గుంటూరు

ఆశల పల్లకిలో అన్నదాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 18: జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో అన్నదాతలు సాగువైపు మళ్లుతున్నారు. నిన్నమొన్నటి వరకు వేసవిలో విశ్రాంతి తీసుకున్న రైతులు సకాలంలో చెదురు మదురు వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. దుక్కులు దున్ని, విత్తనాలు విత్తేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. కృష్ణా, పశ్చిమ డెల్టాల్లో నారుమడులు పోసేందుకు సిద్ధమవగా గుంటూరు, నరసరావుపేట, గురజాల డివిజన్లలో మెట్ట ప్రాంతాల్లో పత్తి, మినుము, పెసర వంటి పంటలు వేసేందుకు సంసిద్ధులయ్యారు. ప్రధానంగా రెండు రోజుల క్రితం పట్టిసం ఎత్తిపోతల నుండి గోదావరి జలాలను కృష్ణాకు మల్లించడం డెల్టా రైతాంగంలో ఆశలు రేపింది. గత ఏడాది కంటే మూడు రోజుల ముందుగానే గోదావరి జలాలు కృష్ణాకు వదలడంతో ఈ ఖరీఫ్‌లో కూడా సకాలంలో నాట్లు పడనున్నాయి. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో 5,35,214 హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణం ఉండగా, గత ఏడాది 5,38,748 హెక్టార్లలో రైతులు వివిధ పంటలను సాగుచేశారు. ఇందులో కృష్ణాపశ్చిమ డెల్టా కింద 2 లక్షల హెక్టార్లకు పైగా వరిసాగు చేశారు. ఈ ఏడాది కూడా పట్టిసీమ నుండి నీరు విడుదల చేయడంతో అదేస్థాయిలో సాగు అవుతుందన్నది అధికారుల అంచనా. ఇలా ఉండగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడికాల్వ కింద పల్నాడు ప్రాంతంలో దాదాపు 90 వేల ఎకరాల్లో రైతులు వరిసాగు చేస్తున్నారు. అయితే గడిచిన నాలుగు సంవత్సరాలుగా సరిపడా సాగునీరు అందకపోవడంతో ఆరుతడి పంటలు, వర్షాధార పంటలు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే సాగర్ డ్యామ్‌లో నీటిమట్టం డెడ్ స్టోరేజ్‌కు చేరుకోవడం, ఇప్పటివరకు ఎగువ ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసిన దాఖలాలు లేకపోవడంతో రైతాంగం ఆశలు వదులుకునే పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఈ ఏడాది అన్నదాతలు ఆశలు నెరవేరాలని కోరుకుందాం.

రూ. 113కోట్లతో 1504 ఏన్టీర్ అర్బన్ గృహాల నిర్మాణం
* రెండో ఫేజ్‌లో మరో 700మందికి గృహాలు * జనవరి 14 సంక్రాంతికి గృహప్రవేశాలు* స్పీకర్ కోడెల శివప్రసాదరావు
నరసరావుపేట, జూన్ 18: చిలకలూరిపేట రోడ్డులోని ఏన్టీఆర్ నగర్‌లో ఏన్టీఆర్ అర్బన్ హౌసింగ్ కింద నిర్మిస్తున్న 1504 గృహాలను 113 కోట్లతో నిర్మించి, 2019 జనవరి 14న సంక్రాంతి పర్వదినం సందర్భంగా అందరూ గృహాప్రవేశాలు చేయాలని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. సోమవారం స్థానిక ఏన్టీఆర్ నగర్‌లో నూతనంగా నిర్మించిన అర్బన్ హౌసింగ్ మోడల్ గృహాన్ని స్పీకర్ ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ ఏ భానూప్రతాప్ అధ్యక్షత వహించారు. పట్టణ నడిబొడ్డులో ఎలాంటి వౌలిక సదుపాయాలు ఉన్నాయో ఈ కాలనీలో కూడా అదే వౌలిక సదుపాయాలను అందిస్తామన్నారు. కాలనీ నుండి చిలకలూరిపేట రోడ్డు వరకు 45 అడుగుల సీసీ రోడ్డును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక్కడి లబ్ధిదారుల కోసం పార్కింగ్ స్థలం, మంచినీరు, విద్యుత్, రోడ్లు, చెట్లు, పార్క్, విద్యాలయం, ఆరు అడుగుల ఎత్తులో ప్రహరీ నిర్మాణం జరుగుతుందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా భూకంపాలను సైతం తట్టుకుని, నిలబడే విధంగా ప్రపంచ దేశాల టెక్నాలజీలో ఈ మోడల్ హౌస్ నిర్మాణం జరుగుందన్నారు. పేదవాని సొంతింటి కల సాకారం చేయడానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేద వాడి సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా సీఎం చంద్రబాబు పాలన కొనసాగుతుందన్నారు. నరసరావుపేట మున్సిపల్ చైర్మన్ గుప్తా, వైస్ చైర్మన్ మీరావలి, కౌన్సిలర్లు ఆధ్వర్యంలో పట్టణం అధ్భుతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన లబ్ధిదారుల మనోభావాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టెప్కో ఎస్‌ఈ కోటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేల్పుల సింహాద్రియాదవ్, మున్సిపల్ సిబ్బంది ఖాదర్, కౌన్సిలర్లు నాగజ్యోతి, నాగూర్‌బీ, సరస్వతి, శ్రీలక్ష్మీ, శ్రీలత, మస్తాన్‌వలి, గఫార్, పోకా శ్రీనివాసరావు, కొలిపాక చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. తొలుత రెండో వార్డులో 40 లక్షలతో మురుగునీటి కాలువ పనులను స్పీకర్ కోడెల శంకుస్థాపన చేశారు.