గుంటూరు

రాజధానికి భూములివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 14: రాజధాని ప్రాధికార సంస్థ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులకు ప్రభావిత నిర్వాసిత కుటుంబాలు భూములిచ్చి సహకరించాలని కలెక్టర్ కోన శశిధర్ కోరారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, అధికారులు, గ్రామస్తులతో కలెక్టర్ అధ్యక్షతన ప్రాజెక్ట్ స్థాయి ఆర్ అండ్ ఆర్ సమావేశం జరిగింది. సిఆర్‌డిఎ పరిధిలోని తుళ్లూరు మండలం నెక్కల్లు, అనంతవరం, వెంకటపాలెం, మంగళగిరి మండలం కురగల్లు-1, కురగల్లు-2, నవులూరు గ్రామాలకు చెందిన సుమారు 543.98 ఎకరాల భూమి ఆర్ అండ్ ఆర్ పరిధిలో ఉందన్నారు. ఇందుకు సంబంధించి 561 మంది నిర్వాసిత, ప్రభావిత కుటుంబాలు ఉంటాయన్నారు. భూ సేకరణ కింద వీరికి మూడు అంశాలలో పునరావాస, పునస్థాపన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందన్నారు. అభివృద్ధిచేసిన భూమి ప్రతిపాదన విషయంలో ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలు (ఇల్లు లేదా ఇంటితో పాటు భూమి కోల్పోయిన వారు) భూమి మాత్రమే కోల్పోయిన ప్రభావిత కుటుంబాలకు ఎక ఎకరంలో అభివృద్ధి పరచిన 20 శాతం అంటే ఎకరానికి 10 సెంట్లు, భూ యజమానులకు వారి భూముల దామాషా పద్దతిలో ఇచ్చేందుకు ప్రతిపాదిస్తామన్నారు. రెండవ అంశమైన ఉపాధి హామీ నగదు మంజూరు లేదా సాంవత్సరిక గ్రాంట్ విషయంలో కనీస వేతన సంపాదన నిమిత్తం ఉపాధి నైపుణ్య అభివృద్ధి శిక్షణతో ఉద్యోగం లేనప్పుడు ఒకే మొత్తంగా ఐదు లక్షలు లేదా నెలకు రెండువేల వంతున 20 సంవత్సరాలు సహాయం అందించబడుతుందని వివరించారు. మూడవ అంశంగా పునరావాస, పునస్థాపన నకాలనీ నందు ఒకేసారి చేసే పునర్మిర్మాణ బత్యంగా 50 వేలు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. వీటిని పరిశీలించి సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జెసి కృతికా శుక్లా, సిఆర్‌డిఎ అంచనాల విభాగం డైరెక్టర్ మోహన్‌రావు, డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో 6 బస్సుల సీజ్

గుంటూరు, జూన్ 14: అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ వాహనాలతో పాటు ఫిట్‌సెన్‌లేని విద్యా సంస్థల బస్సులను నియంత్రించేందుకు రవాణాశాఖ బుధవారం విస్తృత తనిఖీలు నిర్వహించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు కలిగిన ఆరు బస్సులను అధికారులు సీజ్ చేశారు. కాగా బెంగుళూరు నుంచి పాత బస్సులకు మరమ్మతులు జరిపించి విద్యా సంస్థలకు వినియోగిస్తున్నారనే ఫిర్యాదులు రవాణాశాఖకు అందాయి. దీంతో ఫిట్‌నెస్ సర్ట్ఫికెట్లను అధికారులు తనిఖీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2200 పాఠశాలల బస్సులు, మరో 559 బస్సులు వివిధ కళాశాలలకు చెందినవి ఉన్నాయి.. ఇందులో 1930 బస్సులకు ఫిట్‌నెస్ ఉన్నవిగా గుర్తించారు. మరో 859 సర్వీసుల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసినట్లు రవాణాశాఖ ఉప కమిషనర్ రాజారత్నం బుధవారం తెలిపారు. ఈనెల 12వ తేదీ వరకే ఫిట్‌సెస్ గడువు పూర్తయిందని నెలాఖరులోగా పూర్తిస్థాయిలో అనుమతులు తీసుకోకపోతే సంబంధిత సర్వీసులను నిలిపివేస్తామని డిటిసి స్పష్టం చేశారు. కాగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 18 బస్సులను సీజ్‌చేసినట్లు వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థలు ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

చంద్రన్న రాయితీ చెల్లింపులో జాప్యం వద్దు

గుంటూరు, జూన్ 14: మిర్చి రైతులకు ప్రభుత్వం అందిస్తున్న చంద్రన్న రాయితీలో జాప్యం తగదని రైతునాయకుడు, మాజీ రాజ్యసభసభ్యులు యలమంచిలి శివాజీ స్పష్టంచేశారు. బుధవారం మిర్చియార్డులో రైతులతో సమావేశమై నాణ్యతా ప్రమాణాలు, ధరల చెల్లింపు తదితర అంశాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు రైతుల ఖాతాలో నగదు జమ చేయటంలో జాప్యం జరుగుతోందని తమ దృష్టికి వచ్చిందని త్వరితగతిన చెల్లింపులు జరపాలని యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి మార్కెట్ సెస్ కింద 450 కోట్ల ఆదాయం వస్తోందని, ఇందులో గుంటూరు జిల్లా నుంచే 250 కోట్లు వసూలవుతున్నందున ఆ నిధులను రైతుల ప్రయోజనాలకే వినియోగించాలని సూచించారు. గుంటూ రు నుంచి శ్రీలంక, మలేషియా, బంగ్లాదేశ్ వంటి 10 నుంచి 15 శాతం ఎగుమతి అవుతోందని, లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం యార్డు ఉన్న 50 ఎకరాల స్థలం చాలదని, రెండు వందల ఎకరాల్లో యార్డు విస్తరణ జరపాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. వికేంద్రీకరణ వల్ల రైతులకు మేలు జరుగుతుందన్నారు. మిర్చి యార్డు అభివృద్ధి, రైతులకు సౌకర్యాల కల్పనపై ప్రభుత్వానికి తగిన నివేదిక అందజేస్తామని చెప్పారు. యార్డు చైర్మన్ మన్నవ మాట్లాడుతూ చంద్రన్న రాయితీ పథకం కింద 19వేల 497 మంది రైతుల ఖాతాలలో 43.87 కోట్లు జమ చేశామని, ఈ స్కీము కింద 37వేల 370 మంది రైతులకు లబ్ది చేకూరు తుందని వివరించారు. యార్డుకు తక్కువ రకం సరకు రవాణా అవుతోందని నాణ్యత ఉంటే మంచి ధర లభిస్తుందన్నారు. కోల్డు స్టోరేజీలలో నిల్వచేసిన వారు సరకును అలాగే నిల్వ ఉంచితే భవిష్యత్తులో ఎక్కువ ధర పలికే అవకాశాలు ఉన్నాయన్నారు. ధర పెరిగితే విస్తీర్ణం పెంచకుండా నియంత్రణ పాటించాలని ప్రత్యామ్నాయ పంటలను కూడా సాగుచేయాలని సూచించారు. కార్యక్రమంలో యార్డు కార్యదర్శి దివాకర్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ లాల్ వజీర్, హస్తకళల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ వట్టికూటి హర్షవర్ధన్, యార్డు వైస్‌చైర్మన్ కొత్తూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం ఎత్తిపోతలకు రూ. 35.93 కోట్లు

గుంటూరు, జూన్ 14: ధర్మవరం ఎత్తిపోతల పథకానికి రూ. 35.93 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని నరసరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు తెలిపారు. ఏపిఎస్‌ఐడిసి ఇఇగా బాధ్యతలు చేపట్టిన ఇఇ రెడ్డి బుధవారం గుంటూరులో ఎంపి రాయపాటిని కలుసుకున్నారు. పల్నాడు ప్రాంతంలో ఎత్తిపోతల పథకాలపై ఇరువురు చర్చించారు. రాయపాటి దత్తత తీసుకున్న దుర్గి మండలం ధర్మవరం ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించి ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా రాయపాటి మాట్లాడుతూ సనసద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద తాను దత్తత తీసుకున్న ధర్మవరం గ్రామంలో ఈ ఎత్తిపోతల పథకం ద్వారా మాచర్ల నియోజకవర్గంలోని బుగ్గవాగు రిజర్వాయర్ నీటిపై ఆధారపడి ధర్మవరం పరిసర గ్రామాల్లోని 3700కు పైగా ఎకరాలకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. ప్రతిష్టాత్మకంగా రైతులకు శ్రేయస్కరంగా ఉండే ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎత్తిపోతల పనులు త్వరితగతిన ప్రారంభించాలని ఇఇని కోరారు.
నేడు రైల్వేమంత్రి తెనాలి రాక
తెనాలి, జూన్ 14: కేంద్ర రైల్వేశాఖామంత్రి సురేష్‌ప్రభు గురువారం తెనాలి వస్తున్నట్లు బిజెపి పట్టణ అధ్యక్షుడు కాట్రగడ్డ విజయ్‌కుమార్, జిల్లా కార్యదర్శి పాటిబండ్ల రామకృష్ణ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఉదయం 9గంటలకు విఆర్‌ఆర్ అండ్ ఎన్‌విఆర్ కళాశాల నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా మంత్రి సురేష్‌ప్రభు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖామంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు, సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖామంత్రి నక్కా ఆనందబాబు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కె.హరిబాబు, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాజకుమారి కొత్తపేటలోని పార్టీ కార్యాలయానికి చేరుకుంటారన్నారు. స్థానిక మి ఛావాస్ గ్రాండ్ హోటల్ సమావేశ మందిరంలో సబ్‌కాసాత్..సబ్‌కా వికాస్ సభ జరుగుతుందని విజయ్‌కుమార్ వివరించారు.

త్రికోటేశ్వరుని సన్నిధిలో సామూహిక అక్షరాభ్యాసం
నరసరావుపేట, జూన్ 14: శ్రీత్రికోటేశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం శ్రీ మేథాదక్షిణామూర్తి హోమం, సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు మేథాదక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. సుమారు 500 మంది చిన్నారులను వారి తల్లిదండ్రులు తీసుకొచ్చారు. అదే విధంగా లోకకల్యాణార్ధం, సర్వకార్య సిద్ధికోసం, విద్యార్థుల సకల ఉన్నతి ప్రాప్తికోసం, బుద్ధి, మేధస్సు, బలం, తేజస్సు, ఆయుష్షు ప్రాప్తించేందుకు శ్రీ మేథాదక్షిణామూర్తి హోమాన్ని నిర్వహించారు. సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు ఉచితంగా పూజాసామాగ్రి, పలక, బలపం, దక్షిణామూర్తి రూపు, కంకణం, ప్రసాదం అందచేశారు. కార్యక్రమాన్ని గత రెండు సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నట్లు కోడెల తెలిపారు. చిన్నారులకు విద్యతో పాటు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఒనకూడాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అసిస్టెంట్ కమిషనర్ డి శ్రీనివాసరావు, దేవాలయం ట్రస్టీ ఎం రామకృష్ణ కొండలరావు బహుద్దూర్, ఆలయ ట్రస్టుబోర్డు సభ్యులు వెంకయ్య చౌదరి, బెల్లంకొండ పిచ్చయ్య, కొత్తూరి సుబ్బరాయుడు, చెరుకూరి ప్రసాద్, రామినేని భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా చిన్నారులకు పలకలు, బలపాలు, ప్రసాదాన్ని తొండపి శ్రీనివాసరావు, చెరుకూరి ప్రసాద్, బండారు రామారావు, కోడూరి సాంబశివరావు, చెరుకూరి నాగరాజు అందచేశారు.
నారాకోడూరు చెరువు తవ్వకాలపై ఆర్డీవో విచారణ
చేబ్రోలు, జూన్ 14: నారాకోడూరులోని ఊరచెరువును అక్రమంగా తవ్వుతుంటే మీరేం చేస్తున్నారు.. నిద్రపోతున్నారా అంటూ తెనాలి ఆర్డీవో జి నరసింహులు స్థానిక అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నారాకోడూరులో ఎలాంటి అనుమతులు లేకుండా పెద్దఎత్తున చెరువు తవ్వకాలు జరిపి లక్షలాది రూపాయల మట్టిని అమ్ముకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై గ్రామస్తులు కొందరు ఇటీవల జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తెనాలి ఆర్డీవో బుధవారం నారాకోడూరు చెరువును పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా జరిపిన తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపారు. ఆర్డీవో విచారణ విషయం తెలుసుకున్న అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక ప్రజలతో అక్కడకు రావటంతో ఆర్డీవో మండిపడ్డారు. అంతేకాక కోర్టు వివాదంలో ఉన్న కమ్యూనిటీ హాలు నిర్మాణం చేయటమే కాకుండా దానికి చెరువు మట్టి తవ్వి వినియోగించటంపై ఆర్డీవో స్థానిక అధికారులను అడిగి ఆరా తీశారు. కమ్యూనిటీ హాలు నిర్మాణాన్ని తొలగించాల్సిందిగా ఇంతకు ముందే హైకోర్టు ఆదేశాలు జారీచేసిన విషయం విదితమే. అయితే కోర్టు ఆదేశాలను ధిక్కరించి అక్రమ కట్టడాలను నిర్మించటంపై ఆర్డీవో విచారణ జరిపారు. మీరేదైనా చెప్పదలచుకుంటే..కోర్టులో చెప్పండి.. అప్పటి వరకు నిర్మాణ పనులను నిలిపివేయాలని అధికార పార్టీ నేతలకు సూచించారు. నీరు-చెట్టు పథకం కింద లేకపోయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా చెరువు తవ్వుతున్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని గ్రామ పంచాయతీ కార్యదర్శి కిషోర్‌ను ఆర్డీవో ప్రశ్నించారు. ఇందుకు కార్యదర్శి సమాధానమిస్తూ తన మాట లెక్కచేయకుండా చెరువు తవ్వారని బదులిచ్చారు. అక్రమంగా చెరువు తవ్విన విషయంపై పూర్తి నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని ఆర్డీవో విలేఖర్లకు తెలిపారు. చెరువు తవ్వకాలపై మైనింగ్, విజిలెన్స్ అధికారులు కొలతలు సేకరించారు. ఆర్డీవో వెంట మైనింగ్ విజిలెన్స్ ఎడి లక్ష్మణబాబు, డిపిఒ లక్ష్మణరావు, చేబ్రోలు తహశీల్దారు కార్యాలయ డిటి కృష్ణకాంత్, సర్వేయరు శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

భార్యను హతమార్చిన భర్త
తాడికొండ, జూన్ 14: నిండు నూరేళ్లు భార్యతో కలసి కాపురం చేయవలసిన భర్త కాలయముడయ్యాడు. గొడ్డలితో భర్త బుధవారం దాడి చేయడంతో తల భాగం ఛిద్రమై మాదాసు ఇంద్రాణి (65) తీవ్రంగా గాయపడింది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని నిడుముక్కల గ్రామానికి చెందిన మాదాసు చిన్న కిష్టారావు అతని భార్య ఇంద్రాణిపై అనుమానం పెంచుకుని తరచూ వేధించేవాడు. కష్టించి సంపాదించిన పది వేల రూపాయలు అనవసరపు ఖర్చులకు వినియోగించావంటూ తరచూ దూషించేవాడు. ఈనేపధ్యంలో కొద్ది రోజుల క్రితం భార్యపై చిన్నకృష్ణారావు విరుచుపడుతుండడంతో గ్రామస్తులు, కుమారుడు సర్దిచెప్పడంతో అప్పటికి తాత్కాలికంగా శాంతించి ఇంటి నుండి వెళ్లిపోయాడు. భార్యపై కక్ష పెంచుకున్న అతను బుధవారం రాత్రి ఇంటికి వచ్చి నిద్రిస్తున్న ఇంద్రాణిపై గొడ్డతో నరికాడు. బాధతో ఇంద్రాణి కేకలు వేయడంతో కుమారుడు సుధాకర్, ఇరుగుపొరుగువారి సహాయంతో 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్య సహాయం పొందుతూ ఆమె మరణించింది. సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వీరనాయక్ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.
బాబుకు గుణపాఠం చెప్తాం
గుంటూరు, జూన్ 14: బిసిలను ఓటుబ్యాంకుగా పరిగణిస్తూ, రాజకీయంగా, సామాజికంగా వెనుకబాటుతనానికి గురిచేస్తున్న చంద్రబాబుకు తగిన బుద్ధిచెప్పే సమయం ఆసన్నమైందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, కొలుసు పార్ధసారధి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎంపికైన మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, పదవీ ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం స్థానిక శ్రీ వెంకటేశ్వరా విజ్ఞాన మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని బొత్స సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 50 శాతం పైబడి ఉన్న బిసిల అభివృద్ధి, అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ చేసింది శూన్యమన్నారు. బిసిలకు జరుగుతున్న అన్యాయాలపై చంద్రబాబు సర్కారుపై వైఎస్ జగన్ అలుపెరగని పోరాటం చేస్తున్నారని తెలిపారు. బిసి సెల్ అధ్యక్షుడుగా ప్రమాణం చేసిన జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట తప్పారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ప్రవేశపెట్టిన ప్రతిపథకం బిసిలకు ఎంతగానో తోడ్పాటునిస్తుందన్నారు. అవినీతి, అరాచక, అప్రజాస్వామిక విధానాలతో ముందుకుసాగే చంద్రబాబుకు రాజకీయంగా భంగపాటు తప్పదని హెచ్చరించారు. కార్యక్రమానంతరం జంగా కృష్ణమూర్తిని నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రావి వెంకట రమణ, బొల్లా బ్రహ్మనాయుడు, కావటి మనోహర్‌నాయుడు, కాసు మహేష్‌రెడ్డి, కొత్తా చిన్నపరెడ్డి, పల్లపు శివ, పానుగంటి చైతన్య తదితరులు పాల్గొన్నారు.

ఘాట్‌రోడ్డు లైటింగ్ ప్రారంభం
మంగళగిరి, జూన్ 14: మంగళగిరి కొండపై స్వయంభువైన పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి వెళ్లే ఘాట్‌రోడ్డులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో 7 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను బుధవారం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిఎం మిశ్రా ప్రారంభించారు. ఎజిఎం శ్రీనివాస్, బ్రాంచి మేనేజర్ రమేష్‌బాబు, ఆలయ ఇఓ మండెపూడి పానకాలరావు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.