గుంటూరు

వైసిపి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 26: తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల్లో సమర్ధులైన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సూచించారు. ఆదివారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మండల, గ్రామ, జిల్లా స్థాయిలో సంస్థాగత ఎన్నికల తీరుపై విశే్లషించారు. ఎన్నికల అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి అభివృద్ధి పనికీ అడ్డుతగులుతోందని ఆరోపించారు. అభివృద్ధి నిరోధక ప్రతిపక్ష పార్టీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని నాయకులకు పిలుపునిచ్చారు. గత రెండున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణపై కూడా వివరించాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీలను నూరుశాతం అమలుచేసిన ఘనత తమ పార్టీకే దక్కిందన్నారు. బడ్జెట్‌లో నిరుద్యోగులకు 500 కోట్ల భృతి కల్పించామని, ఏడాదిలోనే సచివాలయం, శాసనసభ నిర్మాణాలను పూర్తిచేసి ప్రజలకు పాలనా వ్యవస్థను చేరువ చేశామన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు, శ్రీశైలం నీటిని రాయలసీమకు అందించటం ద్వారా కరవును అధిగమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇన్‌పుట్ సబ్సిడీని గతంలో కంటే త్వరితగతిన పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. రైతులు, డ్వాక్రా రుణమాఫీ ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలను చేపట్టారని అందుకే ప్రజల్లో తమ ప్రభుత్వం పట్ల విశ్వసనీయత పెరిగిందన్నారు. సంస్థాగత ఎన్నికల ప్రాధాన్యత, నియోజకవర్గాల వారీగా నిర్వహణ విధానం, బడ్జెట్ ప్రతిపాదనలు, గత రెండున్నరేళ్లుగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మండల ఎన్నికల కమిటీలకు అవగాహన కల్పించారు. కేంద్ర పార్టీ కార్యక్రమాల కన్వీనర్, ఎమ్మెల్సీ వివివి చౌదరి, రాష్ట్ర పార్టీ కార్యాలయ కార్యదర్శి ఏవి రమణ, ఎన్నికల కమిటీ సభ్యులు ఎంఎ షరీఫ్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు, వర్ల రామయ్య, రాష్ట్ర పార్టీ నాయకులు పాల్గొన్నారు. తొలుత చినరాజప్ప దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.

లక్ష్యసాధనకు సహకరించాలి
* బ్యాంకర్లకు మంత్రి ప్రత్తిపాటి పిలుపు
రూ.19600.39 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక

వ్యవసాయానికి 11634.97 కోట్లు

గుంటూరు, మార్చి 26: జిల్లా వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను అధిగమించేందుకు బ్యాంకర్లు సహకరించాలని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథిగృహంలో ఆదివారం 2017-18 ఆర్థిక సంవత్సరానికి రుణ ప్రణాళికను మంత్రి ఆవిష్కరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రాధాన్యత, ప్రాధానే్యతర రంగాలతో కలపి 19600.39 కోట్ల రుణ మంజూరు లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో వ్యవసాయనికి అత్యధికంగా 11వేల 634.97 కోట్లు కేటాయించారు. ఈ మొత్తంలో వ్యవసాయ పంట రుణాలకు 9020.32 కోట్లు, ఇతర రుణాలకు 1829.67 కోట్లు కాగా వౌలిక సదుపాయాలకు 784.98, పారిశ్రామిక రంగానికి 3370. 43, ప్రాధానే్యతర రంగాలకు 2060.19 కోట్లు , ప్రాధానే్యతర రంగాలకు 2534.8 కోట్లు కేటాయింపులు జరిపారు. గత ఏడాది వార్షిక రుణ ప్రణాళిక 16వేల 932.49 కోట్లు కాగా అంతకు 15.69 శాతం అధికంగా ప్రస్తుత ప్రణాళికను రూపొందించినట్లు మంత్రి ప్రత్తిపాటి వివరించారు. వ్యవసాయాన్ని లాభసాటి చేయటం, వృద్ధి రేటును పెంచటం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని నిధుల కేటాయింపు జరిపామన్నారు. ఏ విధమైన వడ్డీలేకుండా లక్ష లోపు పంట రుణాలను రైతులు పొందవచ్చని వెల్లడించారు. మూడు శాతం వడ్డీతో మూడు లక్షల మేర రుణాలు అందిస్తారన్నారు. రుణాలను సకాలంలో చెల్లిస్తే బ్యాంకుల ద్వారా రైతులు మరిన్ని ప్రయోజనాలు పొందే వీలు కలుగుతుందని చెప్పారు. నగదు రహిత లావాదేవీలపై మంత్రి మాట్లాడుతూ రైతుకు ఎలాంటి నిబంధనలు లేవన్నారు. సంక్షేమ పథకాల అమలుకు ఏ విధంగా లక్ష్యాలను నిర్దేశిస్తారో అదేవిధంగా కౌలు రైతులకు మంజూరుచేసే విషయంలో 5 నుంచి 10 శాతం లక్ష్య సాధనకు ఈ నెల 30న జరిగే రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. వార్షిక రుణ ప్రణాళికలో గుంటూరు జిల్లా ముందంజలో ఉందని తెలిపారు. ఆంధ్ర బ్యాంక్ డిజిఎం ధనుంజయ మాట్లాడుతూ బ్యాంకర్లు రైతులకు లబ్ధి చేకూర్చాలన్నారు. చైతన్య గ్రామీణ బ్యాంకు చైర్మన్ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలు, రైతులకు రుణ మంజూరులో గ్రామీణ బ్యాంకులు ముందంజలో ఉన్నాయన్నారు. నాబార్డు ఏజిఎం భవానీశంకర్ మాట్లాడుతూ విభజన నేపథ్యంలో వ్యవసాయ రుణాలు తగ్గుతాయనే భావన రైతుల్లో ఉందని గత రెండేళ్లలో వ్యవసాయానికి అధికమొత్తంలో రుణాలు అందించామన్నారు. వ్యవసాయశాఖ జెడి విడివి కృపాదాస్, ఎల్‌డిఎం సుదర్శనరావు, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
పెదకాకాని, మార్చి 26: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందిన సంఘటన ఆదివారం పెదకాకానిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... నవులూరుకు చెందిన రాచకొండ పున్నారావు (60), చినకాకానికి చెందిన చావలి శివయ్య (58) స్నేహితులు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండేవారు. ఆదివారం మంగళగిరి నుంచి టివిఎస్ వాహనంపై గుంటూరు వస్తుండగా వెనుకగా వస్తున్న టిప్పర్ అతివేగంతో ఢీకొట్టింది. సంఘటనా స్థలంలోనే పున్నారావు, శివయ్యలిరువురూ దుర్మరణం పాలయ్యారు. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నారు. పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పట్టణ శివార్లలో యువకుని దారుణ హత్య
*మొండాన్ని ఉంచి, తలను పట్టుకుపోయిన దుండుగులు
నరసరావుపేట, మార్చి 26: పట్టణ శివార్లలోని ఉప్పలపాడు గ్రామానికి వెళ్ళే మార్గంలోని ఆంజనేయస్వామి దేవాలయం వెనుక వైపు పోలాల్లో తెల్లవారు జామున ఒక యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేసి, తలను తీసుకెళ్ళిన సంఘటన పట్టణంలో భయబ్రాంతులకు గురిచేసింది. రూరల్ పోలీసుల కధనం ప్రకారం..మండలంలోని చినతురకపాలెం గ్రామానికి చెందిన అబ్బాస్ (25) గా గుర్తించడం జరిగింది. అబ్బాస్‌పై టూటౌన్‌లో రౌడీషీట్, జిల్లా మొత్తంలో వివిధ రకాలైన 20కేసులు ఉన్నట్లు తెలిపారు.రూరల్ పోలీస్ స్టేషన్‌లో అనుమానిత నిందితునిగా గుర్తింపు ఉంది. వేలి ముద్రలు, చేతికి ఉన్న గాయాల నేపథ్యంలో చినతురకపాలెం అబ్బాస్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు రూరల్ సిఐ ప్రభాకర్ సంఘటనా స్ధలానికి చేరుకుని, పరిస్ధితిని సమీక్షించారు. తలలేని మొండాన్ని స్ధానిక ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

నటనకు నిఘంటువు సావిత్రి

గుంటూరు (కల్చరల్), మార్చి 26: తెలుగునాట, ముఖ్యంగా గుంటూరు జిల్లాలో మారుమూల గ్రామంలో జన్మించి, అద్భుతమైన నటనాకౌశలాన్ని సొంతం చేసుకుని, దక్షిణభారత తెలుగుచిత్ర పరిశ్రమకు, అంతకుమించి వెండితెరకు వెనె్నల వెలుగులద్దిన మహానటి సావిత్రి అని శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రశంసించారు. ఆదివారం ఉదయం 10.45 గంటలకు నగరంలోని నాజ్‌సెంటర్ ఐలాండ్‌లో కళాదర్బార్ అమరావతి సంస్థ ఆధ్వర్యాన మహానటి సావిత్రి కాంస్య విగ్రహావిష్కరణ సభ జరిగింది. ఆరు లక్షల రూపాయల పై చిలుకు వ్యయంతో సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి స్వయంగా తయారు చేయించిన కాంస్య విగ్రహాన్ని డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్సీ, ఎపి కనీస వేతనాల బోర్డు చైర్మన్ డొక్కా మాణిక్యవరప్రసాద్, శాసనసభ్యులు మహ్మద్ ముస్త్ఫా, మోదుగుల వేణుగోపాలరెడ్డి, బహుభాషా నటీమణి సుహాసినిలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధాని నడిబొడ్డైన గుంటూరు నగరంలో సావిత్రి కాంస్య విగ్రహాన్ని అందంగా తీర్చిదిద్దే ఏర్పాటు చేయడం, తన చేతుల మీదుగా ఆవిష్కరించే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. తన నటజీవిత కాలంలోనూ, తదనంతరం కూడా తనదైన వ్యక్తిత్వాన్ని నింపుకున్న సావిత్రి నిజంగా మహానటేనని, అంతేకాకుండా మహావ్యక్తి కూడా అని శివప్రసాద్ అంజలి ఘటించారు. డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ రాష్ట్రం విడివడక ముందు హైదరాబాద్‌లోనే కార్యక్రమాలు జరిగేవని, నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత గుంటూరు, విజయవాడలలో ఇలాంటి మంచి కార్యక్రమాలు జరగడం శుభదాయకమన్నారు. కళాదర్బార్ సంస్థ 39 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విగ్రహావిష్కరణ నిర్వహించడం ఎంతైనా ముదావహమని అతిథులు అభినందించారు. శాసనసభ్యులు ముస్త్ఫా, మోదుగుల వేణుగోపాలరెడ్డి, అధ్యక్షత వహించిన మాణిక్యవరప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, నటీమణి సుహాసిని తదితరులు విగ్రహదాత చాముండేశ్వరిని ప్రత్యేకంగా కొనియాడారు. కళాదర్బార్ సంస్థ నిర్వాహకుడు పొత్తూరి రంగారావు, ఇతర కార్యవర్గ సభ్యులను మనఃపూర్వకంగా అభినందించారు. ఆవిష్కరణ సభలో గాయనీ, గాయకులు విజయలక్ష్మి, రాము, కార్యక్రమ నిర్వాహకుడు బి మోహనరావు, సావిత్రి జీవిత పుస్తక రచయిత గార్లపాటి పల్లవి, విగ్రహ శిల్పులు బి ప్రసాద్, కె ప్రసాద్, సభ్యులు పాల్గొన్నారు. ఆవిష్కరణ జరుగుతున్న సమయంలోనూ, అతిథులంతా సావిత్రి విగ్రహానికి పుష్పమాల అర్పిస్తున్న సందర్భంలోనూ అభిమానులు ఆ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి సావిత్రి పట్ల గౌరవ సూచికంగా నినాదాలు చేశారు.

ఆర్యవైశ్యుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

గుంటూరు (కల్చరల్), మార్చి 26: నిస్వార్ధమైన సేవలను చేస్తున్న గుంటూరు శ్రీ వాసవీసేవా సమితి సేవాసంస్థలకు దిక్సూచిలాగా నిలిచిపోతోందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని నగరంపాలెం కెకెఆర్ ఫంక్షన్‌ప్లాజాలో జరిగిన శ్రీ వాసవీసేవా సమితి రజతోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సమితి అధ్యక్షుడు కోట వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. పుల్లారావు మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా శ్రీ వాసవీసేవా సమితి లెక్కకు మిక్కిలిగా నిరంతరం సేవా కార్యక్రమాలను అంకితభావంతో నిర్వహిస్తూ వచ్చిందని, ఇలాంటి సంస్థను సామాజిక సేవకు ప్రతీకగా ఆయన అభివర్ణించారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి రాష్ట్రప్రభుత్వం ఎల్లప్పుడూ అండదండలందిస్తోందని, తనమటుకుతాను వ్యాపారవర్గాల వారికి ఏ సమస్య వచ్చినా తనకు చేతనైనంత రీతిలో సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. గౌరవ అతిథి, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టిన మహాత్మాగాంధీ బాటలో పయనిస్తున్న ఆర్యవైశ్యులు ఎల్లప్పుడూ సమాజ కళ్యాణ కారకులేనని ఆయన శ్లాఘించారు. వారు ఎప్పుడు పిలిచినా తన తోడ్పాటు అన్ని విధాలా ఉంటుందని ఆయన అన్నారు. నిర్వాహకులను అభినందించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన ఎఎన్‌యు మాజీ విసి ఆచార్య వి బాలమోహన్‌దాస్ విభిన్న కార్యక్రమాలను ఒక్కరోజులో అంకితభావం, సేవాదృక్పధంతో దిగ్విజయంగా పూర్తిచేసిన సేవాసమితి అని ఆయన కొనియాడారు. సభలో టిడిపి నాయకుడు మద్దాళి గిరిధరరావు, వైసిపి నాయకుడు కిలారి రోశయ్య, మార్కెట్ యార్డు చైర్మన్ కొత్తూరి వెంకట్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు తదితరులు కూడా సమితి సేవలను ఎంతగానో శ్లాఘించారు. పెద్దబాలశిక్ష పుస్తకాల రెండవ భాగాన్ని ఉచితంగా పంపిణీ చేయడమే కాకుండా, వయోవృద్ధులు, దివ్యాంగులకు, విద్యార్థులకు, గోల్డ్‌మెడల్ సాధించిన ప్రతిభామూర్తులను సత్కరించి, వారికి ఆర్థికంగా చేయూతనిచ్చారు. సభలో సమితి ప్రధాన కార్యదర్శి చుండూరి మురళీకృష్ణమూర్తి, వ్యవస్థాపక అధ్యక్షుడు కోట సత్యనారాయణ, కోశాధికారి సముద్రాల పుల్లారావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సాయంత్రం జరిగిన సభలో తాళ్లాయపాలెం శైవక్షేత్రం ఫీఠాధిపతి శ్రీ శివస్వామి అనుగ్రహ భాషణం చేసి ధర్మపరిరక్షణలో ఆర్యవైశ్యులు ఎప్పుడూ అగ్రభాగానే ఉంటున్నారని కితాబునిచ్చారు. సభ్యుల దంపతులకు సత్కారం జరిగింది.

28న అమరావతిలో శోభాయాత్ర

అమరావతి, మార్చి 26: తిరుమల తిరుపతి దేవస్థానం, దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన పుణ్యక్షేత్రమైన అమరావతిలో వెయ్యి మంది భజన మండలి భక్తులచే కోలాట ప్రదర్శనతో శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు దాస సాహిత్య ప్రాజెక్టు జిల్లా కో ఆర్డినేటర్ పి ముకుందేశ్వర స్వామి తెలిపారు. ఆదివారం అమరావతిలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శోభాయాత్రతో పాటుగా తిరుమల తిరుపతి నుండి విచ్చేసిన నిష్ణాతులైన గాయకులచే సంకీర్తనా కార్యక్రమం, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి టిఆర్ ఆనందతీర్ధాచార్యులు భక్తిప్రవచనం చేస్తారని తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున శోభాయాత్రలో పాల్గొనాలని ముకుందేశ్వర స్వామి పిలుపునిచ్చారు. సమావేశంలో భజన మండలి సభ్యులు పారేపల్లి పుష్పలత, వరలక్ష్మి, మద్ది మణికుమారి, పులిపాటి వెంకట పవన్‌కుమార్, చేగు సాంబశివరావు, పారేపల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు.