గుంటూరు

సైబర్ చట్టాలపై న్యాయవాదులకు అవగాహన అవశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, సెప్టెంబర్ 24: సైబర్ చట్టాలపై న్యాయవాదులు పూర్తి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని హైకోర్టు సీనియర్ న్యాయవాది సివిఎల్‌ఎన్ మూర్తి అన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్, గుంటూరు బార్ అసోసియేషన్, రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల అసోసియేషన్ ఆధ్వర్యాన మంగళగిరి మండలం చినకాకానిలోని ఎన్నారై వైద్య కళాశాల ప్రాంగణంలో సైంటిఫిక్ మరియు ప్రాపర్టీ లాస్ అనే అంశంపై రెండురోజులపాటు జరిగిన వర్క్‌షాప్ ఆదివారం సాయంత్రం ముగిసింది. ఈ వర్క్‌షాప్‌లో సీనియర్ న్యాయవాది సివిఎల్‌ఎన్ మూర్తి మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నంత వేగంగానే సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని, కనుక సైబర్ చట్టాలపై అవగాహన పెంపొందించు కోవాలన్నారు. న్యాయవాది వృత్తిలో రాణించాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన రీతిలో ఉపయోగించు కోవాలని, సామాజిక మాధ్యమాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, ఇంటర్నెట్, సాంకేతిక పరిజ్ఞానం బాగా అందుబాటులోకి రావటం ఫలితంగా సిటిజన్స్ అందరూ నెటిజన్స్‌గా అయిపోయారని, దీనివలన కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. మరో హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎంవి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ మారిన చట్టాలతో మహిళలకు ప్రయోజనం చేకూరిందని, మహిళా చట్టాలపై న్యాయవాదులు అవగాహన ఏర్పరచుకోవాలని, ప్రత్యేకంగా ముస్లిం పర్సనల్ చట్టం గురించి ఆయన వివరించారు. బెజవాడ్ బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సోము కృష్ణమూర్తి, కందుల శ్రీనివాసరావు, బార్ కౌన్సిల్ సభ్యుడు సుంకర రాజేంద్ర ప్రసాద్, గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, యోబు, ఉషారాణి, సెక్రటరీ శేఖర్‌బాబు, వివిధ జిల్లాల న్యాయవాదులు పాల్గొన్నారు.

గుంటూరును హరితవనంగా తీర్చిదిద్దాలి

గుంటూరు, సెప్టెంబర్ 24: గుంటూరు నగరాన్ని హరితవనంగా తీర్చిదిద్దడంలో నగర పౌరులందరూ భాగస్వాములు కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనూరాధ కోరారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా ఆదివారం షిరిడిసాయి ట్రస్ట్, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బాలాజీనగర్, అమరావతిరోడ్డు తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటారు. స్థానిక బాలాజీనగర్‌లోని ఆనందనిలయం వృద్దాశ్రమంలో కూడా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి కమిషనర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు, మానవ మనుగడ చెట్లపైనే ఆధారపడి ఉందన్నారు. కాలుష్య రహిత వాతావరణాన్ని భావితరాలకు అందించాలంటే మొక్కలను పెంచడమే ఏకైక మార్గమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధిక సంఖ్యలో చెట్లను నరికివేయడం వలన వాతావరణ కాలుష్యం అధికమైందన్నారు. ప్లాస్టిక్ వినియోగం వలన కూడా వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణమూర్తి, వసంతదేవి, విద్యార్థులు పాల్గొన్నారు.

నేత్రపర్వంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

మంగళగిరి, సెప్టెంబర్ 24: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని వివిధ దేవాలయాల్లో శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తుల కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఆదివారం శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయంలో భ్రమరాంబ అమ్మవారు ధనలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శన మిచ్చారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో రాజ్యలక్ష్మీ అమ్మవారికి విజయలక్ష్మీ అలంకారం, ఘాట్‌రోడ్డు మార్గంలోని పద్మావతీ సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారికి ధైర్యలక్ష్మీ అలంకారం, పెదకోనేరు వద్ద గల శ్రీ దుర్గ్భావాని ఆలయంలో అమ్మవారికి ధనలక్ష్మీ అలంకారం, బైపాస్‌రొడ్డులోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి లలితా త్రిపుర సుందరి అలంకారం, కోర్టు ఎదుట గల అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి అన్నపూర్ణాదేవి అలంకారం, రాజీవ్ గృహకల్ప రోడ్డులోని కాళీమాతా ఆలయంలో అమ్మవారికి అన్నపూర్ణాదేవి అలంకారం, హుస్సేన్‌కట్ట వద్ద గల కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి కాత్యాయినీదేవి అలంకారం, మెయిన్‌బజార్‌లోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి గాయత్రీదేవి అలంకారం చేశారు. ఆయా దేవాలయాల్లో అమ్మవారి అలంకారోత్సవాలను తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలి వస్తుండటంతో ఆలయాల్లో దసరా సందడి నెలకొంది.