గుంటూరు

మంచినీటి పంపింగ్ స్టేషన్లలో ప్రపంచబ్యాంకు ప్రతినిధుల తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కార్పొరేషన్), సెప్టెంబర్ 2: నగరంలో ప్రపంచబ్యాంకు నిధులతో చేపడుతున్న సమగ్ర మంచినీటి పథకం కింద జరుగుతున్న పనులను ప్రపంచబ్యాంకు ప్రతినిధులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. తొలుత ఉండవల్లి వద్ద నిర్మాణంలో ఉన్న ఇన్‌టేక్‌వెల్, రిజర్వాయర్ నిర్మాణ పనులను తనిఖీ చేశారు. అలాగే నులకపేట వద్ద పైపులైను నిర్మించేందకు అడ్డుగా ఉన్న గృహాలను తొలగించి, నగరపాలక సంస్థ నిర్మించిన గృహాలలోకి వారిని పంపి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. తదనంతరం నులకపేట నుండి మంగళగిరి పంపుహౌస్, మంగళగిరి నుండి తక్కెళ్లపాడు రా వాటర్ వరకు చేపడుతున్న పైపులైను పనులను పరిశీలించారు. అలాగే ప్యాకేజీ-2 కింద మెగా ఇంజనీరింగ్ వర్క్స్ వారు చేపడుతున్న పైపులైను ఇంటర్‌కనెక్షన్ పనులును నందివెలుగు రోడ్డులో పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రపంచబ్యాంక్ ప్రతినిధులు మాట్లాడుతూ నగరంలో సమగ్ర మంచినీటి పథకం పనులను ప్రారంభించి చాలా కాలమైందని, అందువల్ల ప్యాకేజీ-1 కింద పనులు చేపడుతున్న ఎన్‌సిసి గుత్తేదారు, ప్యాకేజీ-2 కింద పనులను చేపడుతున్న మెగా ఇంజనీరింగ్ గుత్తేదారులు రిజర్వాయర్, పైపులైను నిర్మాణం, పైపులైన్ల ఇంటర్ కనెక్షన్, ఇంటింటికి ట్యాపు కనెక్షన్లను 31 డిసెంబర్ 2016 నాటికి పూర్తిచేయాలని తెలిపారు. అలాగే పైపులైన్ నిర్మాణాలకు అడ్డుగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు, రోడ్లలో నిర్మించేందుకు త్వరితగతిన అనుమతులు తీసుకోవాలన్నారు. నిర్మాణపనుల్లో అదనంగా కార్మికులను ఏర్పాటుచేసుకొని నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తిచేయాలన్నారు. ఈ తనిఖీలో ప్రపంచబ్యాంకు ప్రతినిధులు టాస్క్ టీమ్ లీడర్ రఘుకేశవ, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ మోహన్, సీనియర్ సోషల్ డెవలప్‌మెంట్ స్పెషలిస్ట్ ఐయుబి రెడ్డి, ఏపిఎండిపి ప్రాజెక్ట్ డైరెక్టర్ రాంనారాయణరెడ్డి, నగరపాలక సంస్థ ఎస్‌ఈ గోపాలకృష్ణారెడ్డి, ఇఇలు లక్ష్మయ్య, వెంకట్రావు, డిఇ శాంతిరాజు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్‌కు ఘన నివాళి
గుంటూరు, సెప్టెంబర్ 2: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా వైసిపి జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్‌ఆర్ భౌతికంగా ఉంటే రాష్ట్రంలో దుర్భర పరిస్థితులు దాపురించి ఉండేవి కావన్నారు. పేదలపాలిటి పెన్నిధి, అపర భగీరధుడిగా చిరస్థాయిగా నిలుస్తారని శ్లాఘించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముస్త్ఫా మాట్లాడుతూ మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించి వారి జీవనశైలిలో మార్పులు తీసుకొచ్చిన ఘనత వైఎస్‌ఆర్‌కే దక్కుతుందన్నారు. అన్నివర్గాల పెన్నిధిగా ఆయన నిలిచారని నివాళులర్పించారు. నగర పార్టీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, రైతుల్లో ఓ భరోసా కల్పించి రాష్ట్రానికే వనె్న తెచ్చారని ప్రస్తుతించారు. కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకుడు ఆతుకూరి ఆంజనేయులు, లాలుపురం రాము, నసీర్ అహ్మద్, డైమండ్‌బాబు, కొత్తా చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు డైమండ్‌బాబు ఆధ్వర్యాన పేద వృద్ధ మహిళలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు.

మంగళగిరిలో సార్వత్రిక సమ్మె జయప్రదం
మంగళగిరి, సెప్టెంబర్ 2: కార్మిక చట్టాల సవరణను ప్రభుత్వం విరమించుకోవాలని, కార్మికులందరికీ కనీస వేతనం నెలకు 18 వేల రూపాయలుగా ఇవ్వాలని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను దేశంలోకి నూరుశాతం అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ, అసంఘిత కార్మికులందరికీ సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్ ఓట్ సోర్సింగ్ కార్మికులందర్నీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా శుక్రవారం మంగళగిరి పట్టణంలో వివిధ కార్మిక సంఘాలు సమ్మె నిర్వహించాయి. ఎఐఎఫ్‌టియు న్యూ, ఎఐటియుసి, సిఐటియు, ఐఎన్‌టియుసి, వైఎస్‌ఆర్‌టియు, పికెఎస్, ఎఐసిసిటియు మొదలైన కార్మిక సంఘాల ఆధ్వర్యాన పట్టణ వీధుల్లో ఎర్రజెండాలు చేతబూని సమ్మె జరిపారు. బ్యాంకులు మూతబడ్డాయి. మున్సిపల్ వర్కర్లు విధులకు హాజరు కాకుండా సమ్మెలో పాల్గొన్నారు. ఎఐఎఫ్‌టియు నాయకులు జగ్గారపు సుబ్బారావు, ఆదినారాయణ, కూరపాటి కోటేశ్వరరావు, మారెళ్ల అంజిరెడ్డి, సింహాద్రి లక్ష్మారెడ్డి, సిఐటియు నాయకులు ఎం భాగ్యరాజు, జెవి రాఘవులు, పి బాలకృష్ణ, పకీరయ్య, ఎఐటియుసి నాయకులు పిల్లలమర్రి నాగేశ్వరరావు, షేక్ దస్తగిరి, తిరుపతయ్య, కె మురళీరాజు, ఐఎన్‌టియుసి నాయకులు ఎ శ్రీహరినాయుడు, టి తిరుపతిరెడ్డి, వైఎస్‌ఆర్ టియు నాయకులు మునగాల మల్లేశ్వరరావు, చిల్లపల్లి మోహనరావు, కోటేశ్వరరావు, ఫిరోజ్, పికెఎస్ నాయకులు రామకృష్ణ, కిరణ్, సిపోరా, జానకి, రాజశేఖర్, ఎఐసిసిటియు నాయకులు రామ్‌దేవ్, హనుమంతరావు, ప్రభాకర్, భాస్కర్ తదితరులు నాయకత్వం వహించారు.

రద్దీ ప్రాంతాల్లో ఇ-టాయిలెట్లు
గుంటూరు (కార్పొరేషన్), సెప్టెంబర్ 2: నగరంలో రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఇ-టాయిలెట్లను ఏర్పాటుచేసేందుకు పైలెట్ ప్రాజెక్టును చేపట్టబోతున్నట్లు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కృష్ణకపర్ధి తెలిపారు. శుక్రవారం ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టు కింద నిర్మించిన ఇ- టాయిలెట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణకపర్ధి మాట్లాడుతూ రద్దీ ప్రాంతాలైన మార్కెట్, పల్నాడు బస్టాండ్, గుజ్జనగుండ్ల, అరండల్‌పేట, కొల్లి శారద మార్కెట్ ప్రాంతాల్లో ఇ-టాయిలెట్లను ఏర్పాటుచేయనున్నామని తెలిపారు. ఏర్పాటుచేసిన టాయిలెట్ల వల్ల ఉపయోగం ఉన్నదీ లేనిదీ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి అనంతరం మరికొన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్వచ్ఛ్భారత్, స్వచ్ఛ గుంటూరు కార్యక్రమం కింద ఏర్పాటుచేశామని, టాయిలెట్లు వాడుటకు ముందు కాయిన్ వేస్తే ఆటోమేటిక్‌గా తలుపు తెరుచుకుంటుందని, నీరు కూడా అందులోనే ఉంటుందని తెలియజేశారు. అలాగే టాయిలెట్ల నుండి వచ్చిన వ్యర్ధాలు బయోక్లీన్ ద్వారా శుభ్రం అవుతుందని వివరించారు. కార్యక్రమంలో ఎంహెచ్‌ఓ నాగేశ్వరరావు, డిఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

నిద్రిస్తున్న వ్యక్తి గొంతుకోసి నిందితుడు పరారీ
అచ్చంపేట, సెప్టెంబర్ 2: మండల పరిధిలోని రుద్రవరం గ్రామంలో శుక్రవారం తెల్లవారుఝామున ఇంటిబయట నిద్రిస్తున్న వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తి పదునైన ఆయుధంతో గొంతుకోసిన సంఘటన మండలంలో భయానక వాతావరణాన్ని సృష్టించింది. గాయపడిన వ్యక్తి బంధువుల వివరాలిలా ఉన్నాయి... గ్రామానికి చెందిన 75 సంవత్సరాల గడ్డం రామకోటేశ్వరరావు ఇంటిబయట నిద్రిస్తుండగా పిల్లలు ఇంటిలో పడుకున్నారు. గురువారం అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని వ్యక్తి గోడబయట ద్విచక్ర వాహనాన్ని నిలిపి ఇంటిలోకి ప్రవేశించాడు. నిద్రిస్తున్న కొడుకులు బయటకు రాకుండా ఇంటి బయట గడిపెట్టి రామకోటేశ్వరరావుపై దాడిచేయడంతో పాటు పదునైన కత్తితో గొంతుపై గాయపర్చాడు. నిద్ర నుంచి తేరుతున్న ఆయన పెనుగులాడి పెద్దగా కేకలు వేయడంతో వచ్చిన వ్యక్తి గోడదూకి తన బైకుపై పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావం అవుతన్న రామకోటేశ్వరరావును హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు అక్కడ్నుండి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు బంధువుల ద్వారా తెలియవచ్చింది. ఆస్తి తగాదాలే ఇందుకు కారణమై ఉండవచ్చని తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని సత్తెనపల్లి రూరల్ సిఐ, అచ్చంపేట ఎస్‌ఐ కోటేశ్వరరావు, రాజేశ్వరరావు సందర్శించి వివరాలు సేకరించి, కేసు దర్యాప్తు ప్రారంభించారు.

అష్టలక్ష్మీ మూర్తులకు అఖండ సేవ
గుంటూరు (కల్చరల్), సెప్టెంబర్ 2: ననెల రోజులకు పైగా నగరంలోనే కాకుండా జిల్లాలోని అన్ని ప్రధాన పట్టణాలు, గ్రామాల్లో కొలువైయున్న లక్ష్మీగౌరి మందిరాల్లో శ్రావణ మాసోత్సవ పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా అరండల్‌పేటలోని అష్టలక్ష్మీ సమేత లక్ష్మీనారాయణ మందిరంలో ఈ శుక్రవారం భాద్రపదమాసం తొలిరోజు అష్టలక్ష్మీ మూర్తులకు అఖండ సేవ జరిగింది. 30 రోజుల పాటు శ్రద్ధాశక్తులతో శ్రావణమాస వ్రతాలను ఆచరించిన మహిళలు తాము పూజించిన శ్రీమహాలక్ష్మీదేవికి మనఃపూర్వక మంగళ నీరాజనాలర్పించారు. హంపీ విరూపాక్ష పీఠాధిపతి ఆశీస్సులతో కోటి కుంకుమార్చన జరగ్గా శ్రావణం ముగిసి భాద్రపదం వచ్చిన తొలిరోజున అష్టలక్ష్మీ దేవతామూర్తులను కనుల పండువగా అలంకరించారు. లక్షగాజులతో అమ్మవారిని నేత్రపర్వంగా అలంకరించి భక్తులకు కనువిందు చేశారు. ఈ లక్షగాజుల సేవ 14 రోజుల పాటు కొనసాగుతుందని మందిర ప్రధాన అర్చకస్వామి మర్రిపాటి ప్రసాద్ తెలిపారు. గాజుల సేవ ముగిసిన అనంతరం శ్రీ మహాలక్ష్మికి అలంకరించిన గాజులనన్నింటినీ మహిళలకు ప్రసాదంగా అందజేస్తామన్నారు. నగరంలోని అన్ని లక్ష్మీ మందిరాల్లో శ్రావణమాసం ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈనెల 5న భాద్రపద శుద్ధచవితి నాడు గౌరీనందనునికి చవితి పేరిట ఉత్సవాలను శోభాయమానంగా జరుపుకోవడానికి నగరంలోని వివిధ భక్త బృందాలు ఇప్పట్నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు.

బంద్ విజయవంతం
పొన్నూరు, సెప్టెంబర్ 2: దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా పొన్నూ రు పట్టణంలో ఎఐటియుసి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం సమ్మె విజయవంతమైంది. బ్యాంకులు, ఎల్‌ఐసి, పోస్ట్ఫాసు, తహశీల్దార్, మునిసిపల్, ట్రెజరీ ఆఫీసులను కార్మిక సంఘాల నేతలు మూయించివేశారు. ఆటో యూనియన్ కార్మికులు పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ఎదుట జరిగిన సభకు పొన్నూరు ఎఐటియుసి అధ్యక్షుడు ఆరేటి రామారావు అధ్యక్షత వహించారు. సిపిఐ ఎంఎల్ నాయకుడు పరశురామయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి కీర్తి వెంకటేశ్వర్లు, వివిధ సంఘాల నాయకులు శివకుమారి, పి కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

భార్య హత్య కేసులో భర్తకు యావజ్జీవం

గుంటూరు (లీగల్), సెప్టెంబర్ 2: వివాహేతర సంబంధం అనుమానంతో భార్యను హతమార్చిన రిక్షాపుల్లర్‌కు యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ గుంటూరు 3వ అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి ఎన్ సత్యశ్రీ శుక్రవారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. పెదకాకాని అంబేద్కర్ నగర్‌కు చెందిన మాతంగి నిరంతరరావుకు భాగ్యమ్మతో సంఘటనకు 40 యేళ్ల క్రితం వివాహమైంది. ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో 2014 అక్టోబర్ 13వ తేదీన రోకలిబండతో తలపైమోది హతమార్చాడు. పెదకాకాని పోలీసులు కేసు నమోదుచేశారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంచుల వరదరాజు నిందితుడిపై నేరం రుజువు చేయడంతో నిరంతరరావుకు యావజ్జీవ కారాగారశిక్ష, 2 వేల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
ప్రధానోపాధ్యాయుడిపై నిర్భయ కేసు నమోదు
మాచర్ల, సెప్టెంబర్ 2: పట్టణంలోని నెహ్రునగర్ ప్రాంతానికి చెందిన ఓ ఎయిడెడ్ పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడిపై నిర్భయ కేసు నమోదు చేసినట్లు ఇన్‌చార్జి అర్బన్ సిఐ శివశంకర్ తెలిపారు. శుక్రవారం స్థానిక పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. నెహ్రునగర్ ప్రాంతంలోని ఓ ఎయిడెడ్ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా వ్యవహరిస్తున్న తిప్పారెడ్డి గోవిందరెడ్డి పాఠశాలలో మూడవ తరగతి చదువుకుంటున్న విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియజేయటంతో వారు పట్టణ పోలీసు స్టేషన్‌లో ప్రధానోపాధ్యాయుడిపై ఫిర్యాదు చేయటంతో నిర్భయ చట్టం క్రింద కేసు నమోదు చేసినట్లు సిఐ శివశంకర్ తెలిపారు.

అమరావతిలో సార్వత్రిక సమ్మె విజయవంతం
అమరావతి, సెప్టెంబర్ 2: పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీస వేతనంగా 18 వేల రూపాయలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో శుక్రవారం అమరావతిలో వామపక్ష కార్యకర్తలు, కార్మిక సంఘాలు నిర్వహించిన సమ్మె విజయవంతమైంది. పురవీధుల్లో కార్మిక పతాకాలు చేతబూని ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రారంభమైన నిరసన ర్యాలీ అమరేశ్వరాలయం మీదుగా తహశీల్దార్ కార్యాలయం వరకు చేరుకుంది. వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. ర్యాలీనుద్దేశించి సిఐటియు నాయకులు బి సూరిబాబు, ఎఐటియుసి కార్యదర్శి శరణం విజయ్, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి బి రామకృష్ణ తదితరులు ప్రసంగించారు. ఈ ర్యాలీలో వామపక్ష నాయకులు కె ప్రసాద్, ఎస్‌కె ఆలీబాబా, నండూరి రవి, తుడుం కృష్ణ, పఠాన్ జానీ తదితరులు పాల్గొన్నారు.