవసరాలకే నీటిని విడుదల చేశారు. దీంతో ప్రభుత్వం గోదావరి జలాలను నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాల్వలతో అనుసంధానం చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ప్రకాశం బ్యారేజీ ద్వారా కుడి కాల్వకు, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వద్ద నూతనంగా నిర్మించనున్న ఎత్తిపోతల పథకం ద్వారా నూజివీడు, మైలవరం, నందిగామ ప్రాంతాలకు ఎడమ కాల్వ ద్వారా గోదావరి నీటిని అందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుప్రసిద్ధ వాప్కోస్ సంస్థ డిజైన్లకు రూపకల్పన చేస్తోంది..పథకం అంచనాలు త్వరలో ఖరారు కానున్నాయి.. గోదావరి మిగులు జలాలు 300 టిఎంసిల మేర సముద్రంలో కలుస్తున్నాయి.. ఈ నీటిని మళ్లించడం ద్వారా సాగర్ ఆయకట్టు పరిధిలో సాగుకు నీరందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కృష్ణాడెల్టాకు గత ఏడాది పట్టిసీమ నుంచి నీరందించడం ద్వారా ఖరీఫ్ గట్టెక్కింది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు అధికమవుతాయని వాతావరణ శాస్తవ్రేత్తలు అంచనా వేస్తున్నారు. దీంతో సాగర్ ఆయకట్టుకు సాగునీరందే విషయమై ఒకింత సందేహాలు వ్యక్తమవుతున్నాయి.. గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతం మొత్తం సాగర్ కుడికాల్వ పరిధిలోనే ఉంది. ఈ ప్రాంతానికి నీరందాలంటే పులిచింతల, నాగార్జున సాగర్ మధ్య కాల్వలు అవసరం. ఇందుకోసం స్థల పరిశీలన జరుపుతున్నారు. అయితే కొత్తగా వచ్చే ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు మరో దశాబ్దానికైనా పూర్తికావనే ఆందోళన రైతుల్ని పట్టిపీడిస్తోంది.. ఉన్నతాధికారులు ప్రభుత్వానికి దీనిపై సమగ్ర నివేదిక అందిస్తేకానీ తుది నిర్ణయం తీసుకునే అవకాశంలేదని చెప్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

విపక్ష నేతల విగ్రహ ప్రాంతాలను
శ్మశాన వాటికలుగా చూడటం తగదు
గుంటూరు, మార్చి 13: నగరపాలక సంస్థ యంత్రాంగం అధికార పార్టీ జెండా దిమ్మెలు, నేతల విగ్రహాలు, దేవాలయాలుగా భావిస్తూ ప్రతిపక్ష నేతల విగ్రహాలు, పార్టీ జెండా దిమ్మెలను శ్మశాన వాటికలుగా భావించి కూల్చి వేస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం బ్రాడీపేటలోని పార్టీ జెండా దిమ్మెను ముందస్తు సమాచారం లేకుండా పగలగొట్టిన నేపథ్యంలో సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ నాగలక్ష్మిని పార్టీ నాయకులు కలిసి వాస్తవాలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన కమిషనర్ రెండు రోజుల్లో ఈ విషయంపై విచారణ జరిపి తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. అనంతరం విలేఖర్లతో అప్పిరెడ్డి మాట్లాడుతూ నగరాభివృద్ధికి వైసిపి కట్టుబడి ఉందని, అయితే బాధ్యత గల అధికారులకు ఏ విధంగా సహకరిస్తామో, అధికార పార్టీ మెప్పు కోసం ఏకపక్షంగా వ్యవహరించే యంత్రాంగాన్ని అదే స్థాయిలో వ్యతిరేకిస్తామన్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా బ్రాడీపేట 4/10లోని పార్టీ జెండాను ఆవిష్కరించే ఏర్పాట్లు స్థానిక నాయకులు, కార్యకర్తలు చేయగా మరికొద్ది గంటల్లో జరగబోతుండగా కార్పొరేషన్ సిబ్బంది హడావుడిగా వచ్చి పగలగొట్టే ప్రయత్నం చేశారన్నారు. సమాచారం తెలుసుకున్న నాయకులు ఇదేమని అడిగితే సమాధానం చెప్పకుండా నీళ్లునమిలారని చెప్పారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముస్త్ఫా మాట్లాడుతూ ఆరు సంవత్సరాలుగా అడ్డురాని పార్టీ దిమ్మె ఇప్పుడెందుకు అడ్డమొచ్చిందో అర్ధంకావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య విభాగం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆచంపాటి వెంకటకృష్ణ, మొక్కపాటి కృష్ణ, ఎం రవీందర్, అత్తోట జోసఫ్, ఎలికా శ్రీకాంత్‌యాదవ్, గనిక జాన్సీరాణి, దాసరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

నకలీ పాస్ పుస్తకాలతో రుణాలు
బ్యాంకర్లకు టోకరా
కారంపూడి, మార్చి 13: నకిలీ పాస్ పుస్తకాలతో మండలంలోని వివిధ బ్యాంకుల శాఖల నుండి 80 లక్షల రూపాయలకు పైగా రుణాలు పొందినట్లు సోమవారం వెలుగుచూసింది. బ్యాంకర్లు సాధారణ రైతులకు రుణాలు మంజూరు చేయాలంటే అన్ని పత్రాలను పరిశీలించి, బ్యాంకుల చుట్టూ కాళ్ళు అరిగేటట్లు తిరిగితే వివిధ రుణాలు మంజూరు చేస్తారు. అలాంటివి నకిలీలు రంగప్రవేశం చేస్తే అలాంటిది ఏమీ లేకుండా ఇచ్చిందే తడవుగా రుణాలను మంజూరు చేయడం వెనుక పెద్ద మాఫియా ఉన్నట్లు తెలుస్తోంది. అందినకాడికి అందినట్లు దండుకుని, ఇటు రెవెన్యూ అధికారుల సంతకాలతో బ్యాంకుల్లోకి ప్రవేశిస్తే రుణాలు సులువుగా మంజూరవుతున్నాయి. కారంపూడి, బొల్లాపల్లి మండలాలకు చెందిన భూములను చూపించి, నకిలీ పాస్ పుస్తకాలను పొందుతూ, రుణాలను తీసుకుంటున్నారు. సెంటు భూమిలేని వారుకూడా ఐదు నుండి పది ఎకరాల భూమికి నకిలీ పాస్ పుస్తకాలు పొందుతూ బ్యాంకర్లకు టోకరా కొడుతున్నారు. వినుకొండను కేంద్రంగా చేసుకుని, ఒక నకిలీ రాకెట్ విజయవాడ వరకు దళారుల ద్వారా పాస్ పుస్తకాలను మంజూరు చేస్తున్నట్లు తెలుస్తుంది. మండలంలోని ఈ విషయం గుప్పుమనడంతో ఓ మహిళ నకిలీ పాస్ పుస్తకంతో పొందిన రుణాలను సోమవారం గుట్టుచప్పుడు కాకుండా చెల్లించినట్లు తెలిసింది. నకిలీ పాస్ పుస్తకాల రాకెట్‌పై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు దాడులు చేస్తే మరికొన్ని విషయాలు వెలుగుచూస్తాయని పలువురు కోరుతున్నారు. బ్యాంకు రికార్డులు పరిశీలిస్తే ఎక్కడ ఎక్కడ ఏఏ భూములకు సృష్టించి, పాస్ పుస్తకాలు పొందారో తెలుస్తుందని అంటున్నారు. ఇదిలా ఉండగా, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకుల్లో నకిలీ పాస్ పుస్తకాలతో ఎంతో మంది రుణాలు పొందినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై వెంటనే ఉన్నత అధికారులు చర్యలు చేపడితే అసలు నిజాలు బయటకు వస్తాయని కొంతమంది ఖాతాదారులు అంటున్నారు. సమగ్ర విచారణ చేయించి నిందితులను బహిర్గతం చేయాలని రైతులు కోరుతున్నారు.
*బ్యాంక్ మేనేజర్ వివరణ..
బ్యాంకులో రుణాలు పొందిన మాట వాస్తవమేనని, అవి అసలివా? లేక నకిలీవా? తేలుస్తామని, కొద్ది సమయంలోనే రికార్డులు పరిశీలించి, పూర్తి వివరాలను మీడియాకు అందచేస్తామని బ్యాంక్ మేనేజర్ రమేష్ విలేఖరులకు తెలిపారు. అలాంటిది ఏమైనా ఉంటే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఒప్పిచర్ల గ్రామానికి చెందిన బి దుర్గమ్మ ఫిబ్రవరి 23వ తేదీన బొల్లాపల్లి మండలం మేళ్లవాగు గ్రామంలో నాలుగు ఎకరాల భూమికి 2.50లక్షల రూపాయల రుణం పొందిందని, దీనిపై పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు మేనేజర్ ఫణిధర్ తెలిపారు.

18వ శ్రీ మహాలక్ష్మీయాగానికి వేదికగా గుంటూరు
గుంటూరు (కల్చరల్), మార్చి 13: ఇప్పటివరకు రాష్ట్రంలోని పలు ప్రధాన పట్టణాలు, తిరుపతి పుణ్యక్షేత్రంతో పాటు అనేక ఆధ్యాత్మిక క్షేత్రాల్లో లోక కళ్యాణార్ధం మహాలక్ష్మీ యాగాలు నిర్వహించిన భీమవరం శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠాధిపతి మరొక విశేషమైన యాగానికి శ్రీకారం చుడుతున్నారు. అందుకు వేదికగా గుంటూరు నగరంలోని విశాలమైన పోలీసుపెరెడ్‌గ్రౌండ్‌ను ఎంచుకున్నారు. మన దేశం అన్నిరంగాల్లో అభివృద్ధిపథంతో పాటుగా ఆర్థికంగా బలోపేతం కావాలన్న ఆశయంతో శ్రీ రామచంద్ర రామానుజ జీయర్‌స్వామి ఈ ప్రత్యేకమైన శ్రీ మహాలక్ష్మీ యాగానికి నడుంకట్టారు. 16వ యాగాన్ని తిరుపతిలోని శ్రీవారి సన్నిధిన, 17వ యాగాన్ని భీమవరంలోనూ, ఏప్రిల్ 2 నుంచి నగరంలో 18వ యాగాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు నేపథ్యంగా ఈనెల 15 బుధవారం ఉదయం 8 గంటలకు యాగ వేదికైన పోలీసు పెరెడ్‌గ్రౌండ్‌లో భూమిపూజను నిర్వహిస్తామని స్వామివారి ప్రధాన కార్యదర్శి రామానుజ కళ్యాణ చక్రవర్తి సోమవారం ఇక్కడ విలేఖర్లకు తెలిపారు. యాగం విజయవంతమయ్యేందుకు ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ 15 నుండి 24వ తేదీ వరకు గుంటూరు నగరం, పరిసర ప్రాంతాల్లో స్వయంగా స్వామీజీ భిక్షాటన పాదయాత్ర చేస్తారని చక్రవర్తి వివరించారు. ఈ సందర్భంగా స్వామీజీ మంగళాశాసనం చేస్తూ ఇప్పటివరకు నిర్వహించిన యాగాలన్నీ సత్ఫలితాలిచ్చాయని, ప్రజలంతా శాంతి సౌఖ్యాలతో పాటు సర్వ సంపదలు, ఆరోగ్యంతో సుఖప్రదమైన జీవనాన్ని గడపాలన్న ఆశయంతోనే వీటిని ప్రసాదించే మహాలక్ష్మిదేవికి ప్రధాన సంకల్పం చేస్తూ యాగాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఏప్రిల్ 2వ తేదీ టిటిడి కళ్యాణ మండపం నుండి పోలీసుపెరెడ్ గ్రౌండ్ వరకు శోభాయాత్ర, 3వ తేదీన 108 కలశాలతో అభిషేకం, సుదర్శన సహస్రనామ ఉపదేశం, 5వ తేదీ మహాలక్ష్మీ యాగానికి ప్రారంభం తదితర కార్యక్రమాలు జరుగుతాయని, 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు లక్ష్మీనారాయణుల కళ్యాణం, చివరి రోజైన 10వ తేదీ శ్రీపుష్పయాగంతో కార్యక్రమాలు ముగుస్తాయని జీయర్‌స్వామి వివరించారు. విలేఖర్ల సమావేశంలో యాగ ఆహ్వాన సమితి సభ్యులు పాల్గొన్నారు.

సంఘటిత ఉద్యమాల ద్వారానే గిరిజన సమస్యలకు పరిష్కారం
గుంటూరు (పట్నంబజారు), మార్చి 13: శతాబ్దాలుగా గిరిజనులు ప్రకృతిమాత ఒడిలో సేదతీరుతూ తమ జీవనాన్ని కొనసాగించారని, నాగరిక సమాజం అభివృద్ధి పేరుతో తమ జాతుల మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్నారని, సంఘటిత ఉద్యమాల ద్వారానే హక్కులు పరిరక్షించుకోవచ్చని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మానుపాటి నవీన్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక అమరావతి రోడ్డులోని ఎరుకుల కాలనీలో నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా, గుంటూరు నగరం తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల నూతన కమిటీల ఆవిర్భావ సభ సంఘ జిల్లా అధ్యక్షుడు పాలపర్తి బాలాజీ అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు నవీన్ మాట్లాడుతూ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగ ఫలాలు అతి తక్కువ శాతం మాత్రమే గిరిజనులు అందుకున్నారన్నారు. గిరిజనుల్లో ఈనాటికీ అక్షరాస్యతాశాతం 30 శాతం ఉండటంతోనే వెనుకబడి ఉన్నారన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా గల గిరిజనుల్లో 15 లక్షలు మంది మైదాన ప్రాంతాల్లో దుర్భర జీవనం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గిన్నీస్‌బుక్ ద్వారా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబును ఈనాటికీ రాష్ట్రప్రభుత్వం గుర్తింపునివ్వకపోవడం కుల ఆధిపత్య సమాజానికి నిదర్శనమన్నారు. సిసిఎస్ డిఎస్‌పి దేవరకొండ ప్రసాద్, ప్రభుత్వాసుపత్రి ఎడి ఉదయభాస్కర్, ఆచార్య ఎన్‌జి రంగా విశ్వవిద్యాలయం డీన్ పాలపర్తి సాంబశివరావు తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడా కృష్ణ, కోశాధికారి కుంభా ఉదయ్‌కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గరికపాటి సురేష్, మేడా గోపి, తోకల చిన వీరోజి, జిల్లా, నగర నాయకులు పాల్గొన్నారు.
అక్రమణల తొలగింపునకు కదిలిన అధికారులు
సత్తెనపల్లి, మార్చి 13:సత్తెనపల్లి మున్సిపల్ అధికారుల నుండి సిబ్బంది వరకు అవినీతిలో జోగుతున్నారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎట్టకేలకు సోమవారం పట్టణంలోని వివిధ చోట్ల నిబంధనలకు విదరుద్ధంగా నిర్మిస్తున్న నిర్మాణాలను కూల్చేందుకు మున్సిపల్ అధికారులు ఎట్టకేలకు కదిలారు. ఇదేవిషయమై ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆతుకూరి నాగేశ్వరరావు మున్సిపల్ అధికారులు సిబ్బంది చేయి తడపందే పనులు చేయడంలేదని, అక్రమ నిర్మాణాలకు అండగా నిలిచి వచ్చిన చోట వచ్చినట్లు దండుకుంటూ సత్తెనపల్లి పంచాయతీని బ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపణలు చేయడమేగాక, అవినీతిని నిరూపిస్తా నిరూపించని పక్షంలో తన పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరి ఆర్ధనగ్న ప్రదర్శినకు దిగిన వైస్ చైర్మన్ సంగతి పాఠకులకు విదితమే, ఈ నేమథ్యంలో కమిషనర్ జి సాంబశివరావు ఆదేశాలమేరకు పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలను తొలగింపునకు సోమవారం శ్రీకారం చుట్టారు. గార్లపాడు బస్టాండు సమీపంలోని గీతామందిరం వద్ద నూతనంగా నిర్మిస్తున్న నిర్మాణంలో సుమారు మూడు అడుగులు ముందుకు వచ్చిన స్లాబ్‌ను తొలగించారు. అదేవిధంగా సుగాలీ కాలనీలోని షాపింగ్ కాంప్లేక్స్ అక్రమ నిర్మాణాన్ని నిర్మాణాన్ని సుమారు ఏడు అడుగుల మేర తొలగించామని టిపియస్ అనురాధ విలేకర్లకు తెలిపారు. వీరి స్పందనపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనురాధ వెంట అప్రంటీస్ బిల్డింగ్ ఇన్స్‌పెక్టర్స్ దుర్గ్భావాని, శివకుమార్, సిబ్బంది కొత్తా శ్రీనివాసరావులు వున్నారు.
వైభవంగా నృసింహుని వసంతోత్సవం
మంగళగిరి, మార్చి 13: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మత్సవాల్లో భాగంగా సోమవారం చక్రవారి చూర్ణోత్సవం, వసంతోత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా స్వామివారి కల్యాణం అనంతరం ఫాల్గుణ బహుళ పాడ్యమి రోజున ఉదయం చూర్ణోత్సవం జరుపుకుంటారు. ఆ విధంగా చూర్ణోత్వం జరుపుకుని వసంతోత్సవం జరుపుకుంటూ స్వామివారు పురవీధుల్లో విహరించారు. పెదకోనేరు వద్ద చక్రస్నానం జరిపారు. పలువురు భక్తులు కూడా చక్న్రస్నానం ఆచరించారు. ఈ ఉత్సవానికి కైంకర్యపరులుగా కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, ఛాయాదేవి వ్యవహరించారు. తదుపరి పూర్ణాహుతి, ధ్వజ అవరోహణము చేశారు. గరుత్మంతుడు మొదట స్వామివారి కల్యాణానికి పిలిచిన దేవతలందర్నీ తిరిగి మరలా వారి స్థానములకు ధ్వజారోహణం. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని వసంతోత్సవం తిలకించారు. ఆలయ ధర్మకర్తలు కోసూరి శివనాగరాజు, రావుల శ్రీనివాస్, కొమ్మారెడ్డి వీరారెడ్డి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆలయ ఉపప్రధాన అర్చకులు నల్లూరి శ్రీరామచంద్ర భట్టాచార్యులు వసంతోత్సవ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ఇఓ మండెపూడి పానకాలరావు పర్యవేక్షించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ పుష్పయాగోత్సవం జరుగుతుందని ఇఓ పానకాలరావు తెలిపారు.
150 రోజుల పనిదినాలు కల్పిస్తాం...
బెల్లంకొండ, మార్చి 13: గ్రామాల్లో పేదలకు 100 రోజులు కాకుండా 150 రోజుల పనిదినాలు కల్పించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్ తెలిపారు. సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో గ్రావెల్ పనులతో పాటు మాగాణిలో పంటకాల్వల నిర్మాణం, నీరు-చెట్టు, ఎన్‌టిఆర్ జలసిరి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నియోజకవర్గంలోని బెల్లంకొండ మండలంలో అత్యధికంగా ఎన్‌టిఆర్ జలసిరి కార్యక్రమాల ద్వారా బోర్లు వేయించడం జరిగిందని, లేబర్ కాంపోండ్ ద్వారా 3 కోట్ల రూపాయల వరకు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎండిఒ భ్రమరాంబ, తహశీల్దార్, ఎపిఒ నారాయణ, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.