గుంటూరు

‘రియల్’ మోసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 30: జిల్లాలో రియల్ మోసాలు పెచ్చరిల్లుతున్నాయి. మాఫియా ధాటికి సొంత ఇంటి కల యేమోకానీ... కూడబెట్టిన సొమ్ము తిరిగిరాదేమోననే ఆందోళన బాధితులలో వ్యక్తమవుతోంది. ఒకే ఆస్తికి రెండు రిజిస్ట్రేషన్ల చట్టానికి ప్రభుత్వం సవరణలుచేసి అడ్డుకట్ట వేయాలని ప్రయత్నిస్తున్నా భూ మాఫియా చెలరేగిపోతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు లెక్కకు మిక్కిలి రిజిస్ట్రేషన్లు.. కోర్టు వ్యాజ్యాలతో అసలు యజమానులను విసుగెత్తేలాచేసి ఆపై రెగ్యులరైజ్ చేయించుకుంటున్నట్లు తేలింది. నగర పరిధిలోని వివిధ పోలీసుస్టేషన్లలో నకిలీ రిజిస్ట్రేషన్లు, ఫోర్జరీల వ్యవహారంలో కేసులు నమోదయిన ఓ మాజీమంత్రి అనుచరునిపై పిడి యాక్టుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలియవచ్చింది. మంత్రి పేరుతో మూడేళ్ల కిందట విచ్చలవిడి దందాచేసిన ఆ వ్యక్తికి సంబంధించిన ఫైళ్లను పోలీసులు తిరగేస్తున్నారు. రాజధాని నేపథ్యంలో భూ వివాదాలు తారస్థాయికి చేరుతున్నాయి. పార్టీల కతీతంగా ఈ దందాలో కొందరు సిండికేట్‌గా మారుతున్నారు. పొన్నూరు రోడ్డు, బ్రాడీపేట, చిలకలూరిపేట, బాపట్ల, తెనాలి, నరసరావుపేట, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో భూ దందా పెద్దఎత్తున సాగుతోంది. నగర నడిబొడ్డున కోట్లాది రూపాయల విలువగల ఆస్తులను కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తిలాపాపం తలా పిడికెడు అనే చందంగా అమాయకుల ఆస్తులపై కనే్నసి ఆపై పలుకుబడిని ఉపయోగించి రికార్డులను తారుమారు చేస్తున్నట్లు చెప్తున్నారు. వీరికి కొందరు మునిసిపల్, రెవెన్యూ, రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బంది సహకరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో అనధికార రియల్ ఎస్టేట్ వ్యాపారుల వలలో పలువురు ఉద్యోగులు కూడా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగస్థుల వద్ద నుంచి నెలకు కొంత మొత్తాన్ని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సేకరించి తెనాలి రోడ్డు, చౌడవరం, గోరంట్ల ప్రాంతాల్లో ప్లాట్లు కేటాయించారు. అయితే కొందరు ఉద్యోగులు బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్లారు. కిస్తీలు పూర్తయి తమకు రిజిస్ట్రేషన్లు చేయాల్సిందిగా వ్యాపారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ప్రయోజనం కనిపించటంలేదని చెప్తున్నారు. గోరంట్ల పరిధిలో ఓ వ్యాపారి ఇదే తరహాలో ఉద్యోగులు, అమాయకులను వంచించి కోట్లాది రూపాయలు స్వాహా చేసినట్లు సమాచారం. దీనిపై తాలూకా పోలీసుస్టేషన్‌లో కేసు నమోదయినట్లు తెలియవచ్చింది. అయితే కొందరు పోలీసులు అక్రమ ఆస్తులు.. నకిలీ రిజిస్ట్రేషన్ల కేసులను సివిల్ వ్యవహారాలుగా కొట్టిపారేస్తుంటే మరికొందరు ఆమ్యామ్యాలతో అక్రమ రియల్టర్లకు కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై జిల్లాయంత్రాంగం స్పందించకపోతే ఆత్మహత్యలకు దారితీసే పరిణామాలు లేకపోలేదనేది స్పష్టమవుతోంది. తవ్వినకొద్దీ అక్రమాల దొంతరలు వెలుగులోకి వస్తున్నాయి.