గుంటూరు

అన్నదాతలు కలిసి వ్యసాయం చేస్తే అద్భుతాలు సాధించవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్లపాలెం, ఏప్రిల్ 26: అన్నదాతలు సంఘటితంగా కలసి వ్యవసాయం చేస్తే అద్భుతాలు సాధించవచ్చునని సిబిఐ మాజీ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మండలంలోని యాజలిలో నా జన్మభూమి కమిటీ సభ్యుడు ఇక్కుర్తి లక్ష్మీనరసింహ ఆధ్వర్యంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం గురువారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఇటీవల మహారాష్టల్రో రైతులు తమ సమస్యలపై 45 వేల మంది కలసికట్టుగా నాసిక్ నుండి ముంబై వరకు ధర్నా చేస్తే ప్రభుత్వం దిగివచ్చి రైతుల సమస్యలను పరిష్కరించిందన్నారు. ప్రస్తుతం రైతులు రసాయనాలు వాడుతున్నారన్నారు. దీనివల్ల ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నట్లు తెలిపారు. ఇటీవల గుంటూరు వచ్చి రెండు పెద్ద క్యాన్సర్ ఆసుపత్రులు ఎందుకు ఉన్నాయని వైద్యులను ప్రశ్నించగా ప్రస్తుతం పండిస్తున్న ఆహార ఉత్పత్తుల్లో రసాయన ఎరువులు ఎక్కువగా ఉండటం, వాటిని తిన్న ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నట్లు వైద్యులు చెప్పారని ఆయన వివరించారు. యవకులు ఉద్యోగాలతోపాటు వ్యవసాయం చేసేందుకు ముందుకు రావాలన్నారు. జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవాలని, రైతులు సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నారు. మనకి దేశం కోసం ఏమైనా చేయాలి అనే ఆలోచన ఉండాలన్నారు. దేశానికి ఏం చేశామని ఆలోచించి ప్రయత్నం చేస్తే మీరుంటున్న గ్రామంతోపాటు దేశం కూడా అభివృద్ధి చెందుతున్నారు. తమిళనాడు రాష్ట్రంలో రైతులు భూమి నుండి వచ్చే సంపదతోపాటు కోళ్ళు, ఆవులు, మేకలు, గొర్రెల పరిశ్రమలు కూడా ఏర్పాటు చేసుకుని ఆదాయం పొందుతున్నారని చెప్పారు. తాను ప్రజా ప్రతినిధినైతే వ్యవసాయ శాఖ మంత్రిని కావాలని కోరుకుంటానని, రైతులకు సేవ చేస్తానని, లేకున్నా రైతుగా జీవితం గడుపుతానని చెప్పారు. సాధికారిత స్వచ్ఛంద సంస్థ అధికారి పవన్ మాట్లాడుతూ రైతులు వాణిజ్య పంటలపైపు కూడా దృష్టి సారించాలన్నారు. సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయం కోసం గుంటూరు, ప్రకాశం, రాయలసీమల్లో పాదయాత్ర చేసి రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. తొలుత వివి లక్ష్మీనారాయణకు యాజలి గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని హైస్కూల్‌ను సందర్శించి పాఠశాలలో క్రీడాకారులు కబరుస్తున్న ప్రతిభను పూర్వ విద్యార్థుల ద్వారా తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 30 మంది క్రీడాకారులు జాతీయ ఖో-ఖోలో రాణించారని తెలుసుకుని అభినందించారు. ప్రభుత్వ పాఠశాల ఇంత అభివృద్ధి చెందడం యాజలిలోనే చూశానని కొనియాడారు. తొలుత ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీని ప్రారంభించి రైతులతో ముఖాముఖి చర్చలు జరిపారు. అన్నదాతలకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుండ్రెడ్డి శివ, మెండు మహేంద్ర భాస్కరావు, రైతులు మంతెన దశరథ మహారాజు, రామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు తిమ్మరాజు వెంకట సుబ్బారావు, ఎండి మొహియుద్దీన్ బేగ్, ఆంజనేయులు, హనుమంతరావు, ధర్మయ్య, సాయిప్రసాద్, ఏఓ వాసంతి, జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రైతులు పాల్గొన్నారు.

అన్నదాతల ఉద్యమాలను అరెస్టులతో ఆపలేరు
* ఆర్డీఓ కార్యాలయం ముందు వంట వార్పు * నాయకుల అరెస్టు, స్టేషన్‌కు తరలింపు
తెనాలి, ఏప్రిల్ 26: అన్నదాతల ఉద్యమాలను అరెస్టులతో ఆపడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సాధ్యం కాదని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి నరసింహారావు పేర్కొన్నారు. అఖిలపక్ష రైతు సంఘాల పిలుపు మేరకు గురువారం స్థానిక కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ మద్దతు ధర ప్రకటించామని కేంద్రం, రాష్ట్రంలో గోదాములు ఖాళీ లేవు 200 మద్దతు ధర ప్రకటించామని ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవటం సరైన పద్ధతి కాదన్నారు. మే 2వ తేదీన క్యాబినెట్ సమావేశంలో తెల్లజొన్న, మొక్కజొన్న కొనుగోలు విషయమై ఓ నిర్ణయం తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి హామీ ఇచ్చినప్పటికీ ఆచరణలో సాధ్యం కాలేదన్నారు. ఈ నేపథ్యంలో అఖిలపక్ష రైతు సంఘాల సమావేశం నిర్వహించి తెల్లజొన్న, మొక్కజొన్న పండే ప్రాంత రైతాంగాన్ని సమీకరించి దీనిని రాష్ట్ర వ్యాపిత ఉద్యమంగా మారుస్తామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు జొన్నా శివశంకరరావు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లిప్తత కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని చెప్పారు. ఏపి కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తోడేటి సురేష్‌బాబు మాట్లాడుతూ మూడు రోజుల క్రితం వేమూరు మండలం చావలిలో కౌలు రైతు ఆత్మహత్యకు ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలే కారణమని, అది ఆత్మహత్య కాదని, ప్రభుత్వ హత్యేనని ఆయన ఆరోపించారు. ఏపి రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి, డెల్టా పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ వేమూరి శేషగిరిరావు మాట్లాడుతూ రెండు మాసాలుగా పంట దళారుల చేతుల్లోకి వెళ్ళి రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం దుర్మార్గ చర్యగా పేర్కొన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి కొల్లిపర బాబూప్రసాద్ మాట్లాడుతూ సాగు రైతులను ఆదుకోడానికి ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళిక లేకపోవటం వల్లే రైతులకు కష్టాలు, కడగళ్ళు తప్పటం లేదన్నారు. అనంతరం కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వల్లభనేని సాంబశివరావు, రైతు సంఘం రేపల్లె డివిజన్ కార్యదర్శి వేములపల్లి వెంకట్రామయ్య, డివిజన్ కార్యదర్శి కంతేట శ్రీమన్నారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బొనిగల అసగస్టీన్, సుధాకర్, యోగేశ్వరావు, నాగరాజు తదితరులు మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ముందు వంట వార్పు కార్యక్రమం చేపట్టి కార్యాలయంలోకి చొరబడే ప్రయత్నాన్ని 1వ పట్టణ సిఐ ఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. రైతు నాయకులను బలవంతంగా అరెస్టు చేసి 1వ పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించి డిఎస్పీ ఎం స్నేహిత పర్యవేక్షణలో విచారణ అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. సీఐటీయు నాయకులు షేక్ హుస్సేన్‌వలి, మంగళగిరి వెంకటేశ్వర్లు, శివలక్ష్మి, రాజ్యలక్ష్మి, పద్మ, జయలక్ష్మి, వెంకటరావు, రమణ తదితరులు అరెస్టయ్యారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం తుది వరకు పోరాడతాం
* ఎమ్మెల్యే ఆలపాటి
తెనాలి, ఏప్రిల్ 26: రాష్ట్ర ప్రయోజనాల కోసం చివరి వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం కొనసాగిస్తూ ఉంటుందని తెనాలి శాసనసభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కొనుగుతున్న సైకిల్ యాత్ర గురువారం పట్టణంలోని 8,9 వార్డుల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సైకిల్ తొక్కుతూ వార్డు ప్రజలను పలకరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ, ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయని కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రచారం చేశారు. అనంతరం ఆలపాటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసమే నాడు ఎన్‌డిఏ ప్రభుత్వంతో దోస్తీ చేశామన్నారు. అయితే ప్రత్యేక హోదాకు మించిన ప్యాకేజీ ఇస్తామని నమ్మబలికిన కేంద్రం క్రమంగా ఆ విషయాన్ని వెనకేసుకు వస్తుండటంతో పార్లమెంట్ సాక్షిగా ఒత్తిడి తీసుకువచ్చిన తెలుగుదేశం పార్టీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టినట్లు తెలిపారు. అయినా కేంద్రం వారి విన్నపాలను ఖాతరు చేయకుండా రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయటం ప్రారంభించిందన్నారు. ఇందుకు వైసిపి, జనసేన పార్టీల నాయకులను వాడుకుంటూ మోసానికి పాల్పడిందని ఆరోపించారు. ఇటువంటి మోసాలను ఐకమత్యంతో ఎదుర్కోవాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా సహకారం అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుద్దూస్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, జెడ్పీటిసి అన్నాబత్తుని జయలక్ష్మి, పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.