గుంటూరు

సేవకు సమాజంలో గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 22: సమాజ హితం అందరి లక్ష్యం కావాలని మంత్రులు ఉద్ఘాటించారు. శుక్రవారం కొరిటెపాడు హిందూ, ముస్లిం స్మశానవాటికల ఆధునికీకరణ చుక్కపల్లి శంకర్‌రావు చారిటబుల్ ట్రస్టు సహకారంతో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు, గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ నక్కా ఆనంద్‌బాబు, ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఆలపాటి రాజేంద్రప్రసాద్, కలెక్టర్ కోన శశిధర్ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ సమాజ సేవ చేసే వారికి గుర్తింపు ఉంటుందన్నారు. పేదలకు సేవలందించేందుకు ముందుకొచ్చిన చుక్కపల్లి చారిటబుల్ ట్రస్టును అభినందించారు. మరో మంత్రి ఆనంద్‌బాబు మాట్లాడుతూ స్మశాన వాటికల ఆధునికీకరణకు ప్రభుత్వం అన్నివిధాల సహకారం అందిస్తోందని తెలిపారు. కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ జన్మభూమికి సేవ చేయాలనే దృక్పధాన్ని ప్రతి ఒక్కరూ అలవరచుకుంటే రాష్ట్రం అన్నివిధాల అభివృద్ధి చెందుతుందన్నారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సమాజం మనకి ఏమిచ్చిందనేది ఆలోచించరాదని, సమాజానికి మనవంతు సేవలందించాలని హితవు పలికారు. తూర్పునియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ డబ్బు సంపాదన మీదే అందరి ధ్యాస ఉంటుందని అన్నారు. ట్రస్టు అధినేత రమేష్ మాట్లాడుతూ నాలుగు నెలల్లో స్మశాన వాటిక ఆధునికీకరణ పనులు పూర్తిచేయగలమని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వి పూర్ణచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే రాయపాటి శ్రీనివాస్, కమిషనర్ అనూరాధ పాల్గొన్నారు.

సామాజిక అసమానతలపై జాషువా పోరు

* స్పీకర్ కోడెల శివప్రసాదరావు

గుంటూరు, సెప్టెంబర్ 22: సామాజిక అసమానతలపై తన కవితలతో ఉద్యమించిన పోరాటయోధుడు, మహాకవి గుర్రం జాషువా అని రాష్ట్ర శాననసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. జాషువా జయంతి వారోత్సవాల్లో భాగంగా విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ, ఎన్‌టిఆర్ పరిషత్, జాషువా కళాపీఠం సంయుక్త ఆధ్వర్యాన వెంకటేశ్వరా విజ్ఞాన మందిరంలో శుక్రవారం రాత్రి జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. జాషువా జయంతి వారోత్సవాలంటే ఓ మహాకవిని జ్ఞప్తికి తెచ్చుకోవడమేనన్నారు. శాంతియుత సహజీవనాన్ని జాషువా కోరుకున్నారని గుర్తుచేశారు. సమసమాజ అభివృద్ధికి మంచిసాహిత్యం అందుబాటులోకి రావాలన్నారు. అర్బన్ ఎస్‌పి సిహెచ్ విజయారావు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం నిర్వహించే ఐఎఎస్, ఐపిఎస్, సివిల్ సర్వీస్ పరీక్షల్లో జాషువా రచించిన గబ్బిలం పుస్తకం తన విజయానికి దోహదపడిందని గుర్తుచేశారు. తెలుగు సాహిత్యంలో జాషువాది ఓ ప్రత్యేకస్థానం అన్నారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ జాషువా జయంతి వారోత్సవాలను పురస్కరించుకుని పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. వారోత్సవాల్లో జిల్లాకు చెందిన సాహితీప్రియులంతా హాజరు కావాలని కోరారు. తొలుత జాషువా చిత్రపటానికి స్పీకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి హిదాయత్, శాసనమండలి మాజీ సభ్యులు మహ్మద్ జాని, కె ఎస్ లక్ష్మణరావు, ఆచార్య కొలకలూరి ఇనాక్, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్ పాల్గొన్నారు.

కుక్కల వేటలో మున్సిపల్ అధికారులు

గుంటూరు, సెప్టెంబర్ 22: అడవి తక్కెళ్లపాడు ఘటనతో మునిసిపల్ యంత్రాంగం కుక్కలవేట మొదలుపెట్టారు. చిత్రమేమంటే నాలుగైదు కుక్కలు తెగబడి ముక్కుపచ్చలారని బాలుడ్ని మట్టుపెడితే వాటిని నిర్మూలించే పనులు చేపట్టక పోగా వాక్సినేషన్ వేసిన లెక్కలు తీస్తున్నారు. నగరం మొత్తంగా 11 వందల కుక్కలకు పైగా వాక్సినేషన్ వేసినట్లు చెప్తున్నారు. కుక్కలు కుటుంబ నియంత్రణకు అంతా సహకరించాలని ఇందుకోసం ఏటుకూరు రోడ్డులో గల కుటుంబ నియంత్రణ ఆసుపత్రిలో శస్తచ్రికిత్సలు నిర్వహించడం వల్ల సంతానోత్పత్తి తగ్గుతుందని తద్వారా నియంత్రించ వచ్చనే సూత్రీకరణలు చేస్తున్నారు. అవసరమైతే పశుసంవర్ధకశాఖ సహాయంతో తెనాలిలో కూడా కుక్కల కుటుంబ నియంత్రణ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అసలు సమస్యకు మూలాలు అనే్వషించకుండా అధికారులు చేస్తున్న ప్రకటనలకు అంతా విస్తుపోతున్నారు. ఇదిలా ఉండగా గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు, అర్బన్ ఎస్‌పి సిహెచ్ విజయారావు బాధిత కుటుంబాన్ని పరామర్శించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి ఆనంద్‌బాబు మాట్లాడుతూ ప్రభుత్వం తరుపున బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఎండమావిలా పేదలకు సొంతిల్లు

*అర్హుల జాబితా తేల్చడంలో అంతులేని జాప్యం

మంగళగిరి, సెప్టెంబర్ 22: పట్టణంలో సొంతింటి కల నెరవేర్చుకోవాలనే పేదల ఆశ ఏళ్లు గడుస్తున్నా కలగానే మిగిలి పోతోంది. పట్టణ శివారులోని రాజీవ్ గృహకల్ప ప్రాంగణంలో 2009లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేదలకు జి ప్లస్ 2 పద్ధతిలో ఇళ్లు నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. నాటినుంచి శిలాఫలకం దర్శనమివ్వడం మినహా నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో విజయం సాధించిన తెలుగుదేశం ప్రభుత్వం కూడా పేదలకు సొంతింటి నిర్మాణంపై ఇప్పటి వరకు పునాదిరాయి వేయలేక పోయింది. కేంద్రంలో నరేంద్రమోడి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి ప్రకటించిన లక్షా 93 వేల గృహాల్లో మంగళగిరి పురపాలక సంఘానికి 2592 గృహాలను మంజూరు చేశారు. పట్టణ శివారులోని రాజీవ్ గృహకల్ప పక్కనే 14.72 ఎకరాలను జి ప్లస్ 3 పద్ధతిలో పేదలకు ఇళ్లు నిర్మించేందుకు కేటాయించారు. రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన గావించి 3 నెలలవుతున్నా మంగళగిరిలో మాత్రం పునాది పడలేదు. అర్హుల జాబితా తేల్చడంలోనే అధికార యంత్రాంగం నిమగ్నమై ఉంది. లబ్దిదారుల జాబితా తేల్చడంలో అంతులేని జాప్యం కొనసాగుతోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు అర్హుల జాబితా తేల్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలో మొత్తం 5962 పేద కుటుంబాలు గృహాలు పొందేందుకు అర్హత సాధించాయని మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి ప్రకటించారు. ఇళ్ల నిర్మాణంలో జాప్యంపై అధికారులను వివరణ కోరగా మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు వ్యవహార శైలి కారణంగానే అర్హుల జాబితా తేల్చడంలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. కొద్దిరోజుల్లోనే వడపోత కార్యక్రమం పూర్తవుతుందని, అర్హుల జాబితాను తేల్చే పనిలో యంత్రాంగం ఉందని అధికారులు పేర్కొన్నారు. గతంలో మంజూరైన 2592 గృహాలతో పాటు తాజాగా 2044 గృహాలు మంజూరు చేస్తూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని మున్సిపల్ కమిషనర్ ఎన్‌వి నాగేశ్వరరావు గురువారం తెలిపారు. పేదలకు గృహాలు నిర్మించేందుకు అవసరమైన స్థలం, నిధులు ఉన్నప్పటికీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అవలంబిస్తున్న వైఖరి ఫలితంగా పనులు ప్రారంభం కావడం లేదని ఆరోపణలు వినవస్తున్నాయి.

దోపిడీ దొంగల ముఠా అరెస్ట్

గుంటూరు (పట్నంబజారు), సెప్టెంబర్ 22: గుంటూరు నగరంతో పాటు జిల్లాలోని పలు చోట్ల దోపిడీలకు పాల్పడిన నలుగురు సభ్యులుగా గల ముఠాను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ఉమేష్‌చంద్ర హాలులో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో అర్బన్ ఎస్‌పి సిహెచ్ విజయారావు నిందితుల వివరాలను వెల్లడించారు. నంబూరుకు చెందిన షేక్ కరిముల్లా, బర్దన్ అశోక్, పాత గుంటూరు బాలాజీనగర్‌కు చెందిన షేక్ జబీవుల్లా, శారదాకాలనీ 26వ లైనుకు చెందిన కారుమూరి రాజేష్‌లు ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారు. ఈనెల 16వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో కొత్తపేటలోని శంకరమంచివారివీధిలో వృద్ధురాలు వీశం రామానుజమ్మ ఇంటిని అద్దెకు అడిగే నెపంతో కరిముల్లా, అశోక్, జబీవుల్లాలు ఆమెను బెదిరించి బంగారు ఆభరణాలను లాక్కుని, ఆమెను గాయపర్చారు. అలాగే ఈ ఏడాది మార్చిలో రామిరెడ్డితోటలో, మే 11వ తేదీన గుంటూరు జిజిహెచ్ వద్ద, మార్చి 10వ తేదీన పెదకాకాని రైస్‌మిల్లులలో వీరు చోరీలకు పాల్పడ్డారు. ఈస్ట్ డిఎస్‌పి కండే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొత్తపేట సిఐ శ్రీకాంత్‌బాబు నేతృత్వాన పోలీసులు అధికారులు శుక్రవారం బ్రాడీపేటలోని ఓ వస్త్ర దుకాణం వద్ద వీరిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి మోటారు బైకులతో పాటు, 21 సవర్ల బంగారు ఆభరణాలు, ఇతర చోరీసొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి వివరించారు.

నవులూరులో సామూహిక అత్యాచారం

మంగళగిరి, సెప్టెంబర్ 22: మండల పరిధిలోని నవులూరులో గురువారం రాత్రి 17 ఏళ్ల వయసు గల ఇద్దరు యువకులు 16 ఏళ్ల వయసు గల ఒక బాలికను ఆటోలో కిడ్నాప్ చేసి ఉడా ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న క్రికెట్ స్టేడియం రోడ్డులోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి అమ్మమ్మ మంగళగిరి రూరల్ పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. నవులూరులో దళిత కుటుంబానికి చెందిన 16 ఏళ్ల బాలిక ఇళ్లల్లో పాచిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఇద్దరు యువకులు అడ్డగించి ఆటోలో బలవంతంగా ఎక్కించుకుని పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత పరారయ్యారు. డిఎస్పీ గోగినేని రామాంజనేయులు, రూరల్ ఎస్సై కె వాసు శుక్రవారం ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరిలో ఒకడు ఆటో డ్రైవర్ కాగా మరో యువకుడు వెల్డింగ్ పని చేస్తుంటాడని పోలీసులు తెలిపారు. ఈ ఇద్దరికి మరో యువకుడు సహకరించినట్లు తెలిసిందని పేర్కొన్నారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపినట్లు చెప్పారు. యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.

తండ్రీకూతుళ్ల ఆత్మహత్య కేసులో నిందితుల అరెస్ట్

గుంటూరు (పట్నంబజారు), సెప్టెంబర్ 22: అప్పుగా ఇచ్చిన సొమ్ముకు అధిక వడ్డీ వసూలు చేసిన సంఘటనలో తండ్రీకూతుర్ల ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌చేశారు. శుక్రవారం ఉమేష్‌చంద్ర హాలులో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో అర్బన్ ఎస్‌పి సిహెచ్ విజయారావు వివరాలు తెలియజేశారు. పెదకాకాని మండలం, తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన యెండూరి శ్రీనివాసరావు వరుసకు సోదరుడైన వజ్జా సూర్యనారాయణ కుమార్తె అయిన ఇంటూరి శిరీషకు 20 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. శిరీషకు పరిచయస్తుడైన తలశిల కిషోర్ ఇటలీలో హోటల్ పెడుతున్నాను, వర్కర్స్ కావాలని, వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని, పార్టనర్‌షిప్ ఇస్తానని నమ్మబలికాడు. అప్పుగా తీసుకున్న సొమ్ముతో పాటు వర్కర్ ఉద్యోగం కోసం వచ్చిన వారి వద్ద నుండి కూడా తీసుకున్న సొమ్ము 2,97,93,733 రూపాయలను ఆయన ఎకౌంట్‌లో వేశారు. అలాగే సైనీడు మహేష్‌కు కూడా 21 లక్షల రూపాయలను ఎకౌంట్‌లో వేశారు. దీంతో వారు నకిలీ వీసాలతో 9 మందిని ఇటలీ వెళ్లేందుకు విమానం ఎక్కగా ఢిల్లీ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దీంతో చేసిన అప్పులకు అధిక వడ్డీలు కట్టలేక శిరీష తన తండ్రితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం నిందితులు తలశిల కిషోర్‌ను తక్కెళ్లపాడులోనూ, సైనీడు మహేష్‌ను స్తంభాలగరువులోనూ అరెస్ట్‌చేశారు.

సంపత్‌నగర్ శారదాంబకు కుంకుమసేవ

గుంటూరు (కల్చరల్), సెప్టెంబర్ 22: స్థానిక సంపత్‌నగర్ శ్రీ శృంగేరీ శారదాపరమేశ్వరి అమ్మవారికి శరన్నవరాత్రి పర్వదినాల్లో రెండవ రోజైన శుక్రవారం రెండు వేల మంది మహిళలు లక్ష కుంకుమార్చన సేవ చేశారు. ఈ సందర్భంగా రెండవనాటి ఉదయం అమ్మవారికి సహస్ర కమలాలతో విశేష అర్చన చేశారు. జగద్గురు ప్రవచన మందిర వేదికపై ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పీఠంపై శారదాపరమేశ్వరి బంగారు విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఆ తల్లి పాదాల చెంత వివిధ వయస్సులకు చెందిన 2 వేల మందికి పైగా సువాసినిలు నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తిశ్రద్ధలతో తరలివచ్చి లక్ష కుంకుమార్చనలో పాల్గొన్నారు.

మంగళగిరిలో వైభవంగా దసరా ఉత్సవాలు

మంగళగిరి, సెప్టెంబర్ 22: పట్టణంలోని వివిధ దేవాలాయల్లో దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయం (శివాలయం)లో శుక్రవారం భ్రమరాంబ అమ్మవారికి గజలక్ష్మీ అలంకారం చేశారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో రాజ్యలక్ష్మీ అమ్మవారికి గజలక్ష్మీ అలంకారం, ఘాట్‌రోడ్డు మార్గంలోని పద్మావతీ సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారికి గజలక్ష్మీ అలంకారం, బైపాస్‌రోడ్డులోని కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి గజల్మీ అలంకారం, పెదకోనేరు వద్ద గల శ్రీ దుర్గా భవానీ ఆలయంలో అమ్మవారికి గాయత్రీ అలంకారం, రాజీవ్ గృహకల్ప రోడ్డులోని కాళీమాతా ఆలయంలో అమ్మవారికి బాలాత్రిపుర సుందరీదేవి అలంకారం, హుస్సేన్ కట్ట వద్ద గల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి కాశీ అన్నపూర్ణాదేవి అలంకారం, మెయిన్ బజార్‌లోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి కాత్యాయినీ అలంకారం , రాజరాజేశ్వరి టవర్స్ దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో కనకదుర్గమ్మ అమ్మవారికి బాలాత్రిపుర సుందరీదేవి అలంకారం చేశారు.

నేటి నుండి నవ్యాంధ్ర నాటకోత్సవాలు

నరసరావుపేట, సెప్టెంబర్ 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్ధ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల్లోని నంది నాటకోత్సవాల పలు విభాగాల్లో బహుమతులు పొందిన ఉత్తమ నాటకాలను ఎంపిక చేసి, నాటక సంస్థల భాగస్వామ్యంతో ‘నవ్యాంధ్ర నాటకోత్సవాలు’ పేరుతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని నరసరావుపేటలో ప్రధమంగా నరసరావుపేట రంగస్థలితో కలిసి నిర్వహిస్తుంది. స్ధానిక భువనచంద్ర టౌన్ హాల్లో శనివారం నుండి వరుసగా రెండు రోజుల పాటు ప్రతి రోజు ఆరుగంటల నుండి ఆరంభమయ్యే ఈ కార్యక్రమంలో శనివారం నాడు శ్రీ గురూజీ కానె్సప్ట్ స్కూల్ నంద్యాల వారి ‘అపురూపం’ బాలల నాటిక, ఖమ్మం కల్చరల్ అసోసియేషన్ వారి ‘చాణక్య చంద్రగుప్త’ పద్యనాటకం ప్రదర్శితవౌతాయి. ఎపిఎఫ్‌డిసి చైర్మన్ అంబికా కృష్ణ ఆరంభించబోయే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమీషనర్ అన్నాప్రగడ భానూప్రతాప్ తదితరులు హాజరుకానున్నారు. రెండో రోజు న్యూస్టార్ మోడ్రన్ థియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ , పిబి సిద్ధార్ధ కాలేజ్ ఆఫ్ అర్ట్స్ అండ్ సైన్స్ విజయవాడ వారి ‘కాంట్రవర్సీ’ నాటిక, ‘కళాంజలి’ ప్రగతినగర్, హైదరాబాద్ వారి ‘జారుడుమెట్లు’ నాటకం ప్రదర్శితవౌతాయి. రంగస్థలి ఫైనాన్స్ కమిటీ చైర్మన్ కపలవాయి విజయకుమార్, సభాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, గౌరవ అతిథిగా ఆర్డీవో గంధం రవీందర్, ఆత్మీయ అతిథిగా నటులు, దర్శకులు వైఎస్ కృష్ణేశ్వరరావు హాజరుకానున్నారు. కళాభిమానులు అందరూ ఈ నాటకోత్సవాలను తిలకించి, జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు.

సమసమాజ స్థాపనే ఫూలే ఆశయం

నాగార్జున యూనివర్సిటీ, సెప్టెంబర్ 22: సామాజిక, ఆర్ధిక అంతరాలు లేని సమసమాజ స్ధాపనే జ్యోతిబాఫూలే ఆశయమని రాష్ట్ర రచయితల సంఘం అధ్యక్షులు, సీనియర్ పాత్రికేయులు డాక్టర్ ఘంటా విజయకుమార్ అన్నారు. వర్సిటీలోని మహాత్మా జ్యోతిబాఫూలే అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో ఫూలే సత్యశోధక సమాజ్-సమకాలీనత అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసగించారు. ఈ కార్యక్రమానికి అధ్యయన కేంద్రం డైరక్టర్ ఆచార్య నూర్‌భాషాఅబ్దుల్ అధ్యక్షత వహించారు. మహాత్మాఫూలే చలనచిత్ర దర్శకులు డాక్టర్ పియం సుందరరావు మాట్లాడుతూ ఫూలే ఆశయాలను సాధించడానికి సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అధ్యయనకేంద్రం డైరక్టర్ ఆచార్య నూర్‌భాషాఅబ్దుల్ మాట్లాడుతూ భారతదేశ సామాజిక స్ధితిని శాస్ర్తియంగా అధ్యయనం చేసిన తొలి తాత్వికుడు ఫూలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివరామ్‌ప్రసాద్, డాక్టర్ కె వీరయ్య, డాక్టర్ ప్రసన్నకుమార్, వర్సిటీ డిఇఇ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.