గుంటూరు

బూత్ కమిటీలపై ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 25: జిల్లాలో తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీలను వీలైనంత త్వరలో ఏర్పాటు చేయాలని సమన్వయ కమిటీ సమావేశం నిర్ణయించింది. సోమవారం టిడిపి జిల్లా కార్యాలయంలో ఇన్‌చార్జి మంత్రి అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు హాజరయ్యారు. తొలుత ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంపై సమీక్షించారు. ప్రజల నుంచి కార్యక్రమానికి స్పందన వస్తోందని, సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేందుకు రాష్ట్ర కార్యాలయానికి పంపాలని మంత్రి అయ్యన్నపాత్రుడు సూచించారు. రైతురథం పథకం కింద మంజూరైన 990 ట్రాక్టర్లను రైతులకు అందజేయాలన్నారు. ఎకరం పొలం ఉన్న ఎస్సీ, ఎస్టీ రైతులు, ఐదెకరాల సాధారణ లీజు అగ్రిమెంట్ ఉన్న కౌలు రైతులు ఇందుకు అర్హులని వివరించారు. గృహనిర్మాణ విషయంలో రెవిన్యూశాఖ ద్వారా సమస్యలు తలెత్తుతున్నాయని, ఎన్‌ఆర్‌ఇజిఎస్ నిధుల మంజూరులో జాప్యం జరుగుతోందని పలువురు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు సమావేశం దృష్టికి తెచ్చారు. లబ్దిదారుల జాబితాను వెంటనే పూర్తిచేయాలని, సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. గుంటూరు సమీపంలో తాడికొండ, లాం ప్రాంతాల్లో జి ప్లస్ టు గృహాలకు అనుమతి మంజూరు చేయించాలని ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ కోరారు. రెవిన్యూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఇన్‌చార్జి మద్దాళి గిరిధర్ విజ్ఞప్తి చేశారు. మిర్చి యార్డులో ఈనామ్ కారణంగా కొనుగోళ్లు నిలిచిపోయాయని, తక్షణమే ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు సూచించారు. కౌలురైతులు పెట్టుబడికి కమిషన్ ఏజెంట్లపై ఆధారపడుతున్నారని, బ్యాంకర్లు రుణాలు ఇవ్వనందున ఈనామ్‌పై పునరాలోచించాలన్నారు. బండారుపల్లి, వేమవరం గ్రామాల్లోని రైల్వే అండ్ బ్రిడ్జిలో వర్షాకాలం నీరు నిల్వ ఉండి ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని ఈ సమస్యపై త్వరలో అధికారులతో చర్చిస్తామని మంత్రి అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలులో పేదలకు బ్యాంకర్లు సహకరించటంలేదని త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. సమస్యలన్నింటినీ త్వరితగతిన పూర్తిచేస్తామని మంత్రి ప్రకటించారు. సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు జివి ఆంజనేయులు, ఎంపీలు రాయపాటి సాంబశివరావు, గల్లా జయదేవ్, జడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్, ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, రావెల కిషోర్‌బాబు, కొమ్మాలపాటి శ్రీధర్, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్, అన్నం సతీష్ ప్రభాకర్, ఎఎస్ రామకృష్ణ, అర్బన్ పార్టీ అధ్యక్షుడు చందు సాంబశివరావు, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి హిదాయత్, జడ్పీ వైస్‌చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు, మిర్చి యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు, రాష్ట్ర పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శులు దాసరి రాజామాస్టారు, మీడియాసెల్ కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఎసిబి తనిఖీలు
మంగళగిరి, సెప్టెంబర్ 25: టౌన్ ప్లానింగ్ విభాగంలో ఉన్నతాధికారిగా పనిచేసిన జివి రఘుపై అవినీతి ఆరోపణలు రావడంతో ఎసిబి అధికారులు సోమవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆయనకు చెందిన ఆస్తులపై నిర్వహించిన దాడుల్లో భాగంగా మంగళగిరిలోను ఎసిబి డిఎస్పీ కెవిఆర్‌కె ప్రసాద్ బృందం సోదాలు నిర్వహించింది. పట్టణంలో రఘుకి చెందిన నివాసంగా భావిస్తున్న ఇంటిపై ఉదయం, సాయంత్రం రెండు బృందాలు సోదాలు జరిపాయి. రఘు బినామీగా భావిస్తున్న జూనియర్ టెక్నికల్ ఇంజినీర్ శివ ప్రసాద్ ఇంటిని కూడా సోదా చేశారు. 200 గజాల ప్లాటుకు సంబంధించిన పత్రాలు, లక్షల్లో నగదు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
అంతర్‌జిల్లా దొంగ అరెస్టు
* చోరీ సొత్తు స్వాధీనం
గుంటూరు, సెప్టెంబర్ 25: రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. గత పదేళ్లుగా పగలుపూట ఖరీదైన దుస్తులతో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా చలామణి అవుతూ రాత్రిళ్లు ఇళ్ల తలుపులు తొలగించి గుట్టుచప్పుడు కాకుండా నగలు, నగదు చోరీ చేస్తున్న పొన్నూరు మండలం కసుకర్రు గ్రామానికి చెందిన కంచర్ల మోహన్‌రావు అలియాస్ మోహన్ అలియాస్ మోహన్‌రెడ్డిని జిల్లా పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అతనిపై గుంటూరు జిల్లాతో పాటు, గాజువాక, రామచంద్రాపురం, కృష్ణాజిల్లా పెనమలూరు తదితర పోలీసుస్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. నిందితుడి కదలికలపై నిఘాను తీవ్రతరం చేయాల్సిందిగా రూరల్ ఎస్‌పి వెంకటప్పలనాయుడు ఆదేశాల మేరకు క్రైం డిఎస్‌పి ఎస్ కృష్ణకిషోర్‌రెడ్డి ఆధ్వర్యంలో సిఐ ఎం నాగేశ్వరరావు, పొన్నూరు రూరల్ ఎస్‌ఐ రాంబాబు, క్రైం ఎస్‌ఐ రవికిరణ్ సిబ్బంది మోహన్‌రావును వలపన్ని పట్టుకున్నారు. మొత్తం 12 కేసులకు సంబంధించి రూ. 19లక్షల విలువగల 80 సవర్ల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ

గుంటూరు, సెప్టెంబర్ 25: నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు కార్యాచరణ రూపొందించాలని మంత్రులు ఆదేశించారు. సుమారు 150 సంవత్సరాల క్రితం నిర్మించిన అరండల్‌పేట ఫ్లై ఓవర్‌ను రెండు దశల్లో విస్తరణ జరపాలని నిర్ణయించారు. ఇందుకు రూ. 175 కోట్లతో అంచనాలు రూపొందించారు. సోమవారం ఫ్లై ఓవర్, ట్రాఫిక్ సమస్యలను జిల్లా ఇన్‌చార్జి మంత్రి అయ్యన్నపాత్రుడు, గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు, ఎంపి గల్లా జయదేవ్, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, నగర కమిషనర్ చల్లా అనురాధ ప్రత్యక్షంగా పరిశీలించారు. గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు అనుసంధానంగా ఉన్న ఈ ఫ్లై ఓవర్ తొలిదశలో ఆర్‌ఒబి (రైల్ ఓవర్ బ్రిడ్జి) రెండో దశలో ఆర్‌యుబి (రైల్ అండర్ బ్రిడ్జి)తో విస్తరణ జరిపే విషయమై మంత్రులు, అధికారులు సమావేశమయ్యారు. రైల్వేశాఖ, ఆర్ అండ్ బి, నగరపాలక సంస్థల సంయుక్త పర్యవేక్షణలో పనులు చేపట్టనున్నారు. ఇందుకు రోడ్లు, భవనాలశాఖ నుంచి తగిన నిధులు మంజూరు చేస్తామని మంత్రి అయన్నపాత్రుడు వెల్లడించారు. కేంద్ర నిధుల సమీకరణ విషయమై చొరవ చూపాలని ఎంపి గల్లాను కోరారు. అతి పురాతనమైన ఈ వంతెన విస్తరణ పనులను గుంటూరు నగరపాలక సంస్థ రూపుదిద్దుకుని 150 సంవత్సరాలైన సందర్భంగా శంకుస్థాపన చేయాలని నిర్ణయించినట్లు మంత్రి నక్కా ఆనంద్‌బాబు తెలిపారు. ముందుగా రైల్వే శాఖ నుంచి అనుమతి తీసుకుంటామన్నారు. ఎంపి గల్లా మాట్లాడుతూ రాజధాని నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య జటిలంగా మారిందని, దీన్ని అధిగమించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నగర నడిబొడ్డున ఉన్న ఈ ఫ్లై ఓవర్‌ను సాధ్యమైనంత త్వరగా విస్తరణ జరపటం ద్వారా ట్రాఫిక్ సమస్యను అధిగమించాలనేది లక్ష్యంగా చెప్పారు. ఇందుకు తమవంతు సహకారాన్ని అందిస్తామన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎస్‌ఇ డి మరియన్న, సిటీ ప్లానర్ చక్రపాణి, మిర్చి యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.