గుంటూరు

సాగర్ ఆయకట్టులో ఆరుతడి పంటలకే నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 20: నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో ఆరుతడి పంటలకే నీరందించే అవకాశం ఉందని గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు స్పష్టంచేశారు.. నీరిస్తామని రైతుల్ని నష్టపరిచే ప్రయత్నాలు ప్రభుత్వం చేయదని స్పష్టంచేశారు. సాగర్, శ్రీశైలం కృష్ణా జలాల వినియోగంపై ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు నడుచుకోవాల్సి ఉందన్నారు. మంగళవారం జడ్పీ సర్వసభ్య సమావేశం చైర్‌పర్సన్ షేక్ జానీమూన్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో మూడు ప్రాధాన్యతాంశాలపై సుదీర్ఘ చర్చ సాగింది.. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం సాగర్ జలాశయంలో 576 టీఎంసీల నీరు ఉంది.. గత రెండేళ్లుగా రైతులు ఖరీఫ్‌ను వదులుకున్నారు.. దాళ్వా వరికైనా నీరందించండి.. రబీకైనా నీరిచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు వ్యవసాయశాఖ జేడీ విజయభారతి జిల్లాలో గత ఏడాది తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ 5.5లక్షల హెక్టార్లకు గాను 5.8 లక్షల హెక్టార్ల పంటల సాగుతో 101 శాతం లక్ష్యాలను అధిగమించామని చెప్పారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తంచేశారు. సాగర్ పరిధిలో అసలు సాగునీరే ఇవ్వకుండా జిల్లా వ్యాప్తంగా లక్ష్యాలను ఎలా అధిగమిస్తారని ప్రశ్నించారు. కాగితాలలోనే లెక్కలు చూపుతున్నారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్సార్ హయాంలో 525 అడుగుల నీరు ఉన్నప్పుడే సాగునీరందించారని ఇప్పుడు అధికంగా ఉన్నప్పటికీ పంటలకు నీరందించే విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అసలు సాగర్ ఆయకట్టు ఉందో?లేదో? ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి నక్కా ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించినందువల్లే రైతులు నష్టపోకుండా కాపాడ గలిగామని వ్యాఖ్యానించారు. నాగార్జునసాగర్ కుడికాల్వ ఎస్‌ఈ మాట్లాడుతూ కాల్వ సామర్ధ్యం 11వేల క్యూసెక్కులని ఇందులో గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగునీరందించాల్సి ఉందన్నారు. రోజుకు ఒక టీఎంసీ చొప్పున నాలుగు నెలలు నీరందించే పరిస్థితులు లేవన్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ ఎడమ కాల్వ పరిధిలో నీరెలా వదులుతున్నారని ప్రశ్నించారు. ‘మీరు ఇక్కడ ఓ రకంగా..మీనాయకుడు మరోరకంగా మాట్లాడతారు’ రాయలసీమకు కూడా ఈ ఏడాది ప్రభుత్వం నీరందించిందని తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి కూడా నీరు అందించాల్సి ఉందన్నారు. బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ ఖరీఫ్‌కు నీరందించలేనప్పుడు రబీకైనా అందించే ప్రయత్నం చేయాలన్నారు. సాగర్ కుడికాల్వకు వారబంధీ ద్వారా నెలలో 15 రోజులు అదీ మంచినీటికి ప్రాధాన్యత ఇస్తున్నారని, వేసవి దృష్ట్యా తాగునీటికి ఇబ్బందిలేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మంత్రి స్పష్టం చేశారు. నదుల అనుసంధానంతో రాష్ట్రంలో వ్యవసాయాన్ని సుసంపన్నంచేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బదులివ్వటంతో వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ అవన్నీ ‘మాటలకే పరిమిత’మని విమర్శించారు. దీంతో ఇరువురు ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. విద్యాశాఖ పనితీరుపై డీఈఒ గంగాభవానీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 4వేల 872 పాఠశాలల్లో 6లక్షల 49వేల 128 మంది విద్యార్థులు ఉన్నారని గత ఏడాది పదవ తరగతి పరీక్షలలో కొన్ని హైస్కూళ్లలో 10 జీపీఎ సాధించామని వివరించారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌తో పాటు అల్పాహారం కోసం రూ 35లక్షల ఖర్చవుతుందని మరో నెలరోజుల్లో పరీక్షలు సమీపిస్తున్నందున నిధులు మంజూరు చేయాలని కోరగా సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. గత ఏడాది చంద్రన్న రాయితీ కింద మిర్చి రైతులకు ప్రభుత్వం మంజూరుచేసిన మద్దతుధర తన నియోజకవర్గం పరిధిలోని ఈపూరు రైతులు 660 మందికి అందలేదని, పత్తి నష్టపోయిన రైతులకు పరిహారం కూడా చెల్లించలేదని సమావేశం దృష్టికి తెచ్చారు. వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం పేదరిక నిర్మూలనలో భాగంగా ఇళ్లపట్టాలు పంపిణీ చేసిందని, పట్టా భూములకు బ్యాంకులలో రుణాలివ్వనందున అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఆస్థి గా పట్టాలు పంపిణీ చేసినప్పటికీ అనుభవ హక్కులు కల్పించేందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలన్నారు.దీనిపై క్యాబినెట్ సమావేశంలో చర్చించాలని మంత్రి నక్కాను కోరారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలల్లో జీజీహెచ్‌తో సహా రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అధికార, ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. కొందరు ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసు కారణంగా రోగులు ఇక్కట్లకు గురవుతున్నారని వివరించారు. పిడుగురాళ్లలో లక్ష మంది జనాభాకు గాను ఒకే ఒక్క ఆరోగ్యకేంద్రం ఉందని కాన్పుల వసతి లేకపోవడంతో 35 కిలోమీటర్ల దూరంలో నరసరావుపేట, సత్తెనపల్లికి లేదా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు వెళ్లే దయనీయ పరిస్థితులు ఉన్నాయని జడ్పీటీసీ రామిరెడ్డి ధ్వజమెత్తారు. జిల్లా వ్యాప్తంగా నూతనంగా నిర్మించే ఆసు పత్రులను త్వరలో ప్రారంభించి వైద్య సదుపాయాలను విస్తృతం చేయాలని మంత్రి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి అఫ్రీన్‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి నివాసం ఉన్న తాడేపల్లి మండలంలో విద్యాశాఖ అధికారి పోస్టు ఖాళీగా ఉందని, పీహెచ్‌సీ వైద్యుని పనితీరు కూడా సక్రమంగాలేదని జడ్పీటీసీ వివరించారు. జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయల జడ్పీ ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయని, వీటిని స్వాధీనం చేసుకోవాలని జడ్పీ వైస్‌చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు విజ్ఞప్తి చేశారు. దీనిపై కమిటీని నియమించి త్వరలో చర్యలు తీసుకుంటామని ఇన్‌చార్జి కలెక్టర్ ముంగా వెంకటేశ్వరరావు, జడ్పీ సీఈఒ నాగార్జునసాగర్ హామీ ఇచ్చారు. బాపట్ల సూర్యలంక తీరంలో రూ 12 కోట్లతో శివక్షేత్రం ఏర్పాటుకు 47 సెంట్ల స్థలాన్ని మంజూరు చేయాలని ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్ కోరగా ప్రభుత్వానికి ప్రతిపాదిస్తూ సమావేశం తీర్మానించింది.