గుంటూరు

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినుకొండ, ఏప్రిల్ 1: మండలంలోని శివాపురం గ్రామంవద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరోకరు తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం తెలుగులోకి వచ్చింది. నూజెండ్ల మండలంలోని ఐనవోలు గ్రామంలో గురువారం శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి తిరునాళ్ళ జరిగింది. ఈ సందర్భంగా శివాపురం గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్ పిర్నిడి ప్రసన్నకుమార్ (22), స్నేహితుడు కోటయ్యతో కలిసి ద్విచక్రవాహనంపై ఐనవోలు తిరునాళ్ళకు వెళ్తున్న సమయంలో శివాపురం గ్రామ సమీపంలో లారీ ఢీకొట్టడంతో డ్రైవింగ్ చేస్తున్న ప్రసన్నకుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న కోటయ్య తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళాడు. 108 వాహనంలో మృతదేహాన్ని, క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కోటయ్యను బంధువులు గుంటూరుకు తరలించారు. మృతుడు ప్రసన్నకుమార్ మృత దేహాన్ని తల్లిదండ్రులకు అందచేశారు. మృతుడు ప్రసన్నకుమార్ పట్టణంలోని వేంకటేశ్వర ఫోటో స్టూడియోలో పనిచేస్తున్నాడు. వినుకొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రుణాలివ్వని బ్యాంకు సేవలను అడ్డుకున్న లబ్ధిదారులు
అమరావతి, ఏప్రిల్ 1: మండల పరిధిలోని కర్లపూడి గ్రామంలో ఉన్న ఐఎన్‌జి వైశ్యాబ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు ఇటీవల జరిగిన ఎస్సీ, ఎస్టీ, బిసి కార్పొరేషన్ రుణాల క్రెడిట్‌క్యాంపులు నిర్వహించి లబ్ధిదారుల జాబితా ప్రకటించక పోవడంతో యండ్రాయి గ్రామస్థులు గురు, శుక్రవారాల్లో బ్యాంకు సేవలను సామూహికంగా అడ్డుకున్నారు. రుణ మంజూరు పత్రాలు ఇచ్చే వరకు బ్యాంకు సేవలను స్తంభింపజేస్తామని గ్రామానికి చెందిన నండూరి వెంకట స్వామిరాజు, చిలకా వెంకటేశ్వర్లు, కాకి వేదమణి, మరియదాసు, చిల్కా ఆనందరావు తదితరులు హెచ్చరించారు. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ లబ్ధిదారుల ఒత్తిడి చేసి బ్యాంకు కార్యకలాపాలు జరగకుండా అడ్డుకోవడంతో పై అధికారుల దృష్టికి తీసుకెళ్లానని, బ్యాంకు మూసివేయమని చెప్పడంతో బ్యాంకు కార్యకలాపాలు నిలిపివేసినట్లు తెలిపారు.

అన్నివర్గాలను అలరించనున్న ‘సరైనోడు’
గుంటూరు (పట్నంబజారు), ఏప్రిల్ 1: సరైనోడు చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొంటుందని వేదసీడ్స్ డైరెక్టర్, జిల్లా జనసేన నాయకులు తులసి ధర్మచరణ్ ఆశాభావం వ్యక్తంచేశారు. శుక్రవారం అల్లు సేవాసమితి ఆధ్వర్యంలో సరైనోడు సినిమా ఆడియోను తులసి ధర్మచరణ్, వేద సీడ్స్ ఎండి పి చంద్రశేఖర్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధర్మచరణ్ మాట్లాడుతూ తెలుగు సినిమా రంగంలో క్లాస్, మాస్ ప్రేక్షకుల అభిమానం చూరగొన్న ఏకైక హీరో అల్లుఅర్జున్ అని కొనియాడారు. గత 15 సంవత్సరాల సినీప్రస్థానం విజయవంతంగా పూరె్తైందంటే అందుకు అభిమానుల ఆదరాభిమానాలే కారణమన్నారు. వేద సీడ్స్ ఎండి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ చిత్రంలోని పాటలు అభిమానులను అలరిస్తాయనడంలో అతిశయోక్తి లేదన్నారు. ఈ కార్యక్రమంలో అల్లు సేవాసమితి గుంటూరు అధ్యక్షుడు బాషా, నాని, రాము, హజారు శ్రీనివాస్, డేవిడ్, అశోక్, వినిత్, ప్రభుతేజ, నాగరాజు, అవినాష్, కార్తీక్‌కాజా, తోట రంగారావు, గుడి సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పొందుగల, తంగెడ పుష్కరఘాట్‌లను పరిశీలించిన కలెక్టర్
దాచేపల్లి, ఏప్రిల్ 1: దాచేపల్లి మండలంలోని కృష్ణ పుష్కరఘాట్‌లను శుక్రవారం జిల్లా కలెక్టర్ కాంతి లాల్ దండే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పొందుగలలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ త్వరలో జరగనున్న కృష్ణ పుష్కరాలకు వచ్చే యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు నుండే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పుష్కర ఘాట్‌లను పరిశీలించి అక్కడ చేపట్టవలసిన ఏర్పాట్ల గురించి అధికార యంత్రాంగాన్ని సమాయాత్తం చేసేందుకు తాను విస్తృతంగా పర్యటిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
తొలుత కలెక్టర్ పొందుగలలోని పుష్కర ఘాట్‌ను పరిశీలించారు. అనంతరం తంగెడ చేరుకొని అక్కడ కృష్ణా నదిపై నిర్మాణంలో ఉన్న అంతర్రాష్ట్ర బ్రిడ్జి పనులను పరిశీలించారు. తంగెడ రేవులో పుష్కర ఘాట్‌లో తీసుకోవలసిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు రూరల్ ఎస్పీ కె నారాయణ నాయక్ , గురజాల ఆర్టీఓ మురళి, గురజాల డిఎస్పీ నాగేశ్వర రావు , దాచేపల్లి తహశీల్దార్ దత్తాత్రేయ శర్మ , పిడుగురాళ్ళ మార్కెట్‌యార్డు చైర్మన్ వేముల వినోద్ రెడ్డి, దాచేపల్లి యంపిపి నవకుమార్, తంగెడ డీసి చైర్మన్ చింతపల్లి హసన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.