గుంటూరు

ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో రాజీలేని పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 18: ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో రాజీలేని పోరాటం చేస్తామని, ఎపి ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి అశోక్‌బాబు స్పష్టంచేశారు. ఆదివారం జిల్లా సంఘ ఎన్నికలు జరిగాయి. నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో అనంతరం జరిగిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడుతూ మంచి నాయకత్వాన్ని ఎన్నుకుంటే ఉద్యోగుల సమస్యలు సత్వరం పరిష్కారమవుతాయన్నారు. జిల్లాలోని 20 తాలూకా యూనిట్లలో సభ్యత్వాన్ని పెంచి సంఘ బలోపేతానికి నూతన కార్యవర్గం కృషి చేయాలన్నారు. ఉద్యోగులతో సఖ్యతగా మెలిగి వారి ఆదరాభిమానాలను పొందాలన్నారు. తప్పులు చేస్తే ఉపేక్షించేది లేదని, గత పాలకవర్గం సంఘానికి చెందాల్సిన డబ్బును సక్రమంగా వినియోగించకుండా, లెక్కలు చెప్పనందునే రద్దుచేయాల్సి వచ్చిందన్నారు. గుంటూరు జిల్లాలో 20 హెచ్‌ఒడిలు ఉన్నందున ఇకపై వారంలో ఒకరోజు గుంటూరుకు వచ్చి ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం ఎన్నికల అధికారులు ఎ విద్యాసాగర్, ఎండి ఇక్బాల్‌లు ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా అధ్యక్షుడుగా ఎస్‌కె బాజిత్‌బాషా, జిల్లా కార్యదర్శిగా సిహెచ్ రాంబాబు, కోశాధికారిగా జి శ్రీనివాసరావు, సహాధ్యక్షులుగా ఎస్‌డి జానీబాషా, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సిహెచ్ వీరబ్రహ్మేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా కె రాజుబాబు, జిఎస్ రాజ్‌కుమార్, ఎస్‌కె ఎంపి ఖాశిం, బి వెంకటప్పయ్య, కె శంకరబాబు, సంయుక్త కార్యదర్శులుగా ఎంవి వరప్రసాద్, బి కొండారెడ్డి, టి హరికిషణ్, వైవి సత్యనారాయణరావు, మహిళా సంయుక్త కార్యదర్శిగా కె శివజ్యోతిలు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని నగరశాఖ అధ్యక్ష, కార్యదర్శులు కెఎన్ సుకుమార్, ఎంఎన్ మూర్తితో పాటు పలు తాలూకా యూనిట్ల కార్యవర్గ సభ్యులు, వివిధ శాఖల ఉద్యోగ నాయకులు పెన్షనర్లు అభినందనలు తెలియజేశారు.

నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం

* వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లు మావే!
* టిడిపి జిల్లా అధ్యక్షుడు జివి

గుంటూరు, జూన్ 18: తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి వినుకొండ ఎమ్మెల్యే జివి ఆంజనేయులును రాష్ట్ర పార్టీ అధికారికంగా ప్రకటించింది. అంతకు ముందే జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో జీవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ లాంఛన ప్రాయంగా ఆయన నియామకాన్ని ఖరారుచేసింది. ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు జిల్లాలవారీ అధ్యక్షుల నియామకాలను ఆదివారం ప్రకటించారు. అధ్యక్షుడిగా జివి ఆంజనేయులుతో పాటు ప్రధాన కార్యదర్శిగా మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ లాల్ వజీర్ నియమితులయ్యారు. జిల్లా పార్టీ అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైన జీవి ఆంధ్రభూమితో మాట్లాడుతూ తనకు రెండోసారి అవకాశం కల్పించటం పట్ల పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అధిష్టానం తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయమన్నారు. సమర్ధవంతంగా పార్టీ పటిష్టతకు పనిచేస్తామని ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలను సమన్వయపరచి వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించేందుకు తనవంతు శక్తివంచన లేకుండా కృషిచేస్తామని స్పష్టం చేశారు. చిన్నచిన్న పొరపొచ్ఛాలు ఉంటే కుటుంబ సభ్యుల్లా పరిష్కరించుకుంటామన్నారు. పార్టీ విధివిధానాలను తుచ తప్పకుండా అమలుచేసి కార్యకర్తలు, అభిమానులకు అండగా నిలుస్తామన్నారు. పార్టీలోని ముఖ్యనేతలు, సీనియర్ల సహకారంతో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపిలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని, కార్యకర్తలు ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఎలాంటి అరమరికలు లేకుండా వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం, పెట్టుబడులు జిల్లాకు వస్తున్నాయని, ఉపాధి కల్పన పెద్దఎత్తున జరుగుతుందన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతుల రుణం ప్రభుత్వం తీర్చుకుంటుందని తెలిపారు. వచ్చే రెండేళ్లలో ప్రభుత్వ కార్యక్రమాలు విస్తృతం కానున్నాయని రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు అండగా నిలవాలన్నారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాజీపడే ప్రసక్తి లేదు
* ఎపి జెఎసి అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు

గుంటూరు, జూన్ 18: నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, సిపిఎస్ ఉద్యోగులతో పాటు విశ్రాంత ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణలో ఎపిజెఎసి అమరావతి అవిశ్రాంతంగా పోరాడుతుందని, ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆదివారం ఎపిజెఎసి ఆవిర్భావ గుంటూరు జిల్లా శాఖ ఆవిర్భావ సదస్సు స్థానిక రింగురోడ్డులోని సుర్యదేవర కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. తొలుత బృందావన గార్డెన్స్, ఎన్‌టిఆర్ స్టేడియం నుండి భారీ ఊరేగింపుతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యఅతిథిగా హాజరైన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మూడు నెలల క్రితం ఆవిర్భవించిన ఎపిజెఎసి రాష్ట్రంలోని అన్ని జిల్లా కమిటీల నియామకం పూర్తి చేసుకుందని, త్వరలో మండల కమిటీల ఏర్పాటుతో రాష్ట్రంలో బలీయమైన సంఘంగా రూపుదిద్దుకోనుందన్నారు. ఎపి జెఎసి సామాజికవర్గాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు లక్షలాది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, సిపిఎస్, విశ్రాంత ఉద్యోగుల ప్రయోజనాల కోసం పోరాడుతుందని వివరించారు. సభాధ్యక్షుడు ఎపిజెఎసి అమరావతి జిల్లా నూతన అధ్యక్షుడు కనపర్తి సంగీతరావు మాట్లాడుతూ జిల్లా ఆవిర్భావ సభకు అన్ని ఉద్యోగ వర్గాల నుండి మద్ధతు లభించిందన్నారు. సమస్యలు ఏవైనా ఉంటే రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. అనంతరం అమరావతి జెఎసి నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షులుగా కనపర్తి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా సిహెచ్ వెంకయ్య, కార్యదర్శిగా అంబటి వెంకటస్వామి, కోశాధికారిగా ప్రతాప్‌గౌడ్, ఉపాధ్యక్షులుగా జి సురేష్‌నాయుడు, ఝాన్సీరాణి, జి సత్యనారాయణ, ఎం శ్రీనివాసరావు, టి వెంకటేశ్వర్లుతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల నుండి 22 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నేటి నుండి రంజాన్ తోఫా
* నాణ్యత, కచ్చితమైన తూకాలు పాటించకుంటే కఠిన చర్యలు: ప్రత్తిపాటి
తెనాలి, జూన్ 18: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ముస్లిం సంక్షేమంకోసం కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈరంజాన్‌కు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 12లక్షల మంది ముస్లిం సోదరులకు చంద్రన్న రంజాన్‌తోఫాను సోమవారం నుండి పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాలశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం తెనాలి పరిధిలోని పినపాడు సమీపంలోఉన్న సివిల్ సప్లారుూస్ గోదామును జిల్లా సివిల్ సప్లారుూస్ అధికారిణి మంజుభార్గవి, స్థానిక శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో కలసి ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి పుల్లారావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ముస్లిం మైనారిటీలకు టిడిపి ప్రభుత్వం అండగా ఉంటూనే వస్తోందన్నారు. వారి సంక్షేమం కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేయటం జరుగుతోందన్నారు. తిరిగి 2014లో టిడిపి ప్రభుత్వం నారా చంద్రబాబునాయుడు నాయకత్వాన అధికారంలోకి వచ్చిన తరువాత మరెన్నో నూతన పథకాలు ప్రవేశపెట్టి వారు ఆర్ధికంగా ఎదిగేందుకు కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే ప్రతి రంజాన్ పండగకు చంద్రన్న తోఫాను ముస్లిం మైనారిటీలకు పంపిణీ చేయటం జరుగుతోందన్నారు. పండుగనాడు ప్రతి పేదవాడు కడుపునిండా తిండి తినాలనే సత్సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో రంజాన్ తోఫాను సోమవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13జిల్లాల పరిధిలోని రేషన్ డీలర్ల ద్వారా సోమవారం నుండి పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. అయితే తోఫాలో పొందుపరిచిన 515రూపాయల విలువగల నిత్యావసర వస్తువుల నాణ్యతా ప్రమాణాలు, కొలతలు, తూకం, ప్యాకింగ్ విధానం తదితర అంశాలను పరిశీలించినట్లు చెప్పారు. నాణ్యత, తూకంలోగాని ఎటువంటి లోపాలు తలెత్తినా కఠిన చర్యలు తీసుకుంటామని, అనుమానం వచ్చిన సరుకులను ల్యాబ్‌కుపంపి నివేదికల ఆధారంగా సంబందిత డీలర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చంద్రన్న తోఫా పంపిణీ చేయటం ద్వారా రాష్ట్రంలో 12లక్షల మంది ముస్లిం మైనారిటీలు లబ్దిపొందుతుండగా 65కోట్ల మేరకు రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతుందన్నారు. తెనాలి శాసన సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీల కోసం అమలుచేస్తున్న చంద్రన్న రంజాన్ తోఫాను ముస్లిం సోదరులు సక్రమంగా సద్వినియోగం చేసుకొని మేలుచేసిన ప్రభుత్వాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ జి నరసింహులు, తహశీల్దార్ జివి సుబ్బారెడ్డి, స్థానిక సివిల్ సప్లరుూస్ అధికారులు, టిడిపి నాయకులు ఖుద్దూస్, పుల్లారావు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నరసరావుపేటలో హ్యాపీ సండే
నరసరావుపేట, జూన్ 18: స్ధానిక పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సంతోషాల ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల నుండి వచ్చిన విద్యార్ధినీ, విద్యార్థులు అనేక ఆటలు, పాడి ఆనందాన్ని పంచుకున్నారు. మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా, కమీషనర్ భానూప్రతాప్ తాడు ఆట ఆడారు. విద్యార్థులు పాము, నిచ్చెన కార్యక్రమంలో పాల్గొన్నారు.అదే విధంగా మ్యాజిక్ షో నిర్వహించారు. వాలీబాల్ ఆటలు ఆడారు. మున్సిపల్ ఉద్యోగి మస్తాన్‌రావు ఒక ప్రత్యేక వేషంలో ఎయిడ్స్ ఎవెర్‌నెస్‌పై జల్సారాయుడుగా ప్రేక్షకులను ఆనందపరిచారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ భానూప్రతాప్ మాట్లాడుతూ ప్రతి నెల మూడో ఆదివారం ఈ హ్యాపీ సండే కార్యక్రమాన్ని స్ధానిక మున్సిపల్ హైస్కూల్లోని గురజాడ కళామందిర్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. చైర్మన్ సుబ్బరాయగుప్తా మాట్లాడుతూ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం దిద్దారని తెలిపారు. అదే కోవలో ఇక నుండి విద్యార్థులకు, ప్రజలకు హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

మాతృభాషను ప్రేమించే కవిత్వాన్ని అందించండి
గుంటూరు (కల్చరల్), జూన్ 18: మనల్ని మానవీయతా మూర్తులుగా, సంస్కృతి, సంప్రదాయ వేత్తలుగా తీర్చిదిద్దిన మాతృభాషను, జన్మభూమిని ప్రేమించే అసలు సిసలైన కవిత్వాన్ని అందించాల్సిందిగా ప్రముఖ కవి, రచయిత డాక్టర్ బీరం సుందరరావు పిలుపునిచ్చారు. ఆదివారం బ్రాడీపేటలోని ఎస్‌హెచ్‌ఒ ప్రాంగణంలో డాక్టర్ రావి రంగారావు అధ్వర్యంలో అమరావతి సాహితీ మిత్రుల గోష్ఠి జరిగింది. మాసం మాసం ఈ సంస్థ ఏర్పాటు చేస్తున్న సాహిత్య సమావేశంలో భాగంగా ప్రధానవక్తగా డాక్టర్ బీరం ప్రసంగిస్తూ వర్ధమాన, ఔత్సాహిక కవులు, రచయిత, రచయిత్రులు మంచి కవిత్వం రాయాలంటే ముందుగా మహాకవుల కవిత్వాలు, వారి రచనలను ప్రతినిత్యం అధ్యయనం చేయాలని సూచించారు. వీటికితోడుగా భాషపై పట్టు సాధించాలని ఆయన కోరారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని, మాతృదేశాన్ని ప్రేమించే మంచి కవిత్వం నేటి కవుల కలాల నుంచి సమాజానికి అందాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇందుకు అమరావతి సాహితీమిత్రుల ప్రతినెలా సాహిత్యగోష్ఠులు వేదిక కావాలని ఆయన ఆకాంక్షించారు. రైతు, అమ్మ, నాన్న, నేటి విద్యావిధానం, ముఖ్యంగా కానె్వంట్ చదువులపై ఆయన చెప్పిన కవితలకు సాహిత్యాభిమానుల నుంచి మంచి ప్రతిస్పందన లభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన సమ్మేళనంలో కందిమళ్ల శివప్రసాద్, డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, కలవకొల్లు సూర్యనారాయణ, నందిపాటి శివరామకృష్ణయ్య, పెనుమాక నాగేశ్వరరావు, జె భవభూతి శర్మ, ఇ చంద్రయ్య, షేక్ ఖాశింబీ, తాటికోల పద్మావతి, టి పార్థశ్రీ, జి లలితా శేఖర్, ఎం శారద, వైహెచ్‌కె మోహనరావు తదితరులు స్వీయ కవిత్వాలను వినిపించారు. సభా ప్రారంభంలో ఇటీవల దివంగతుడైన జ్ఞానపీఠ పురస్కార గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సినారేకు కవితాంజలి సమర్పించారు.

చిరస్మరణీయుడు సినారె
తెనాలి,జూన్ 18: అభ్యుదయ కవి డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి చిరస్మరణీయుడని తెనాలి శాసన సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఏపి అభ్యుదయ రచయితల సంఘం, ప్రజ్వలిత సంయుక్త ఆద్వర్యంలో ఆదివారం స్థానిక నందులపేటలోని సీనియర్ సిటిజన్స్ హాలులో డాక్టర్ సి నారాయణరెడ్డి సంస్మరణసభ జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆలపాటి మాట్లాడుతూ రచయిత, అభ్యుదయ కవి, సినీ పాటల రచయితగా అంచలంచలుగా ఎదిగిన డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి ఙ్ఞనపీఠ్ అవార్డు పొంది తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పారని ఆయన సేవలను కొనియాడారు. విశ్వంభరతో తెలుగు భాషాధ్యకతను ప్రజ్వలింపజేసిన సినారే ఆదర్శనీయుడని పేర్కొన్నారు. అటువంటి మహారచయితను కోల్పోవటం దురదృష్టకరం అన్నారు. తొలుత సినారే చిత్రపటానికి పూలమాలలువేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో చెరుకుమల్లి సింగారావు, కనపర్తి అబ్రహాం, శివప్రసాద్, తపస్వి, నాగళ్ళ దుర్గాప్రసాద్, ఆనంద్‌లతోపాటుగా అనేక మంది రచయితలు, కవులు, కళాకారులు పాల్గొన్నారు.

ఆరోగ్య పరిరక్షణకు యోగా దోహదం
తెనాలి, జూన్ 18: పురాతన భారతీయ సంస్కృతి భారతదేశానికి ఇచ్చిన అమూల్యమైన కానుక యోగాయని ఎన్‌సిసి అధికారి బి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం ఐతానగర్ ఎన్‌ఎస్‌ఎస్‌ఎం పాఠశాలలో విద్యార్థులకు యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వెంకట్ మాట్లాడుతూ యోగా ఆలోచన, ఆచరణకు మద్య ప్రకృతికి మనిషికి మధ్య సమతుల్యాన్ని పెంచుతుందన్నారు. ఆరోగ్యపరిరక్షణకు ఒక పవిత్రమైన మార్గమన్నారు. ప్రధాని నరేంద్రమోదీ భారతీయ యోగాను ప్రపంచస్థాయికి తీసుకువెళ్ళటం శుభపరిణామంగా చెప్పారు. ఐక్యరాజ్యసమితి యోగాను ఓజీవన విధానంగా ప్రకటిస్తూ జూన్ 21న అంతర్జాతీయ యోగాడేగా ప్రధాని పిలుపు అందుకొని ప్రపంచంలోనే అతిపెద్ద యువజన వ్యవస్థ ఎన్‌సిసి జాతీయ శిక్షణ సేవకులైన 13లక్షల సుశిక్షితులైన క్యాడెట్స్ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘హమ్‌యోగాదిన్’ను 2015జూన్ 21లో జరిపి ప్రపంచ రికార్డును సాధించిందన్నారు. విఎస్‌ఆర్ కళాశాల ఆవరణంలో బుధవారం యోగా కార్యక్రమనికి కర్నల్ జెఎ మిర్, బి హరికృష్ణమనాయుడుల ఆధ్వర్యంలో జరుగుతుందని సుమారు 9819మంది ఎన్‌సిసి క్యాడెట్స్ గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో 73వేదికల నుండి ప్రదర్శనను ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు.