గుంటూరు

సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చిన ఎన్టీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), జనవరి 18: సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న నినాదంతో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి, అనతికాలంలోనే ప్రజాదరణతో అధికారంలోకి వచ్చి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థానంగా నిలిచిపోయారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొనియాడారు. గురువారం దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ 22వ వర్ధంతిని పురస్కరించుకుని బృందావన గార్డెన్స్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పుల్లారావు మాట్లాడుతూ పేద ప్రజలకు పక్కా గృహాలు, జనతావస్త్రాలు, రెండు రూపాయలకే కిలో బియ్యం, మహిళలకు ఆస్థిలో సమాన హక్కు ఎన్‌టిఆర్ కల్పించారన్నారు. కాంగ్రెస్ బోఫర్స్ అవినీతిపై నిరంతరం పోరాటం చేసి నేషనల్ ఫ్రంట్‌ను స్థాపించి కాంగ్రెస్‌ను గద్దెదింపిన ఘనత ఎన్‌టిఆర్‌కే దక్కుతుందన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ ఎన్‌టిఆర్ మాండలిక వ్యవస్థను తీసుకువచ్చి పరిపాలనను ప్రజలకు చేరువ చేశారన్నారు. దేశంలో మొదటగా వెనుకబడిన వర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిచెప్పిన మహనీయుడని కొనియాడారు. తొలుత ఎన్‌టిఆర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ, ఎమ్మెల్యే ఫిలిప్ తోచర్, మార్కెట్ యార్డు ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, పార్టీ నాయకులు రాయపాటి రంగారావు, టివి రావు, కంచర్ల శివరామయ్య, లాల్‌వజీర్, గోనుగుంట్ల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా జిల్లా కోర్టు ప్రాంగణంలోని ఎన్‌టిఆర్ విగ్రహానికి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డిలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడ్తున్న పాలకుల నుండి రాష్ట్ర ప్రజలను విముక్తి చేసేందుకే ఎన్‌టిఆర్ పార్టీని స్థాపించి తెలుగోడి సత్తాను దేశాంతరాలకు చాటిచెప్పారన్నారు. పశ్చిమ నియోజకర్గ పరిధిలో ఎమ్మెల్యే మోదుగుల సారధ్యంలో పేదలకు అన్నదానం నిర్వహించారు. అదేవిధంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని కొత్తపేట ఫ్యాన్సీ కళ్యాణ మండపంలో ఇన్‌ఛార్జి మద్దాళి గిరిధర్ ఆధ్వర్యాన ఎన్‌టిఆర్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా గిరిధర్ మాట్లాడుతూ ఎన్‌టిఆర్ పార్టీని స్థాపించిన అనతికాలంలోనే అధికారంలోకి తీసుకువచ్చి దేశ రాజకీయాలను శాసించారని, ఆయన పాలనాదక్షత నేటి నేతలకు ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య, షౌకత్, జాగర్లమూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే నగరంలోని పలు కాలనీల్లో డివిజన్ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్‌టిఆర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్‌టిఆర్ బస్‌స్టేషన్ ఆవరణలో ఇన్‌ఛార్జి రీజనల్ మేనేజర్ నాగేంద్రప్రసాద్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో 1,2 డిపో మేనేజర్లు శ్రీనివాసరెడ్డి, శివరాం సుబ్రహ్మణ్యం, చీఫ్ సెక్యూరిటీ ఇన్స్‌పెక్టర్, కె శ్యాంబాబు, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ నైపుణ్యతను పెంచాలి

*వ్యవసాయ వర్సిటీ వీసీ దామోదరనాయుడు

తాడికొండ, జనవరి 18: వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు వ్యవసాయ పద్దతుల నైపుణ్యతను పెంపొందించే విధంగా పాఠ్యాంశాలను రూపొందించాలని ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ వల్లభనేని దామోదరనాయుడు వ్యవసాయ కళాశాలల అసోసియేట్ డీన్స్‌కు విజ్ఞప్తి చేశారు. మండల పరిధిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాం ఫామ్‌లో గురువారం అగ్రికల్చర్ డీన్ రమేష్‌బాబు అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వీసీ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ విత్తన, ఎరువు, పురుగు మందులు, బయోపెస్టిసైడ్స్, వ్యాపార నర్సరీలు, సెరీకల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, జూట్, కోల్డ్ స్టోరేజి మున్నగు వాటిని నెలకొల్పడంలో విద్యార్థులను భాగస్వాములను చేయాలన్నారు. దానికి అనుగుణంగా బ్యాంకర్లతో విద్యార్థులకు ముఖాముఖి చర్చలు పెట్టి పరిశ్రమలు స్ధాపించడానికి కావలసిన వనరులను సమకూర్చడంలో భాగస్వాములను చేయాలని తెలిపారు. సమావేశంలో పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ శివశంకర్, వివిధ వ్యవసాయ కళాశాలల అసోసియేట్ డీన్స్, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.