గుంటూరు

నగరపాలక సంస్థలో కంట్రోల్ రూమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు సిటీ, డిసెంబర్ 14: వాతావరణ శాఖ పెథాయి తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కమిషనర్ శ్రీకేష్ బి లత్కర్ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు అదనపు కమిషనర్ కె రామచంద్రారెడ్డి శుక్రవారం తెలిపారు. 24 గంటలూ కంట్రోల్ రూమ్ ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. తుఫాన్ కారణంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా నగరపాలక సంస్థ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించవచ్చని చెప్పారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్‌లు 0863-2345104, 2345105లకు సమాచారం అందించాలని కోరారు.

719 ఎకరాల భూసేకరణకు కార్యాచరణ
అమరావతి, డిసెంబర్ 14: గోదావరి-పెన్నా నదుల అనుసంధానం కోసం ఏర్పాటుచేసిన ప్రాజెక్టు నిర్మాణానికై అమరావతి మండల పరిధి గ్రామాల నుండి 719.45 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్లు మండల తహశీల్దార్ పి భాస్కరరావు తెలిపారు. శుక్రవారం స్థానిక విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ వైకుంఠపురంలో 152.16 ఎకరాలు, పెదమద్దూరులో 63.75 ఎకరాలు, అమరావతిలో 130.42, ధరణికోటలో 207.22, లింగాపురంలో 86.28, దిడుగు గ్రామంలో 68.35, మునగోడులో 11.27 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి భూమి ఇచ్చి రైతులు సహకరించాలని తహశీల్దార్ భాస్కరరావు కోరారు.

సాగర్ కుడికాలువకు నీటి సరఫరా నిలిపివేత
విజయపురిసౌత్, డిసెంబర్ 14: నాగార్జునసాగర్ జలాశయం నుండి కుడికాలువకు విడుదలవుతున్న నీటి సరఫరాను శుక్రవారం ప్రాజెక్టు అధికారులు పూర్తిగా నిలిపివేశారు. గతనెల 7వ తేదీ నుండి రోజుకు 9వేల క్యూసెక్కుల చొప్పున 37 రోజులు 83.05 టిఎంసీల నీటిని సాగర్ జలాశయం నుండి కుడికాలువకు విడుదల చేశారు. కృష్ణా రివర్ బోర్డు ఆదేశాల మేరకు 91.874 టిఎంసీల నీటిని కుడికాలువ ఆయకట్టు ప్రాంతానికి కేటాయించారు. మిగిలిన నీటిని అవసరాల మేరకు విడుదల చేస్తామని ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 549.20 అడుగుల వద్ద నిలకడగా ఉంది. ఇది 208.0186 టి ఎంసిలకు సమానం. సాగర్ జలాశయం నుండి ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి, కుడి, ఎడమ కాలువలకు నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. ఎస్ ఎల్‌బిసి ద్వారా 550 క్యూసెక్కులు, మొత్తం అవుట్‌ఫ్లోగా 560 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుండి సాగర్ జలాశయానికి 19070 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 846.60 అడుగుల వద్ద కొనసాగుతుంది. ఇది 72.6505 టి ఎంసిలకు సమానం. సాగర్ జలాశయం నుండి కుడి, ఎడమ కాలువలకు నీటి సరఫరా నిలిపివేయటంతో విద్యుత్ ఉత్పాదన పూర్తిగా నిలిచిపోయింది.

సంస్కరణలతో నాణ్యమైన విద్యుత్
* విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో కలెక్టర్ శశిధర్
గుంటూరు, డిసెంబర్ 14: రాష్ట్రప్రభుత్వం చేపట్టిన విద్యుత్ సంస్కరణల వలన మిగులు విద్యుత్‌ను సాధించి గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏపి ఎస్‌పిడీసీఎల్ ఆధ్వర్యంలో ఈనెల 14 నుండి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న విద్యుత్ పొదుపు వారోత్సవాలను పురస్కరించుకుని కలెక్టరేట్ నుండి విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ ఒక యూనిట్ విద్యత్‌ను ఆదాచేస్తే 1.2 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని చేసినట్లేనన్నారు. ప్రతి ఒక్కరూ విద్యుత్‌ను ఆదా చేయాలని, అవసరమైన మేరకే విద్యుత్ పరికరాలను వినియోగించాలన్నారు. విద్యుత్‌ను ఆదా చేయడంలో రాష్ట్రప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యల వలన గడిచిన మూడు సంవత్సరాల నుండి జాతీయస్థాయిలో రాష్ట్రప్రభుత్వానికి అవార్డులు వస్తున్నాయన్నారు. జిల్లాలో విద్యుత్‌ను ఆదా చేసేందుకు ఎల్‌ఇడి బల్బుల వినియోగాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. రానున్న మూడు నెలల కాలంలో జిల్లాలోని అన్ని గ్రామాల్లో వీధి లైట్ల స్థానంలో ఎల్‌ఇడి బల్బులను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే వినియోగదారులకు ఉచిత బల్బులను పంపిణీ చేశామన్నారు. జిల్లాలో పవన (సోలార్ విద్యుత్‌ను) పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. తొలుత జిల్లా కలెక్టర్ కోన శశిధర్ విద్యుత్ పొదుపుపై విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్‌ఇ జయభారత్‌రావు, డిఇఇలు, ఎడిఇలు, సిబ్బంది పాల్గొన్నారు.

వారాబందీతో సత్ఫలితాలు
గుంటూరు, డిసెంబర్ 14: నాగార్జున సాగర్ చివరి ఆయకట్టు భూములకు నీరు అందించేందుకు రాష్ట్రప్రభుత్వం చేపట్టిన వారాబందీ సత్ఫలితాలనిస్తోందని జలవనరుల శాఖ రాష్ట్ర ఎపెక్స్ కమిటీ సభ్యులు ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు తెలిపారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో కృష్ణారావు మాట్లాడుతూ నాగార్జునసాగర్ కుడికాల్వ పరిధిలోని కృష్ణా, గుంటూరు చివరి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా అవుతుందన్నారు. కుడికాల్వ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుంటుపల్లి వీరభుజంగరాయలుతో పాటు సాగునీటి సంఘాల ప్రతినిధులు, జలవనరుల శాఖ అధికారులతో కలిసి జిల్లాలోని 91 కిలోమీటర్ల మేర, చేజర్ల నుండి 137 కిలోమీటర్ల మేర ప్రకాశం జిల్లా బోర్డర్ కాల్వ వరకు కాల్వపై పర్యటించి క్షేత్రస్థాయిలో నీటి సరఫరాను పర్యవేక్షించామన్నారు. సాగర్ ప్రాజెక్టులో రెండు తెలుగు రాష్ట్రాలకు 548 అడుగుల మేరకు 76 టిఎంసిలు నీరు అందుబాటులో ఉందన్నారు. కుడికాల్వ పరిధిలో 84 టిఎంసిల సాగునీటిని జిల్లాలోని 6.50 లక్షల ఎకరాల్లో ఆరుతడి, పొడిపంటలకు, ప్రకాశం జిల్లాలోని 3.70 లక్షల ఎకరాల్లో ఆరుతడి, వరి పంటలకు వెరశి రెండు జిల్లాల్లో 10.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. ప్రస్తుతం డ్యామ్ నుండి 4,663 క్యూసెక్కుల నీరు తీసుకుని ప్రధాన రిజర్వాయర్ అయిన బుగ్గవాగు నుండి 4,500 క్యూసెక్కుల మేర తీసుకుని 137 కిలోమీటర్ల దగ్గర ప్రకాశం జిల్లాకు 3,051 క్యూసెక్కులు ఇస్తూ దిగువ ప్రాంతంలో ఉన్న పమిడిపాడు బ్రాంచ్‌కాల్వకు 552 క్యూసెక్కులు, ఒంగోలు బ్రాంచ్ కాల్వకు 755 క్యూసెక్కులు సాగునీటి సరఫరా నిరాటంకంగా జరుగుతుందని వివరించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు కట్టా చినకోటయ్య, అంకాల ప్రభుదాసు, డిఇఇ సూర్యనారాయణ, ఎఇఇ ఎం రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

అగ్రిగోల్డ్ బాధితుల సహనాన్ని ఆగ్రహంగా మార్చకండి
* జంగాల అజయ్‌కుమార్
గుంటూరు (కొత్తపేట), డిసెంబర్ 14: అగ్రిగోల్డ్ బాధితుల సహనాన్ని ఆగ్రహంగా ప్రభుత్వం మార్చవద్దని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ హెచ్చరించారు. శుక్రవారం కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులు శాంతియుతంగా తమ డిపాజిట్లను చెల్లించాలని ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమాలు చేస్తున్నారని, అయితే ప్రభుత్వం వారి సహనాన్ని పరీక్షిస్తోందని, దీంతో అవి ఆగ్రహజ్వాలలుగా మారే ప్రమాదం ఉందన్నారు. గత మూడున్నరేళ్ల కాలంలో వివిధ పోరాటాలు చేస్తూ తమకు న్యాయం చేయాలని కోరుతున్నా ప్రభుత్వం హామీలు మాత్రమే ఇస్తూ కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. ఈనెల 11 నుండి గ్రామాల్లో దళయాత్రల పేరుతో ప్రజలకు కరపత్రాలు పంచుతూ బాధితుల్లో చైతన్యం నింపుతున్నారన్నారు. ఈనెల 21 నుండి అగ్రిగోల్డ్ బాధితుల పిల్లలు తమ తల్లిదండ్రులను ఆత్మహత్యల నుండి కాపాడాలని, డిపాజిట్ డబ్బులు చెల్లించాలని రాష్టవ్య్రాప్తంగా ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 23 నుండి 26 వరకు రిలే నిరాహారదీక్షలు, 28 నుండి నిరవధిక నిరాహారదీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈనెల 16వ తేదీ ఆదివారం స్థానిక మల్లయ్యలింగం భవన్‌లోని సీపీఐ కార్యాలయంలో పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరుగుతుందని జంగాల తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావుతో పాటు అన్ని నియోజకవర్గాల సభ్యులు, జిల్లా సమితి సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు హాజరవుతారని తెలిపారు. విలేఖర్ల సమావేశంలో పార్టీ నాయకులు పులి సాంబశివరావు, ఎం రమేష్‌బాబు, కె ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అమరావతిలో పర్యటించిన చైనా బృందం
అమరావతి, డిసెంబర్ 14: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పథకాలను చూసేందుకు విచ్చేసిన చైనా ఆర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధుల బృందం శుక్రవారం అమరావతిలోని ధ్యానబుద్ధ ప్రాజెక్టు మహాస్థూపాలను సందర్శించి అక్కడ గల శిల్పసంపద ప్రాముఖ్యతను అడిగి తెలుసుకున్నారు. నాన్‌జంగ్ బ్రహ్మకల్చర్ అండ్ మీడియా (చైనా) లిమిటెడ్ డైరెక్టర్ వాంగ్‌లీ (ప్రియ) నాయకత్వాన ఆరుగురు సభ్యులు గల బృందాన్ని కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి సిఇఒ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గైడ్‌గా వ్యవహరించి, అమరావతి చరిత్ర, చైనా బౌద్ధ్భిక్షువు హుయాన్‌సాంగ్ క్రీస్తుశకం 640 సంవత్సరంలో ధాన్యకటక బౌద్ధారామాన్ని సందర్శించి అబిదమ్మ పీటికల గురించి నేర్చుకున్న సంగతిని వారికి వివరించారు. అమరావతికి విచ్చేసిన ఈ బృందం ఇక్కడ శిల్పసంపదను, బుద్ధుని జీవిత చరిత్రను తెలుసుకుని మంత్రముగ్ధులయ్యారు. ఈ పర్యటనలో వారి వెంట ఏపి సిఆర్‌డిఎ అధికారి హనుమంతరావు, ఇడిబి ప్రతినిధి ఆదిత్య పాల్గొన్నారు. అనంతరం ఈ బృందం ఉండవల్లి గుహలను కూడా సందర్శించేందుకు వెళ్లారు.