గుంటూరు

రాజధానిలో 7 ప్రధాన రహదార్ల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 25: రాజధాని ప్రాంతంలో 29 గ్రామాలను అనుసంధానించే 7 ప్రధాన రహదారుల నిర్మాణానికి ఎర్రబాలెం గ్రామంలో ఈనెల 29వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు. సింగపూర్ మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా రాజధానిలో 9 కానె్సప్ట్ నగరాలలో 27 టౌన్‌షిప్‌లతో జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ రూపొందించిన డిజైన్లను ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శనివారం శాసనసభ సమావేశపు హాలులో పరిశీలించారు. సంస్థ ప్రతినిధులు ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌పై పలువురు ప్రజాప్రతినిధులు సందేహాలను వ్యక్తంచేశారు. గతంలో జపాన్‌కు చెందిన మాకీ అసోసియేట్స్ డిజైన్లు మాస్టర్‌ప్లాన్‌కు తగ్గట్టుగా లేకపోవటంతో ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దుచేసుకుంది. తాజాగా జాన్సన్ సంస్థ రూపొందించిన డిజైన్లలో 15 శాతం రహదార్ల నిర్మాణానికి కేటాయించారు. అనంతపురం నుంచి అమరావతికి నేరుగా ఆరులైన్ల ఎక్స్‌ప్రెస్ హైవేతో పాటు రాజధాని నగర అంతర్భాగంలో టౌన్‌షిప్‌లను కలుపుతూ మరో 7 ప్రధాన రహదారుల నిర్మాణం జరగనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే డిజైన్లు పూర్తయ్యాయి. భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలని కూడా నిర్ణయించారు. మేజర్, మైనర్ ఆర్టీరియల్ రోడ్లు.. కలెక్టర్ రోడ్డు నిర్మాణాలు ముందుగా పూర్తిచేయనున్నారు. వీటికి ముఖ్యమంత్రి 29న ఉదయం 11 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన ఏర్పాట్లపై శనివారం కలెక్టర్ కాంతీలాల్ దండే అధికారులతో సమావేశమయ్యారు. సుమారు ఐదువేల మంది వరకు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా. వేసవి దృష్ట్యా మంచినీరు, వైద్య సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు. కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించాలని పోలీసుశాఖను ఆదేశించారు. సమావేశంలో జెసి కృతికా శుక్లా, నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ నాగలక్ష్మి, జిల్లా రెవిన్యూ అధికారి కొసనా నాగబాబు తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీల సంక్షేమానికి అంకితభావంతో కృషి
* ఎంపిలు రాయపాటి, గల్లా జయదేవ్
గుంటూరు, మార్చి 25: గత ప్రభుత్వాలు ముస్లిం, మైనార్టీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తే ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం వారి సంక్షేమం, అభివృద్ధి కోసం అంకితభావం, చిత్తశుద్ధితో కృషిచేస్తోందని నర్సరావుపేట, గుంటూరు పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివరావు, గల్లా జయదేవ్‌లు పేర్కొన్నారు. శనివారం స్థానిక మలినేని పెరుమాళ్లు ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి హిదాయత్ అధ్యక్షతన జరిగిన జాబ్‌మేళాలో ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. నవ్యాంధ్రలో మైనార్టీ సమాజంలో ఉన్న నిరుద్యోగ సమస్యను నిర్మూలించడమే చంద్రబాబు ధ్యేయంగా పెట్టుకున్నారని తెలిపారు. ప్రభుత్వం అందజేస్తున్న సాయం, చేయూతను అందిపుచ్చుకుని మైనార్టీలు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులు తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ముస్లింలు ధార్మికవిద్యతో పాటు
వృత్తిపరమైన విద్యారంగంలో కూడా రాణించాలని రాయపాటి, గల్లా కాంక్షించారు. కదిరి ఎమ్మెల్యే అత్తర్ చాంద్‌బాషా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ముస్లింలకు రాజకీయంగా ఎన్నో అవకాశాలు ఇచ్చిందని గుర్తుచేశారు. మైనార్టీ సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అహ్మద్ షరీఫ్, కార్పొరేషన్ డైరెక్టర్లు లాల్‌వజీర్, మొహిద్దిన్, బషీర్ అహ్మద్, విసి ఎండి ఉషాకుమారి, జి ఎం లియాఖత్, కళాశాల యాజమాన్యం, అధిక సంఖ్యలో మైనార్టీ యువత తదితరులు పాల్గొన్నారు. విజయవాడ, నెల్లూరు జిల్లాల్లో జరిగిన జాబ్‌మేళాలో 1000 మందికి ఉద్యోగాలు వచ్చాయని, గుంటూరులో జరిగిన జాబ్‌మేళాతో 2000 మందికి ఉపాధి లభిస్తుందని కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్ పేర్కొన్నారు.

గ్రంధి సుబ్బారావుకు అంతిమ వీడ్కోలు
* వేలాదిగా తరలివచ్చిన ప్రజలు
గుంటూరు కల్చరల్, మార్చి 25: వేలాదిమంది కుటుంబాలకు జీవనోపాధిని కల్పించి క్రేన్ వక్కపొడిని దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఖండాంతరాలలో కూడా పరిచయం చేసిన క్రేన్ సంస్థల అధినేత దివంగత గ్రంథి సుబ్బారావుకు శనివారం అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలు రంగాలకు చెందిన ప్రముఖులు, అసంఖ్యాకంగా తరలివచ్చిన ప్రజలు, క్రేన్ ఉద్యోగులు, ప్రజలు పలికారు. శుక్రవారం తెల్లవారుజామున తాను చికిత్స పొందుతన్న ప్రైవేటు ఆసుపత్రిలో అస్వస్థతతో మృతిచెందిన సుబ్బారావు పార్థివ దేహాన్ని కడసారి దర్శనార్థం ఆయన వ్యవస్థాపించిన సంపత్‌నగర్ ఫ్యాక్టరీలో ఉంచి అనంతరం రామనామ క్షేత్రం సమీపంలోని స్వగృహానికి శనివారం ఉదయం తరలించారు. జీయర్ సంప్రదాయాలకు అనుగుణంగా వైదిక కార్యక్రమాలను నిర్వహించి భారీ ఊరేగింపు నడుమ శ్రీనివాసరావుపేటలోని స్మశాన వాటికకు తరలించారు. గ్రంథి సుబ్బారావు ఏకైక కుమారుడు వెంకట లక్ష్మీకాంతారావు అంతిమ సంస్కారాలను నిర్వహించారు. శుక్ర, శని వారాల్లో అనేక రంగాల ప్రముఖులు ముఖ్యంగా దేశంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన క్రేన్ అనుబంధ సంస్థల వ్యాపారులు, నగర ప్రజలు కడసారిగా సుబ్బారావు భౌతికకాయాన్ని సందర్శించి కన్నీటి నివాళులర్పించారు. ఆయన మృతికి గౌరవార్థం ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక నివాళి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వ్యాపార వర్గాల వారు గౌరవ సూచకంగా సంతాపం ప్రకటించారు.