గుంటూరు

సర్కారు సొమ్ము మింగిన ఉద్యోగి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, జూలై 21: సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి తెనాలి సబ్‌ట్రజరీ కార్యాలయంలో కోటి రూపాయలకు పైగా ప్రభుత్వ నిధులు స్వాహా చేసిన జూనియర్ అకౌంటెంట్ తాడికొండ వరుణ్‌బాబును అరెస్టు చేసినట్లు వన్‌టౌన్ సిఐ బి శ్రీనివాసరావు తెలిపారు. గురువారం స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన అరెస్టు వివరాలు వెల్లడించారు. జల్సాలకు అలవాటుపడిన వరుణ్‌బాబు సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వ నిధులను తెలివిగా తన, తన సోదరుని ఖాతాలోకి జమ చేసుకున్నాడు. ఈ మొత్తం దాదాపు 1.10 కోట్లుగా గుర్తించినట్లు తెలిపారు. జూన్ 21న ఆ శాఖ జిల్లా అధికారి సురేంద్రబాబు జరిపిన వార్షిక తనిఖీలలో ఈ అవినీతి బట్టబయలైనట్లు వివరించారు. సురేంద్రబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. వరుణ్‌బాబు బాంబే, కలకత్తా, మద్రాసు, హైదరాబాద్ వంటి నగరాల్లో స్నేహితులతో కలిసి ఈ మొత్తాన్ని ఖర్చు చేసినట్లు విచారణలో తేలిందన్నారు. నాలుగు కార్లు, ఆన్‌లైన్‌లో వస్తువుల కొనుగోలు, బంధువులకు కొంత ఆర్థిక సాయం చేసినట్లు ఆతడు ఒప్పుకున్నట్లు వివరించారు. ఇప్పటికే 9 లక్షల రూపాయల మేర రికవరీ చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో బాధ్యులందరినీ విచారిస్తున్నామని, త్వరలోనే వారిపై కేసులు నమోదు చేస్తామని సిఐ వివరించారు. వరుణ్‌బాబును అరెస్టు చేసిన అనంతరం కోర్టులో హాజరుపరిచినట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఎస్‌ఐలు అసన్, వెంకటేశ్వరరావు, హెచ్‌సిలు సత్తార్, రామారావు, మల్లేశ్వరరావు సిబ్బంది ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
* ఇద్దరి పరిస్థితి విషమం

దుగ్గిరాల, జూలై 21: ప్రయాణికుల ఆటో ఎదురుగా వస్తున్న టాటాఏస్ వాహనాన్న ఢీకొన్న ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతిచెందగా... మరో ఇద్దరు తీవ్రగాయాలతో ఆసుపత్రిపాలైనారు.
పోలీసుల వివరాల ప్రకారం... సుద్ధపల్లికి చెందిన యలమాటి ప్రసాద్ మంగళగిరి నుంచి తన ఆటోలో భార్య అన్నపూర్ణ, కుమార్తె సువార్తలతో కలిసి గురువారం సాయంత్రం తమ గ్రామానికి బయల్దేరాడు. తెనాలి-విజయవాడ ప్రధాన రహదారిలో తుమ్మపూడి సమీపంలోకి రాగానే ఎదురుగా ఇనుప చువ్వల లోడ్‌తో వస్తున్న టాటాఏస్‌ను అదుపుతప్పి ఢీకొట్టాడు. ప్రమాదంలో అన్నపూర్ణమ్మ (35) అక్కడికక్కడే మృతిచెందారు. కుమార్తె సువార్త, ప్రసాద్‌లకు తీవ్రగాయాలయ్యాయి. దుగ్గిరాల ఎస్‌ఐ మురళి రక్తపు మడుగుల్లో పడివున్న క్షతగాత్రులను తన పోలీసుజీపులో ఎక్కించుకుని తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వీరిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మురళీ తెలిపారు.

కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య
కారంపూడి, జూలై 21: కుటుంబ కలహాల నేపథ్యంలో దంపతులు అత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా కారంపూడిలో గురువారం జరిగింది. ఎస్‌ఐ నారాయణస్వామి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కారంపూడికి చెందిన కట్టమూరి ప్రసన్నాంజనేయులు (38), కట్టమూరి సావిత్రి (30) కారంపూడిలో కొంత కాలంగా జీవిస్తున్నారు. 18 ఎకరాల సాగు భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. మూడు సంవత్సరాల నుండి వేసిన పంట చేతికి రాక పెట్టుబడులు ఎక్కువై వడ్డీ వ్యాపారస్తుల వద్ద తీసుకున్న 13.50 లక్షలు చెల్లించాలని ఒత్తిడి ఎక్కువవడంతో ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇటీవల ప్రారంభించిన బియ్యం వ్యాపారంలో కూడా అప్పులు ఎక్కువయ్యాయి. ఈ విషయంలో భార్యభర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి ప్రసన్నాంజనేయేలు తాగి ఇంటికి వచ్చాడు. భార్యాభర్తల మధ్య తిరిగి గొడవ జరిగింది. గురువారం ఉదయానే్న ప్రసన్నాంజనేయులు బయటకు వెళ్లటాన్ని గమనించిన భార్య సావిత్రి ఇంటి పనులు ముగించుకుని పిల్లను బడికి పంపించింది. తలుపులకు తాళం వేసుకుని ఇంటిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. ఇంటికి వచ్చిన ప్రసన్నాంజనేయులు తన భార్య ఆత్మహత్య చేసుకోడాన్ని చూని మృతదేహాన్ని దించి తాను కూడా అదే ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారమిచ్చారు. వీరికి శేషు, లోకేష్ పిల్లలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నారాయణస్వామి తెలిపారు. మృతదేహాలను శవ పంచనామ నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం
అచ్చంపేట, జూలై 21: రైతులకు ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాలను అందించి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మండల కేంద్రమైన అచ్చంపేటలో గురువారం జరిగిన వన మహోత్సవ కార్యక్రమానికి ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామి విగ్రహం సెంటర్‌లో ఏర్పాటైన సభకు పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్ అధ్యక్షత వహించారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర మాట్లాడుతూ అందరూ వ్యక్తిగత బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించుకోవాలన్నారు. మొక్కల పెంపకం విషయంలో రాష్ట్రంలోనే పెదకూరపాడు నియోజకవర్గం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. దేశంలో తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానం చేసి సముద్రజలాల్లో కలిసే 3 వేల టిఎంసిల గోదావరి జలాలను కృష్ణాలోకి మళ్లించారన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు వైసిపి నేత వైఎస్ జగన్మోహనరెడ్డి అడుగడుగునా అడ్డు పడుతున్నారని విమర్శించారు. చరిత్రలో లేని విధంగా 23 వేల కోట్ల రూపాయల మేర రైతులకు రుణమాఫీ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. జరుగుతున్న అభివృద్ధిని చూసే కాంగ్రెస్, వైసిపిల నుంచి నాయకులు, కార్యకర్తలు తమ పార్టీలో చేరుతున్నారన్నారు. అవినీతి, అక్రమాలు, దోచుకోవడమే తెలిసిన జగన్‌కు జరుగుతున్న అభివృద్ధి పనులపై విమర్శలు చేసే నైతిక అర్హతలేదన్నారు. పుష్కర అభివృద్ధి పనులకు రాష్ట్రంలో 1400 కోట్ల రూపాయలు మంజూరైతే పెదకూరపాడు నియోజకవర్గానికి 800 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని చెప్పారు. వన మహోత్సవంలో భాగంగా అచ్చంపేటలో 90 వేల మొక్కలు, క్రోసూరు లక్షా 5 మొక్కలు, బెల్లంకొండలో లక్ష మొక్కలు, పెదకూరపాడులో 70 వేలు, అమరావతిలో 70 వేలు చొప్పున మొత్తం నియోజకవర్గంలో 4.35 లక్షల మొక్కలు నాటారన్నారు. అనంతరం వైఎస్‌ఆర్ సిపి, కాంగ్రెస్ పార్టీల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఎమ్మెల్యే శ్రీ్ధర్ ఆధ్వర్యాన టిడిపిలో చేరారు. అత్యధిక లాభాలను ఆర్జించేందుకు సహకరించిన పిఎసిఎస్ సిబ్బందికి 51 వేల రూపాయల చెక్కును ఆ శాఖ సిబ్బందికి మంత్రులు అందించడంతో పాటు మొక్కలు నాటి సంరక్షించుకుంటామని అందరిచేత ప్రతిజ్ఞ చేయించారు. తొలుత మంత్రులు, ప్రజాప్రతినిధులు సాయిబాబా దేవాలయం వద్ద మొక్కలు నాటి బాబావారికి ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. వన మహోత్సవంలో భాగంగా జడ్పీ హైస్కూల్, విద్వాన్, బ్లూబెల్స్ పాఠశాలల విద్యార్థులు మానవహారం, ర్యాలీ నిర్వహించారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, పార్టీ నాయకులు దాసరి రాజామాష్టారు, మన్నవ సుబ్బారావు, లాల్‌వజీర్, వెన్నా సాంబశివారెడ్డి, కిలారి రాజన్‌బాబు, వై నాగేశ్వరరావు, తహశీల్దార్ సుజాత, ఎండిఒ డిజి నాయక్, డిఎఫ్‌ఒ రామమోహనరావు, ఎంపిపి ఆర్ పిచ్చమ్మ, జెడ్పీటీసీ వెంకటేశ్వరరావు,తదితరులున్నారు. ఇలావుండగా స్థానిక పోలీసుస్టేషన్ ఆవరణలో ఎస్‌ఐ రాజేశ్వరరావు ఆధ్వర్యాన జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్రలు మొక్కలు నాటారు. ఎఎస్‌పి రామాంజనేయులు, సిఐ కోటేశ్వరరావు, క్రోసూరు ఎస్‌ఐ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. అలాగే తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం నాయకులు, ఉపాధ్యాయులు కెసిహెచ్ నరసింహారావు, లక్ష్మీనారాయణ, గోపికృష్ణ మంత్రులను ఘనంగా సన్మానించారు.

నేటి నుండి వర్సిటీలో
రెండవ దఫా విచారణ
నాగార్జున యూనివర్సిటీ, జూలై 21: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పలు విభాగాలలో అక్రమాలు జరిగాయని పత్రికలలో వచ్చిన వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల విచారణ కమిటీ శుక్రవారం నుండి రెండవ దఫా విచారణను ప్రారంభించనుంది. ఈనెల 15వ తేదిన విచారణ ప్రారంభించిన కమిటీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రాథమిక సమాచారాన్ని సేకరించింది. ఆరోపణలకు సంబంధించిన రికార్డులను పరిశీలించటంతోపాటు ఆయా విభాగాలకు చెందిన అధికార్లను నుండి సమగ్ర సమాచారాన్ని సేకరించారు. మొదటి దఫా విచారణలో కమిటీ కన్వీనర్ సాంకేతిక, ఉన్నతవిద్య శాఖ కమిషనర్ బి ఉదయలక్ష్మి పాల్గొనలేదు, సభ్యులైన ఉన్నతవిద్య శాఖ డెప్యూటీ డైరక్టర్ టివి కృష్ణమూర్తి, విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి కన్నమదాస్ అక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. శుక్రవారం నుండి జరిగే విచారణ కన్వీనర్ ఉదయలక్ష్మి పాల్గొంటారని సమాచారం. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను కూడా నేరుగా సభ్యులు విచారించవచ్చని తెలిసింది. ఇదిలావుండగా శుక్రవారం నుండి ఈనెల 25వతేది వరకు వర్సిటీలోని అన్ని విభాగాలకు చెందిన సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఆదివారం సెలవును రద్దుచేసినట్లు సర్కులర్ జారీ చేశారు.

సత్తెన్న రథయాత్రకు ఘనస్వాగతం
పొన్నూరు, జూలై 21: కృష్ణా పుష్కరాలు కొద్దిరోజుల్లో ఆరంభం కానున్న నేపథ్యంలో భక్తులకు ఆశీస్సులు అందించేందుకు అన్నవరం పుణ్యక్షేత్రం నుండి బయల్దేరిన సత్యనారాయణ స్వామి వారి రథయాత్ర గురువారం పొన్నూరు చేరుకుంది. స్వామివారి రథానికి స్థానిక భక్తులు ఘనస్వాగతం పలికారు. గుంటూరు, కృష్ణ జిల్లాల భక్తుల సందర్శనార్ధం కొనసాగుతున్న దివ్య రథయాత్రను భక్తులు నేత్రపర్వంగా వీక్షించారు. రథంలోని పురోహితులు భక్తులపై అక్షింతలు చల్లి, ప్రసాదాలు అందజేశారు.

చంద్రబాబును బ్లాక్‌లిస్టులో పెడతారు: ఆర్కే
మంగళగిరి, జూలై 21: రాష్ట్రాన్ని దోచుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర ప్రజలు రాజకీయంగా బ్లాక్‌లిస్టులో పెట్టేరోజులు దగ్గర పడ్డాయని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధ్వజమెత్తారు. గురువారం నాడిక్కడ తన కార్యాలయంలో ఆర్కే విలేఖర్లతో మాట్లాడుతూ పుష్కర పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆగ్రహం వ్యక్తంచేయడం హాస్యాస్పదంగా ఉందని, చంద్రబాబు అక్రమ నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న సీతానగరం ఘాట్ పుష్కర పనులు నెలరోజులుగా జరుగుతుంటే వైసీపీ నేతలు పరిశీలించి పనుల్లో నాణ్యతలేదన్న విషయం వెలుగులోకి తీసుకురాగా ఖంగుతున్న ముఖ్యమంత్రి పరిశీలించి కాంట్రాక్టర్‌పై చిందులు తొక్కడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు ఎల్లవేళలా ప్రకాశం బ్యారేజీపై తిరుగుతుంటే నాణ్యతలేని పుష్కర పనులు వారికి కన్పించలేదా అని ఆర్కే ప్రశ్నించారు. గడువు దగ్గర పడేవరకు పనులు ప్రారంభించకుండా చివరలో నామినేషన్ పద్ధతిపై టిడిపి నేతలకు కోట్ల రూపాయల పనులు కట్టబెట్టి దోచుకునేందుకు అవకాశం ఇచ్చింది చంద్రబాబేనని ఆర్కే అన్నారు. అన్ని పుష్కర పనుల్లో భారీ అవినీతి చోటుచేసుకుందని, నాసిరకం మెటీరియల్ వాడి కోట్లు దండుకుంటున్నారని ఆర్కే అన్నారు. చంద్రబాబును బ్లాక్‌లిస్టులో పెట్టే అవకాశం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆర్కే అన్నారు.

‘అభివృద్ధి మాటున అడ్డగోలు దోపిడీ’
గుంటూరు, జూలై 21: రాష్ట్రంలో అభివృద్ధి మాటున అడ్గగోలు దోపిడీకి పాలకులు తెరలేపారని వైసిపి రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. గురువారం 20వ డివిజన్ పరిధిలోని జోసఫ్ కాలనీలో డివిజన్ అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో గడప గడపకు వైసిపి కార్యక్రమాన్ని అప్పిరెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిని బులెట్‌ట్రైన్ వేగంతో పరిగెత్తిస్తానని చెప్పిన చంద్రబాబు విదేశీ పర్యటనల్లో బుల్లెట్‌ట్రైన్‌లతో ఫొటోలు దిగడంతోనే సరిపోయిందని ఎద్దేవాచేశారు. గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేస్తానన్న చంద్రబాబు ఎన్‌టిఆర్ హౌసింగ్ పథకం కింద ఒక్క ఇంటినీ నిర్మించక పోగా ఉన్న ఇళ్లను పీకించి సామాన్యులను సొంత ఇళ్లకు దూరం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాతంశెట్టి సీతారామాంజనేయులు, అంగడి శ్రీను, బెంజిమన్, వాసు తదితరులు పాల్గొన్నారు.

మహోద్యమంలా వన మహోత్సవం
అమరావతి, జూలై 21: పెదకూరపాడు నియోజకవర్గంలో వాడవాడలా వన మహోత్సవం గురువారం మహాయజ్ఞంలా విజయవంతంగా సాగింది. స్థానికంగా జరిగిన వన మహోత్సవంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులను అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్ అధ్యక్షత వహించారు. సభలో కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలోనే పెదకూరపాడు నియోజకవర్గం ఆదర్శంగా నిలుస్తుందని, 3.36 లక్షల మొక్కలను నాటాలన్నది లక్ష్యంకాగా పండుగ వాతావరణంలో ప్రజల సహకారం, భాగస్వామ్యంతో 4.46 లక్షల మొక్కలు నాటడం స్ఫూర్తిదాయకమన్నారు. రాష్ట్రప్రభుత్వం ఈనెల 29న వన మహోత్సవం చేపడితే పది రోజుల ముందుగానే పెదకూరపాడులో నియోజకవర్గంలో చేపట్టడం, విజయవంతం కావడం ఆనందదాయకమన్నారు. స్థానిక శ్రీ రామకృష్ణ హిందూ హైస్కూల్‌లో మొక్కలు నాటిన అనంతరం పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో డ్వాక్రా మహిళలు, అంగన్‌వాడీ కార్యకర్తలు మండల స్థాయి ఉద్యోగులు, డ్వాక్రా మహిళలు, మహిళా సాధికార సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక మెయిన్‌బజారులో క్రోసూరు రోడ్డు జంక్షన్ వద్ద మానవహారంగా ఏర్పడి మొక్కల ఉపయోగాన్ని వివరిస్తూ నినాదాలు చేశారు. మ్యూజియం సెంటర్ వరకు ర్యాలీ సాగింది. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గుడిసె నిర్మలాదేవి అధ్యక్షతన ఎండిఒ వై రాజగోపాల్, తహశీల్దార్ కె నాసరయ్య, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ పెనుముచ్చు రామకృష్ణ పర్యవేక్షణలో మహిళలు మొక్కలు నాటారు. మండల పరిధిలోని అన్ని గ్రామాలు, పాఠశాలల్లో మొక్కలు నాటి ప్లకార్డులు ధరించి వీధుల్లో ర్యాలీలు నిర్వహించారు.