గుంటూరు

పంటపొలాలను ముంచెత్తిన చేబ్రోలు సైడ్ డ్రెయిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేబ్రోలు, ఆగస్టు 17: పొలాలకు సాగునీరు ఎంత అవసరమో, ఆ నీరు అవసరం లేనప్పుడు పొలాల నుంచి బయటకు వెళ్లడం కూడా అంతేముఖ్యం. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం వల్ల పొలాల్లో చేరిన వరదనీరు బయటకు వెళ్లక ముంపునకు గురై ఏటా రైతులకు నష్టాలు తప్పడం లేదు. చేబ్రోలులో అతిపెద్ద మురుగునీటి కాల్వగా పేర్గాంచిన చేబ్రోలు సైడ్ డ్రెయిన్ ఏటా పంట పొలాలను ముంచెత్తుతోంది. చేబ్రోలు నుంచి కొల్లిమర్ల లాకుల వరకు 9 కిలోమీటర్ల పొడవున ఈ డ్రెయిన్ విస్తరించి ఉంది. గ్రామంలోని ఎర్రచెరువు, నల్లచెరువుల నుంచి వచ్చే మురుగునీటితో పాటు నారాకోడూరు గ్రామం నుంచి కూడా మురుగునీరు వచ్చి ఈ డ్రెయిన్‌లో కలుస్తుంది. చేబ్రోలు నుండి ప్రారంభమైన ఈడ్రెయిన్ కొల్లిమర్ల లాకుల వద్ద బ్రిటీషువారి హయాంలో నిర్మించిన కొల్లిమర్ల డ్రైనేజీలో కలుస్తుంది. డ్రెయిన్ పొడవునా గుర్రపుడెక్క, తూటాకు విపరీతంగా పెరిగిపోయి మురుగునీరు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. ప్రతి ఏటా డ్రైనేజీ మరమ్మతుల పేరుతో లక్షలాది రూపాయల ఖర్చుతో సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో డ్రైనేజీలో పేరుకుపోయిన తూటాకుకు మందులు పిచికారి చేస్తున్నట్లు కాగితాల్లో లెక్కలు చూపిస్తున్నారే తప్ప డ్రైనేజీలో ఎలాంటి మార్పు కన్పించడం లేదు. ప్రస్తుతం పది రోజులుగా కుండపోతగా వర్షాలు కురవడంతో డ్రైనేజీలో మురుగునీటితో పాటు వరదనీరు కలిసి పక్కనే ఉన్న పంటపొలాలను ముంపునకు గురిచేసింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 70 శాతం మంది రైతులు వెద పద్ధతిలోనే వరిసాగు చేశారు. ఈ డ్రెయిన్‌లో వరదనీరు ఉద్ధృతమై వరిపొలాలన్నీ జలమయమయ్యాయి. దిగువ ప్రాంత పొలాలకు నేటికీ ముంపు వీడలేదు. తూటాకు మందు పిచికారి పేరుతో లక్షలాది రూపాయలు ఖర్చుచేస్తున్నప్పటికీ డ్రైనేజీ దుస్థితిలో ఎలాంటి మార్పు కన్పించడం లేదు. చేబ్రోలులోని సినిమా హాళ్లు ప్రాంతంలో ఈడ్రైనేజీ ఆక్రమణకు గురికావడంతో మురుగునీరు ముందుకు కదలక పంటపొలాలను మరింత జలమయం చేసింది. ఈ డ్రైనేజీ కలిసే కొల్లిమర్ల డ్రెయిన్ దుస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏ మాత్రం లేదు. కొల్లిమర్ల డ్రెయిన్‌కు బ్రిటీషువారి హయాంలో 11 ఖానాలు నిర్మించినప్పటికీ ఈ ఖానాలన్నీ పూడుకుపోవడంతో భారీవర్షాలు కురిసినప్పుడు ఈ ప్రాంతంలోని పంటపొలాలు, ఇళ్లు జలమయం అవుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన చేబ్రోలు సైడ్ డ్రెయిన్‌లో పేరుకుపోయిన తూటాకు, గుర్రపు డెక్కను తొలగించాల్సిన అవసరం ఉందని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

క్రోసూరు-పిడుగురాళ్ల బస్సులు నడపాలి
క్రోసూరు, ఆగస్టు 17: క్రోసూరు-పిడుగురాళ్ల ప్రధాన రహదారికి నెల రోజులుగా బస్సులు రాకపోవడంతో సుమారు 10 గ్రామాల ప్రజలు రాకపోకల్లేక పలు ఇబ్బందులు పడుతున్నారని, బస్సులు నడపాలని గుంటూరు ఆర్‌ఎం నాగేంద్రకు శుక్రవారం వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త కావటి శివనాగ మనోహర్ నాయుడు వినతిపత్రం అందజేశారు. రోడ్ల మరమ్మతులు చేయించే వరకు ఆర్టీసీ బస్సులు తిప్పబోమని యాజమాన్యం తెలియజేయడంతో మనోహర్ నాయుడు ఈ విజ్ఞప్తి చేశారు. నాగేంద్ర స్పందిస్తూ త్వరలో బస్సు సర్వీసులు నడిపేందుకు కృషిచేస్తామన్నారు. వినతిపత్రం అందజేసినవారిలో కాల్వపల్లి సాంబిరెడ్డి, నారు శ్రీనివాసరెడ్డి, దొండేటి వీరారెడ్డి, గోగిరెడ్డి వెంకటేశ్వరెడ్డి ఉన్నారు.