గుంటూరు

వర్సిటీలో అక్రమాలపై నేటి నుండి విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున యూనివర్సిటీ, జూన్ 16: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వివిధ శాఖలలో అక్రమాలు జరిగాయని పత్రికలలో వచ్చిన కథనాలపై ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ గురువారం నుండి విచారణ చేపట్టనుంది. ఇష్టానుసారం జరిగిన సిబ్బంది నియమకాలు, అనర్హులకు పదోన్నతులు కల్పించటం వంటి పలు అక్రమాలపై పలు కథనాలు రావటంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. దీనిపై రాష్ట్ర కళాశాల, సాంకేతిక శాఖ కమిషనర్ ఉదయలక్ష్మి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. వర్సిటీలో జరిగిన అక్రమాలపై వర్సిటీలో వచ్చిన కథనాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. దీనిలో భాగంగా ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ బృందం గురువారం నుండి మూడురోజులపాటు వర్సిటీలో విచారణ జరపనుంది. అక్రమాలకు సంబంధించిన ఫైల్స్‌తోపాటు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న సిబ్బందిని విచారణ బృందం నేరుగా విచారించనుంది. విచారణ బృందం వర్సిటీలో పర్యటించనున్న మూడు రోజులూ టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని వర్సిటీ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మూడు రోజులూ సిబ్బందికి ఎటువంటి సెలవులు మంజూరు చేయవద్దని అధికార్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. విచారణ కమిటీ వర్సిటీకి రానుండటంతో వర్సిటీ అంతటా ఉత్కంఠ నెలకొంది.

రోడ్ల విస్తరణలో శాఖల మధ్య
సమన్వయలోపం
గుంటూరు, జూన్ 16: ప్రభుత్వశాఖల మధ్య సమన్వయలోపం కారణంగా జిల్లాలో రోడ్ల విస్తరణకు అవరోధాలు ఏర్పడుతున్నాయి. రాజధానికి నేరుగా కనెక్టివిటీని పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేసిన నేపథ్యంలో డ్రైన్ల పునరుద్ధరణ జరక్కపోవటంతో ప్రతిబంధకాలు తలెత్తుతున్నాయి. గుంటూరు- అమరావతి, గుంటూరు- చీరాల, పొన్నూరు రోడ్డు నుంచి హైవే వర కు, ఏటుకూరు- నల్లచెరువు నుంచి ఐదో నెంబరు జాతీయ రహదారి వరకు, చుట్టుగుంట రాష్ట్ర రహదారి విస్తరణ జరిపేందుకు గతంలోనే ఆర్ అండ్ బి అధికారులు అంచనాలు రూపొందించారు. డ్రైనేజీ విభాగంతోపాటు నగరపాలక సంస్థ అధికారుల సహకారం లేకపోవడంతో రోడ్లు అధ్వాన్నంగా మారాయి. దీనిపై ముఖ్యమంత్రి సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనేజి శాఖకు అవసరమైన నిధులు కేటాయించినా పనులు చేపట్టటంలేదనే ఆరోపణలు వచ్చాయి. దీంతో రోడ్లు, భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి శ్యాంబాబు గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ, డ్రైనేజి, విద్యుత్, కార్పొరేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా రోడ్ల విస్తరణ జరుగుతున్నా కార్పొరేషన్ పరిధిలో జరక్క పోవటాన్ని ఆయన ప్రశ్నించారు. నగరంలో విస్తరణకు అవసరమైన పనుల గురించి ఆర్ అండ్ బి ఎస్‌ఈ కేవి రాఘవేంద్రరావు శ్యాంబాబుకు వివరించారు. ఈ నెలాఖరులోగా డ్రైనేజి పనులు పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. జూలై నెలాఖరులోపు పెండింగ్‌లో ఉన్న రోడ్ల పనులు పూర్తిచేయాలని గడువు విధించారు. పుష్కరాలకు నగరంలో చేపట్టిన రోడ్ల నిర్మాణంపై శ్యాంబాబు ఆరా తీశారు. డ్రైనేజి పనులతో పాటు రోడ్ల విస్తరణ.. గ్రీనరీపై శ్రద్ధ వహించాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో నాగబాబు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

జూట్‌మిల్లు యాజమాన్యంపై
శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి
గుంటూరు, జూన్ 16: చట్టాలంటే గౌరవం, ప్రభుత్వమంటే భయంలేని జూట్‌మిల్లు యాజమాన్యంపై కార్మికశాఖ అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మిల్లు పరిరక్షణ సమితి కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి విజ్ఞప్తిచేశారు. గురువారం అరండల్‌పేటలోని కార్మికశాఖ జాయింట్ కమిషనర్ కార్యాలయంలో జెసి వరహాలరెడ్డిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ జూట్‌మిల్లు కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేయాల్సిన ప్రభుత్వం, కాఠ్మికశాఖ అధికారులు సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సాక్షాత్తు సిఎం చంద్రబాబు నాయుడు జూట్‌మిల్లు వద్దకు వచ్చి మిల్లును తెరిపించి కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ నేటికీ అమలుకాకపోవడం బాధాకరమన్నారు. కార్మికుల కష్టాన్ని దోచుకుంటున్న యాజమాన్యాలకు కొమ్ముకాసే ప్రభుత్వాలు ఎక్కువకాలం మనజాలవన్న సత్యాన్ని ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. జెసిఎల్‌ను కలిసిన వారిలో ఎబ్బూరి పాండురంగ, బోడపాటి కిషోర్, రవీంద్ర, పానుగంటి చైతన్య, రమణారెడ్డి, కోటి, నరసింహారావు తదితరులున్నారు.

కొండెక్కి కూర్చున్న కూరగాయల ధరలు
* పచ్చిమిర్చి రేటు ఘాటు
పొన్నూరు, జూన్ 16: మిసమిసలాడే టమాటాలను చూసి నోరూరి కొందామని ముట్టుకోబోతే రేటు దడ పుట్టిస్తుంది. గుత్తి వంకాయలనైనా ఇష్టంగా తిందామనుకుంటే పెరిగిన ధర గుండె గుభేల్ మనిపిస్తుంది. చేదుగా ఉండే కాకరకాయతోనైనా సర్దుకు పోదామని పేరాశపడితే వారి రేటు వెగటుపుట్టిస్తుంది. ఒక్కటేమిటి అన్ని రకాల కూరగాయల ధరలు రెక్కలొచ్చి కొండెక్కి కూర్చున్నాయి. ఇష్టమైన కూరతో తృప్తిగా భోజనం చేసే యోగం సామాన్యులకు కనిపించడం లేదు. రాష్ట్ర విభజనతో ఏర్పడిన నవ్యాంధ్ర రాజధాని అతి చేరువకు వచ్చిందని ఓ వైపున సంబర పడుతున్న ప్రజలకు పెరిగిన వేసవితాపంతో పాటు ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరల సెగలు గుండెదడ పుట్టిస్తున్నాయి. పచ్చిమిర్చి రేటు రూ.80, టమోటా 100 రూపాయలు ధర పలుకుతోంది. కాకర, వంగ, బీరకాయ, క్యారెట్‌లు 60, చామదుంప, క్యాబేజీ 40, గోరుచిక్కుడు, పొట్ల, మునగ 50 ధర పలుకుతుండగా బంగాళదుంప, దోసకాయ మాత్రం కేజీ 30 రూపాయలకు లభిస్తున్నాయి. నిమ్మకాయలు డజను 40 రూపాయలు పలుకుతూ ఊరిస్తుండటం గమనార్హం. దీంతో మార్కెట్‌కు వెళ్లిన ప్రజలు తక్కువ రేటులో ఉన్న కూరగాయలు, ఆకు కూరలతో సరిపెట్టుకుంటున్నారు.

ఎమ్మెల్యే శ్రీ్ధర్ కోరితే వైకుంఠపురానికి నిధులు
అమరావతి, జూన్ 16: కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న వైకుంఠపురం క్షేత్రం తమకు ఎన్నికల ప్రచారంలో ఎంతగానో కలిసొచ్చిందని, ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్ కోరితే ఎంపి నిధుల నుండి వైకుంఠపురం అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని నరసరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని వైకుంఠపురం గ్రామంలో నిరుద్యోగ యువకుడు మాదాల నరేంద్ర ఏర్పాటు చేసుకున్న శ్రీనివాస వాటర్‌ప్లాంట్‌ను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్, గ్రామ తెలుగుదేశం నాయకుడు ఆలోకం సుధాకర్‌బాబుతో కలిసి ఎంపి రాయపాటి సాంబశివరావు ప్రారంభించారు. తొలుత వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వీరు ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. వైకుంఠపురంలో జరుగుతున్న పుష్కర పనులను పరిశీలించి గ్రామస్థులకు పలు సూచనలు చేశారు.
ఘాట్‌రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన జరిగి నిధులు లేక ఆగిపోయిందని, ఆలోకం సుధాకర్‌బాబుతో పాటు గ్రామస్థులంతా ఎంపి రాయపాటి దృష్టికి తీసుకొచ్చారు. వైకుంఠపురం గ్రామానికి నిధులు కావాలని తనను ఎవరూ ఇంతవరకు అడగలేదన్నారు. తన పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యే శ్రీ్ధర్ కోరితే నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సాగర్‌లో హెలికాప్టర్ చక్కర్లు
విజయపురిసౌత్, జూన్ 16: నాగార్జున సాగర్‌లో గురువారం హెలికాప్టర్ చక్కర్లు కొట్టింది. ఆకాశంలో కిందగా హెలికాప్టర్ చక్కర్లు కొట్టడంతో ప్రజలంతా వింతగా చూశారు. ఆగస్టులో పుష్కరాలు రానున్న దృష్ట్యా పుష్కర ఘాట్లను ఎక్కడ నిర్మించాలి అనే విషయాన్ని తెలంగాణ డిజిపి, ఎండోమెంట్ అధికారులు హెలికాప్టర్ నుంచి ఏరియల్ సర్వే నిర్వహించారు.

కుడి కాలువ పనులను పరిశీలించిన
ప్రపంచ బ్యాంక్ బృందం
నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న కుడి కాలువలో నిర్వహిస్తున్న ఆధునికీకరణ పనులను గురువారం ప్రపంచ బ్యాంక్ బృందం సభ్యులు పరిశీలించారు. గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి పదిమంది సాగర్‌కు చేరుకున్నారు. ఈ బృందానికి ఎస్‌ఇ రమేష్, ఇఇ విష్ణుప్రసాద్ స్వాగతం పలికారు. కుడికాలువ పరిధిలో పలు ప్రాంతాల్లో బృందం పర్యటించి ఈ నివేదికను హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులకు అందించనున్నారు.

బాల్యం నుండే చదరంగంపై ఆసక్తి పెంచాలి

తెనాలి, జూన్ 16: బాల్యం నుండే పిల్లల్లో చదరంగంపై ఆసక్తి పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెనాలి వ్య వసాయ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ తోటకూర వెంకట రమణారావు పేర్కొన్నారు. స్థానిక ఎన్‌జిఓ కళ్యాణ మండపంలో జరుగుతున్న రాష్ట్ర స్థా యి చెదరంగం పోటీలు గురువారానికి రెండవ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా పోటీలను తిలకించిన వెంకట రమణారావు మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో విధిగా చదరంగం ప్రవేశపెట్టి విద్యార్థుల మేథస్సుకు పదును పెట్టాలని సూచించారు. జాతీయ, అంతర్జాతీయ పోటీలలో ఎందరో తెనాలి క్రీడాకారులు పాల్గొన్నారని, అంతటి ఘన చరిత్రగల తెనాలిలో రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలు నిర్వహించటం హర్షణీయమన్నారు. అంతర్జాతీయి చెస్ క్రీడాకారుడు సి రేవంత్ గోపాలకృష్ణ అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఈ పోటీల్లో 230 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. అంతర్జాతీయ చెస్ క్రీడాకారులు మెహర్ చిన్నారెడ్డి, కృష్ణతేజి ఈ పోటీలలో పాల్గొనటం ఒక విశేషమైతే 80 మంది రేటెడ్ క్రీడాకారులు ఈ పోటీలలో తమ ప్రతిభను చాటడం మరో విశేషమన్నారు. దొడ్డక ఆదినారాయణ, జాతీయ స్థాయి న్యా య నిర్ణేతలు ఎస్ సుబ్బరాజు, జె సుబ్రమణ్యం, వై రాజేంద్రలతోపాటు సి రాఘవరావు, భాస్కర్, శ్రీ్ధర్, చక్రవర్తి, శ్రీనాధ్, మెహర్ పాల్గొన్నారు.

భర్త, బిడ్డను హతమార్చిన
మహిళకు జీవిత ఖైదు
నరసరావుపేట, జూన్ 16: నాదెండ్ల మండలం గురజవోలులోని ఎస్టీ కాలనీకి చెందిన జొన్నలగడ్డ మార్తమ్మకు జీవత ఖైదు, 500 రూపాయల జరిమానా విధిస్తూ నరసరావుపేట 13వ అదనపు జిల్లా జడ్జి జయకుమార్ గురువారం తీర్పు వెలువరించారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2012వ సంవత్సరం అక్టోబర్‌లో నాదెండ్ల మండలం గురజవోలు ఎస్టీ కాలనీకి చెందిన జొన్నలగడ్డ మార్తమ్మ తన భర్తపై అనుమానంతో రాత్రి నిద్రిస్తున్న సమయంలో తన భర్త గన్నయ్య, పది నెలల కుమారుడు ఆనంద్‌బాబుపై కిరోసిన్ పోసి నిప్పు అంటించింది. ఆనంద్ అక్కడికక్కడే మృతి చెందగా, భర్త గన్నయ్య గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. భర్త గన్నయ్య ఇచ్చిన వాంగ్మూలం మేరకు నాదెండ్ల పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశారు. ఈ కేసుకు ప్రాసిక్యూటర్‌గా బాలసత్యనారాయణరెడ్డి వ్యవహరించారు.

రాష్ట్ర అథ్లెటిక్స్‌లో రాణించిన జిల్లా జట్టు
గుంటూరు (స్పోర్ట్స్), జూన్ 16: విజయవాడలో ఇటీవల జరిగిన రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా అథ్లెటిక్స్ జట్టు ఓవరాల్ రన్నర్స్ టైటిల్‌ను సాధించింది. జట్టులో ఏ మాలతి 800 మీటర్లులో ప్రథమ, 1500 మీటర్లలో ద్వితీయ స్థానాలను, పి పాప 10 కిలోమీటర్లలో ప్రథమ, 5 కిలోమీటర్లలో ద్వితీయ స్థానాలను, పి అరుణజ్యోతి 100 మీటర్ల హర్డిల్స్‌లో ప్రథమ, కె సుస్మిత 100 మీటర్ల హర్డిల్స్‌లో ద్వితీయ, పి శ్రీలత జావెలిన్ త్రోలో తృతీయ, షేక్ మహబూమి హేమర్‌త్రోలో తృతీయ స్థానాలను సాధించారు. పురుషుల విభాగంలో ఎవిజి కృష్ణంనాయుడు జావెలిన్‌త్రోలో ప్రథమ, పివి భరత్‌కుమార్ షాట్‌పుట్‌లో ద్వితీయ స్థానాలను, వి ఫల్గుణ హేమర్‌త్రోలో తృతీయ, బి లక్ష్మీనారాయణ 5 కిలోమీటర్ల పరుగులో ద్వితీయ స్థానాలను సాధించారు. జట్టుకు శిక్షకులుగా రమాసుందరి, మేనేజర్లుగా గమిడి సాంబశివరావు, బి లక్ష్మీనారాయణ వ్యవహరించారు. ఈ సందర్భంగా విజేతలైన క్రీడాకారులకు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి రామకృష్ణ అథ్లెటిక్స్ సంఘ కార్యదర్శి జి శేషయ్య తదితరులు చాంపియన్ షిప్ ట్రోఫీ అందజేసి క్రీడాకారులను అభినందించారు.