గుంటూరు

మిర్చి రైతుకు అండగా ఉంటాం:వైఎస్‌పి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 4: గిట్టుబాటుధర కోసం మిర్చి రైతులు చేస్తున్న ఆందోళనలకు, ఉద్యమాలకు వైఎస్సార్ సిపి అండగా ఉంటుందని, ముందుండి ఆయా కార్యక్రమాలను నడిపిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పలు విషయాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాక్షాత్తు జిల్లాకు చెందిన అప్పటి వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మిర్చిరైతులను ఆదుకునేందుకు మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించుతామని హామీ ఇచ్చారన్నారు. అయితే పక్షంరోజులు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తటంలేదని విమర్శించారు. రైతుకు గిట్టుబాటుధర అందే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఇందులో భాగంగా ఈనెల 6వ తేదీన మార్కెటింగ్ అధికారులను కలిసి పరిస్థితులను వివరించి వారిపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు రావి వెంకటరమణ, కావటి మనోహర్‌నాయుడు,డైమండ్‌బాబు, కొత్తా చిన్నపరెడ్డి, మాబు, యు నరసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భారతీయ మహిళలు

ప్రపంచానికే ఆదర్శం
గుంటూరు (కల్చరల్), ఏప్రిల్ 4: పురాణ కాలం నుంచి కూడా మన భారతీయ మహిళలు తమదైన రీతిలో సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షిస్తూ, ధైర్య, సాహసాలకు ప్రతీకలుగా నిలిచి ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచ మహిళా లోకానికే ఆదర్శ శిరోమణులుగా కీర్తి పొందుతున్నారని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ వి రాజేంద్రప్రసాద్ కొనియాడారు. మంగళవారం రాత్రి నగరంలోని బృందావన్ గార్డెన్స్ అన్నమయ్య కళావేదికపై సారస్వత కళానిధి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి రచించిన ‘ప్రకృతి విలాసం’ గ్రంథాన్ని ఆయన ఆవిష్కరించారు. రచయిత చిరకాలంగా చేస్తున్న సాహిత్య, సారస్వత సేవలను ఆచార్య రాజేంద్రప్రసాద్ ప్రశంసించారు. జిల్లా రచయితల సంఘం సంస్కృత భారతి జిల్లాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు జడ్పీసిఇఒ, రాష్ట్ర రచయితల సంఘం అధ్యక్షులు సోమేపల్లి వెంకటసుబ్బయ్య అధ్యక్షత వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసిన వెంకన్న దేవాలయ ఉపాధ్యక్షురాలు జి రామతులసమ్మ, గ్రంథాన్ని పరిచయం చేసిన సాహితీవేత్త డాక్టర్ బి వెంకటేశ్వర్లు, రచయితలు ఎస్‌ఎం సుబానీ, బొమ్ము ఉమామహేశ్వరరెడ్డి, జమదగ్ని తదితరులు రాజ్యలక్ష్మి కలం నుంచి మరిన్ని రచనలు రావాలని ఆకాంక్షించారు.సభానంతరం అందరూ మహిళలే ప్రధానపాత్ర వహించిన వనితా వైభవం సాహిత్య రూపకాన్ని ప్రదర్శించారు.

మిర్చి రైతులకు న్యాయం చేస్తాం...
గుంటూరు (పట్నంబజార్), ఏప్రిల్ 4: మిర్చి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని గుంటూరు మిర్చియార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు హామీ ఇచ్చారు. మంగళవారం మార్కెట్ యార్డు వద్ద ధర్నా చేస్తున్న రైతులతో మన్నవ మాట్లాడారు. మిర్చి ధరలు తగ్గుతున్న నేపథ్యంలో నాలుగు దఫాలుగా రైతు ప్రతినిధులు, ప్రభుత్వంతో చర్చించటం జరిగిందన్నారు. తక్షణమే మార్క్‌ఫెడ్‌ను రంగంలో దించి ధరలు పడిపోకుండా సిఎం చంద్రబాబునాయుడు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఆదేశించారని గుర్తుచేశారు. ధరలు మరింత పతనం కాకుండా ఎగుమతి, దిగుమతి వ్యాపారులతో సంప్రతింపులు జరుపుతామని ప్రకటించారు. రైతాంగ ప్రయోజనాలే తమకు ప్రాధాన్యమని, వారు దోపిడీకి గురికాకుండా యార్డులో అనేక సంస్కరణలు చేపట్టామన్నారు. రైతులకు నాణ్యమైన భోజనం, వసతి సౌకర్యం కల్పించామన్నారు. మచ్చు కాయల దోపిడీని అరికట్టటంతో పాటు వ్యాపారులు కమిషన్ అధికంగా వసూలు చేయకుండా నిరోధిస్తున్నట్లు తెలిపారు. గతంలో యార్డులో అనేక దొంగతనాలు జరిగేవని, వాటిని పూర్తిగా నియంత్రించామని చెప్పారు. తాము రైతులపక్షాన ఉంటే కొన్ని వ్యతిరేక శక్తులు రైతుల్ని రెచ్చకొడుతూ పబ్బం గడుపుకునేందుకు చూస్తున్నాయని ఆరోపించారు. మిర్చి నాణ్యత తగ్గడం, లారీల బంద్, పెద్దనోట్ల రద్దు, విస్తీర్ణం పెరగటం, ఎగుమతులు తగ్గిపోయిన కారణంగా ధరలు పతనమయ్యాయని వివరించారు. పక్కనే ఉన్న తెలంగాణ కంటే గుంటూరు మార్కెట్‌యార్డులో 30 శాతం ధరలు అధికంగా ఉన్నాయన్నారు. తాజాగా మోడల్ ధర 6వేలకు పైగా ఉందని, అయితే ఇది రైతుకు గిట్టుబాటు కాదన్నారు. ఒక్కో రైతు వద్ద నుండి పది క్వింటాళ్ల చొప్పున కనీస మద్దతుధర 7వేల కంటే తగ్గకుండా మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని తాము సిఎంను కలిసి నివేదించటం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి లక్షకు పైగా బస్తాలు వచ్చాయని, ఇక్కడి ఎగుమతిదార్లతో మాట్లాడి అన్ని చర్యలు తీసుకోవటం వల్ల కనీసం ఈ మాత్రం ధర పలుకుతోందని తెలిపారు. మిర్చి చివరి కోతలు కావడం వల్ల నాణ్యత తగ్గినట్లు చెప్పారు. ఏది ఏమైనా రైతులకు గిట్టుబాటుధర కల్పించటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. యార్డు కార్యదర్శి దివాకర్, అధికారులు సుబ్రహ్మణ్యం,శ్రీకాంత్ రైతు సంఘం ప్రతినిధులతో చర్చించారు.
రోడ్డు ప్రమాదంలో బిటెక్ విద్యార్థి మృతి
సత్తెనపల్లి, ఏప్రిల్ 4: గుంటూరు-మాచర్ల రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలందా ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. తోటి విద్యార్థులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు కంటెపూడి నలందా కాలేజీలో బిటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న దమ్మాటి యశ్వంత్‌కుమార్ (21) ద్విచక్ర వాహనంపై గుంటూరు వైపు వెళుతుండగా ఎదురుగా వస్తున్న డిసియం లారీ ఢీ కొంది. ఈ దుర్ఘటనలో యశ్వంత్‌కుమార్ తల పగిలి మెదడు బయట పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కంటెపూడి గ్రామ సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనను గుంటూరు నుండి సత్తెనపల్లికి వస్తున్న స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అక్కడ ఆగి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్ధి మృతదేహాన్ని చూసి ఆయన చలించిపోయారు. మృతదేహాన్ని సత్తెనపల్లి ప్రభుత్వ మార్చురీకి తరలించారు.